ఒకరి కొకరు     ఒకరి కొకరు 


ఓ సనాతన మధుపర్కాల్లారా!
అధునాతన వధూవరుల్లారా!
మీ కళ్యాణ శుభసమయంలో 
మీకివే నా అభినందనలు.

ఇన్నాళ్ళూ ఇన్నేళ్ళూ మీ
ఇరువురు ఎవరికి ఎవరో ?
ఇపుడే అయినారు ఒకరికొకరు
అయినారు అత్యంతాప్తులు.

మీ ఇరువురి జంట  
చూడ కన్నుల పంట  
ఒకరినొకరు తెలుసుకొమ్మంట
సంసార రహస్యమిదేనంట.

సంసారం అరవిందం
సంగీతం మకరందం
వసివాడని పసిపాపలకు
మిసిమికాంతుల శుభోదయం.

సంసారం సాగరం
            కాదు
ఓ సంగీత సరోవరం
              అవును

సంగీతంలో సరిగమలు
సంసారంలో మధురిమలు    
ఆ సరిగమలలో ఎన్నో రాగాలు
ఈ మధురిమలలో ఎన్నెన్నో అనురాగాలు.

రాగాలలో రసం ఉట్టిపడ్తుంది
అనురాగాలలో సరసం ఉద్భవిస్తుంది
సంగీతం రాగాల సంగీత పల్లవి
సంసారం అనురాగాల సంసారవల్లరి.

ఓ సనాతన మధుపర్కాల్లారా!
అధునాతన వధూవరుల్లారా! 
పచ్చని తోరణాల పందిట్లో 
మీకివే నా కవితా కుసుమాలు.


       * సమాప్తం *

బస్సు - బుస్సు బస్సు - బుస్సు

                                       


పల్లె పల్లెకు బస్సులట
పనికిరాని బస్సులేనట

హంగులెక్కువ
రంగులెక్కువ

స్టాఫ్ తక్కువ
స్టాపులు ఎక్కువ

అరుపులెక్కువ
కుదుపులూ ఎక్కువే

కన్వేయన్స్ ఎక్కువ
కన్వీనియన్స్ తక్కువ

అక్షరాలలోనే ప్రజాసేవ కర్తవ్యమట
ఆచరణలో  అది అసలు శూన్యమట 

                         *****

నేను నేను కాను                      నేను నేను కాను
                            

పుట్టగానే నాకేమి తెలియలేదట   ఏడవటంతో సహా
ఎంతకీ ఏడవకపోయేసరికి , వారందరూ ఏడుస్తున్నారట

మా బామ్మనా వద్దకు వచ్చి నన్నుగిల్లేసిందట 
కెవ్వు మన్న కేక అమాంతంగా పెట్టేశానట
అందరూ పగలబడి , విరగబడి నవ్వేశారట

ఆ ఏడుపు తర్వాత నేనూ నవ్వేశానట 
ఏ ప్రాణి జీవితమైనా ఏడుపుతోనే ప్రారంభమట
ఏ నవ్వులైనా ఆ తర్వాతే ఆరంభమట
గుర్తించటానికి  నామకరణం చేశారట

ఆ తర్వాతే  వాళ్ళలో ఒక్కడిగా కలుపుకున్నారట 
వరుసవారీగా వారి అలవాట్లను శిక్షణ  మొదలెట్టారట 

ఊహ తెలియడం ఆరంభంలోనే ఈ మేను నేనేనన్నారు 
స్వార్ధం మొదలై ఈ నేను (మేను) సంరక్షణ  స్టార్ట్ చేశా

ఇన్ని నాళ్ళు ఈ కనులు నావి , ఈ కాళ్ళు నావి,
ఈ చేతులు నావి , ఈ చెంపలు నావి,
ఈ నాదం నాది ,ఈ పాదాలు నావి,
ఈ రిష్ట్ నాది , ఈ ఛెష్ట్ నాది అనుకొన్నా.


ఈ కరములకి క్రీములు పూసి ఎంత శ్రధ్ధగా పెంచానో 
 ఈ ఫింగర్స్ కి  ఉంగరాలు తొడిగి విలువ పెంచానే 
ఈ రిష్టుకి రిష్ట్ వాచ్ గోల్డ్ చైను తో అలంకరించానే
ఈ నడుమును నాజూకుగా మలచాలని ఎంతగా చేశానో
ఈ పాదాలకు ఏ ప్రమాదం కలుగకుండా ఖరీదైన పాదరక్షలు వాడానో
ఈ కనులు , కనుబొమ్మలు అందంగా కనపడాలని ఎంతగా శ్రధ్ధ తీసుకున్నానో 
ఇన్నింటి సమ్మేళనమైన ఈ మేనుని నేను ఎంత జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చానో


ఈ మేను, నేను అనుకొని అమిత శ్రధ్ధగా పోషించానో అవి అడగకనే ,మఱి
ఇన్ని మెలకువలతో , ఇంతటి నా పోషణతో  వృధ్ధి అయిన ఈ మేను,
ఈ రోజు, నా మాటే విననంటుంది , అలక్ష్యం చేస్తున్నదే..........?

కనులు చూడలేకపోతున్నాయి,
కాళ్ళు అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నాయి,
చెవులు వినలేకపోతున్నాయి,
చేతులు చాచలేకపోతున్నాయి,
కేశాలు క్లేశమే మిగుల్చ్తుతున్నాయి శిరముపై స్థిరముగా నుండక,
ఆ అందాల బుగ్గలు ఒగ్గు అయిపోతున్నాయి,
నడుములే కాదు , నరనరాలు నొప్పుల పంచన చేరి , నను వంచన చేస్తున్నాయి

ఈ నాడు సహకరించటం లేదు అంటే ,

ఇవేవి నేను కాదు , వీటి మిశ్రమమూ  నేను కాదు 
ఆ నేను ఈ నేను కాను , మఱి నేనెవరినో ........ ?

    *********

రా(మ)చిలుక


                                                                 రా(మ)చిలుక   

                                           ( తలుపు తీయగానే , ఎగిరిపోబోతున్న రా(మ)చిలుకతో  )

             
                    చిలుకా ! ఓ రామచిలుకా !
                    ఏడకెడుతుండావ్ ?

                    రామయ్యా ! ఓ పరశురామయ్యా !
                    కాన కెడుతున్నా

                    కాన కెందుకెళ్తున్నావ్ ?
                    కానరాకుండా పోతావ్
                    కాన కాన కెళ్ళద్దు
                    ఈడ ,
                    ఈ పంజరమే నీకో పెద్ద మేడ
                    నీ శతృవులకిదే పేద్ద అడ్డుగోడ
                    విరగడవుతుంది నీకు శతృపీడ
                    నీవు గూటిలోన కూకున్నా
                    వచ్చు నోటిలోకి దాణా
                    నీ కూనలకి లేదిచ్చట భయం
                    నీకిదే నా అభయం
                    ఆడ ,
                    పుల్లా పుడకలు తెచ్చుకోవాలి
                    గూడు నువ్వే కట్టుకోవాలి
                    పిల్లా పాపలను చూసుకోవాలి
                    దాణా నువ్వే తెచ్చుకోవాలి
                    కాన కెల్తే మఱి
                    కాన రాకుండా పోతావ్
                    కాన కాన కెళ్ళద్దు
               

                    రామయ్యా ! ఓ పరశురామయ్యా !
                    మంచి  నేర్చుకోవాలని
                    మీ పంచకు వచ్చా
                    కానీ ,
                    వంచన అగపడ్తుందీ పంచన
                    తెల్లదొరలకు చేశారు  బానిసత్వం
                    వదలలేకున్నారు ఆ వారసత్వం
                    అందుబాటులో వున్నంతవరకు
                    మందు బాబులై మసులుతున్నారు
                    నా కా మందులు వద్దు
                    మీ కామందు తనమూ వద్దనే వద్దు
                    స్వేఛ్ఛ లేకుంటే
                    ఇఛ్ఛే రాదు బతుకు మీద
                    జీవికి శ్వాస ఎంత అవసరమో
                    స్వేఛ్ఛ అంతే అవసరం
                    స్వేఛ్ఛ లేనే లేదు నాకీడ
                    ఈ బానిస శృంఖలాలు నాకొద్దు
                    హద్దులు లేని ఆ కానే నాకు ఎంతో ముద్దు
                    కన్నుల పండుగ నా కాన
                    మనసు కానందం నా కాన
                    కాన నే  నా కానకే వెళ్తుండా

                            *   *   *   *   *


గమ్యమా ! అగమ్యమా ?


     గమ్యమా ! అగమ్యమా ?      


ఆత్మకు లేదు ఏ ఆకారం
కావాలి  దేహ సహకారం
మనసుకి లేదు  ఏ  ఆకారం
కావాలి తనువు సహకారం

ఆత్మ జనన మరణాల కతీతం
దేహం పుటక ,గిటకల గాలం
నిత్యమైన ఆత్మ ,అనిత్యమైన దేహాన్నే ఆశ్రయించటం
కుక్క తోక పట్టుకుని గోదారి యీదటం లాంటిదే

ఆ కుక్క గమ్యం తెలియ(బడ)క అగమ్యమగునో ? 
పరుగులతో పక్క దారిన పడకుండా,    
ఎన్నటికి మనలని గమ్యం చేర్చునో ? 

ఈ దేహాన్ని ఆశ్రయించిన ఆత్మ 
ఏ ఆకర్షణలకి లొంగకుండా, 
ఎప్పటికి ఆ  గమ్యాన్ని ( దైవాన్ని) చేరుకొనునో ?

                  *******

తీరం చేరని నావలు

                తీరం చేరని నావలు              

ఆడజన్మ కానందం ఆడనే , ఆ వాడ(లో)నే
ఆడ, భామలందరూ వాడభామలే
ఆడ, పడుచుకైనా  పడుపువృత్తని వెల కట్టారు
' వెలయాలు ' అని పేరు కూడా పెట్టారు

స్వేఛ్ఛగా పెరుగుతారు ఆడపిల్లలైనా
ఇఛ్ఛగా తిరుగుతారు ఎచ్చోటికైనా
కట్టుబాట్లకే గట్టూ లేదు ఆడ
కట్టు బొట్లకు పట్టే లేదు ఆడ

వయసు కొఱకు ఆశగా నిరీక్షిస్తారు
వలపు సెగలు ఆబగా వదిలేస్తారు
తలపులతో తలుపులు తీస్తారు , మూస్తారు
వలపులతో ముఱిపిస్తారు ,( మై )మఱిపిస్తారు

పడుచువాడితో కలసిపొమ్మంటారు
పర్సు వాడినే కౌగిలించుకోమంటారు
కాసులు రాసులుగా రావాలంటారు
క్లాసు బాసులే శహభాష్ అంటారు

తనువుని అనువుగ అందిస్తారు
మనసుని సులువుగ చంపేస్తారు
ఎప్పటికప్పుడు నీదే బోణీ అంటారు
అదే మా నిత్య బాణీ అంటుంటారు

ఆ రోగంతో ఉన్నా ,ఆరోగ్యం లేకున్నా
అడిగే వాళ్ళు లేరు అనటానికి వీల్లేదు
హడావుడిగ మందులేస్తారు
పడకమీదకి పడే(సే)స్తారు

అంతు తెలియని వైనంతో ,
అంతం లేని పయనం
తీరం చేరని నావలే ఆ బతుకులు
సమాజానికి ఆవలే ఆ బడుగులు


             *******

తరంగ తతంగం                              

ఇంగ్లీష్ వాడన్నాడు , లిప్ కి కప్ కి మధ్య ఎంతో గ్యాప్ ఉందని
ఆ గ్యాప్ లో ఎన్నెన్నో భావతరంగాలిమిడి వున్నాయనే


భావతరంగాలు కనపడవు , అంతరంగాన్ని తడతాయి

అంతరంగాలు పైకి కనపడవు , లోననే తెలియబడతాయిఅలా అలల్లా  అను నిత్యం భావతరంగాలు పయనిస్తూనే వుంటాయి 


అందుకొన్నవారికే అర్ధమవ(బడ)తాయి , ఆనందింపజేస్తాయి

కేవలం ఆహ్వానంతోనే కవులు , రచయితలు / త్రులు కాలేరు
ఆ భావాలని అక్షర రూపంలో మలచిన వారే కవులు , రచయిత/త్రులు 

ఆహ్వానించకనే , అసలు భావ తరంగాలే లేవంటే అంగీకరిస్తామా ?
మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి  , నువ్వసలు కాల్స్ రావటం లేదంటావా ?
రేడియో ఆన్ చేయకుండానే,  ఏ కార్యక్రమాలు ప్రసారం కావటం లేదంటావా ? 
టెలివిజన్ ఆన్ చేయకుండా , అసలు ఏ ప్రోగ్రాములు ప్రసారం చేయటం లేదంటావా ?

ఓ వేళ ఆన్ చేసినా , తరంగాలు సరిగా లేకుంటే , ఏవీ పనిచేయలేవు 
దీన్నే దైవాధీనమని అంటుంటాం యాధాలాపంగా , అసలు నిజాన్నే 

అవి మన అధీనంలోనే  ఉన్నట్లుంటాయి , కానీ ,
అన్నీ ఆ దేవుని స్వాధీనంలోనే ఉంటాయని  తెలుసుకోవాలంటాను .

కనపడని   ఆ దేవుణ్ణి చూడటానికి ప్రయత్నించు నిజాయితీగా,
ఆ దేవుడే నిన్ను వెతుక్కుంటూ నీ దరి జేరి తీర్తాడు సుమా!

                                          *******కాకిపిల్ల - సబ్బుబిళ్ళ


                                             

గాలిలోన కాకి
గోడ మీద వాలింది
గట్టు మీద సబ్బుపై
చూపు మరల్చింది
లోలోన తపనాయె
సబ్బు మీద మనసాయె

 (  స్వగతంలో )
 
ఇదేమి శాపమో నాకు
నాది కఱ్ఱి బొగ్గు రూపమాయె
ఈ సబ్బుబిళ్ళ ఎత్తుకొందు
నే జలకాలాడుకొందు
నే రూపరాశినౌదు నటంచు
ఈ శాప విమోచన కావించుకొందు
అటు ఇటు దొంగచూపు చూసింది
సబ్బు బిళ్ళని మటుమాయం చేసింది

                   *****