ఇకనైనా
ఆటు పోట్ల పోరాటంలో అలలుద్భవిస్తాయి 
అలలు ఉరకలేస్తూ పరుగులు తీస్తాయి
అందంగా అగపడ్తూ ఆనందాలనందిస్తాయి
కడలెంత క్షోభననుభవిస్తూ అంత శోభనిస్తుందో ?

ఎంతమంది , శిశువులు , అశువులు బాశారో
ఆంగ్లేయుల అహంకార  తూటాలకు  బలయ్యారో
మఱెంతమంది అగపడకుండా అడవుల పాలయ్యారో
ఎన్నేళ్ళ అవిరళ కృషి ఫలితామో ఈ స్వాతంత్ర్యము ? 

ఆ వృక్షం అందనంత ఆకాశాన్ని తాకుతున్నట్లు
అనిపిస్తూ, అందంగా కనిపిస్తోంది 
మొలక నాటి నుంచి నేటి దశ వరకు
ఎంతమంది చిలిపి చేష్టలకు తల కాచిందో ?

ఏ దారి రహదారి కాదోయ్ ఒక్కనాటితో  .
ఓ నాడు ఆ దారి ముళ్ళ కంచె , రాళ్ళ పంచ
ఎన్ని సైక్లోన్లకు తొలుచుకుపోయిందో,
మఱెన్ని ప్రొక్లీనర్ల తాకిడికి తట్టుకొందో ?

రోమ్ మహానగరమంటారు
ఒక్క రోజులో కట్టబడ్డది కాదనీ అంటారు
అంత అందంగా తీర్చి దిద్దటానికి 
ఎంతమంది  పట్టుదలతో  పరి పరి శ్రమించారో ?

రోగమైనా ఒక్క రోజులో బయటపడదు ,
ఎన్నాళ్ళనుంచో లోనే అణగి మణగి ఉండిపోతాయి
ఇంక లోన వుండలేని క్షణాన ,వెలికి వచ్చి వెతలు కలిగిస్తాయి
ఆరోగ్యమైనా, ఓ నాటితో సమకూరదు .

పరికించగా , ఏదీ ఒక్క క్షణంలో జరగబడదని ,
ఇలా ఈ క్షణం జరగటానికి వెనుక ,
ఎనలేని ప్రిపరేషన్ ఉంటుందని ,
తెలుసుకొని మసులుకొందాం ఇకనైనా ........

                                 *******

1 comment:

  1. more meaningful...
    అర్ధవంతమైన కవిత .... చాలా బాగుంది ....

    ReplyDelete