మొబైల్

                   
నడిబజారులో అమ్మాయిలని , అబ్బాయిలని 
వాళ్ళ వాళ్ళకు తెలియకుండా ,
తన ప్రియుళ్ళతో , ప్రియురాళ్ళతో కలుపుతోంది .
సరదాల దురదలు తీర్చుకొమ్మంటుంది .


ప్రేయసిని నమ్మించి , 
ప్రియుడిచేత , 
గాలి కూడా చొరబడలేని ఆ వేళ  ,
చిత్రాతి చిత్రమైన చిత్రాలను తీయిస్తుంది ,
చిలికి చిలికి గాలి వానై ,
చిత్రంగా  చితి మిగులుస్తుంటుంది . 


భార్యలు , భర్తలు ,
ఒకళ్ళ కొకళ్ళ ,
కళ్ళు కప్పుకొంటూ ,
పరాయి వాళ్ళతో కలయికలకు , 
ప్రత్యేకంగా నిలబడ్తుంటుంది . 

నమ్మకంగా ఆటోలలో ఎక్కించుకొని,
ఆ సందేశాన్ని తమవారికి ,
ఏ సందేహం రాకుండా చేరవేసి ,
సామూహికంగా అత్యాచారాలు ,
చేయించటానికి దోహదపడ్తుంటుంది .

బాకీదారులు ఫోన్లో అడుగుతుంటే ,
తను పక్క బజారులో ఉన్నా ,
ఔట్ ఆఫ్ స్టేషనని ,
రావటానికి టైం పడ్తుందని ,
బొంకు పలికిస్తుంటుంది .


అడ్డదారిలో దోచుకొనేటందుకు ,
కిరాయి రౌడీల క్రియలకు ,
వీధి రౌడీల ప్రక్రియలకు ,
ఓ పేద్ద అడ్డాగా ఉపయోగపడ్తుంటుంది .  

అన్ని దేశాల నీలిచిత్రాలను ,
అర నిముషంలో కళ్ళముందుంచుతుంది ,  
రెప్పలు మూయకుండా అదేపనిగ ,
తదేక దృష్టితో చూడమంటుంది .  

బైటకు వెళ్ళిన మానవులకు ,
పొరపాటున ఏదైనా ప్రమాదం సంభవిస్తే ,
వెంటనే చేరవేసి తగు ట్రీట్మెంట్ యిప్పించి ,
ప్రాణాన్ని , తనవారిని రక్షిస్తోంది .

హంతకుల ఆరా తీసేందుకు ,
రక్షకభటులకు శ్రీరామరక్షగా నిలబడ్తోంది . 

ఏ వస్తువైనా ఈ ప్రపంచం పంచన ,
మంచికే సృష్టించబడ్తుంది ,

ఆ పై వంచన పంచకు చేర్చి ,
ఆ దిశగా అడుగులు వేయిస్తుంటారు  .

ఆ వస్తువుల తప్పు కాదు ,
కనుగొన్న వాళ్ళ నేరమూ కాదు ,
ఉపయోగించుకునే వారి తీరుని బట్టి ,
మంచిగా , చెడుగా దర్శనమిస్తుంటాయి .


అణుబాంబు కనుక్కొన్నది దేశ రక్షణకే కాని ,
ప్రాణ హానికి కాదన్నది మరువకూడదు సుమా !

                        ***********

2 comments: