ఇక ఇల కల

యుక్తవయసులో ,
నేను , నా స్నేహిత వర్గం ,
కళ్ళకు కనపడ్తున్న అక్రమాలను , 
అన్యాయాలను సహించలేకపోయాం ,
అక్రమాలను అఱికట్టాలనుకున్నాం ,  
అన్యాయాల్ని అణగదొక్కాలనుకున్నాం , 
ప్రతిన పూనాం మా స్నేహిత వర్గంతో ,
సమసమాజ నిర్మాణం స్థాపిస్తాం !

మా పెద్దలందరూ మమ్మల్ని , 
ఉడుకు రక్తపు ప్రతినలొద్దురా అన్నారు .

మీలా కాదు మేము ,
మావి మాటలు కాదు ,
సరాసరి చేతలే సుమా !
మా సత్తా ఏమిటో చాటుతాం !

అంతదాకా ,
మూడు పువ్వులూ ముఫ్ఫై కాయలుగా  ,
వృధ్ధి చెందిన మా స్నేహిత వర్గం  ,
చెట్టుకొకళ్ళు , పుట్టకొకళ్ళుగా ,
అయిపోయాం చెల్లాచెదురుగా  .

'నింద లేనిదే బొంద కదలదన్నట్లు '
కారణాలు కో కొల్లలు ,
ప్రతి క్రియకు కారణం ఉంటుంది ,
చదువులు , ఉద్యోగాలు , ఆరోగ్యాలు ,  
ఆర్ధిక పరిస్థితులు , పెళ్ళిళ్ళు ,
ఆ పై సంసార సారాల సంతానాలు . 

ఎన్నో చేయాలనుకున్న మేమంతా ,
ఏమీ చేయలేక , ఏటికి ఎదురీదలేక , 
విడిపోయి , మిగిలిపోయాం  ,

ఆ నాటి ఆ ఆలోచనలు , 
ఆ నాటి ఆ ప్రతినలు , 
ఉడుకు రక్తపు పోకడలుగా , 
పెళ్ళినాటి ప్రమాణాలుగా ,
నామకరణం చేయబడ్డాయి  .

మేమూ అందరిలా సగటు మానవులమే ,
సమసమాజ నిర్మాణం యిక కలే .

                  ********
  1 comment:

  1. నిఖార్సైన అనుభవ సారం
    ఒప్పుకొని తీరాలి అందరం

    ReplyDelete