కెవ్వు... కేక...,                        కెవ్వు... కేక...                             
    

నా వెంటే ఉంటూ , 

నా బాగోగులు చూసుకుంటుంటే
ఎంతగా మురిసిపోయానో , 
మైమఱచిపోయానో ,
మురికి కూపంలో ఎన్ని మార్లు దొర్లాడానో , 

అయినా, 

నన్నేమనకుండా తన అక్కున చేర్చుకుని, 
నీటితో కడిగి అమిత శ్రధ్ధ చూపిస్తుంటే ,
ఎంతగా సంతసించానో ,
సూకరముగా  పుట్టినా , 
తనే సూకరాలను దరిచేర్చుకోక,
నన్ను తన బిడ్డగా చూసుకుంటున్నాడంటే , 
ఏ జన్మలోనో  తను నాకు ఋణపడి ఉన్నాడేమో అనుకున్నా. 

అందుకే ,

అతను చేసే అన్ని సేవలకు సహకరించా
ఎండకు ఎండకుండా ,
వానకు తడవకుండా, 
నేనుండటానికి ఎంతో కష్టంతో ఓ కొష్టం ఏర్పరిచాడు,  
అదీ తన ఋణవిముక్తిలో భాగమనే ఎంచా .

నా లాలన ,పాలన చూడ్డానికి, 

తను ముష్టెత్తుతుంటే ఎంతగా బాధపడ్డానో. 
నేనెదురు తిరిగితే , 
మఱల మఱో జన్మలోనైనా ఈ ఋణం తీర్చుకోవాలిగదా ! 
అలా మళ్ళీ అతనిని బాధపెట్టటం ఎందుకని , 
అతను నన్నెలా చూసుకొనాలనుకొంటే అలా జష్ట్ ఎడ్జష్ట్ అవుతున్నా,
అదీ తన ఋణవిముక్తిలో భాగమనే ఎంచా .

నా జాతి సహచరులతో సహవాసం వద్దని ,
నన్ను సపరేట్ చేసినా ,
ఎదురుచెప్పక అతని అభిమతానికి తగ్గట్లు జీవిస్తున్నా,
నాకిష్టమైన నాజాతితో ఆ సృష్టి కార్యాన్ని కాదని ,
తనకిష్టమైన సీమజాతితో లంకె వేస్తే ఎదురుచెప్పల ,
మఱల మరో జాతితో లంకె వేసినా , 
అప్పుడూ ఎదురుచెప్పలేకపోయా ,
అదీ తన ఋణవిముక్తిలో భాగమనే ఎంచా .

గత 8 ఏళ్ళలో ఎదురుచెప్పక  అలా వింటూ కంటూనే ఉన్నా. 

మెటర్నిటీ డాక్టర్లచే  చెకప్ చేయించి , 
ఇంక లాభం లేదనుకున్నాడేమో , 
నన్ను కట్టేసి నా నాలుగు కాళ్ళూ ఒకటిగ చేసి , 
తోకని పైన వేలాడ దీసి , 
జీవాన్ని పోగొట్టుకున్న తోటి జీవాల పక్కన , 
నాకూ చోటు కల్పించాడు . 

ఇన్నేళ్ళు తను నన్ను పెంచి పోషించింది , 

ఋణవిముక్తుడవటానికి కాదని , 
దారుణానికి దగ్గఱవుతున్నాడని,
అప్పుడే తెలుసుకున్నా,

ఇవన్నీ నాకెలా  అర్ధమయ్యాయనా మీ సందేహం ? 


నాకు భాష రాకపోవచ్చు , 

బదులు చెప్పలేకపోవచ్చు , 
ఏ భాషలోనైనా , 
ఏ జీవికైనా భావాలు  అవే కదా ! 

ఇంక నా జీవితానికి మిగిలింది 

కెవ్వు... కేక..!.,  కెవ్వు... కేక...!, కెవ్వు... కేక...!!
                                               
                           ********   

2 comments:

  1. చక్కని కవిత రాసారు.

    ReplyDelete
    Replies
    1. భావానికి మాత్రమే ప్రాధాన్యత నిచ్చానంతే . భాషకు కాదు పద్మార్పిత గారు.

      Delete