" మాంగల్యం 'తంతు' నా...... "                   
                                                 "  మాంగల్యం 'తంతు' నా......  "  

                                                                                                                                        రచన : శర్మ జీ ఎస్                           


సాంబయ్య చనిపోగా ఆతని ఒక్కగా నొక్క అమ్మాయి పెళ్ళి బాధ్యత పెద్దన్నయ్య రాఘవయ్య మీద పడింది. 

పెళ్ళీడు వయసు దాటిపోతున్నదనటమే బాగుంటుంది . చూడని సంబంధాలు లేవండి . పల్లెలు పట్టణాలయిపోతున్నాయి , కారణం చదువుల కొఱకు పట్నమొచ్చి అక్కడి నాగరికపు ( ఆకర్షణ ) అలవాట్లు నేర్చుకొని , తల్లితండ్రుల మాట కాదనక , ఆ పట్నపు నాగరిక ఆకర్షణలను పల్లెల్లో పెంచుతూ, చదుకున్న పిల్లనే చేసుకుంటాం అని చూసిన సంబంధాల వారంటున్నారాఘవయ్య ఎంతో ఓపికగా సంబంధాలు సర్చ్ ప్రారంభించాడు . 

తెలిసినవాళ్ళకి చెప్తూ ,ఎవరైనా ఏ ఫంక్షన్ కి పిలిచినా అమ్మాయిని కూడా తన వెంట తీసుకు వెళ్ళేవాడు.

ఆ అమ్మాయికి యిలా ప్రతి ఫంక్షన్ కి బాబాయితో వెళ్ళాలన్నా యిబ్బందిగా ఫీలవుతుంది.అదే విషయం బాబాయికి చెప్పగా 

"  అలా ఫీలవ్వదమ్మా! ప్రతి ఫంక్షన్ కి దేనికి తీసుకెళ్తున్నానంటే ,అక్కడ తెలిసినవాళ్ళు , తెలియని వాళ్ళు వస్తుంటారు. వాళ్ళకెవరికైనా నచ్చితే , వాళ్ళ వాళ్ళకు తెలియచేస్తారని . ఇది మన అధునాతన సంప్రదాయం. అంతే గాని నీకింకా ఇంతవయసు వచ్చినా పెళ్ళీ కాలేదని వేలెత్తి చూపటానికి కాదమ్మా "  బదులిచ్చాడు. 

మోడ్రన్ పెళ్ళిళ్ళ పేరయ్యలను ( మాట్రిమోని వాళ్ళను ) కూడా కంటాక్ట్ చేశాడు రాఘవయ్య . 

మొదట ఫ్రీ రిజిస్ట్రేషన్ అంటే రిజిష్టర్ చేసేశాడు . 10, 15 సంబంధాలు ఇంటర్నెట్ ద్వారా చూసింతర్వాత ,మీరు రెగ్యులర్ సర్చ్ కాదు , 
అడ్వాన్స్ సర్చ్ చేస్తే మీకు తగిన సంబంధాలు దొరుకుతాయి అని ఉచిత సలహా పారేస్తే ( ఇంటర్నెట్ లోనే లెండి ), అలా వెతికినా , మనకు కావలసిన సంబంధాలు కాకుండా , మన సర్చ్ కి సంబంధంలేని సంబంధాలు మనల్ని ఆకర్షిస్తుంటాయి .

వాటి ఆకర్షణకు లొంగకుండా సర్చ్ చేస్తూనే ఉన్నాడు రాఘవయ్య యింకా . అతనికి వెతుకులాటలో ఏ సంబంధం నచ్చలేదు .

మెయిల్స్ లో మాట్రిమోని వాళ్ళు వెంటపడ్తున్నారు సరి కొత్త ఆఫర్లతో . ఒకళ్ళు కాదు చాలా మంది .

ఆ ఆఫర్లు చూడగానే రాఘవయ్య ఆనందానికి అంతులేదు . వరుడు దొరికిపోయాడన్నంతగా ఫీలయ్యాడు . ఇన్ని రకాల మోడ్రన్ 
పెళ్ళిళ్ళ పేరయ్యలుండగా ఇంక దిగులు చెందాల్సిన పనిలేదనుకున్నాడు.

మళ్ళీ సర్చ్ మొదలెట్టాడు . ఫలితం మునుపటిదే . కొన్ని సంబంధాలు కనపడ్తున్నాయి , కాని వాళ్ళను  డైరెక్ట్ కంటాక్ట్ చేయ్యటా
నికి వీలు లేదు . కారణం అవతలివాళ్ళు పెయిడ్ సభ్యులు కనుక మీరు పెయిడ్ సభ్యులయితే వారిని కంటాక్ట్ చెయ్యచ్చు అంటూ
పదేపదే , అదే అదే చెప్తూ బలవంతం లేదంటూనే బలవంతం చేస్తుంటారు.

మోడ్రన్ మాట్రిమోనీలన్ని కూడా ఇదే వరస . మన వివరాలన్నీ వాళ్ళకందించేంతవఱకు ఫ్రీ రిజిష్ట్రేషన్ అంటారు , అలా  చేసిం తర్వాత ఇలా వేధించుకు తింటుంటారు . 

సరెలే పెయిడ్ సభ్యత్వం తీసుకుంటే  మనకు సంబంధించినవి ఎక్కువ సంబంధాలు  లభిస్తాయని కడితే , లభించకపోగా మీరు  3 నెల్లకు కాదు , 6 నెలలకు గాని , 9 నెలలకుగాని ప్రీమియం కడితే యింకా పెయిడ్ సభ్యులతో చాటింగ్ చేయచ్చు, మొబైల్లో మాట్లాడవచ్చు , ఎస్ ఎం ఎస్ లు పంపించుకోవచ్చు , ఎన్నో ఫొటోలు చూడవచ్చు, యిలా ఎన్నో సౌకర్యాలు మీకు లభ్యమవుతాయి , 
ఒక్క మాటలో చెప్పాలంటే పిండి కొద్దీ రొట్టె అన్నమాట అని మొబైల్లో , మెయిల్స్ లో వెంటపడ్తుంటారు .

రాఘవయ్య సరే యిలాగైనా త్వరగా సంబంధాలు చిక్కుతాయి , తన కూతురు పెళ్ళి త్వరగా చేద్దామనుకున్నవాడై పెయిడ్ సభ్యత్వం తీసుకున్నాడు .

వెంటనే మాట్రిమోనీ వాళ్ళు కొన్ని సంబంధాల ఫోన్ నంబర్లు , చిరునామాలు , ఫొటొలు , జాతకచక్రాల మొదలగు వివరాలన్నింటిని విడుదల చేశారు . తన స్థాయికి తగ్గ సంబంధాల కొఱకు వెతకటం మొదలుబెట్టాడు . ఎస్ ఎం ఎస్ లు పంపాడు , మొబైల్లో  డైరెక్ట్ కంటాక్ట్ చేశాడు , జాతకచక్రాలు కొన్ని చూశాడు . 

అటునుంచి మాకు ఇంట్రెష్ట్ లేదు అని కొంతమంది , చదువుకున్న అమ్మాయి కావాలని యింకొంతమంది , అమ్మాయి నాజూకుగా ఉండాలి అని మఱికొంతమంది  బదుళ్ళొచ్చాయి . 

ఎక్కడున్నావే గొంగళి అంటే , వేసిన చోటే ఉన్నానే కంబళీ అన్నట్లు మళ్ళీ మొదటికొచ్చింది వెతుకులాట.ఎవారన్నారోగాని , వెతకటాన్ని , వెతుకులాట అని , అది ఆట అన్నది నిజమే మఱి.

ఇంతలో మాట్రిమోనీ వాళ్ళిచ్చిన 3 నెలలు గడచిపోయింది . మళ్ళీ వాళ్ళే రాఘవయ్య వెంటపడ్డారు అంటే మెయిల్స్ ద్వారా , ఈ మారు "1 సంవత్సరానికి తీసుకోండి మీకు యింకా మంచి మంచి సంబంధాలు లభిస్తాయని"  అనగానే , 

" వద్దులెండి "  అన్నాడు రాఘవయ్య.

అలా మీరు వెనకాడకండి , మీ అమ్మాయి ప్రొఫైల్ ని మా ఎక్స్పర్ట్స్ కి చూపించి మాడిఫై చేద్దాం , దానికి కొంత ఖర్చు చేయాల్సి వస్తుంది , మీరేం అధైర్యపడకండి , హైలైట్ చేస్తాం ఈ సంవత్సరం మొత్తం "   అంటూ వెంటపడ్తుంటే , రాఘవయ్య అయోమయంలో పడ్డాడు .

మాడిఫై చేస్తారా ? అంటే సవరించటమే కదా ! మా అమ్మాయిలో లేనిది వీళ్ళేమైనా యాడ్ చేస్తారా ? దానివల్ల సమస్యలు తప్ప సంబంధాలు ఎలా లభిస్తాయి?  హైలైట్ చేస్తారా ? అంటే మనం ఇంతవరకు కట్టిన మనీకి హై లైట్ చేయరా ? దానికి మళ్ళీ మనీ కట్టాలా ? అంటే అడుగడుగునా మనీతోనే మనకు వాళ్ళు సాయపడతారన్నమాట . 

ఆ అడ్వాన్స్ సర్చ్ లో సర్చ్ చేస్తే పెళ్ళీ కావలసిన వధూవరులు కోకొల్లలు. చాలామంది పెయిడ్ సభ్యులే . రెండేళ్ళ నుంచి పెయిడ్ సభ్యులుగానే కొనసాగుతున్నారు . 

ఇదే నా చిన్నతనంలో అయితే జనాభా తక్కువ , అన్నీ అందుబాటులోనే ఉండేవి . నిత్యావసర వస్తువుల్లాగే పెళ్ళిళ్ళ విషయంలో కూడా . ఆ రోజుల్లో అయితే అమ్మాయి గాని , అబ్బాయి గాని అయితే చాలు . పెళ్ళిళ్ళయిపోయేవి. అందం గాని , హైట్ గాని ,రంగు గాని , రూపు గాని ,చదువు గాని చూసే వాళ్ళే కాదు .  అసలు కాపురం చేయటానికి , వారసుల్ని కంటానికి ఆ పైన చెప్పినవేమీ అఖ్ఖర్లేదని , ఒక్క సంప్రదాయం , గుణం తప్ప వేరేవీ అవసరం లేదని అవే పాటించేవారు . సంప్రదాయం చూసేవాళ్ళు , దాన్ని బట్టే గుణం తెలిసేది . పెళ్ళంటే నూరేళ్ళపంటగా భావించేవారు .

"   బాబాయ్ ఇదంతా చూస్తుంటే పెళ్ళొద్దు  బాబాయ్ ! బాబోయ్ అని చెప్పాలనిపిస్తోంది ."

"  అదేంటమ్మా ? అమాంతంగా ఆ నిర్ణయానికొచ్చేశావ్ ?"

"  అవును బాబాయ్ వధువులు , వరులకు నచ్చుతారో లేదో మాట అవతల వుంచి , అలా నచ్చకపోతే ఈ మోడ్రన్ పెళ్ళిళ్ళ పేర ( య్యల ) మ్యాట్రిమోనీ వాళ్ళ పంట పండినట్లే. అలా పెళ్ళి కుదిరే వరకు ఆ వధూవరుల మీద ఎంచక్కా బిజినెస్ చేసుకోవచ్చు . 

నచ్చి సంబంధం కలుపుకుంటే ఈ వధూవరులకు పెళ్ళి నూరేళ్ళ పంట  , లేకుంటే నోరెళ్ళపెట్టటమేనంటా.  నాకు 
పెళ్ళి కావాలని మీరనుకుంటుంటే , ఆ మోడ్రన్ పెళ్ళిళ్ళ పేర ( య్యలు)మ్యాట్రిమోనీ వాళ్ళు నా పెళ్ళి వంకతో బిజినెస్ చేసుకోవటం నాకేమాత్రం నచ్చటంలేదు. ఇదంతా చూస్తుంటే మన బావనే చేసుకోవటం మంచిదనిపిస్తుంది ."

"   ఏంటమ్మా ? రాకేష్ నా !"  ఆశ్ఛర్యంగా అడిగాడు.

"   అవును బాబాయ్ , వీళ్ళందర్ని యిలా మేపుతూ , ఎవరో ముక్కూ ,ముఖం తెలియని వాళ్ళను చేసుకోవటం కంటే , మనకు తెలిసినవాళ్ళని కొంచెం లోపమున్నా చేసుకోవటం  మంచిదే ."

"   మాంగల్యం 'తంతు ' నా మమ జీవన హేతునా "   అని రాఘవయ్య తన తమ్ముడి కూతురి పెళ్ళి జరిపించేశాడు .
ఎప్పటికి ఆ మ్యాట్రిమోనీ వాళ్ళూ వాళ్ళ పెళ్ళిళ్ళకి గ్రీన్ సిగ్నల్ యిస్తారో , ఎప్పుడు ఆ  'మాంగల్య తంతు నా మమ జీవన హేతునా '  మంత్రం చదవటానికి అవకాశం కల్పిస్తారో వాళ్ళకే ఎఱుక / లేకుంటే ఆ భగవంతునికే ఎఱుక." అనుకొన్నాడు రాఘవయ్య .  

' నాటి మాంగల్యం తంతు నేడు మోడ్రన్ పెళ్ళిళ్ళ పేర ( య్యల ) మ్యాట్రిమోనీ వాళ్ళ తంతుగా ' అర్ధం చేసుకొన్నాడు రాఘవయ్యకి .


                                                                **** స *** మా *** ప్తం ***
                                                             
4 comments:

  1. మోడ్రెన్ పెరయ్యలతో మీ అనుభవమా ఇది ?

    బాగుంది !!

    ReplyDelete
  2. :) బావుంది . పెళ్లి అంటే మాటలు కాదు.. వెతలు, కోతలు, వ్యాపారం.

    ReplyDelete