హార్డ్ వేర్ డాడ్ - సాఫ్ట్ వేర్ సన్


                     
                                                             
                                                                                                                    కధా రచన : శర్మ జీ ఎస్                                                                                                                                                  

మహి , మహేష్ లు ఒకే ప్రాజెక్ట్  లో వర్క్ చేస్తున్నారు గత ఆరు నెలల నుంచి . ఆ ప్రాజెక్ట్ పుణ్యమా అని ఆ యిరువురూ  ప్రేమలో మునిగి పెళ్ళి కూడా చేసేసుకున్నారు పెద్దల నొప్పించి , ఐ మీన్ నాట్ నొప్పించి , ఒప్పించి .

వయసు పోతే రాదని , మనసు పారేసుకుంటే దొరకదని తెలుసుకున్న ఈ యిరువురు కొన్నాళ్ళు , అహ కొన్నేళ్ళు వయసుతో  పోరాడి ఎంజాయ్ చేయాలనుకుని , తమ ఫ్యామిలీని ప్లానుగా నడపాలని , ఫ్యామిలీ ప్లానింగ్ ని అనుసరించారు .

అధిక జీతాలనాశించి ఉద్యోగ పరంగా పరాయి రాష్ట్రానికి తరలిపోయారు అత్తా మామల అనుమతితోనే . వయసు లోతు తెలుసుకుంటూ ఆనందిస్తున్నారు . 4 ఏళ్ళు గడిచాయి . ఈ నాలుగేళ్ళలో కొన్ని పండుగలకు వాళ్ళు అత్తా మామల వద్దకు రావటం , మఱి కొన్ని పండుగలకు అత్తా మామలని వీళ్ళ వద్దకు పిలుచుకోవటం తో ఆనందాలని అందరూ పంచుకుంటున్నారు .

"   ఇకనైనా ఆలస్యం చేయకుండా వారసులని ఆహ్వానించండిరా . ఆలస్యపు  ప్రసవాలు అనవసరమైన నొప్పులుగా బైటపడ్తాయి "   అన్నది అత్తగారు .

"   అత్తయ్యగారు అప్పుడేనా ? "   ఆన్నది మహి .

"   ఓ ప్రక్క మీ వయసు పెరుగుతోంది , యిప్పుడు వారసులను వాయిదా వేసుకొంటూ ఏ 40 కో , 45 ఏళ్ళకో కంటే  , ఆ పిల్లలకు 10 , 15 ఏళ్ళు వచ్చేటప్పటికి మీకు 50 , 55 ఏళ్ళు వస్తాయి . ఇంకా మీ పిల్లలు చదువుకొంటుంటే , మీ లైఫ్ కి  సెక్యూరిటీ ఏముంటుంది ? వాళ్ళెపుడు మీ చేతికంది వస్తారు . మాకూ వయసు అయిపోతుంది , మాకెవరు చేస్తారా అని మేమెదురు చూస్తున్న సమయంలో , మేము మీ పిల్లనెలాపెంచగలం ? కొంచెం బాగా ఆలోచించండి "   అన్నది అత్తగారు  .

అత్తా మామల సంతానోపదేశం సమంజసమనిపించి , " అత్తయ్య గారు మీరు చెప్పిన ప్రకారం మేము వారసులని ఆహ్వానిస్తాం , కానీ ........... "

"   కానీలు , అర్ధణాలు ఏనాడో పోయాయి . త్వరగా చెప్పవే కోడలు పిల్లా "   అన్నది ఆనందంతో .

"   వాళ్ళను పెంచాల్సిన బాధ్యత మాత్రం మీదే , అలాగైతే నేను  రెడీ "   అన్నది మహి  . 

"   పిల్లలు కావాల్సింది మాకు , ఈ వయసులో మేం కనలేం కనుక ,  మిమ్మల్ని కనమంటున్నట్లుగా ఫీలవుతున్నట్లున్నది నీ వాలకం చూస్తుంటే "   అన్నది అత్తగారు .

"   ఏయ్ మహి ,  ఏమిటే అలా డైరెక్ట్ గా అడిగేస్తున్నావ్ , అమ్మ ఏమైనా అనుకోదు "   అని  మహేష్ అన్నాడు  . 

"   అనుకోవటానికేముంది , ఇది అత్తయ్య , మామయ్య గార్ల ప్రపోజలే కదా ! మనం  ఉద్యోగాలు చేస్తున్నవాళ్ళం , హాయిగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నవాళ్ళం . ఇలాంటప్పుడు పిల్లల్ని కంటే , మెటర్నటీ లీవ్ యిస్తారే గాని , ఎటర్నటీ లీవ్ యిచ్చి , శాలరీ యివ్వరు  కదా ! "   ఆన్నది మహి .

"   నువ్వు చెప్పినవన్నీ నిజమేనే , పిల్లలు కావలసింది మన భవిష్యత్తుకి   కాని వాళ్ళకు కాదు . వాళ్ళకు మనమున్నాంగా . అలా కండిషన్ గా అడగకే . అమ్మా , నాన్నలను రిక్వెష్ట్ గా అడుగు , మాకు సాయంగా ఉండండి "   అన్నాడు మహేష్ .

"   అలాగే మహేష్ , అత్తయ్య గారు , మామయ్య గారు  మీరు మాకు సాయంగా ఉండండి , మీకు మేం తోడుగా ఉంటాం "   అని అడిగింది మహి .

"   అలాగేలెమ్మా , యిక మీరు ఆ దిశగా అడుగులు వేయండి "   అన్నది అత్తగారు .

"   ఇప్పుడు మార్చ్ నెల కదా , కొత్త సంవత్సరం రాకుండానే , మీ ఒడిలో బాబు ఉంటాడు "   అన్న భరోసా 
యిచ్చింది .

కోడలు యిచ్చిన ధీమా , జీవిత భీమాతో సమానమనుకొని సంతసించారు అత్త , మామలు .

కొత్త సంవత్సరం రాకుండానే , పండంటి పాపను అత్త మామలకు అప్పగించింది మహి .  కొడుకు , కోడలు ఫోర్స్ గా ఉద్యోగాలను  స్వరాష్ట్రానికి మార్చుకున్నారు . 

పసిపాపను అత్తా ,మామలకప్పజెప్పి ఉదయమనగా వెళ్ళి , రాత్రి 9 గంటలకి చేరుకొంటున్నారు .

సాఫ్ట్ వేర్ ఉద్యోగస్థులు రెగ్యులర్ గా  లేట్ నైట్ అంటే మిడ్  నైట్ కాకుండా బెడ్ లైట్ ఆఫ్ చేయరు . కారణం సాఫ్ట్ వేర్ బేస్ , బాసులు  ఫారెన్ కంట్రీస్ లో ఉండటమే  మూలకారణం . 

పసిపాపకి 2 సంవత్సరములు నిండి  3 వ సంవత్సరం వచ్చింది . మళ్ళీ అత్తా మామల ప్రపోజల్ తో గ్రీన్ సిగ్నల్స్ చూసిన ట్రైన్  ముందుకు  దూసుకు పోయినట్లుగా , దూసుకు పోయారు మహి , మహేష్ లు .

ఈ సారి నిజ్జంగా వారసుడినే అప్పజెప్పారు . ఆనందించారు ఆ అత్త మామలు . 

                                                          *      *       *       *      


సుందరయ్య నాస్తికుడు కాదు ఆస్తికుడే . అలాగని ఆస్తి ఉందనుకొన్నారంటే కాలే పప్పులో కాలేసినట్లేనండోయ్ .

వాళ్ళ పూర్వీకులకో ఆచారం వుందట . ఆస్తులు ఈయకుండా , అప్పులూ అప్పజెప్పకుండా , "   అస్తులు " మాత్రమే యిస్తారుట . అదే పది లక్షలుగా , పది కోట్లుగా భావిస్తారుట ఆ వారసత్వం పుచ్చుకొని పుట్టిన వారందరూ. అస్తులన్నీ సక్రమంగానే వున్నాయన్న ఆనందం ఆస్తులకన్నా గొప్పదన్న భావన ఆ అందరిలో బాగా వుంటుందట .

అస్తులతో పాటు , ఆచారాలని కూడా వారసత్వంగా పుణికి పుచ్చుకొన్నాడు మన సుందరయ్య .  

ఉపనయనం అంటే ఏమిటొ అర్ధం  తెలుసుకున్నాడు సుందరయ్య . ఆ మరుక్షణం చేసేసుకోవాలని తొందర పడ్డాడు . అప్పటికే అతను 
పెళ్ళీడు కొచ్చి ఉండటం వలన , ఆతని పెద్దలు సరేనని  చేశారు ,అదీ ఎర్లీగా కాదండోయ్ ,  పెళ్ళి యింకా  2 , 3 గంటలు వున్నదనగా .  సంధ్యావందనం చేసుకుంటుంటే సర్వశక్తులూ లభిస్తాయని , దాంతో జీవితం ఆనందమయం చేసుకోవచ్చని , ఆ పై మానవులుగా పుట్టినందు
కు ఈ జన్మ సార్ధకత చేసుకునే అవకాశాలు ఇందులో ఎక్కువగా ఉన్నాయని తెలుసుకున్న సుందరయ్య ( పెళ్ళైన ) నాటినుంచి ఆ దిశగా 

అడుగడుగునా కొత్త కొత్త నియమాలు ఎంచుకొంటూ , ఎప్పటికప్పుడు ఆ నియమాలను కూడా మార్చుకొంటూ సాధన చేస్తూనే వున్నాడు . 


నియమాలు , సంవత్సరాలు మారుతున్నాయే గాని ఆతని లక్ష్యం ఏ మాత్రం మారలేదు , సాధించిన పురోగతీ లేదు .
ఆ నియమాలలో కొన్ని మచ్చుకు ఎక్జాంపుల్స్ .

సంధ్యావందనం , యిత్యాది పూజా కార్య క్రమాలకు కూర్చున్నప్పుడు , అక్కడ నుంచి డిష్ట్రబ్ కాకుండా ఉండేటందుకు మౌనంగా  

వుండదలిచాడు . తప్పనిసరి అవసరమైనప్పుడు మాత్రం గంట మోగిస్తుంటాడు , అర్ధం కాకపోతే సైగల అభినయం ద్వారా తెలియ
చెప్ఫాలనుకున్నాడు .ఆ రోజు సంధ్యావందనానికి కూర్చున్నాడు . సమయం 7 గంటలు కావస్తున్నది . ( ఇంకా ఇంటిలో  ఎవ్వరూ లేవలేదు . అందరికంటే 
ముందుగా మన సుందరయ్యే లేస్తుంటాడని మీకూ తెలుసుగా .)ఇంతలో పనమ్మాయి రంగమ్మ "   అమ్మగారు , అమ్మగారు "   అంటూ పిలిచింది .

ఆ పిలుపుకి సుందరయ్య గంట మోగించకుండా ఉండలేకపోయాడు .

ఇంటిలోంచి బదులు రాకపోయేసరికి , మరలా  గంట గణగణ మని అదేపనిగ ( కొంచెం సెపు ) మోగించాడు .

మఱల "   అమ్మగారూ , అమ్మగారూ "   అంటూ పిలిచింది రంగమ్మ .

బదులుగా  మళ్ళీ గంట గణ గణ మంటూ మోగుతూనే ఉన్నది .

అప్పుడు బెడ్ రూం లోంచి హాల్లోకి వస్తూ " వస్తున్నానండి " అన్నది కామాక్షి  .

విసుగు ఎక్కువైన సుందరయ్య మౌనవ్రతం మాట మర్చిపోయి "   ఎంతసేపు ఈ గంట మోగించాలి .  రంగమ్మ వచ్చి పావుగంట 
దాటింది "   అన్నాడు .


"   అయ్యో , అలాగా అండి వస్తున్నా "   అన్నది కామాక్షి .

"   ఆ.... ఆ.... నువ్వొస్తూనే వుంటావ్ , నేను మోగిస్తూనే వుంటానీ గంట . అసలీ గంట ఎవడు కనిపెట్టాడో గాని , గంటల తరబడి 
మోగిస్తేనే గాని ఎవరూ బదులీయటం లేదు "   అన్నాడు.


"   అదేమిటండి మీరు మాట్లాడుతున్నారు ,  మౌనవ్రతం మాట మర్చిపోయారా ? మాట్లాడకుండా గంట మోగించాలిగదా "  అన్నది .

"   ఎంతసేపు మోగిస్తానే ఈ గంట , రెక్కలు నొప్పులు పుడ్తున్నాయి ."   అన్నాడు.

"   మొదటి , రెండు గంటలకి మెలకువతోనే ఉన్నా, కానీ ఆ గంట మీ పూజకి సంబంధించినదనుకుని రెప్ప వాల్చాను . ఆ తర్వాత 
గణగణ మని రణగొణ ధ్వనిలా  గంట మోగుతుంటే అప్పుడు గుర్తొచ్చింది మీ మౌనవ్రతం . వెంటనే వచ్చేశా . ఉండండి , రంగమ్మ 
వచ్చింది  తలుపు తీసి వస్తా , ఆ పై మీక్కావలసింది యిస్తా " అన్నది.

రంగమ్మ లోనకి వస్తూ , " అమ్మగారు అయ్యగారి పూజ ఈ రోజు అప్పుడే అయిపోనాది , హారతిచ్చి , గణ గణ గంట మోగిస్తే , నే బయటనుండే కళ్ళకద్దుకున్నా , మీరు అద్దుకోలేదా ? " అని అన్నది.

" అది హారతి గంట కాదే పిచ్చి మొఖమా . అయ్యగారు పూజ చేసుకొంటున్నప్పుడు ఎవ్వరితో మాట్లాడరుట . ఏదైనా అత్యవసరమైతే అలా గంట మోగిస్తారే " అన్నది కామాక్షి .

" అదేమిటమ్మగారు చక్కగా నోరుండగా , హాయిగా మాట్లాడుకోకుండా , అల మూగవాళ్ళగా , ముష్ఠి వాళ్ళ లాగా , కుష్టి వాళ్ళ లాగా , ఆ గంటల పిలుపులేమిటి ? " అన్నది రంగమ్మ . 

సుందరయ్య  చిరాకుగా మళ్ళీ గంట గణ గణ మని మోగించాడు .

" ఉండవే రంగమ్మా , అయ్యగారు పిలుస్తున్నారు " అంటూ అక్కడ నుంచి పూజా మందిరంలోకి వచ్చి " ఏమిటండి ? " అన్నది . 

సైగలతోనే  మాట్లాడకండి నా పూజకి ఆటంకంగా వుంది అని తెలియచేశాడు.

" అలాగేనండి " అని అవతలకి వెళ్ళిపోయింది  కామాక్షి .

మచ్చుకు మరోటి .

              
ఆ క్రమంలో  సుందరయ్య వేకువఝామునే లేచి , కాలకృత్యాలు తీర్చుకుని , పువ్వుల సేకరణకు , ఓ కఱ్ఱ లాంటిది ( కాని కఱ్ఱ కాదు లెండి ) తీసుకుని , చేతికో క్యారీ బాగ్ తీసుకుని తలుపులు తాళాలు వేసుకొని ( ఇంట్లో ఎవరూ ఉండరా అన్న సందేహం మీకు కలగవచ్చు . ఆ సందేహం ఇప్పుడే తీరుస్తాను , ధర్మపత్ని , కొడుకులు , కోడళ్ళు , కూతురు , మనమడు , మనమరాలు ఉన్నారు , వాళ్ళందరిని నిద్ర లేపి ఆ సమయంలో ఇబ్బంది పెట్టటం యిష్టంలేక ) యిలా బయలుదేరతాడు .

సుందరయ్యకు ఏదైనా రెండు విధాలుగా ఉపయోగించాలనే తడి , అదేనండి తపన  ఎక్కువే . అదేంటయ్యా అని అడిగితే , ఈ ప్రపంచమే ద్వైతం , మొదట ఒక్కటే , ఆ పైనే రెండు అయ్యింది , దీనినే మన వేదాలు ఘోషిస్తున్నాయి అంటాడు . ఈ కఱ్ఱ గాని కఱ్ఱను కూడా ఒకపరి పువ్వుల కొమ్మలను క్రిందకు వంచటానికి , తదుపరి కుక్కలు మొఱిగితే  తోలటానికి అంటాడు .

అలా వెళ్ళివచ్చిన పిమ్మట తలుపుల తాళాలు తీసుకుని , పాల ప్యాకెట్లు ఫ్రిజ్ లో పెట్టి , శీతల పానీయంతో స్నానం పూర్తి చేసుకొని , సంధ్యావందనం యిత్యాది పూజా కార్యక్రమాలకు ఉపక్రమిస్తాడు . ఆ సరికి 7 గంటలు కావస్తుంటోంది . పూజామందిరంలో ఆసనం వేసుకొని ఆరంభించగనే , రాగాన్ని ఆరంభిస్తాడు అతని ఆరేళ్ళ మనుమడు అఫ్ఫుడప్పుడు .

దాంతో సుందరయ్య డైవర్ట్ అయ్యి , " ఏయ్ కామాక్షీ,ఆ పిల్లవాడు ఏడుస్తున్నాడు , వాళ్ళను లేపి వాళ్ళకిచ్చేయ్  " అన్నాడు .

" ఆ మాట మాత్రం చెప్పనండి , కావాలంటే నేను చూస్తాను అని ప్రక్క మీదనుంచే  బదులిచ్చింది కామాక్షి. 

" ఎవరు చూస్తే నాకేంటి ? వాడు ఏడుపు ఆపాలి అంతే " అన్నాడు .

"ఒరేయ్ చిట్టికన్నా , యిటురారా , నా బంగారు కొండవు కదూ " అంటూ అక్కడనుంచే పిలుస్తోంది .

వాడు అంగుళం కూడా కదలకుండా ఆరున్నొక్క రాగం శృతి పెంచేస్తున్నాడు .

సుందరయ్యకి సంధ్యావందనం ముందుకు సాగటం లేదు . " ఏయ్ వాడు నీ వద్దకు రాకుంటే , వాళ్ళను నిద్ర లేపి వాడిని వాళ్ళకిచ్చి సముదాయించుకోమను , నేనిక్కడ కూర్చున్నానని పేరే గాని , ప్రయోజనం లేకుంది " అన్నాడు .

" అదేనండి నే చెప్పేది కూడా , మీకెందుకండి ఇవన్నీ ? " అన్నది .

" వాడలా గ్రీన్ సిగ్నల్ కొరకు ఆపకుండా కూస్తున్న రైలింజన్ లా అదేపనిగ ఏడుస్తుంటే , సంధ్యావందనం , పూజ ఎలా చేసుకుంటాను . ఎవరైనా వాడిని సముదాయిస్తే పూజ చేసుకోగలను . లేకుంటే ...... ? "

" లేకుంటే మీరు పూజ చేసుకోలేనంటారు . అయితే ఓ పని చేయండి " అన్నది కామాక్షి .

" ఏమిటో అది ? "

" ఎటూ పూజ చేసుకోలేనంటున్నారు గనుక , మీరే వాడిని సముదాయించండి , మిగిలిన వాళ్ళందరన్న హాయిగా విశ్రాంతి తీసుకొంటారు " అన్నది .

" వేకువఝామున లేచి నే చెయ్యాల్సింది యిదేనా ? " అన్నాడు.

" అంతే కదండి . పిల్లలు దేవుడితో సమానమంటారు. దేవుడి పూజ కుదరనప్పుడు యిలా పిల్లల్ని సేవించుకోండి " అన్నది.

" ఇలా ఈ సలహా నాకిచ్చేబదులు , మన కొడుకు , కోడల్ని లేపి వాళ్ళను చూసుకోమనకూడదు "

" కూడదని వాళ్ళు ముందే చెప్పారు గ . పిల్లల్ని మన కోసం ఇంత తొందరగా కన్నారు గాని , వాళ్ళ కోసం కాదు . కనటంతో వాళ్ళబాధ్యత వాళ్ళు చక్కగా నిర్వర్తించారు . ఇంక పెంచాల్సిన బాధ్యత  మనదేనండి " .

" సరేనన్నంత మాత్రాన వేకువఝామునుంచి  వెలుతురు పోయేంతవరకు అంటే , వెలుతురు కాదే  పోయేది మన ఊపిరే ."

" రోజూ చెయ్యమనటం లేదుగా , ఇలా ఎప్పుడైనా అవసరం అయినప్పుడేగా . వాళ్ళూ మన పిల్లలే కదండి " .

" కాదనలేదే , అలా ట్రాన్స్ లోకి వెళ్ళకు , నన్ను లాక్కెళ్ళకు . ఇంత  నాకు చెప్పే బదులు , వాళ్ళకు చెబితే , కొన్నాళ్ళకైనా మారతారు గదా ! ఇంక ఆపు " .

" నేనాపుతాలెండి , మీరెక్కడ ఆపారో అది చూసుకోండి "

" ఆ...ఆ... నేనెక్కడ ఆపానో , మర్చిపోయాను , సరే ఎం చేస్తాను ? మళ్ళీ మొదలెడతా "

" ఇలాగైతే ఎంతకీ మీకు పూర్తి కాదు . "  పిల్లవాడిని తీసుకుని " ఏడ్వకురా , మీ తాతగారు పూజ చేసుకుంటున్నారు , ఏం కావాలి ? " అడిగింది ."

" మమ్మీ కావాలి " ఏడుస్తూనే .

" మమ్మీ నిద్రపోతుందిరా ".

" లేపు , మార్నింగ్ అయిందిగా "

" వాళ్ళకింకా కాలేదురా . వాళ్ళు లేట్ గా పడుకున్నారు . నైటే చెప్పారు మార్నింగ్ 9 , 9.30 వరకు డిష్ట్రబ్ చేయొద్దని ."

" అయితే డాడీని లేపు నామ్మా " .

" డాడీ కూడా లేట్ గా పడుకున్నాడు , మమ్మీ లాగే లేస్తానన్నాడు . "

ఇంతలో సంధ్యావందనం చేసుకుంటున్న సుందరయ్య " ఈ కొంచె సేపు అయినా మాట్లాడకుండా ఉండండే . అసలు మంత్రం ముందుకి వెళ్ళటం లేదు " 

అంత ఏడుపులో కూడా " తాతయ్యా అది యంత్రం కాదుగా ముందుకెళ్ళటానికి , మంత్రం కదా , నువ్వే దానిని ముందుకు తీసుకెళ్ళాలి " అంటూ నవ్వాడు  సంగ్రహ్ .

" అబ్బో అంత తెలిసినవాడికి ఏడవకూడదని తెలియదా నాయనా " .

" తెలియకపోవటం కాదు తాతయ్యా , అప్పుడపుడు ఎర్లీ మార్నింగ్ ఇలా ఏడుస్తుంటే , అవయవాలన్నీటికీ వ్యాయామం అని మా మిస్ చెప్పింది . అందుకే నేనప్పుడప్పుడూ ఏదో ఓ కారణంతో ఏడుస్తుంటాను " అని మరలా ఏడుపు మొదలెట్టాడు సంగ్రహ్ .

" అత్తయ్య గారు వాడిని సముదాయించి పడుకోపెట్టండి " అన్నది గదిలోంచి కోడలు మహి .

" అలాగేనమ్మాయ్ , ఒరేయ్ సంగూ ( ముద్దు పేరు లెండి ) అమ్మ పడుకోమంటున్నది , పడుకోరా " అన్నది కామాక్షి .

" ఉహూ నేను పడుకోను , నాకు మమ్మీ కావాలి " ఏడుస్తూనే .

" ఏయ్ కామాక్షి , అమ్మ నిద్రపోవాలి పడుకోరా అంటావే గాని , తాతయ్య పూజ చేసుకొంటున్నారు , డిష్ట్రబ్ చేయకూడదని చెప్పవా ? " అన్నాడు సుందరయ్య .

" ఎందుకు చెప్పనండీ , రోజూ చెప్తూనే ఉన్నాను కదండి , ప్రయోజనమేమీ కనపడక , ఈ రోజే వాళ్ళ మమ్మీ డాడి ల గురించి చెప్తే భయమన్నా ఉంటుందని అలా చెప్పానండి " అన్నది .

" భయం లేకపోయినా , భక్తి అయినా ఉండాలిగా ." 

" వాళ్ళకుండటం అంత ముఖ్యం కాదు గాని  , ముందు మీకు దేవుడి మీద వున్న భక్తిని చూపించుకోండి , పెంచుకోండి " అన్నది . 

" పెంచుకొనే మాట అటుంచు , మన యిరువురం యిలా ఒకళ్ళనొకళ్ళం ఎంచుకోవటం మాత్రం జరుగుతుంది "

ఇంకా సంగ్రహ్ ఏడుస్తూనే వుండతంతో , " అమ్మా వాడు ఆపుతాడా ? లేదా ? నేను లేచి రావాలా నాలుగు దెబ్బలు వేయటానికి " అన్నాడు మహేష్ .

అంతే వెంటనే బెడ్ మీదకెళ్ళి పడుకున్నాడు నోరు , కళ్ళు  మూసుకొని సంగ్రహ్ .  

సుందరయ్య సంధ్యావందనానికి లైన్ క్లియర్ అయ్యింది .

               *   *   *   *   *

10 comments:

 1. అనుభవాలు కధలు,కధలె అనుభవాలు అవుతాయి :)

  ReplyDelete
 2. హర్డ్ వేర్ డాడ్....సాఫ్ట్ వేర్ సన్...వాట్ అబౌట్ మదర్? :-)

  ReplyDelete
  Replies
  1. జిలేబీయం గరు నుడివినట్లు మదర్ హార్ట్ వేర్ , అనుమానమేమీ లేదు .

   Delete
 3. పద్మార్పిత గారూ,

  మదర్ 'హార్ట్'వేర్ !!

  చీర్స్
  జిలేబి

  ReplyDelete
  Replies
  1. మదర్ హార్ట్ వేర్ , అదర్స్ హర్ట్ వేర్స్ అండి.

   Delete
 4. చాలా బాగుంది. శైలజ

  ReplyDelete