ఇండియన్ డాడ్ - అమెరికన్ సన్


                                                                         ఇండియన్  డాడ్  -   అమెరికన్ సన్                                               
                                                                                                                                కధా రచన : శర్మ జీ ఎస్                                                          

పాల్ చిన్నతనంలోనే దత్తు పోయాడు వాళ్ళ డాడీ వాళ్ళకు తెలిసిన దూరపు అమెరికా బంధువులకు . ఇపుడు అంటే 40 ఏళ్ళ తర్వాత పాల్ జనక తల్లితండ్రుల ఇంట్లో పెళ్ళి అంటే చూడటానికని బయలుదేరాడు న్యూయార్క్ నగరం నుంచి హైదరాబాద్ కి  . చాలా కాలం తర్వాత యింత దూరం ప్రయాణం చేయటం ఇపుడే .  ఫ్లైట్ లో బాగానే సాగింది ప్రయాణం . విసుగు కలగకుండా హాయిగా ఎంజాయ్ చేశాడు .
రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో కాలు పెట్టిన మరుక్షణం తనను చక్కగా రెసీవ్ చేసుకొని , ఏ సి కారులో తీసుకువెళ్ళారు . వాతావరణం వేడిని విరజిమ్ముతోంది . సమయం ఉదయం 9 గంటలుకూడా కాలేదు , తట్టుకోలేక పోయాడు . ఇంట్లోకి వెళ్ళగానే యిల్లంతా పెళ్ళికి వచ్చిన బంధువులతో కిటకిట లాడుతోంది . తన డ్రెస్ చమటలతో
తడిసిపోయింది . లగేజ్ ఇంట్లోకి చేరవేసిన తర్వాత నేచర్ కాల్స్ ముగించుకున్నాడు . ఇక్కడ అక్కడ లాగా టిస్యూస్ లేవు .కుడి ఎడమల తేడాలు యిక్కడ లేవు . స్నానం చేయటానికి బాత్ టబ్ లేదు . వేడినీళ్ళకు  అమెరికాలో లాగ ట్యాప్ తిప్పుకుంటే రావట , గీజర్ వేసుకోవాలిట . ఎలాగోలా ముగించుకొని డ్రెస్ వేసుకొని హాల్లోకి వచ్చాడు .బ్రేక్ ఫాస్ట్ అతనికి సపరేట్ గా తెచ్చిపెట్టారు . ఫ్యాన్ వేశారు చమటలతో తడుస్తున్న ఆయన డ్రెస్ చూడక మునుపే . ముగించుకున్న తర్వాత ఆ హాల్లో ఓ మూల పడక్కుర్చీలో కూర్చున్న ఓ 85 ఏళ్ళ పండు ముసలమ్మ వద్దకు తీసుకు వెళ్ళి , "   అమ్మా నీ అమెరికా మనమడు వచ్చాడే   పెళ్ళి చూడటానికని "   అన్నాడు .

"  ఎవరూ , మన జులపాలా ? "   అన్నది .

"   అవును బామ్మా , నేనే , నీకింకా నా పేరు గుర్తున్నదే "   అన్నాడు .

"   నీ రూపం మారిపోతుందేమో గాని , పేరెలా మారుతుందిరా ? "

"   రూపంతో పాటు , పేరు మారింది బామ్మా "   అన్నాడు .

"   అదెలాగరా ! "   అడిగింది .

"   దేశ కాలానుగుణంగా , వేష భాషలు , వాటితో పాటు పేర్లు , అలవాట్లు అన్నీ మారుతుంటుంటాయి . ఇప్పుడు నా పేరు నువ్వు అంటున్నట్లుగా జులపాలు కాదు . కే జే పాల్ . "


"  అలాగా! ఏదీ  ఒక మారు యిటు రారా "   అన్నది .

మసక మసకగా కనపడ్తున్న అతనిని చూసి , "   ఏరా మన భారతదేశాన్నే మరచిపోయావుగా . నిన్ను చూసి
షుమారుగా 30 ఏళ్ళు దాటింది . ఇప్పటికి గుర్తొచ్చానురా "  అంటూ తల నిమరబోయింది . "   పైన జుట్టే లేదు .
అదేమిటిరా జులపాలు , నీ జుట్టేది ? "

"   ఇంకా జుట్టెక్కడుంటుంది , ఎపుడో పోయింది , ఎపుడూ విగ్ వాడ్తుంటాను , ఎపుడైనా బయటకి వచ్చినపుడు ,
ఇంట్లో ఉన్నపుడు యిలా  ఉంటుంటాను ."

"   ఔనురా , ఏదీ నా మనుమరాలు ? "   అన్నది .

"   ఎప్పటి మనుమరాలు ? "

"   అదేమిటిరా అలా అడుగుతావు , నీ భార్యరా "   అన్నది .

"   నేనూ అదే అంటున్నా , ఎప్పటిభార్య ? లేదా ఎన్నో భార్య ? "   అని అడిగాడు .

"   అలా అడుగుతావేమిటిరా , నాటకాలలో ఒకటవ కృష్ణుడు , రెండవ కృష్ణుడు "   లాగ అన్నది .

"   నేనూ అదే అడుగుతున్నా , ఒకటవదా  ? రెండవదా ? లేక మూడవదా ? "

"   ఇంతమందిని పెళ్ళి చేసుకున్నావా ? "

"   ఔను బామ్మా"   అన్నాడు .

"   ఇద్దరిని చేసుకున్నా సంతానం కలగలేదని మూడోపెళ్ళి  చేసుకున్నావటరా ? "

"   అదేం లేదు . అందరితో పిల్లలు పుట్టారు . "

"   మరి ఇన్ని పెళ్ళిళ్ళెందుకు చేసుకున్నావురా ? "

"   ఇందాక చెప్పావు చూడు 1 వ కృష్ణుడు , 2 వ కృష్ణుడు అని . నిజంగా ఈ జీవితం ఓ నాటకం . నాటకంలో ఒకే పాత్ర కడదాకా వుండనట్లే , ఈ జీవన పయనంలో ఇలా మారుతుంటారు , నాకే కాదు ఆడవాళ్ళకు కూడా . "

"   ఛీ ఛీ అదేమిటిరా అలా తప్పుగా మాట్లాడుతున్నావ్ ? "

"   తప్పేమి మాట్లాడటం లేదు , చెయ్యటం లేదు . "

"  సరే ,సరే   పిల్లలెక్కడా ? "

"   ఏ పిల్లలు ? "

"   నీకు పుట్టిన పిల్లలురా . "

"   వాళ్ళు పెద్దవాళ్ళై వాళ్ళ జీవితాలు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు . ఎలా తీసుకు వస్తాను . ? "

కొంచెం విసుగ్గా , "   సరే సరేఇదంతా వింటుంటే నాకేదో గందరగోళంగా వుంది . ఒరేయ్ పెద్దోడా ? ముందు ఆ పెళ్ళి పనులుచూడండి , నే కాసేపు విశ్రాంతి తీసుకొంటాను "   అంటూ కళ్ళు మూసుకొన్నది .

                                                     **                            **                    **

ఫంక్షన్ హాలు అంతా పెళ్ళి వారితో , బంధు మిత్ర పరివారంతో నిండి ఉంది తెల్లవారుఝాము నుంచే . మన జులపాలు , అదే మన పాల్  కూడా అక్కడకి చేరుకొన్నాడు . కొంచెం వేడి తగ్గినట్లనిపించి , హాయిగా ఫీలయ్యాడు . 

ఓ గదిలో వధువు చేత పూజ చేయిస్తున్నారు . మరో గదిలో వరుడి చేత పూజ చేయిస్తున్నారు .ఆ పెళ్ళి వస్త్రధారణతో  వాళ్ళు  చమటలతో బాగా యిబ్బంది పడ్తున్నారు అని గ్రహించాడు మన పాల్  . అతనిని చూడగానే నమస్కారం చేశారు . పక్కనే వున్న వాళ్ళ డాడ్ ని "   పెళ్ళెప్పుడని ? "   అడిగాడు . రాత్రి 1.30 కి అని చెప్పాడు .                             

"   మరి యిప్పట్నుంచే వీళ్ళేమిటి అలా వేషం వేసుకొని ఉన్నారు ? విప్పేసి అప్పుడు ఓ గంట ముందు రెడీ అవచ్చుగా "  అన్నాడు .

మన పాల్ మాటలు విన్న కొందరు వింతగా చూశారు జులపాలుని , ఇంకొందరు కొత్తగామోలు అనుకొన్నారు , మరికొందరు నవ్వు ఆపుకోలేక ఫకాలున అతనికి వినపడేటట్లుగా నవ్వేసేశారు .

అతను అన్నదానిలో తప్పేమిటో జులపాలుకి మాత్రం అర్ధం కాలేదు .

"   మధ్యాహ్నం దాకా మంచి ముహూర్తం లేదని ,  వేకువఝామున 4 గంటలకి వుండటంతో , ఆ ముహు      ర్తానికే  పూజలు చేయించేయాలని మేమంతా వాళ్ళను 2.30 కే లేపి రెడీ చేశామ  "   ని తెలియచేశాడు పక్కనే                                      వున్న డాడ్  .

"   అయ్యో అంత ఎర్లీగా లేచారా ? అప్పటినుంచి యిలా ఈ వేషంలోనే వున్నారా ? ఇంకా రాత్రి దాకా యిలానే వుండాలా ? చ్ చ్ ఐ పిటీ దెం "   అన్నాడు .

"   రాత్రిదాకా అవసరం లేదు , 9 గంటలకు రెసెప్షన్ అరేంజ్ చేశాంగా , అప్పుడు ఈ డ్రెస్ మార్చుకొంటారు , అందరూ విష్ చేయటానికి వస్తారు కదా ! " .

"   పధ్ధతులను చూస్తుంటే , వీళ్ళకేమైనా తినటానికి పెట్టేటట్లు లేరే అన్న తన సందేహాన్ని వెలిబుచ్చాడు . "

"   అల్పాహారం మాత్రంపెడతాము  . లంచ్ పెట్టకూడదు . "

"   మరిఎలా ఉంటారు ? అంతవరకు  ? "

"   పదే పదే ఇంకేమి తినకూడదు , తప్పనిసరైతే టీ గాని , కాఫీ గాని , లేదా ఏదో ఓ కూల్ డ్రింక్ గాని తాగవచ్చు . పెళ్ళి పూర్తయ్యేవరకు ఇంతే "   అన్నాడు .

"   పెళ్ళి చేసుకుంటున్నందులకు ఇంత శిక్షా వాళ్ళకు ? "   అని అడిగాడు .

"   శిక్ష కాదు , కక్ష కాదు , మన సంప్రదాయం అది . "

9 గంటలైంది , రెసెప్షన్ ప్రారంభమైంది , అందరూ వచ్చి పలకరించి , గిఫ్ట్ లందించి , డిన్నర్ చేసి వెళ్ళిపోయారు బయటి వాళ్ళు . ఆ సరికే 11.30 అయింది . క్రిక్కిరిసిన జనం మెలమెల్లగా పలచబడ్డారు . బంధు , మిత్రులు వుండిపోదామని వచ్చినవాళ్ళు మాత్రం  అక్కడే పరిచిన తివాసీల మీద  పడుకొన్నారు . ఇంక మెలకువతో ఉన్నవాళ్ళు ఆ నూతన వధూవరులు , వాళ్ళ తల్లితండ్రులు , బ్రహ్మలు , వాళ్ళ శిష్యులు మాత్రమే . వధూవరులు నిద్రముఖాలతో పూజలు చేస్తున్నారు , వాళ్ళకెదురుగా అగ్ని వెలుగుతూ , ఆరుతూ , పొగతో తన ఉనికిని తెలియజేస్తున్నది . యిలా నిద్రపోతారనే కాబోలు ఆ అగ్ని ఉంచబడింది అనుకొన్నాడు పాల్  .

తన పుటక భారతదేశంలో అయినా , తనకిక్కడ సంప్రదాయాలు అసలు తెలియనే తెలియవు . ఒకవేళ చిన్నతనంలో చూసినా కాలక్రమంలో అవి మరపు బుట్టలోకి వెళ్ళిపోయాయి . అందుకే  చూడాలనే వచ్చాడు ఇపుడు . అందరూ నిద్రపోతున్నా , తను మాత్రం ఆ పెళ్ళి విధానం చూడాలనుకొని చూస్తున్నాడు . 

నిన్నటిదాకా ఒకరినొకరు చూసుకున్నవాళ్ళే రకరకాల సంప్రదాయాల పేర్లతో ఈ లోపల దూరంగా వుంచారా యిరువురిని . ఆ యిరువురి నడుమ ఓ తెల్లటి పలుచటి వస్త్రాన్ని పరదాగా వుంచి అటూ , యిటూ హోల్డ్ చేసి ఉంచారు వాళ్ళ పురోహితుల శిష్యులు . ఈ సమయంలో జీలకఱ్ఱ , బెల్లం కలిపి ముద్దగా చేసి చెరి కొంచెం ఒకరినొకరి తలమీద పెట్టించారు .

వాళ్ళు తలవంచుకొని వాళ్ళు చెప్పినట్లే చేసి , ఒకరినొకరు చూసుకొనే ప్రయత్నం చేస్తూ ఆనందం పొందుతుండగా పుటుక్కున ఆ వస్త్రాన్ని తొలగించేశారు .

"   హమ్మయ్య ఇప్పటికి వాళ్ళకు అడ్డం తొలగిందన్నమాట "అనుకొంటూ నిట్టూర్పు విడిచాడు పాల్ .

"   అపుడే కాదు ఇంకా , యిలా మరికొన్ని కార్యక్రమాలు వున్నాయి . కన్యాదానం , సూత్రధారణ , ఇలాంటివన్నీ చేసిన తర్వాత కొంచెం విశ్రాంతికి అవకాశం వస్తుంది  "    అని తెలియచేశాడు వాళ్ళ డాడ్ .

"   మరి భోజనాలు ఎప్పుడువాళ్ళకు ? "   అడిగాడు .

"   రేపు మధ్యాహ్నం అందరి ముందర విందులో ఎంగిళ్ళు పెట్టిస్తాం . నిజానికి అవి ఎంగిళ్ళు మాత్రమే కాదు అంగిళ్ళు కలుపుకోవాలని తెలియచెప్పే ఎంగిళ్ళు అవి . చాలా మంచి విషయం అది . "

"   ఈ అంగిళ్ళు కలవటానికి ఇంత తతంగమా ? "

"   తతంగం కాదు , ఈజీవితమే ఓ పతంగం . గాలివాటుగా పయనిస్తుందని తెలుసుకొన్న మన ముందు తరాల
వారు ఈ పెళ్ళి అనే తతంగాన్ని ఏర్పాటు చేశారు ".

"   మరి వాళ్ళు ఒకళ్ళనొకళ్ళను తెలుసుకొనేదెప్పుడు ? "అడిగాడు పాల్ . 

"   అందుకేగా పెద్దలం మేమందరం వుండి ఈ కార్యక్రమాన్ని , ఈ క్రమంలో జరిపించటం ."

"  ఈ పెళ్ళి అయ్యేదాకా వాళ్ళు యిలా నిరిక్షించాల్సిందేనా ? "

"   మరింకేం చేస్తారు ? తప్పదు .పెళ్ళికొడుకు వయసు 30 , పెళ్ళికూతురు వయసు 25 . వరుడు మంచి ఉద్యోగం కొరకు నిరీక్షిస్తున్నాడు . వధువు సాఫ్ట్ వేర్ లో జాబ్ చేస్తున్నది . "

"  మరి వరుడు ఎక్కడ జాబ్ చేస్తున్నాడు ? "   అడిగాడు పాల్ .

"   ప్రస్తుతం ఎక్కడా చేయటం లేదు . అతను ఉద్యోగం వచ్చిన తర్వాత చేసుకొంటానన్నా , మేమే బ్రతిమలాడి యిపుడు జరిపిస్తున్నాం .ఆలస్యం చేస్తే అతనికి మాంచి ఉద్యోగం వచ్చి మనసు మార్చుకుంటే  యిబ్బందే కదా ? "

ఆ మాట వినగానే మరింత ఆశ్ఛర్యానికి లోనయ్యాడు మన పాల్ . ఏమిటి  వీళ్ళ ఆలోచనా విధానం ? అనుకున్నాడు మనసులోనే  . "   పెళ్ళి అయిపోయినట్లేనా ? "అడిగాడు  .

"   లేదు ,ఇంకా చాలా ఉంది . తాళి ( మంగళసూత్ర ధారణ ) కట్టాలి , తలంబ్రాలు పోసుకోవాలి , హోమం జరగాలి , నాగవల్లి జరగాలి ."

"   అంటే ? "

"  తాళి అంటే మాంగల్య సూత్రధారణ , పెళ్ళికూతురి మెడలో ఒక పసుపు తాడు (లో గుచ్చబడిన రెండు పుస్తెలు వుంటాయి ) ను మూడు ముడులు వేసి కడతాడు . దాని అర్ధమేమిటంటే నిన్ను , మనసా , వాచా , కర్మణా నా అధీనం లోనికి ఆహ్వానిస్తున్నాను అని . నేనూ అలా త్రికరణశుద్ధిగా ఉంటాను అని .ఆ తర్వాత వరుడి మెడలో కూడా అంతక్రితం ఉపనయనంలో వేసిన యఙ్నోపవీతాన్ని ( ఒక ముడితో ముడివేసుకున్న మూడు దారాలున్నదాన్ని ) , ఇప్పుడు అలాంటివే 3 వున్న అంటే 9 పోగులు వున్న దానిని వేసి ఆ పాతదాన్ని తీసేస్తారు . ఆడవాళ్ళకు తాళి కనపడ్తూ అడుగడుగున ఎలా గుర్తు చేస్తుంటుందో , అలా మగవాళ్ళకు ఈ యఙ్నోపవీతం ( జంధ్యం ) గుర్తు చేస్తుం టుంది , పరాయి , కిరాయి చేష్టల జోలికి వెళ్ళకుండా . 

మగవాళ్ళకు ఈ ఒక్కటే మార్పు . ఆడవాళ్ళకైతే చాలా మార్పులుంటాయి . కాళ్ళకు మెట్టెలు తొడగంలాంటివెన్నో . 
ఆ తర్వాత తలంబ్రాలు . దీని అర్ధం ఈ చర్యతో ఒకరికొకరు ఇంకొంచెం దగ్గరవతారు .  ఈ ప్రపంచంలో మానవులు భయపడేది ఒక్క అగ్నికి మాత్రమే , ఇలా దగ్గరవుతున్న ఆ యిరువురూ కలసి ఆ అగ్ని ముందు హోమం చేస్తారు , మేమిరువురం కలసి మాటకు కట్టుబడి వుంటాము .  
అలా యివన్నీ పూర్తి అయిన తర్వాత  నాగవల్లి  . 
ఒక ఉయ్యాల కట్టి అందులో ఓ గంధపు చెక్క , ఓ పండు ఇంకా పసుపు పళ్ళెంలో పెడతారు . ఆ తర్వాత వాళ్ళ చేత ఆ ఉయ్యాలను ఊపిస్తారు . మీరిరువురూ కలసి కాపురం చేస్తే పిల్లలు పుడతారు . ఆ పిల్లల్ని మీరిరువురూ కలసి పెంచాలి  అని .
యిలా అనేక కార్యక్రమాలు ఉన్నాయి . అవన్నీ జరిగిన తర్వాత వాళ్ళను తిసుకొని పెళ్ళికొడుకు ఇంటికి అమ్మాయిని పంపిస్తారు . ఆ పంపించటమే గృహప్రవేశం అంటారు . ఆ తర్వాత వాళ్ళ చేత సత్యనారాయణ స్వామి వ్రతం చేయిస్తారు . ఆ తర్వాత 16 రోజుల లోపల వాళ్ళ తొలి సంగమానికి వలసిన అన్ని ఏర్పాట్లు చేస్తారు ."

"   అయితే అంతదాకా వాళ్ళకి వట్టి పై పై చూపులేనా ? "

"   ఔను , ఇవన్నీ దేనికంటే వాళ్ళకొకళ్ళకు ప్రేమ కలగటానికి , పెరగటానికి . "

"   అలాగా ! ఇదంతా చూస్తుంటే , వింటుంటే ఓ దీర్ఘకాలిక ప్రాజెక్ట్ లా కనపడ్తుందే . "

"  నిజమే మరి . జీవించినంతకాలం కలిసి ఉండాల్సిన దానికి మరి ఈ మాత్రం లేకపోతే ఎలా ? "

"   జీవితమంతా దీనికే సరిపోయేట్టుంది . "

మొత్తానికి పెళ్ళి పూర్తయింది . జులపాలు డాడ్ ఎయిర్ పోర్ట్ కు బయలుదేరారు  . 

"   డాడ్ ఇదే అమెరికాలో అయితే  ....... "

   అయితే ? "        


                                                             (  మనవి : మిగిలినది రేపటి బ్లాగులో చూడగలరు . )

2 comments:

  1. chakkani sambhashanalatto kudina tapaa andi aalochinchalsina vishayame

    ReplyDelete
    Replies
    1. మీకు నచ్చినందులకు సంతోషం .

      Delete