జాలమా ! మాయా జాలమా ?


                                                                                                                              కవితా రచన : శర్మ జీ ఎస్


ఒంటరితనాన్ని పోగొడ్తుంటుంది ,
తుంటరి ఆలోచనలను రేకెత్తిస్తుంటుంది  ,
కన్నుల నిండుగ కవ్విస్తుంటుంది ,
కన్నుల పండుగ కావిస్తుంటుంది ,
ఎన్నడూ చూడ (లే )నివి చూపిస్తుంటుంది  ,
అన్నులమిన్నలచే కవ్వింపజేస్తుంటుంది  ,
రక రకాల గైస్చే గైడ్ చేస్తుంటుంది ,
కధని ఉత్సాహభరితంగా నడిపిస్తుంటుంది ,
కదలకుండా అక్కడే కూర్చోపెడ్తుంటుంది ,
కామకేళి చక్కెరకేళిలా భావించమంటుంది ,
కామానికి  , కామా పెట్టవద్దంటుంది ,
కళ్ళార్పకుండా చూడమనే ప్రయోగశాలనంటుంది . 

పెద్దలకంట పడకుండా , 
పబ్బులలో గడపచ్చంటుంది ,
ఆ ఫ్రెండ్స్ ని పబ్లిక్ సెంటర్లలో కాదు ,
నెట్ సెంటర్లలో నే కలుసుకోమంటుంది ,
పదుగురిని పరిచయం చేస్తానంటుంది ,
ప్రతిభను పెంచుతానంటుంది , 
పెంచుకొమ్మంటుంది ,
తెలియనివెన్నో తెలియ చేస్తానంటుంది ,

అంతరంగాన్ని అమాంతంగా లాగేసుకుంటుంది  ,
మనలను తనదానిగా చేసుకొంటుంది ,
తనకణుగుణంగా నడిపిస్తుంటుంది ,
అది ఇంద్రజాలం కాదు , 
మాయాజాలం కానే కాదు ,
ఆరని అగ్ని జ్వాలే అది ,
అనుక్షణం వెన్నంటి వుండే నీడ లాంటి  ,
అంతర్జాల  మాయాజాలమే సుమా !

    ********

2 comments: