సినిమానా ? జీవితమా ?

                                                                       సినిమానా ? జీవితమా ?

                                                                                                                                కధా రచన : శర్మ జీ ఎస్ 
                                                        
"  తాతయ్యా ఏ మూవీ చూస్తున్నారు "   అడిగాడు మనమడు సువన్ .

"   ధర్మదాత "   బదులిచ్చాడు .

"  బాగుంటుందా ? "

"  చాలా బాగుంటుందిరా . ఈ సినిమాకి చాలా అవార్డులొచ్చాయిరా ! "   బదులిచ్చింది వాడి నానమ్మ .

"  అంతే కాదురా , రజతోత్సవం , స్వర్ణోత్సవం , వజ్రోత్సవాలు జరుపుకున్న తెలుగు సినిమాలురా ఇవి " అన్నాడు  తాతయ్య ఎంతో గొప్పగా .

"  రజతోత్సవం "   అంటే ? "   అంటే అడిగాడు .

"  అసలు మా రోజుల్లో ఒక సినిమా 50 రోజులు , రోజూ 3 ఆటలు ఆడిందంటే ఎంతో ఆనందాలతో  'అర్ధశతదినోత్సవ ' పండుగ వేడుకలు జరుపుకునే వాళ్ళు . అదే అలాగే 100 రోజులు ఆడిందంటే ఇక '  శత దినోత్సవ ' వేడుకలు  భారీగా ఖర్చు చేసి జరుపుకునేవాళ్ళు . "

"  ఇపుడు అలాంటివి ఎక్కడా కనపడటంలేదే ? "   అడిగాడు సువన్ .

"  ఇప్పుడు అలా ఎక్కడ ఆడిస్తున్నారు ? మార్ణింగ్ షో ఒకటి , నూన్ షో ఇంకొకటి , ఫస్ట్ షో ఇంకొకటి ,సెకండ్ షో వేరొకటిలా ఆడిస్తున్నారు . " 

"  నిజమే తాతయ్యా . మూవీకి వెళ్ళాలంటే నెట్ లో చూసుకుని వెళ్ళాల్సిందే ? లేకుంటే గ్యారంటీ లేదు .మనం అను
కున్న మూవీనే చూస్తామని "   అన్నాడు .

"   ఔనురా ఇంక ' రజతోత్సవం ' అంటే 25 ఏళ్ళు నిండటం . కాని ఈ చలన చిత్ర పరి భాషలో 25 వారాలు నిండితే జరుపుకునే చిత్ర పండుగ "   తెలియచేశాడు .

"  మరి ' స్వర్ణోత్సవం ' అంటే ? " 

"   అలాగే 50 వారాలు నిండితే జరుపుకునే గొప్ప పండుగ చిత్ర నిర్మాతలు ." 

"   ఆ ' వజ్రోత్సవం ' అంటే ? "

"   ఇంకా బహు గొప్పగా జరుపుకునే 75 వారాలు నడిచిన చిత్రాల పండుగని ."

"   అంత గొప్ప మూవీసా మీరిపుడు చూస్తున్నది ? అయితే నేనూ , చూస్తాను తాతయ్యా ? "   అన్నాడు .

"   మాతోపాటు చూస్తానంటే అంతకంటే భాగ్యమేముంటుంది ? రా ఇటు కూర్చో "  తన పక్కగా కూర్చోపెట్టుకు
న్నాడు .                           

అలా 15 నిముషాలు గడిచాయి . హుషారు మెల్లగ తగ్గుముఖం పడ్తున్నది , మరో 10 నిముషాలు గడిచాయి . ఇంక ఉండలేక  "   తాతయ్యా , ఒక్క ఫైటింగ్ లేదు , ఎంతసేపటికి అలా సాగదీస్తూ , స్లోగా ఉన్నది "   అన్నాడు సువన్ .

"  మంచి కుటుంబ కధా చిత్రం రా " అన్నాడు .

"   కుటుంబ కధా చిత్రాలలో ఫైటింగులుండవా ? " 

"   అవసరమైనప్పుడు మాత్రమే అదీ కొంచెం చూపిస్తారు ."

"   అలాగా ! అది కూడా ఇంతవరకు చూడలేదే ?"

"   అదేమిటిరా అలా అంటావ్ , ఇంతకుముందేగా చూసింది ? " 

"   ఎప్పుడు బామ్మా ? నేనిందాకటినుంచి ఇక్కడే వున్నాగా , చూడలేదే ? "   అమాయకంగా అడిగాడు సువన్  .

"   5 నిముషాల క్రితం ఆ విలన్ ని ఆ హీరో కిందపడేశాడుగా "   అని తెలియచేసింది  నానమ్మ .

"   ఏదీ ఆ కిందపడేయటం ఫైటింగా నానమ్మా ! ? " 

"   ఔనురా ఎక్కువగా అటువంటివి చూపించరురా ? "   అన్నాడు తాతయ్య .

"   తాతయ్యా , ఈ మూవీ నేను చూడలేను , వేరే ఇంకేమైనా మంచి మూవీ చూపిస్తారా ? "

"   మంచి మంచి సినిమాల పేర్లు చెప్తాను . సెలెక్ట్ చేసుకో "   అన్నాడు .

"   అలాగే , చెప్పు తాతయ్యా . " 

"  దసరా బుల్లోడు , అక్కా చెల్లెలు , కలసివుంటే కలదు సుఖం , కలిసుందాం రా , మనుషులు మమతలు , 
మనుషులు మారాలి  , బడిపంతులు " 

"   సరే రా . ఈ మూవీ చూడు "   అని ముత్యాల ముగ్గు పెట్టాడు .

"   20 నిముషాలు గడిచిన తర్వాత ఈ వాకిలి చిమ్మటం , పేడ కలిపి నీళ్ళు చల్లుకోవటం , అలా క్రింద కూర్చొని ముగ్గులేసుకోవటమేంటి ? "

"   అదంతా యింటి ముంగిట అందమైన అలంకరణరా "   అన్నది నానమ్మ .

"   మీరు కూడా చేసేవాళ్ళా ? " 

"   చేసేవాళ్ళమే ."

"   మనింటిముందు లేవేంటి ? "

"   యిపుడెవరూ వేయటం లేదురా , అయినా యివన్నీ పట్టణాలలో వీలుపడవురా "   అన్నది .

"   వీలుపడకుంటే వదిలేయచ్చా ? "

"   మరింకేం చేస్తాం వదిలేయక "

"   వీలుపడకుంటే మంచైనా వదిలేయాల్సిందేనా ? "

"   తప్పదురా . కొన్ని కొన్ని సినిమాలు చూస్తుంటే కళ్ళ వెంట నీళ్ళు జర జర రాల్తాయిరా . "

"   అదేంటి బామ్మా సినిమా చూస్తూ ఏడుస్తారా ? అంతగా ఏడుపు తెప్పిస్తుంటే, ఆ మూవీ చూడటం ఆపేసి హాయిగా వుండండి . అసలు మూవీ చూడటం దేనికి ? హాయిగా రిలాక్స్ అవ్వాలనే కదా ? " .

"   అంతేరా , నువ్వు మాత్రం కూల్ డ్రింక్స్ తాగద్దురా , ఐస్ క్రీములు తినద్దురా అంటే విన్నావా ? నిన్నటివరకు 
జలుబుతో కూడిన జ్వరంతో బాధపడ్తూ కూడ తినలేదూ ? " 

"   అది జబ్బున పడేసినా , దబ్బున లోనికి వెళ్తాయి . "

"   ఇదీ అంతేలేరా  ? ఇవన్నీ అవార్డులొచ్చిన సినిమాలురా . "

"   మా డాడ్ అంటుంటే విన్నాను , అవార్డులు అర్ధంకాని సినిమాలకే యిస్తారటగా . వాటినా మీరు పదే పదే చూస్తు
న్నది ? "

"   ఆ మాట నిజమే కవచ్చు , కాని అన్ని సినిమాలకి అలా యివ్వరురా . ఈ చిత్రాలు మంచి కుటుంబ కధా చిత్రాలు . లక్షల మంది కాదు కోట్ల మంది  చూశారు , మెచ్చారు . "

"   ఎన్నైనా చెప్పు తాతయ్యా , ఇవన్నీ పనికి మాలినకధలే  . "

"   ఇద్దరూ ఒక్కసారిగా " పనికిమాలినవా ? "

"   నిజ్జంగా పనికిమాలిన కధలే ఇవి . లేకపోతే ఏంటి ? పిల్లలందరూ చక్కగా మంచి మంచి చదువులు చదువుకొని , ఉన్నత ఉద్యోగాల కొరకు పేద్ద పేద్ద పట్టణాలకు వెళ్ళి అక్కడ వుండక , కలిసుందాం రా , కలసి వుంటే కలదు సుఖం అని . 
ధర్మదాత అట , ధర్మదాత ,తనకున్నదంతా , తనవాళ్ళను వదలి వూళ్ళో వాళ్ళకు దానాలు , ధర్మాలు అంటూ ఇంట్లోవాళ్ళకు తెలియకుండా చేస్తూ బికారై పోయి , కుటుంబాన్ని బజారు క్పడేసి , తన పిల్లలను సైతం తను కోల్పో
యిన శ్రీనిలయం కొరకు కష్టపెట్టటం గొప్ప కధా యితివృత్తమా ? కీర్తి కండూతి . అందువల్లే అలా నాశనమైపోయాడు . ఇటువంటివి చూసి మేం నేర్చుకోవాలా ? ఇలా మీరుంటుంటే పిల్లలమైమైన మేమెలా బాగుపడ్తాము ? కొంచెం ఆలోచించండి . ఇటువంటి మోవీస్ మంచివా ? వీటికి అవార్డులా ? పైగా మిమ్మల్ని చూసి నేర్చుకోమంటారా ?  మాకే కాదు , మా డాడ్ , మమ్మీలకు కూడా నచ్చవు . "

"   అలా అంటావేమిటిరా ? మీ అమ్మా , నాన్నలు బాగా  నచ్చాయని రెండు , మూడు సార్లు చూశారుగా . "

"   ఆ నాడు అవి నచ్చాయని చూసినంతమాత్రాన , ఎప్పుడూ అవి నచ్చాలని లేదు నాన్నా . ఆనాటి పరిస్థితులకు 
అవి నచ్చి వుంటాయి . ఇప్పటి ప్రకారం అవి నచ్చనే నచ్చవు  "   అన్నాడు అపుడే గదిలోకి వెళ్తున్న కొడుకు .

"   నిజమేలే , నీకే నచ్చకపోతే , నీ పిల్లలకేం నచ్చుతాయిరా  " .

"   హమ్మయ్య , ఇప్పటికి అర్ధమైంది కదా తాతయ్యా , ఇకనైనా ఇటువంటి పనికిరాని సినిమాలు చూసి విలువైన 
టైం ని పాడుచేసుకోకండి , నే వెళ్ళొస్తా "   వెళ్ళిపోయాడు సువన్ .

వాళ్ళిద్దరే వుండిపోయారు . "   ఏమిటండి ఇంత మంచి సినిమాలను పనికిమాలినవి అంటున్నారు ."

"   ఆ నాడు అవి గొప్పగా చెలామణీ అయ్యాయి . ఈ నాడు అవి పనికిమాలినవి అయ్యాయి . అంతెందుకు , ఓ 
నాడు కానులు , అర్ధణాలు , పావలాలు , అర్ధరూపాయిలు రూపాయికి వారసత్వంగా చెలామణీ అయ్యాయి . ఈ 
రోజు రూపాయికి , రెండు రూపాయలకి , అయిదు రూపాయలకి గతిలేదు . రేపూ మన పరిస్థితి అంతేనే . ఆ నాడు 
అన్నింటిలో గొప్పగా పేరు తెచ్చుకున్న నేను , నువ్వు కూడా పనికిరానివాళ్ళమవుతామే . మనమే కాదు ఈ ప్రపం
చంలో అందరి పరిస్థితి ఇంతేనే , ఇది తెలుసుకొని మసులుకుంటూ , మెల్లగ తప్పుకుంటే చాలా మంచిది . " 


                                                                   **  స  **  మా  ** ప్తం  **

No comments:

Post a Comment