ఒక్కో ఒంటితీరు ( 2 )

                                                                                                                             కధా రచన : శర్మ జీ ఎస్
                                                           ( నిన్నటి తరువాయి టపానే )

"  అమ్మా వెళ్ళొస్తా . ఆరోగ్యం  జాగ్రత్త . "
రామారావు , అపర్ణ ఇంటి నుంచి బయలుదేరారు . సిటీ బస్ ఎక్కాలన్నా , ఆటో అందుకోవాలన్నా ఫర్లాంగు దూరమైనా నడవనిదే లభించవు .అలాగని వీళ్ళ యిల్లు ఎడారిలో లేదు .సెంటర్లోనే వున్నది , కాని సందులో వున్నది .

"   సిటీ బస్ లో మనమెంత మడి కట్టుకు కూర్చున్నా , కండక్టరు కంపు చేసేస్తాడు . కనుక .... "

"   తాకుతూ వెళ్దామంటారా ? సరే నేను రెడీ . "

"   అది కాదు , ఆటోలో అయితే దూరదూరంగా కూర్చొని వెళ్ళవచ్చు "    అన్నాడు .

"   పోనీ ఆటోలో దూరదూరంగా కూర్చొని వెళ్తే ఆటొ అతనే అనుమానిస్తాడు . ఆ పై చూసేవాళ్ళు అనుమానిస్తారు . పోలీసులు అనుమానిస్తారు . ఇది పరమ ప్రమాదకరమైన విషయం . కనుక మనమిద్దరం పక్క పక్కనే కూర్చుందాం  "   అన్నది .

"   నీకేమైనా మతిపోయిందటే . "

"   మీకేమైనా దొరికిందా అండి . "

"   వేళాకోళాలకిది సమయం కాదు . అవతల క్యాంపుకి వేళ అయిపోతోంది . త్వరగా ఒక నిర్ణయానికి రా . "

అపర్ణ అతనికి దగ్గర దగ్గరగా నడుస్తున్నది . రామారావు మాత్రం దూర దూరంగా నడుస్తున్నాడు .

"   దగ్గరగా వున్నపుడు దూర దూరంగా వున్నావు . దూరంగా వున్నపుడు దగ్గరవాలని ప్రయత్నిస్తున్నావు . ఏమిటీ వింత ప్రవర్తన ? "

"   ఎవరకీ అనుమానం రాకుండా , మనకే అవమానం జరగకుండా కలిసి కూర్చొని వెళదాం .మీరెటూ ఇంటివరకూ వస్తారుగా నన్ను డ్రాప్ చేయటానికి . అక్కడ మీరు స్నానం చేసి వెళ్ళండి . "

"   ఛీ ... ఛీ ... నిన్ను తాకటమేమిటి ? "

"   తాకకుండానే తాపం తీరుతుందంటారా ? "

"   ఎంత తాపం తీరకుంటే మాత్రం , నువ్వు దూరంగా వున్నపుడెలా అపర్ణా ? ఆరోగ్యానికి మంచిది కాదు " దూరదూరంగా వెళ్తున్నాడు .

"   అంత శ్రమ మీకీయనులెండి . ఆటోలోనే వెళ్దాం . మీ అవస్థ చూశాక , మీ చిరాకు గమనించాక  నేనే యిలా ప్లాన్ వేశాను , నిజంగా నేను దూరంగా లేనండి . "

"   అలాగా ! ఎంత ( మంచి ) పని చేశావు అపర్ణ . ఆఫీసుకి అర్జంటుగా టెలిగ్రాం యిచ్చి వస్తా 4 రోజులవరకు నేను క్యాంపుకెళ్ళలేనని , బెడ్ మీదే వున్నానని . "

"   ఆ అవసరం లేదు లెండి . మీకొచ్చిన టెలిగ్రాం నేనే పంపించాను పోష్ట్ మెన్ చేత ."

"   ఆ టెలిగ్రాం చూసి ఎంత కంగారు పడ్డానో ? అది సరే , మరి ఎక్కడ ? ఎలా ? ఇంటికి వెళ్ళటానికి వీలులేదుగా . "

"   పెళ్ళైన తర్వాత హాయిగా హనీమూన్ కి ఎటూ వెళ్ళలేకపోయాం . కనీసం ఈ 3 రోజులైనా ఏదైనా లాడ్జింగ్ కి వెళ్ళి ఎంజాయ్ చేద్దామండి . "

"    ఇంక ఆలోచించకు , పద , చకచకా నడువు ."

రోడ్డు చేరుకున్నారు . ఆటో ఎక్కారు , "   హోటల్ అన్నపూర్ణ అన్నాడు . "

                                                                                       ********

అన్నపూర్ణ హోటల్ 555 డభుల్ రూం పట్టపగలే రేయిగా మార్పు చెందబడ్డది రామారావు , అపర్ణల సంగమంతో .
పేరుకి , పేమెంటుకి మాత్రమే అది డబుల్ బెడ్ రూం , సింగిల్ బెడ్ రూంగా వాడబడ్తున్నది . కేబుల్ కనెక్షన్ వున్నా కేసెట్ ఆన్ చేశారు . కేసెట్ అయితే మనకిష్టమైనవి మనం పొదగలం , అదే కేబుల్ అయితే ప్రసారమైనవాటినే అందుకోవలసి వస్తుంది .

పల్లవి , అల్లరి ప్రారంభమైంది ఏకబిగిలో .వలువలు నిలవలేమంటూ ఒకటొకటిగ నేలకొరిగిపోతున్నాయి . విలువలు ఇపుడిపుడే నిర్ధారించబడ్తున్నాయి .
అపర్ణ అందాలకు సిగ్గు చెందిన బల్బు కూడా జీరోగా మారింది . 
ఆ అవయవాల సౌష్టవం అతనికి పరిచయమైనదైనా , కొత్తగా అతనిని ఎక్కడికో తీసుకు వెళ్తున్నాయి .
ఆమె చేతులు మెలమెల్లగా , అతి సుతారంగా స్పృశిస్తూ , అనురాగాలు వర్షిస్తూ , కేశాలలోకి జొరబడ్డాయి . అదో హాయి , ఆమె అతనిని వదలక అలాగే గట్టిగా బంధించింది . అతను సంధించాడు . ఇరువురి మధ్య అల్లరి యుధ్ధం ఆరంభమైంది .
ఇరువురు ఒకటైనారు , ఏ మాత్రం ఎడం లేదు వారి మధ్య . గాలి కూడా చొరబడాలన్న కొంచెం సమయం ఆగాలి అన్నచోట అనంగుడు చొరబాడి , ఆ ఇరువురిని చెరబట్టాడు . చరచరా పయనం సాగించాడు . ఆ ఇరువురి కాకతో సంసార పాయసం కాకతాళీయకంగా పొంగించాడు . ఒకరినుంచి మరొకరికి సరఫరా చేశాడా అనంగుడు కాదు అఖండుడే .
శోభనం రాత్రుళ్ళు తర్వాత మరల దాంపత్య రుచి చూసిందిపుడే . నాటి ఆనందాన్ని మించిన ఆనందంతో , ఇన్నాళ్ళ పస్తుకి సరిపడా శిస్తు చెల్లించి , దాంపత్యానందం అనే రసీదు పొందారు . తెరచిన కన్ను వాల్చకుండా ముచ్చటైన 3 రాత్రులూ , 3 పగళ్ళు .
4 వ రోజు ఉదయాన్నే అభ్యంగన స్నానం , అల్పాహారం ముగించి "   ఏమండి అత్తయ్యగారు మన సుఖానికి అడ్డంగా నుల్చున్నారెందుకండి "   అడిగింది .

"   అదో పేద్ద రహస్యంలే . ఈమె నా స్వంత తల్లి కాదు , సవతి తల్లి . "

"   ఆమెకు పిల్లలు లేరా ? "

"   లేరు పుట్టరనే మా అమ్మను చేసుకొన్నాడు మా నాన్న . మా అమ్మ నన్ను కని ( తను వచ్చిన పని అయిపోయినట్లుగా ) వెళ్ళిపోయింది . "  

"   అయినా అత్తయ్యగారు మనల్నిలా హింస పెట్టడం ఏమీ బాగా లేదండి . "

"   పోనీలేవే , మనకో ఆసరా దొరికిందిగా , ఇక మన సుఖానికి అడ్డమే లేదు . ఇకనుంచి ప్రతినెలా శోభనం జరుపుకొందాం . "
ఇంటికి చేరుకున్నది అపర్ణ.

                                                                                        *******

రెండు నెలలు గడిచాయి .సరస్వతమ్మ రోగం నుంచి బయటపడలేదు . అపర్ణ సేవలు రోజు రోజుకీ అధికంగా అందుకొంటూనే వున్నది . 
అపర్ణ ప్రతి నెలా రెండుమార్లు దూరంగా వుంటూనే వున్నది . ఒకమారు బంధువులింటికి ( రామారావు క్యాంపులో వుంటే ) , మరో మారు అన్నపూర్న హోటల్ కి వెళ్ళి వస్తూనే వున్నది . రామారావు లోని చిరాకు ఛీదరించుకొని దూరంగా వెళ్ళిపోయింది . 
అమ్మ ముందు మాత్రం కొంచెం చిరాకు ప్రదర్శిస్తూనే వున్నాడు . "   ఏమిటమ్మా ఇది నెలనెలా రెండు మార్లు దూరం అని కూర్చొంటుంది , విసుగ్గా వుందమ్మా "   అన్నాడు .

"   ఒక్క సారి డాక్టరుకి చూపించరా . "

"   అదీ అయిందమ్మా . లేడీస్ స్పెషలిష్టుకే చూపించాను . అలా వచ్చినపుడు దూరంగా కూర్చోవడమో , లేక స్నానం చేసి ఇంట్లోకి రావడమో తప్ప వేరే ఏమీ చేయలేం అన్నారు . "

"   నిజమేరా , ఏం చేస్తాం . మన సంప్రదాయం ప్రకారం దూరంగా కూర్చోవడమే మన చేతిలో వుందిరా . ' ఒక్కో ఒంటితీరు ' రా అంతేరా "   అన్నది సరస్వతమ్మ .
  
                                                                                        *******
( కొసమెరుపు - తుది మెరుగు )

సరస్వతమ్మ ప్రాణాన్ని టైఫాయిడ్ టై చేసేసింది .
రెండు నెలలు గడిచాయి . అత్తగారు బ్రతికుండగా నెలకు 2 సార్లు దూరంగా కూర్చొనే అపర్ణ , అత్తగారు పోయిన 2 నెలల తర్వాత 10 , 12 నెలలవరకు ఒక్కసారి కూడా దూరంగా కూర్చొనే అవకాశాన్ని పూర్తిగా కోల్పోయేలా చేసేశాడు రామారావు . 
ఆదవారి జీవితానికి పరిపూర్ణత్వం మాతృత్వమేనని సంబరపడింది అపర్ణ .

                                                                                ** స ** మా ** ప్తం 

                            ( ఈ ' ఒక్కో ఒంటితీరు ' కధ 17/10/1995 మయూరి వారపత్రికలో ప్రచురించబడినది )

No comments:

Post a Comment