రాజీ రా జీ


                                  ( ఈ "   రాజీరా జీకధ "   పక్షపత్రిక అయిన ఆమృత్ కిరణ్ 16-16-1995 న ప్రచురించ బడినది . )
పెళ్ళికూతురు   రాజ్యలక్ష్మి కంటే వెనుక పుట్టినా , ముందుగానే పెళ్ళి చేసుకొని ఓ బిడ్డకు తల్లి అయింది విజయ .వయసులో చిన్నదైనా , ఆ ఇంటి కోడలుగా అడుగుపెట్టడంలో ఆ నూతన దంపతుల తొలిరాత్రి కార్యక్రమ సన్నాహా లను సరోజకు పురమాయించారు ఆ వృధ్ధ దంపతులు .

ఆ గది మల్లెల గుబాళింపులతో నిండిపోయింది . అగరు , పన్నీరు , సుగంధ ద్రవ్యాల సువాసనలను ఆఘ్రాణిస్తూ అత్తగారు కొత్తగా యిచ్చిన గడియరాన్ని చూసుకొంటూ యింకా రాలేదేనిటా అని ఎదురు చూస్తున్నాడు పెళ్ళికొడుకు .పెళ్ళికూతురి భుజం మీద చేయివేసి మెల్లగా నడిపించుకుంటూ వచ్చి తలుపులు తీసి , లోపలకి నెట్టి గడియ బిగించారు బయట సరోజ , విజయలు .

తన్మయత్వంతో మరచిపోతానేమోనని  పెళ్ళికూతురు వెంటనే లోపలి గడియ బిగించి ,అడుగులో అడుగు వేసు కుంటూ పడక చేరుకున్న వధువును పక్కన కూర్చోమని బాదుషాని నోటికందించి ' రాజీ ' అంటూ దగ్గరికి తీసుకు న్నాడు .అదే ఆ వధువుకు తొలి కౌగిలింత , పులకింత . అందుకే ఆనందానికి అవధుల్లేవు .
"   రాజీ యభయ్యవ పడిలో పడిన నా వయసుని నీ అందాలు వెలికి తీస్తున్నాయి . ఉరకలు వేస్తున్న వయసు , మనసు గుటకలతో సరిపెట్టుకోలేకపోతోంది . మందులు వాడుతూ వయసు తడాఖా చూపుతా మనసుకి "   అంటూ మాత్రలు మింగాడు పెళ్ళికొడుకు .

ఆ సమయంలో ఆనందాన్ని అందివ్వటమే ప్రధానం కనుక అంతగా పట్టించుకోలేదు రాజ్యలక్ష్మి అలియాస్ రాజీ .
పెళ్ళికొడుకు పరమేశం పరమ ఆవేశంతో పరుగులు తీస్తున్నా , గమ్యాన్ని చేరుకోలేకపోతున్నాడు , ఫలితాన్ని అందుకోలేకపోయాడు . గురకలతో నిద్రాదేవి ఒడిలో వాలిపోయాడు .రాజ్యలక్ష్మి మేలుకొనే ఉంది . ఎప్పటికో గాని నిద్ర పోలేకపోయింది .
తెలవారిందే తడవుగా సరోజ , విజయలు హడావుడిగా తలుపు తట్టటంతో పరమేశం లేచి , రాజ్యలక్ష్మి  నిద్రపోతుం డటం గమనించి తలుపుల గడియ తీయటానికి రెండడుగులు ముందుకు వేశాడు . మరల మూడడుగులు వెనక్కి వేసి రాజ్యలక్ష్మి చీరనీ , జుట్టునీ చిందరవందర చేసి , తలుపులు తీసి బయటకు నడిచాడు .
అలా వెళ్తోన్న బావగారిని చూసి విజయ "   ఏమండోయ్ బావగారు త్వరగా కాలకృత్యాలు ముగించుకొని రండి . కాఫీ , ఫలహారం సేవించి మరల తలుపులు మూసుకొందురు "   అనగానే పరమేశం పరవశం చెందినంతగా ఫీలయి  బయటకు వెళ్ళీపోయాడు .

" వదినా ఎంత తెల్లవార్లు మేలుకొంటే మాత్రం పొద్దెక్కేవరకు పడుకోకూడదమ్మా , ఉదయాన్నే లేచి అన్నయ్యగారికి అవసరమైనవన్నీ అందించి అలసినా నిద్రపోకూడదు . కొత్త కదా ! మరో మూడు రోజుల తర్వాత గాని ఈ అలసట , అలవాటుగా మారదు . లే వదినా ! "   అంటుంటే సిగ్గుతో బయటకు నడిచింది రాజ్యలక్ష్మి .
రెండవ రోజు మొదటి రోజులా గడిచింది . రాజ్యలక్ష్మికి మనసు కలత చెంది వేకువఝామున కునుకు తీసింది .
మూడవ రోజు మొదటి , రెండవ రోజుల కంటే ఘోరంగా గడిచింది .తీవ్రమైన అసంతృప్తికి లోనయింది రాజ్యలక్ష్మి . గుఱ్ఱు తీస్తున్న భర్తని చూసి తనని మరోమారు అద్దంలో చూసుకుంది .

గత యిరవై అయిదేళ్ళుగా ఈ అందాలు అభివృధ్ధి అవుతూ , నేడు అడవిగాచిన వెన్నెలలా మిగిలిపోతున్నాయి .
నేటికి తనకి ముఫ్ఫై ఎనిమిది సంవత్సరాలు దాటాయి . ఈ వయసుకి తన స్నేహితురాళ్ళు ఒక్కొక్కరు ఇద్దరు , ముగ్గురు పిల్లల్ని కని జీవితంలో సగభాగం ఆనందాన్ని చవిచూసిన వాళ్ళే .

తను యింకా జీవితమనే సంసార పాఠశాలలో భర్త అనే సహాధ్యాయితో ఓనమాలు దిద్దటం ప్రారంభించింది .
సహాధ్యాయి అనుభవఙ్నుడైనందున ముందుకు సాగింది . ఈ సంసార పాఠశాలకు సహాధ్యాయే ఉపాధ్యాయునిగా భావించాలని మన శాస్త్రాలు సూచించగా , పెద్దలు శాసించగా అందరి భారత స్త్రీలలా తనూ అనుసరించింది .అనుభవఙ్నుని అనుభవం అడుగున పడి , ప్రతి రోజూ ఏదో ఒక మిషతో క్లాసును లాస్ చేస్తున్నాడు .
నేర్చుకోవాలని తనెంత ఉత్సాహాన్ని చూపుతున్నా , అతని నిరుత్సాహాన్ని తనలో నింపే ప్రయత్నం చేస్తున్నాడు . 
ఇంక తనకు అక్షరాలెలా వస్తాయి ? అక్షరాలు వస్తేనే గదా! పదాలు చేకూర్చ నేర్చుకోగలిగేది . పదాలు కూర్చితే గదా! వాక్య నిర్మాణం చేయగలిగేది . వాక్య నిర్మాణం చేయగలిగితేనే గదా కధను అర్ధం చేసుకొనేది . కధను అర్ధం చేసుకొంటే గదా అక్షరాలు నేర్చుకున్నందుకు సార్ధకత లభించేది .
తను ఎప్పటికి ఈ స్థాయికి ఎదగగలదు ? అసలు తనకా అవకాశం లభిస్తుందా ? ఏమిటీ జీవితం ? ఎందుకీ జీవితం ? తను పెద్ద కూతురుగా ముందుపుట్టి , చిన్న కూతురిగా పెళ్ళి చివర చేసుకొన్నది . "   ఎవరి వలన ? "   అని మధన పడ్తూంటే .
మనసు మాత్రం నిజాయితీగా "   మీ నాన్న గారు "   అని సమాధానమిచ్చింది . అలా అలా ఆలోచనలలో పడి పోయింది రాజ్యలక్ష్మి .

నాన్నగారికి ప్రభుత్వ ఉద్యోగంతోపాటు , మంచి రాబడి , హోదా , అందరిలాగే తనను ఎంతో ఆప్యాయంగా చూసు కున్నారు .

వయసుతోపాటు సంబంధాలు వచ్చాయి . అమలాపురం వాస్తవ్యులు అడుసుమిల్లి ఆనందరావు గారి అబ్బాయి అమరేశ్వరరావుకి తను నచ్చింది . ఈడులో ధీటుగా ఉన్నాడు . జోడులో తనకంటే అరంగుళం తక్కువ కావటంతో అక్కడితో ఆగిపోయింది . మరొకటి మండపేట మాధవయ్య గారి కుమారుడు మల్లేశ్వరరావుకి తను నచ్చింది . అన్నింటా సమవుజ్జీ అయి కూడా కలరులోఫేడ్ అయిపోవటంతో నాన్నగారు ససేమిరా ఒప్పుకోలేదు .
"   కాకి ముక్కుకు దొండపండులా . ఇన్నాళ్ళు పెంచి పెద్ద దాన్ని చేసి , ఇంత గారాబంగా చూసుకొని , యిప్పుడు యిలాంటి వాడికిచ్చి చేయటం దుర్లభం . నా తల్లికి బంగారం లాంటి సంబంధం చూసి చేస్తాను "   అనటంతో తనలో తనకు తెలియకుండా , తన ప్రమేయం ఏ మాత్రం లేకుండానే విపరీతమైన ఆశలకి , కలలకి పునాది రాళ్ళు వేయటం జరిగింది . ఆ ఆశల పల్లకిలో , ఆ కలల అలలలో మరికొన్ని కూడా సంబంధాలు అలా అలా దొర్లిపోయాయి .
తమ వీధిలోనే ఉంటున్న పోరుమామిళ్ళ రంగారావు గారి అబ్బాయి శంకరరావు బాగా చిరపరిచితుడే . ఈడూ జోడూ సరిపోయింది . ఆస్తి , అంతస్థులు సరిపోయాయి . ప్రభుత్వ ఉద్యోగం లేకపోవటంతో నాన్నగారికి నచ్చలేదు .
ప్రైవేటు కంపెనీలలో ఉద్యోగాలు నీటి బుడగల లాంటివి . ఏ సెకనులోనైనా కనుమరుగై పోయే ప్రమాదమున్నది . ఆస్తి ఈ రోజు ఉంటుంది , రేపు పోతుంది . అదే ప్రభుత్వ ఉద్యోగమైతే ఏది ఎలా ఉన్నా చేసినంతకాలం జీవితానికి జీతం గ్యారంటీ . రిటైరైన తర్వాత ఏ టెన్షనూ పడకుండా ఆ వచ్చే పెన్షన్ తో హాయిగా గడపచ్చు . గవర్నమెంటు ఉద్యోగ స్థుడినే చూసి చేస్తానన్నారు . అప్పటికే తన వయసు రజతోత్సవం జరుపుకుని ఆరు మాసాలైంది . నాన్నగారి ఆ మాటలు తనకూ నిజమేననిపించాయి .
ఆ తర్వాత అన్ని లక్షణాలుగల గవర్నమెంట్ ఉద్యోగస్థుడిని చూడలేకపోయారు .ఈ నడుమ చెల్లెలు విజయ ప్రేమలో పడడం,ఆతని తల్లితండ్రులు నాన్నగారి స్నేహితులు కావటంతో ఏ ఆటంకమూ లేకుండా చెల్లెలి పెళ్ళిజరిపించేశారు .
నాన్నగారు రిటైరైనా తన పెళ్ళి విషయంలో ప్రయత్నిస్తూనే ఉన్నారు . ఈ సరికి తన వయసు స్టేట్ గవర్నమెంట్ జాబ్ లిమిట్ చేరుకొన్నది . పెళ్ళి అవుతుందన్న నమ్మకం సన్నగిల్లుతున్నది మెల్లగా తనలో .అమ్మ ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉండటంతో "   ఏమండీ ఎన్నాళ్ళిలా కన్నపిల్లను కన్నెపిల్లగా చూస్తాం , వయసుకూడా మించిపోతున్నది గవర్నమెంట్ ఉద్యోగస్తుడు కాకుంటే ప్రైవేటు ఉద్యోగస్తుణ్ణి , అదీ కాకుంటే ఎవరో ఒకరికి యిచ్చి చేసేయండి "   అన్న అమ్మ మాటలకు బదులుగా నాన్నగారు "   రేపో , మాపో మంచి సంబంధం దొరుకుతుంది , దేశం యింకా గొడ్డు పోలేదే . దాని జీవితం బాగుండాలనే కదా ! ఇన్నాళ్ళూ , ఇన్నేళ్ళూ ఆగింది . ఇప్పుడు తొందరపడితే ఎలా ? " అన్నారు .
మరో మూడు సంవత్సరాలు మునుపటిలాగే గడిచాయి . కాలంలో మార్పు మినహా జీవనగమనంలో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు . ఆనాడు అమ్మ అన్న మాటలు తన చెవిలో మార్మ్రోగుతూ మనసుని కదిపేశాయి .

"   నాన్నగారూ ఇంక ఆలస్యం చేయకండి . రెండో పెళ్ళి అతనైనా ఫరవాలేదు . అమ్మ ముచ్చట తీర్చండి "   అన్నది తను .

" చూడు తల్లీ , మంచి సంబంధం కొరకే కదా! ఇన్నేళ్ళూ ఆగాము , ఏదీకుదరలేదు , ఈ రోజు యిలాంటి పరిస్థితి వస్తుందనుకోలేదమ్మా "   కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ అన్నాడు .

"   ఫరవాలేదండి , మీరూ పెద్దవారైపోయారు , అమ్మ ఆరోగ్యం సజావుగా లేదు . సందేహించకండి . వెంటనే ఎవరో ఒకరిని చూడండి "   అని తను బలవంతం చేయటంతో , తన కన్యత్వపు జీవితానికి ఈ యాభయ్యవ పడిలో నున్న భర్తతో తెరపడింది .
అందరి జీవితాల్లో తొలిరాత్రులు మధురానుభూతులతో తెలవారతాయి . కాని నా జీవితంలో మాత్రం తొలిచే రాత్రు లుగా తెలవారిపోయాయి .
భార్యాభర్తల సంబంధం అతి పవిత్రమైనదనీ , భర్త అనే తోడుతో , భార్య నీడలా అనుసరించాలని , ఇంకా భర్త అనే చెట్టు నీడలో భార్య సేద తీర్చుకుంటుందనీ మన పెద్దలు అంటుంటారు . 

సకాలంలో జరిగే పెళ్ళిళ్ళకు మాత్రమే అవి వర్తిస్తాయనీ , అకాలంలో జరిగే పెళ్ళీళ్ళకు అవి వక్రిస్తాయని తను అను భవపూర్వకంగా తెలుసుకుంది . వాస్తవంలో వయసులో , శారీరకంగా  పెద్దవారు కావటం చేత ఆయనకు తను తోడు అయింది . తన వయసూ , ఆనందాలు ఆయన నీడలో కనుమరుగయ్యాయి . అందరూ మేల్కొన్న సమయంలో తను నిద్రపోయింది . అందరూ నిద్రపోతున్న సమయంలో తను మేల్కొంటోంది . తెల్లవారబోతోంది . నిద్రపోవాలి అనుకొంటూ భర్త ప్రక్కనే పడుకొంది .
సరోజ వచ్చి "   వదినా ! లే వదినా !"   అంటూ భుజం మీద చేయి వేసి తనవైపుకు లాగింది పక్కకు తిరిగి పడు కున్న రాజ్యలక్ష్మిని .

బదులు రాలేదు . ప్రశాంతంగా నిద్రపోతున్నట్లుంది . మరల కుదిపింది .లేవకపోయేసరికి " విజయా! వదిన లేవటం లేదు . ఒళ్ళు చల్లగా వుంది "   అంటూ అరచేతిని తీసుకొని మర్దన చేయాలని గుప్పెటను గట్టిగా లాగింది . ఓ కాగి తపు ముక్క బయటపడింది . కంగారుగా తీసుకొని "  విజయా , మామయ్య గారిని పిలుచుకురా "   అంటూ బట్ట లను సరిచేసింది .

" ఏమిటమ్మా ? ఏమైందమ్మా ? "   అంటూ తండ్రి కామేస్వర రావు హడావుడిగా వచ్చి కాగితం అందుకొని చదువ నారంభించాడు .

" నాన్నగారికి , అమ్మకి ,
నమస్కారాలు . ఆ రోజున రెండో పెళ్ళి అతనైనా ఫరవాలేదు అనుకొన్నాను . ప్రయోజనం లేకపోయింది . ఈ ఆలోచనే ఇరవై ఏళ్ళ వయసులోనే చేసి వుంటే , ఈ నాడు ఈ స్థితి వచ్చేది కాదు . ఈడూ జోడూ , ఆస్తి , అంతస్తు , గవర్న మెంటు ఉద్యోగం , ఎత్తూ , రంగూ లాంటివి ఏవేవో చూసుకొంటూ , మనందరం ఇంతదాకా వచ్చాం . అన్నీ ఒక్కచోట చేరవని మనం తెలుసుకోలేకపోయం . ప్రతి చోటా ఒకటో , రెండో లోపాలుంటూనే వుంటుంటాయి . ఆ లోపాల్ని చూసీ చూడనట్లుగా పోవాలి .గట్ట్టిగా పట్టుకు కూర్చుంటే నష్టపోవలసిందే .అదే జరిగిందిప్పుడు నా జీవితంలో శంకరరావు   
అనే కుఱ్ఱవాడిని చూసి ప్రైవేటు ఉద్యోగమని అంగీకరించలేకపోయారు . అతను పెళ్ళి చేసుకొని గవర్నమెంట్ ఉద్యో గిగా మారి , పిల్లా పాపలతో నేడు హాయిగా జీవిస్తున్నాడు . 
ఆనందమయమైన జీవనానికి ప్రభుత్వ ఉద్యోగమే అవసరం లేదు . సరైన వయసు మాత్రమే కావాలి , అది గ్రహించ లేకపోయారు . వయసులో పొందే ఆ ఆనందం ఈనాడు పొందలేను .
ఆ వయసులో పెళ్ళి చేసుకొంటే రెండు జడలు వేసుకొని , హాయిగా లంగా , ఓణీతో అలా అలా భర్తతో షికారు వెళ్ళి వస్తుంటే పొందే ఆనందమే వేరు .
అన్నట్లు మా శ్రీవారు ప్రభుత్వ ఉద్యోగులే , అయినా పొందగలనా ? పొందలేను , వారు పొందలేరు , వయసుదాటి పోయింది కదా! 

ప్రతి మనిషి జీవితంలో రాజీ పడక తప్పదు . అయితే ఆ రాజీ ఏ సమయంలో అవసరమో తెలుసుకొని , అప్పుడే అమలు జరిపితే అమదరి జీవితాలు ఆనందమయమవుతాయి . లేకుంటే తనకూ , తనవారికీ కూడా భరిఉంచలేని నష్టం వాటిల్లుతుంది . అర్ధం చేసుకున్నారు కదూ ! 

మీ 
రాజ్యలక్ష్మి .
ఉత్తరం చదివిన కామేస్వర రావు నోట మాట రాలేదు .


                                                                                    ** స ** మా ** ప్తం No comments:

Post a Comment