ఓపెనింగ్ & క్లోజింగ్

ఓపెనింగ్ ,


కాళ్ళతో తన్నినా ,
ఉమ్ము తుప్పరలు చిలకరించినా ,
అశుధ్ధాన్ని ఒళ్ళంతా అంటించినా ,
పెట్టినది తినకున్నా ,
చెప్పినమాట వినకున్నా ,
ఛీ ఫో అంటూ ఛీదరించుకున్నా ,
అవన్నీ చిన్ననాటి బాల్యపు చేష్టలుగా ,
సరిపెట్టుకొంటారు ఆ కన్నవాళ్ళు .

ఆ  పసిపిల్లలే పెరిగి పెద్దయి ,
చదువుల పేరుతో ప్రగతి సాధిస్తారని ,
దూరమై పోతారు మొదట .
పిదప ఉద్యోగాల పేరిట ,
అత్యున్నత పదవిని అధిరోహించాలని ,
ఇంకొంచెం దూరమై పోతారు .
ఆ తదుపరి పెళ్ళి పేరిట ,
మరి కొంచెం దూరమై పోతారు ,
ఆ పై , వాళ్ళ పిల్లలు పెరిగి పెద్దయ్యేవరకు ,
తమ పెద్దలని దైవసమానంగా భావిస్తారు ,

క్లోజింగ్ ,

పెరిగి పెద్దయ్యాక ,
ఇంటి కంటే గుడి పదిలమన్నారుగా ,
ఇంటి కంటే యిక్కడే పదిలం మీకు ,
మాకంటే , వీళ్ళే బాగా చూసుకొంటారు ,
మరెక్కడకి , మాలా పంపించబోరు ,
ఎప్పటికీ యిక్కడే ఉంచేసుకొంటారు ,
పదండి పదండి అంటూ పరుగెత్తిస్తారు ,
ఏవేవో చెప్తూ అలా ఏమార్చేస్తారు ,
పడకలనక్కడకి మార్చేస్తారు .

రోజులు , నెలలు , సంవత్సరాలుగ మారుతున్నా
ఆరు రుతువులు పలకరించి పోయినా ,
కన్నకొడుకు కంటిచూపుకి నోచుకోలేకపోయారు ,

ఆఫీసులో ఆరా తీశారు ఎటూ పాలుపోక ,

ఈ వృధ్ధాశ్రమానికి శాశ్వత చందాదారులు మీరు ,

ఈ దారులు చూసుకొని ఇంత దారుణానికి ఒడిగడ్తారా ?

దారుణం అనుకోకండి ,
మీకూ మాకూ ఏనాటి ఋణమో లెండి ,
వాళ్ళకి , మీకు ఏ సంబంధమూ లేదమ్మా ,
ఇక ఏ సంబంధమైనా మీకూ , మాకే అన్నారు ,
దగ్గరుంచుకొని చాకిరీ చేయలేమన్నారు ,
ధనమెంతైనా చెల్లిస్తామన్నారు ,
అందుకే కదండీ అర లక్ష ఒక్కమారుగ కట్టారు ,
మీకీ వయసులో మేమే ఆసరా ,
మీ పెద్ద వయసుకి ,
అలసట తీర్చేవాళ్ళం , సొగసులద్దేవాళ్ళం , 
వాస్తవానికి మేము అద్దెవాళ్ళమే ,
అమ్మలు , అమ్మమ్మలు , నానమ్మలు ,
అయ్యలూ , తాతయ్యలూ , బాబయ్యలూ ,
స్వాగతం , సుస్వాగతం , రండి రండి ,
మీ వాళ్ళు చెంత లేరనే చింతనే  వదలండి ,
మాతో మనఃస్ఫూర్తిగా కలిసిపోండి .
మిగిలిన మీ శేషజీవితాన్ని హాయిగ గడిపేయండి

( గమనిక :  గత్యంతరం లేని పరిస్థితులలో తప్పఇలా ఎవ్వరికీ జరుగకూడదని మనఃపూర్వకంగా ఆశిస్తున్నాను )

*****

4 comments:

  1. మనసు భారమైంది ఈ పోస్ట్ చదువిన తరువాత. నిజమే ఎవరికీ ఇలాంటి పరిస్థితి రాకూడదనే కోరుకుందాం.

    ReplyDelete
  2. ఎవరూ లేని వాళ్ళకి ఇటువంటి శ్రధ్ధాశ్రమాలూ మంచి ఆసరాయే కానీ , పిల్లలుండి తలితండ్రులని అనాధల్లా ఇందులో చేరిస్తే అటవంటి పిల్లలుఉన్నా ఒకటే ,లేకున్నా ఒకటే..

    ReplyDelete