తడి తపనలు మాత్రమే ....... ( హాస్య కధ )

                                                                                                                          కధా రచన : శర్మ జీ ఎస్

"   అమ్మా , నాన్న గారు తన బ్లాగుని చూడనే చూడనంటున్నారెందుకని ? "

"   కోపమొచ్చినప్పుడల్లా యిదే వరసరా . "

"   కోపం ఎవరిమీదమ్మా ? "

"   ఇంకెవరి మీదనైనా చూపిస్తే ఎవరూరుకుంటారు , ఆయన గారి ప్రతాపమంతా నామీదనే కదా !."

"   నీమీద కోపం వస్తే ఆ బ్లాగేం పాపం చేసిందని . "

"   నన్నేం చేయలేక , ఆ కోపం దానిమీద చూపిస్తుంటారులే .  "

"   నాన్న అలా చెప్పలేదే ?  "

"   మరెలా చెప్పారేమిటి ?  "

"   నిగ్రహ శక్తిని పెంపొందించుకోవటానికట .  "

"   నిగ్రహ శక్తా ? విగ్రహ శక్తా ?   "

"   విగ్రహ శక్తికి ఉపవాసాలుండకుండా తింటుండాలట .  "

"   నిగ్రహ శక్తికి తినకుండా వుంటే పోతుందిగా ?  "

"   తినకుండా వుంటే నీరసం వస్తుందట , ఒంట్లో వున్న ఆ కాస్త శక్తి కూడా వుండకుండా పోతుందిట . "

"   ఆ పై మెలమెల్లగా ఆగ్రహ శక్తి పెరుగుతుందట . ఆ ఆగ్రహశక్తికి బలం , ఒంట్లో బలం లేకుండా వుండటమేనట .
అందుకని .....   "

"   ఇలా తనకు సంబంధించిన వాటితో బంధాలు గాని , యిటువంటి సంబంధాలు గాని పెట్టుకుంటే , తనకు నిగ్రహ శక్తి పెరుగుతుందట .  "

"   ఎవరు చెప్పారుట ?  "

"   ఎవరో చెప్తే ఆయన వింటారా ! ఏమిటి ? ఆయనే కనుక్కున్నారుట . ఈ కనుక్కోవటం నా పెళ్ళైన నాటి నుంచి వింటూనే వున్నా .  "

"   మరెప్పుడూ చెప్పలేదే ?  "

"   చెప్పటానికేమైనా వుంటే చెప్పచ్చు . పధకాలు , ప్రణాళికలు వేస్తూనే వుంటారు . ఫలితాలు మాత్రం శూన్యం .
అంటే నీ పెళ్ళైన  ఈ 20 ఏళ్ళలో ఒక్కటైనా కనుక్కోలేదా ?  "

"   కనుక్కొంటే నేనూ ఆనందంగా పదిమందికి చాటింపు వేసేదాన్ని . అయినా నా పిచ్చిగాని , వయసులో వున్నప్పుడే కనుక్కోలేనిది , ఈ వయసులో యింకేమి కనుక్కొంటారు ?  "

"   అటువంటప్పుడు  ఇంక వద్దండీ , మానుకోండీ అని ఆయనకు చెప్పచ్చుగా .  "

"   ఛెప్తే వినకపోగా , ఆయన అహం దెబ్బతిన్నట్లుగా ఫీలవుతుంటారు . అలా అహం దెబ్బతిన్న తర్వాత మొహం కూడా చూపించరు . అంత అవసరమా నాకు ఈ వయసులో .  "

"   ఓ ఈ కళ కూడా వున్నదా ఈయనలో . "

"   ఈ కళేంటి , యింకా చాలా చాలా కళలున్నాయి . మనింటి పేరేమిటి ?  "

"   అదేంటమ్మా అలా తెలియనట్లు అడుగుతున్నావ్ ?  "

"   తెలియక కాదు , నీకు వివరంగా తెలియచెప్పాలని .  "

"   కళల కాణాచి .  "

"   అంటే కళలలో నిష్ణాతులైనవారు అని అర్ధం .  "

"   అలాగా ! ఏ కళలలో ?  "

"   అదే చెప్తున్నా . ఆ యింటిపేరు చూసే మా వాళ్ళు మీ నాయనగారికి నన్ను కట్టబెట్టారు .  "

"   మంచిపనే చేశారుగా .  "

"   మేమూ మొదట అలాగే అనుకున్నాం . తీరా పెళ్ళై కాపురానికొచ్చిం తర్వాత అర్ధమైంది , ఏ కళలలో ఆరితేరారో ."

"   అప్పుడు కూడా తెలియకపోతే యిబ్బందిపడేదానివేమో . త్వరగా తెలుసుకోగలిగావు . ఆ తర్వాత .  "

"   ఇంకేముంది నొప్పి తగ్గింది , వాపు మిగిలింది .  "

"    అర్ధం కాలేదమ్మా . ఇంకొంచెం వివరంగా వివరించమ్మా . "

"   నిజంగా వాళ్ళ ఇంటిపేరు అది కాదట . వాళ్ళ పూర్వీకులు నాటకాలాడేవారట . వాళ్ళ నాటకాలు చూసిన ఆ నాటి పెద్దమనుషులు " కళల కాణాచి " అన్న బిరుదు ప్రదానం చేశారుట యీయనకు ముందు మూడు తరాల వాళ్ళ వాళ్ళకు . ఇక ఆ నాటి నుంచి అంతకుముందు వున్న వాళ్ళ అసలు ఇంటిపేరుని మార్చేసుకున్నారుట .  "

"   అలాగా ! నాకు తెలియక ఇంతదాకా నా స్నేహితుల దగ్గర గొప్పగా చెప్పాను . అయితే అది నిజం కాదా . "

"   నిజం కాదురా , ఇదే నిజంరా .  అలా ఎచ్చులు చెప్పకు , ఉచ్చులలో బిగుసుకుంటావు . "

"   సరేనమ్మా , ఇక నుంచి జాగ్రత్తగా వుంటాను . అది సరే గాని ఆయన గారు అలా భీష్మించుకు కూర్చొంటే
ఎలాగమ్మా ?  "

"   ఎన్నాళ్ళు కూర్చొంటారురా ? కూర్చొంటే కూర్చోనియ్ . "

"   అంత సీను లేదమ్మా ఆయనకి . "

"   మరెంతుందంటావేమిటి ?   "

"    ఒక్క పది రొజులపాటట .  "

"    ఎందుకు ? ఏమైందేమిటి ? గూగుల్ వాడేమైనా బ్లాగులకు సంబంధించిన సైట్ ని మరమ్మత్తులు చేస్తున్నాడా ఏమిటి ?  "

"    గూగుల్ ఏమీ చేయటం లేదు , మా నాయనే గమ్మత్తులు చేస్తున్నాడిలా ?  "

"    అంటే ? అర్ధం కానట్లు అడిగింది . "

"    అలా అయితే నాకేంటి ? ఆ అవస్థలేవో ఆయనే పడ్తారుగా . ""

"    అలాగైతే నీకెందుకు చెప్తాను . కొంచెం తేడాగా ప్రవర్తిస్తుంటారు .  "

"    తేడా అంటే ?  "

"    అదేనే కనపడిన ప్రతివాళ్ళని కసురుకోవటం , విసుక్కోవటం , కోప్పడటం లాంటివి మొదలైనాయి .  "

"    అందుకేనా ఆయన ఏదో ఆలోచిస్తున్నట్లుగా వున్నారు ?   "

"    ఆలోచించటం కాదు , అర్ధం చేసుకోవటం కాదు . ఆయనలో ఆయన గొణుక్కుంటున్నాడు ?  "

"    దేనికి ?  "

"    ఏంటి యిలాంటి పరీక్ష ఎందుకు పెట్టుకొన్నానా ? అని . "

"    ఆయనకు ఆయనేగా కమిట్ అయ్యారన్నావు ?  "

"    కమిట్మెంట్ యీజీ , ఫాలో అవటమే అన్ యీజీగా ఫీలవుతున్నారు . "

"    అంత కష్టమైతే కమిట్మెంట్ విత్ డ్రా చేసుకొంటే పోలా ?  "

"    విత్ డ్రా చేసుకుంటే నిగ్రహశక్తి పెరగదుగా ?  "

"    విత్ డ్రా ఎందుకు చేసుకున్నారని అందరూ అడుగుతారుగా , అది తట్టుకోలేక సహనాన్ని కోల్పోయి , అసహనాన్ని ఆశ్రయించి ఆగ్రహించేస్తారట . "

"    అలా అయితే ఆయనను కంటిన్యూ చేయమను . "

"     ఆయన గారు కంటిన్యూ చేస్తే ఇంట్లో సిస్టం మూసే వుంటుంది . అది కష్టమవుతుంది నాకు . "

"     ఆ విషయం ఆయనకు నువ్వే చెప్పు .  "

"     నేనెలా చెప్తానమ్మా . నువ్వైతే చెప్పగలవు . "

"     నేను కూడా అంతేరా . ఆయనకు ఎప్పుడు కోపమొస్తుందో , ఎప్పుడు నవ్వొస్తుందో నాక్కూడా సరిగ్గా తెలియదు .  "

"     అదేంటమ్మా అలా అంటావు ?  "

"     ఇంకేమనమంటావు . ఆయన వైఖరే వేరు . అందరూ నవ్వుతుంటే ఆయన సీరియస్ గా వుంటారు . అందరూ
సీరియస్ గా వుంటే ఆయన నవ్వుతుంటారు . మనకి ఉప్పు సరిపోతే ఆయనకి తగ్గిందంటారు . ఖారం తగ్గిందంటే
ఎక్కువైందంటారు .   కాఫీ తియ్యగా వుందంటే , చేదుగా వుందంటారు . "

"     అది రోజూ చూస్తూనే వున్నాగా . అది మీ యిరువురి తత్వమనుకున్నా . "

"     తత్వం కాదురా , పైత్యమే . ఆయన ఏం చేయదల్చుకొంటే అదే చేయని . లేకుంటే నిజంగా ఆయనకు నిగ్రహశక్తి రాకున్నా ,  దానికి కూడా మనమే కారణమంటారు .అందుకని ఆయన ఎలా వుండదలుచుకొంటే అలాగే వుండనిద్దాం . "

"     అంతేనంటావా ?  "

"     అంతేరా . ఒకసారి 1985 లో ఏం జరిగిందో తెలుసా ?  "

"     తెలియదు . నేనప్పటికి పుట్టలేదు , నీవింతవరకు చెప్పలేదుగా . "

"     ఇప్పుడు చెప్తా విను . ఆయనకు ఎప్పుడూ ఏదో కనుక్కోవాలనే తపన ఎక్కువుండేది .  "

"      మధ్యలోనే అందుకొని , నీకు కొనుక్కోవాలనుండేదా అమ్మా అన్నాడు సుపుత్రుడు . "

"      అవునురా , కరెక్టుగా చెప్పావు . దాంతో నాకు విసుగ్గా వుండేది .  "

"      ఆయన కనుక్కోలేకపోయారనా ? లేక నువ్వు కొనున్నోలేకపోయావనా ?  "

"      రెండూ ఒక్కసారే జరుగుతున్నాయిగా .  "

"      ఇంతకీ ఆయన ఏం కనుక్కోవాలనుకున్నారు ?  "

"      ఆ 1985 లో వంట నూనె కిలో 4.50 ఉండేది . పిండివంటలు అంత ఖరీదైన వంటనూనెతోనే చేయటం ఎందుకు ?  "

"     వంటనూనెకు బదులు నీళ్ళతో వంటకాలు వచ్చేటట్లయితే , ప్రపంచమంతా పిచ్చివాళ్ళనుకుంటున్నారా  ? "

"    అలా నేనేమీ అనుకోవటంలేదు . ఏదైనా ఓ కొత్తది కనుక్కోవాలంటే ఎవరో ఒకరు ప్రయత్నం చేయకుంటే మనం ఏమి అనుభవించేవాళ్ళం ? ఆలోచించు అన్నారు .  "

"    అలా అనిపిస్తోందా మీకు ? "

"    అలా అనిపించబట్టే కదా , నా ప్రయత్నం విరమించకుండా కొనసాగిస్తున్నా అంతకంత రెట్టింపు ఉత్సాహంతో . "

"    ఓ యిలా ఫిక్స్ అయిపోయారా , సరే కానీయండి . "

"    వాటర్ తో ఎందుకు చేయకూడదు అని నా వెంటబడేవారు పిండి కలిపేదాకా . ఆ తర్వాత ఆయనే బాణలి గ్యాస్ స్టవ్ మీద పెట్టి , వెలిగించి , బాణలిలో నీళ్ళు పోసి , ఆ నీళ్ళు తెర్లేవరకు వుండి కలిపిన చక్రాల పిండిని గిద్దలలో పెట్టి నొక్కారు . చూశావా ? ఎలా చేస్తున్నానో అంటూ ఆ వెంటనే నన్ను నొక్కటం ప్రారంభించారు . "

"    చక్రాలు వచ్చాయమ్మా ?  "

"    చక్రాలెందుకొస్తాయిరా , గట్టిగా వున్న పిండి కాస్తా ఆ వుడికే నీళ్ళతో కలిసిపోయి పలచబడింది . ఇంక మారు మాట్లాడక తన గదిలోకి వెళ్ళిపోయారు .  "

"    మళ్ళీ ఆ ప్రయోగం చేయలేదా ?  "

"    అదెందుకు చేస్తారు ? మరో కొత్త ప్రయోగం , పెళ్ళైన నాటి నుంచి యిలా అదే వరస . "

"     నువ్వెప్పుడూ చెప్పలేదా ? "

"     చెప్పకపోవటం నా లోపం కాదు , వినకపోవటం ఆయన లోపం . అలాగని ఆయనను వదలి వెళ్ళలేను , మన భారతీయ సంప్రదాయం ప్రకారం కడ ( తేరే ) దాకా , ఆ (యన) గడపలోనే వుండాలి . అలా వుండకపోతే , మా పెద్దల పరువు గంగలో కలిసిపోతుందనో , మంటల పాలౌతుందనో చెప్పేవారు . పెద్దలనెదిరించటం మన సంప్రదాయానికి విరుధ్ధం కదా ! .  "

"    అలా భావించి ఆయన్ను అలా ప్రోత్సహించటం వలన , ఇప్పుడు అందరూ బాధపడ్తున్నారా ? లేదా ? "

"    నిజమేరా ? ఈ మాత్రం ధైర్యం ఆ రోజుల్లో నాకే వుండి వుంటే ఎంత బాగుండేదో ?  "

"    అమ్మా , యిప్పటికైనా ధైర్యం చేసి ఆయనకు చెప్పమ్మా ఎటువంటి ప్రయోగాలు చేయద్దని . "

"    నేను చెప్పలేనురా . నువ్వే ధైర్యవంతుడివి కదా !  "

"    ధైర్యం ఒక్కటే సరిపోదమ్మా , యిలాంటివి చెప్పటానికి చనువు కావాలి , ఆ చనువు నీకే వున్నదమ్మా . "

"    ఆ చనువు యిటువంటికి వాటికి వుపయోగపడదురా . నువ్వే చెప్పు , నువ్వు చెప్తేనే బాగుంటుందిరా . "

"    అంతేనంటావా ?  "

"    ముమ్మాటికీ అంతేరా . తను చేయలేనిది తన పిల్లల ద్వారా చేయిస్తారంటారు ఈ లోకంలో . ఇదే తరతరాల ఆనవాయితీరా .  "


                                                                                               *****

4 comments:

 1. ఇంతకీ ఎందుకో అంత విసుగు,బ్లాగు పై కోపమున్నూ :)

  ReplyDelete
  Replies
  1. అలా అర్ధమైందా సారూ , ఎపుడూ ఏదో కనుక్కోవాలన్న తపనే యిలాంటి పనులకు అవకాశం కల్గిస్తుంది .

   Delete
 2. తడి తపనల హాస్యాన్ని ఆరనీయకండి :-)

  ReplyDelete
  Replies
  1. తప్పకుండా నా వంతు ప్రయత్నం నేను చేస్తాను సుమా !

   Delete