వైద్యో నారాయణో హరిః

                                                                                                                                కధా రచన : శర్మ జీ ఎస్రాజ్యలక్షమ్మ మెట్రిక్యులేషన్ పాసయింది .  రంగారావు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ఈ యిరువురూ ఆలు మగలు .
వీరిద్దరు , వీరికిద్దరూ ఆడపిల్లలే  మీనా , వసంతలు .

రాజ్యలక్షమ్మ మనసు కి తఱచూ నొప్పి కలుగుతుండేది. కానీ ఏ డాక్టరుకి చూపించుకోవటానికి ముందుకు రాలేదు .
ఎందుకంటే డాక్టర్లు దేహాలతోనే వైద్య శిక్షణ పొందుతారు కదా , మనసులతో కాదు గదా అని. ఓ వేళ మనశాస్త్రాన్ని చదివినడాక్టర్లకి చూపించుకోవచ్చు గదా అనవచ్చు. ఆ సైకాలజీ వైద్యులు , మనసు పక్కదోవలు పడ్తుంటే , దానిని లైన్ లో పెట్టగలరేమోగాని , ఆ మనసుకి కలిగే నొప్పిని తగ్గించలేరు అన్న ధృఢ నమ్మకంతో వుండటమే అసలైన ముఖ్య కారణం . ఈ విషయాన్నిఎవరికీ తెలియకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నది .

అలా తఱచూ మనసుకి కలుగుతున్న నొప్పి ,  రిపీట్ అవుతూ , ఓ స్థాయిలో  గుండెకి ఎటాక్ అయింది. దానినే ఆంగ్ల భాషలో హార్ట్ ఎటాక్ అంటారు .

ఈ విషయం  రంగారావుకి తెలియగానే , హుటాహుటిన ,ఫ్యామిలీ డాక్టరు వద్దకు తీసుకువెళ్ళి చూపించాడు. తక్షణమే ఆసుపత్రిలో జాయిన్ చేసి వైద్యం  ప్రారంభించారు.

నాలుగు రోజులు గడిచాక , నార్మల్ కి వచ్చ్చిన తర్వాత డిశ్ఛార్జ్ చేశారు. ఇంటికి చేరుకొన్నది రాజ్యలక్షమ్మ.

"   వదినా! యిప్పుడెలా ఉన్నది ? ఆసలు ఏమైంది నీకు ? ఎందుకిలా వచ్చింది ? ఈ విషయం విని నేనెంతగా కంగారు పడ్డానో తెలుసా ? అసలు ఇంట్లో ఉండబుధ్ధి కాలేదు. వెంటనే యిక్కడకొచ్చేశాను. ఆసుపత్రికొచ్చి నాకు చేతనయిన సాయం చేద్దామనుకొంటే గౌరి అన్నది , ఎవర్నీ రానీయటం లేదని. ఏం చేస్తాను , నీ కొఱకు పడిగాపులు కాస్తూ, ఎప్పుడొస్తావో అని ,  ఇక్కడే యిలాగే కూర్చుండిపోయాను "   అంటూ తన ప్రేమని చూపించింది ఆడబిడ్డ రంగనాయకి .

రాజ్యలక్షమ్మ మాత్రం సైగలతోనే తనకు ఫరవాలేదని చెప్పింది.

"   హమ్మయ్య మంచిమాట విన్నాను. అమ్మాయ్ మీనా అమ్మకు , నాకు , మీ నాన్నకు కాఫీ కలిపి తీసుకురా " అన్నది ఆడబిడ్డ .

తనకు కాఫీ వద్దని సైగ చేసింది రాజ్యలక్షమ్మ .

"   అమ్మకు వద్దట, నాకు , మీ నాన్నకు తీసుకురా ,  ఆ చేత్తోనే మా పిల్లలకు పాలు పట్టుకు రావే " అన్నది ఆడబిడ్డ .

మారు మాట్లాడక , రెండు కాఫీ గ్లాసుల్లో  తీసుకు వచ్చ్చి యిచ్చ్చి , " పిల్లలకు యిపుడే తెస్తానత్తయ్యా " అన్నది మీనా .

" ఏరా అన్నాయ్ , ఆ కాఫీ తాగరా. వదినెకి తగ్గిందిగా, యింకా బెంగెందుకు ? పైగా యింటికి కూడా వచ్చిందిగా . ఓ నెల రోజుల్లో నార్మల్ కి వస్తుందన్నారుగా , నేను రోజూ వచ్చి చూస్తుంటాగా "   అంటూ ధైర్యం చెప్పింది .

                                                                                   
                                                                                                           *         *          *

పదిరోజులు గడిచాయో లేదో , మఱలా రాజ్యలక్షమ్మ గుండె ఎటాక్ అవటంతో , ఆసుపత్రిలో జాయిన్ చేశారు.
ఇది రెండవసారి గనుక , డాక్టరుకి ట్రీట్మెంట్ చేయటంలో ఆలస్యం జరుగలేదు. వారం రోజులు గడిచిన పిమ్మట డిశ్ఛార్జ్చేస్తూ, "    చూడండి రంగారావు గారు , హార్ట్ ఎటాక్ రెండుమార్లు వచ్చినా ఫ్రవాలేదు , మూడవమారు వస్తే , మేమే మాత్రం భరోసాయివ్వలేం . కనుక పేషంటుకి పెయిన్ కలగకుండా, వీలైనంత విశ్రాంతినిస్తూ, ప్రశాంతతని కూడ కలిగించాలి . పేషంటు ఎక్కువ ఆలోచించకూడదు రణగొణ ధ్వనులు వినకూడదు . ఉద్వేగం కలిగించే విషయాలకు , ముఖ్యంగా మన తెలుగు టీ వీ సీరియల్స్ కు చాలా దూరంగా  వుంచాలి. గలభాలకు , కొట్లాటలకు కూడా దూరంగా వుంచాలి .  మీరు ఈ విషయంలో చాలా శ్రధ్ధ తీసుకోవాలి "

రంగారావు మనసు ఎంతగానో బాధపడినా , తన రాజ్యం తనకు దక్కుతున్నందుకు సంతోషిస్తూ "   అలాగేనండి " అని బదులిచ్చాడు.

రాజ్యలక్షమ్మను తీసుకొని ఇంటికి చేరుకున్నాడు .

వదినని చూసిన రంగనాయకి, "   వదినా వచ్చావా ? యిప్పుడెలా వున్నది ? నీకు మఱలా హార్ట్ ఎటాక్ వచ్చిందంటే , నా మనసు ఎంతగా మధనపడిందో తెలుసా ? అయ్యో యింత మంచి వదినెకు ఈ యిబ్బందులేమిటా ? ఆని విపరీతంగా ఆలోచిస్తున్నాను . ఆసుపత్రికి వద్దామా అంటే, ఏ రోజుకా రోజు నువ్వు  డిశ్ఛార్జ్  అయి వస్తావని  అమ్మాయిలు అంటుంటే, యిక్కడే ఉండిపోయాను , మా ఆయన్ని కూడా యిటే రమ్మన్నాలే ".

"   ఫరవాలేదమ్మాయ్, యిప్పుడే కదా ఆసుపత్రినుంచి వచ్చింది. ముందు దాన్ని విశ్రాంతి తీసుకోనియ్ "   అంటూ , రాజ్యం "   యిదిగో ఈ బెడ్ మీద మెల్లగా నడుం వాల్చు .  డాక్టరు గారు మఱీ మఱీ చెప్పారు ఏ విషయాలు పట్టించుకోవద్దని "  అంటూ బెడ్ వైపు నడిపించాడు రంగారావు .

"   వదినా అలా బెడ్ మీద ఎంతసేపు  ఒక్కదానివి పడుకొంటావు ? బోర్ కొట్టకుండా , నేను రోజూ వస్తాలే "   ఆన్నది రంగనాయకి .

"   అయితే అత్తయ్యా నీకు కూడా ఆ పక్కనే మరో బెడ్ వేయించమంటావా ? "   ఆన్నది  కోపాన్ని ఆపుకోలేక  మీనా .

"   నాకెందుకే బెడ్ , యిదిగో ఈ కుర్చీ సరిపోతుందిలే . ఇందులో కూర్చొని కబుర్లు చెప్తాలే "   అన్నది .

"   అంత అవసరం లేదులే అత్తయ్యా , మామయ్య రాగానే మీరు బయలుదేరి వెళ్ళండి . మఱల అడుగడుక్కి రాకండి అన్నది మీనా .

"   రాకుంటే, వదినకెలా ఉందోనన్న ఆందోళన ఎక్కువవుతుంది నాలో , అపుడు నేను ఆసుపత్రిలో చేరాల్సి వస్తుంది. ఆది నాకిష్టం లేదే , అందుకని నేనే వస్తుంటా రోజూ " .

"   వద్దు అత్తయ్యా , నేను ఎప్పటికప్పుడు అమ్మ ఆరోగ్యవిషయాలు తెలియచేస్తుంటాగా "   అన్నది మీనా .

"   ఎందుకే , ప్రక్క బజారులోనే గా నే ఉండేది, నేను రాకుంటే , నా మనసుకి స్థిరం వుండదు ".

"   వద్దులే అత్తయ్య , అమ్మనొక్కదాన్నే అలా విశ్రాంతి తీసుకోనివ్వండి , మీరు రాకండి " .

"    అదేమిటే , పెద్దదానినని చూడకుండా , యిలా ముఖం మీద అనేస్తున్నావ్ . ఏరా అన్నాయ్ , నువ్వైనా చెప్పరా దానికి పెద్దవాళ్ళని అలా అనకూడదని "  .

రంగారావు వినీ విననట్లు పక్కకెళ్ళిపోయాడు.

"   ఏం చెప్పకుండా అలా వెళ్ళిపోతావేమిటీరా అన్నాయ్ "   అన్నది .

"   చెప్పటానికేముంది , డాక్టరు గారు  మీ వదినను కంప్లీట్ గా విశ్రాంతి తీసుకోమన్నారు . కనుక మనం ఎవరం కదిలించి యిబ్బంది పెట్టకూడదు "   అన్నాడు రంగారావు .

                                                                                                               *       *        *

ఎవరెంత వద్దంటున్నా , రంగనాయకి  వాళ్ళ అన్నయ్య యింటికి రోజూ వస్తూనే వున్నది , తన ధోరణి ఏ మాత్రం మార్చుకోలేదు .తన పిల్లలు కూడా స్కూల్ నుంచి యిటే వచ్చి , తండ్రి వచ్చేదాకా అక్కడే ఆడుకుంటూ , హోం వర్ఖ్ అతి కష్టం మీద పూర్తి చేసుకుని , డిన్నర్ పూర్తి చేసుకొని వెళ్తున్నారు. మీనా , వసంతలకు చాకిరి తప్పలేదు , రాజ్యలక్షమ్మకి ఈ రగడ తప్పలేదు . ఆన్నా ప్రయోజనం లేక అనుభవిస్తున్నారు .

పట్టుమని పదిరోజులైనా గడవక ముందే , మఱల రాజ్యలక్షమ్మకి హార్ట్ పెయిన్ కలగగా , డాక్టరు వద్దకు తీసుకెళ్ళాడు రంగారావు .

డాక్టరు  గారు వెంటనే ఐ సీ యు లో కి తీసుకెళ్ళారు రాజ్యలక్షమ్మను . రంగారావు వెలుపల వెయిట్ చేస్తున్నాడు .

ఓ గంట గడిచిన తర్వాత , డాక్టరు గారు  రంగారావుని  లోపలకి పంపించమని సిష్టర్ కి చెప్పారు .

డాక్టరు గారేం చెబుతారోనని రంగారావులో ఖంగారెక్కువైంది . కళ్ళవెంట వస్తున్న  కన్నీళ్ళను ఆపుకొంటూనే , మీనా వసంతలకు ధైర్యం చెప్పి లోపలకి వెళ్ళాడు .

"   నమస్కారం సార్ " .

"   రండి రంగారావు గారు , కూర్చోండి  . పోయినసారే మీకు చెప్పాను. హార్ట్ ఎటాక్ మూడవ సారి రానే రాకూడదు , వస్తే మేమేమీ భరోసా యీయలేమని "   అంటుండగానే ,

"   అలా అనకండి డాక్టరు గారు , ఎలాగైనా నా రాజ్యాన్ని నాకు దక్కించండి , మీ కాళ్ళు పట్టుకుంటాను "   అంటూ కాళ్ళు పట్టుకొని  భోరున ఏడుస్తున్నాడు.

"   ఏడవకండి , మీ చేతుల్లో వున్నది  మీరు చేస్తే , మా చేతుల్లో వున్నది మేం చేయగలం  ".

"   మీరన్నది నిజమే డాక్టరు గారు , ఎలాగైనా నా రాజ్యాన్ని రక్షించండి "   మొఱ పెట్టుకుంటున్నాడు రంగారావు .

"   రోగాన్ని గుర్తించి రోగికి మందులు యివ్వగలిగినవాళ్ళమే మేం . ఆ మందులతో పాటు , రోగి మీద ఎక్కువగా చుట్టుప్రక్కల పరిసరాలు పని చేస్తాయి . ఇలా అంటున్నందుకు మీరేమి అన్యధా భావించకండి . విశ్రాంతిలో ఎక్కువగా శాంతి లభ్యమవుతుంది . అందుకే రోగులకి ఎక్కువగా మేము విశ్రాంతినే ప్రిఫర్ చేస్తుంటాము . ఆ విశ్రాంతి హాయి నిస్తుందే గాని అశాంతిని కలుగచేయదు . మీ ఆవిడకి హార్ట్ ఎటాక్  యిలా అడుగడుగుకి రావటనికి కారణం , మీ యింటి వాతావరణమే . మనసు పదే పదే గాయపడితే , గుండెకు తాకుతుంది . ఆ గుండెతట్టుకోలేనపుడు డిసీజ్ గా మారుతుంది . ఒకటి , రెండు సార్లు మా డాక్టర్ల ట్రీట్మెంట్ ద్వారా సర్దుకొంటుంది . మూడవ సారి వస్తే యిక అది
మా మాటా కూడా ఖాతరు చేయదు . అప్పుడే మా ట్రీట్మెంట్ ఫెయిల్ అవుతుంది .  కనుక , మీ యింటి వాతావరణం మార్చగలిగితే , మరోమారు హార్ట్ ఎటాక్ రాకుండా చూసుకొంటే చాలా మంచిది ."

"   తప్పకుండా డాక్టరుగారు , ఈ క్షణం నుంచి నా యింటి వాతావరణాన్ని మార్చుకుంటాను . ఎలాగైనా మీరు నా రాజ్యాన్ని కాపాడండి ప్లీజ్ ,  ' వైద్యో నారాయణో హరిః ' అంటారు . మీరే మా దైవం "   బ్రతిమలాడుకుంటున్నాడు రంగారావు .

"   మేము మా శాయశక్తులా ప్రయత్నిస్తాం "   అన్నాడు డాక్టర్ .

రంగారావు మనసు కుదుట పడింది . మీనా , వసంతల భుజాల మీద చేయి వేసి దగ్గఱకు తీసుకొన్నాడు.
                                   
                                                                                                          *         *         *

రంగారావు  యింటికి చేరుకొనేసరికి , రంగనాయకి ,  పిల్లలు హాయిగా సోఫాలో కూర్చొని , యాపిల్స్, కమలాలు , బత్తాయిలు సెంటర్టేబుల్  మీద పెట్టుకొని కోసుకొని ఆరగిస్తున్నారు.  రంగారావుని చూడగానే , సోఫా వెనక కొన్ని, చీరకొంగు వెనక కొన్నిసర్ది , ఆ కొంగుతోనే కళ్ళు తుడుచుకొంటూ , " అన్నయ్యా ! వదినెకెలా ఉన్నది ? ఎంత బాధపద్తున్నామో , ఎప్పుడొస్తుంది ? ఇంకా  ఎన్నాళ్ళుండాలన్నారు ? అంటూ , అమ్మాయి గౌరి మంచినీళ్ళు పట్టుకురామ్మా "   అన్నది .

రంగారావు కోపాన్ని అణచుకోలేక , "   ఏమిటే నీ కపటప్రేమ . మీ వదినెకు నెల తిరగకుండానే 3 మార్లు హార్ట్ ఎటాక్ అయ్యిందటే , దానికి కారణం నువ్వేనే .  ఆరోగ్యం బాగా లేదు , విశ్రాంతి తీసుకోమని చెప్పారు  ,  కొన్నాళ్ళు రావద్దే  అన్నా , వినకుండా , నువ్వొచ్చింది కాక , నీ పిల్లలను చేర్చుకొని ఉదయం నుంచి రాత్రిదాకా యిక్కడే తిష్ట వేసుక్కూర్చొని , అడుగడుక్కి కాఫీ , ఫలహారాలు అడుగుతుంటే అందించలేక  నా పిల్లలు బాధపడ్తున్నా , నీ కెక్కడా రవంతైనా తప్పనిపించటంలేదు .
ఇన్నాళ్ళూ నా సొమ్మంతా , మీ చదువులకి, పెళ్ళిళ్ళకి వెచ్చించాను , నా పిల్లల బాగోగులను కూడా కాదన్నా . నా రాజ్యం గాని , నా పిల్లలు గాని ఏ నాడూ నోఱు తెఱచి అడగలేదు . అది మా చాతకానితనంగా భావించి ,  యింత నీచంగా ప్రవర్తిస్తున్నావు . తక్షణమే , బైటకు వెళ్ళిపో, మఱల నా యింటి గడప త్రొక్కవద్దు , నీకూ , మాకూ ఈ క్షణంతో ఋణానుబంధం తీరిపోయిందనుకుంటున్నా "   అని స్వయంగా తనే బయటకు పంపించాడు .

వసంతకి రంగారావు లో కోపాన్ని చూడటం ఇదే ప్రధమం .

రాజ్యలక్షమ్మ  డిశ్ఛార్జ్  అయ్యి యింటికి తిరిగి వచ్చేసింది . ఇంటి వాతావరణం నిశ్శబ్దంగా ఉండటం ఎంతో కొంతైనా నూతన ఉత్తేజాన్ని పొందినట్లుగా ఫీలయింది.

 ( వాస్తవానికి హార్ట్ ఎటాక్ 3 మార్లు వస్తే చరిత్రలో బ్రతకటమనేది , లేదన్నది వైద్య శాస్త్రంలోనే లేదు.  మఱి 3 మార్లు వచ్చిన రాజ్యలక్ష్మి ఎలా బ్రతికిందన్న సందేహం అందఱికి వచ్చి తీరుతుంది. నిజ్జంగా 3 వ మారు హర్త్ ఎటాక్ కాలేదు . తెలిసిన డాక్టరు కావటం వలన యింటి విషయాలన్నీ వివరించి , తెలివిగా భర్త మీదకు ఎటాక్ చేసిందిలా , భర్తలో మార్పు రావాలని  యిలా చిన్న నాటకమాడింది .  తన కుటుంబాన్ని కాపాడుకోగలిగింది . )
 
                                     
                                                                                      *     స      *     మా     *     ప్తం      *

2 comments:

  1. తెలివైన భార్య చక్కగా తీర్చి దిద్దుకుంది:-)

    ReplyDelete
    Replies
    1. సంతోషమే కదా !.

      Delete