ఎదురీత

                                                                                                                              కధా రచన : శర్మ జీ ఎస్

భారతమ్మ కి ఐదవతనం లేదన్న బాధతో పాటు , వారసులు లేరే అన్న బాధ తోడైంది . ఐశ్వర్యానికే లోటు లేదు , భర్త పోతూ పోతూ స్థిర , చరాస్తులన్నీ ఆమె పేరే వ్రాసేశాడు .

ఒక్కగానొక్క కొడుకు రాహుల్ , కోడలు రూప . రూప రూపవతే , చదువుకున్న పిల్ల , ఉన్నత కుటుంబాన్నించి వచ్చినా , చాలా సాదా సీదాగా ఉంటుంది . దంపతులై రెండేళ్ళైనా ఇంకా రూప గర్భాన ఓ వంశాంకురం ఉదయించలేదన్నదే ఆమెకు దిగులు .

ఇన్నాళ్ళు కనలేదంటే ఫామిలీ ప్లానింగ్ అనుసరిస్తున్నారేమోనని అనుకున్నది . తీరా కోడలి నడిగితే

"   అటువంటిదేమి లేదండి అత్తయ్యగారు, మాకూ పిల్లల్ని కనాలనే ఉంది "   అని బదులిచ్చింది రూప .

"   మఱి మన ఫామిలీ డాక్టర్ని కలిసి చెకప్ చేయించుకోకపోయారా "   అని సలహా యిచ్చింది .

"   డాక్టరు గారిని కలిసి పరీక్షలు చేయించుకొన్నాము . ఇద్దరిలో ఏ లోపం లేదు , ఎప్పుడైనా కనవచ్చు "   అన్నారు .

"   మఱి యింకేమిటాలస్యం ? "

"   ఆలస్యం మా వైపునుంచి ఏమీ లేదు , ఆ టైం యింకా వచ్చినట్లు లేదు "   అన్నది .

"    నువ్వు చెప్తున్నది నిజమేనా ? "   అన్నది భారతమ్మ .

"   నిజమేనడి అత్తయ్యగారు . ఆయన గారు కూడా ఆలోచిస్తున్నారు "   అన్నది రూప .

"    పోనీ వేరే ఫేమస్ డాక్టర్ల వద్ద చెకప్ చేయించుకోండి "   అన్నది భారతమ్మ .

"   అలాగే చెప్తానండి ఆయన గారికి "    .

రాహుల్ , రూప లు పేరుమోసిన ప్రముఖ డాక్టర్ల వద్దకు టెస్ట్ ల కు వెళ్ళారు . అన్ని టెస్త్ లు చేసిన మీదట
"   మీరిరువురూ పిల్లల్ని కనే సామర్ధ్యం కలిగి ఉన్నారు . మీదే ఆలస్యం "   అని సర్టిఫై చేశారు .

అదే విషయాన్ని తల్లి భారతమ్మకు చెప్పాడు .

"   సంతోషం రాహుల్ మంచి వార్త చెప్పావు , యింక అటు వైపుగా నడక సాగించండి . "   అన్నది.

"   అలాగేనమ్మా "   అన్నాడు .

ఆరు మాసాలైనా ఆ ఛాయలేమీ కనపడక పోవటంతో జ్యోతిష్య శాస్త్రవేత్త జానకిరామయ్యగారికి కబురు చేసింది భారతమ్మ .

"   రండి జానకిరామయ్యగారు రండి , కూర్చోండి "   అన్నది భారతమ్మ .

"   ఏమిటమ్మా విశేషం ? "   అడిగాడు .

"    మీకు తెలియకుండా విశేషాలేముంటాయి ? ఆ విశేషం గురించి మాట్లాడాలనే మిమ్మల్ని పిలిపించాను " అన్నది .

"    సెలవీయండమ్మా "

"   ఈ యింటికి వారసులు కావాలి , నా కొడుకు , కోడలు ఎంతోమంది ప్రముఖ డాక్టర్లని కలిశారు , వాళ్ళలో ఏ లోపం లేదు , ఆ అర్హత  వారికి స్వతహాగా ఉన్నది , ఏ వైద్యం అవసరం లేదు , ఎప్పుడైనా ఆ అవకాశం రావచ్చు అన్నారు . కాని నాలుగేళ్ళు వెళ్ళిపోయాయి . ఆ ఊసే లేదు . ఒక మారు మీరు జాతకాలు చూసి ఎప్పుడు ఆ శుభఘడియలు వస్తాయో తెలియచేస్తారని పిలిచాను "   అన్నది .

"   తప్పకుండానమ్మా . ఇరువురి జాతకాలు యివ్వండి , చూసి సెలవిస్తాను అన్నాడు జానకి రామయ్య  .

"   మా రాహుల్ జాతకం యిదివఱకే చూశారుగా "   అన్నది .

"   ఇదివఱకు చూసినా , యిప్పుడు మళ్ళీ చూడాలి , దేనికంటే ,మీ రాహుల్ జాతకంతో , మీ కోడలు జాతకం కలిపి వచ్చే మిశ్రమ ఫలితాలే  మీ వంశ వారసుల జాడలు తెలియచేస్తాయి  ".

"    అలాగా ! ,ఇవిగోనండి శాస్త్రుల్లు గారు "   అంటూ అందజేసింది భారతమ్మ .

జాతకాలని అందుకున్న జానకిరామయ్య రెండు జాతకాలను క్షుణ్ణంగా పరిశీలించిన మీదట "   అమ్మగారు వీరిరువురికీ సంతానయోగం బాగానే వుందమ్మా , అందులో ఏ మాత్రం సందేహం లేదు , కాకుంటే వివాహమైన 11 సంవత్సరాలకి గాని ఆ యోగం ఫలించదు "   సెలవిచ్చాడు .

"   అయితే యిప్పుడు లేదంటారా ?"   అన్నది భారతమ్మ .

"   అవునమ్మా , ఈ లోగా మీరెంత ప్రయత్నించినా ఆ యోగం లభించదు "  .

"  వేరే మార్గాలేమైనా ఉన్నాయా ? "

"   ఏ మార్గాలైనా ఆ 11 సంవత్సరాలు పూర్తి కాకుండా ఏ ఫలితాన్నీయలేవు , వృధా ప్రయాస తప్ప ".

"   సర్లేండి శాస్త్రుల్లుగారు "

జానకిరామయ్య శాస్త్రుల్లు గారు వెళ్ళిపోయారు . భారతమ్మకేమి చేయాలో పాలుపోలేదు . వాళ్ళత్తగారు అన్నమాట గుర్తొచ్చి , "   ఒరేయ్ రాహుల్ జ్యోతిష్య శాస్త్రవేత్త జానకిరామయ్యగారు యిలా అన్నారు "   అన్నది .

"   అమ్మా నేను జ్యోతిష్యాన్ని నమ్మను , రాళ్ళను నమ్మను ,నిన్ను నమ్ముతాను , నా శక్తిని  నమ్ముతాను " అన్నాడు .

"   సరేరా నన్ను నమ్ముతానంటున్నావుగా , ఓ పని చేయి నామాట విని పుణ్య క్షేత్రాలు తిరిగి రండిరా మీ యిరువురు , అప్పుడైనా ఆ దేవుడికి మనపై కరుణ వస్తుందేమో ? "   అన్నది భారతమ్మ .

"   పుణ్య క్షేత్రాలు తిరిగే వయసు కాదు , అంత సమయము లేదమ్మా నాకు , వీలు కుదిరితే తప్పక వెళ్ళొస్తా నీ మీద గౌరవంతో "   అన్నాడు .

"   వీలు కుదిరితే కాదు రాహుల్ , వీలు చేసుకో , యిది మన వంశానికి సంబంధించినది "  .

                                                                                                    *         *        *        *

"   అమ్మా నీవెన్ని చెప్పినా నేనంగీకరించను , అనుసరించను . డాక్టర్లని నమ్ముతాను , ఏ లోపం  లేదన్నారు మా యిరువురిలో . పిల్లల్ని కనటానికి కావలసిన అర్హతలన్ని మా యిరువురికి ఉన్నాయని వ్రాత పూర్వకంగా యిచ్చారు " .

"   వ్రాత పూర్వకంగా యిచ్చి వుండవచ్చు , నేను తప్పనను . కాని మన నుదుటి వ్రాతలు మాత్రం జ్యోతిష్య శాస్త్రం ద్వారా మనకు తెలియబడ్తాయి . మనకు శాస్త్రాలే ఆధారాలు, అనుసరణలు . నువ్వు నమ్మినా , నమ్మకున్నా నేను అనుసరిస్తాను "   అన్నది.

"   నీ యిష్టం , నేను మాత్రం నమ్మను . ఇంకా ఏడేళ్ళు అఖ్ఖర్లేదు , ఏడు మాసాలు చాలు నిన్ను నానమ్మని చేయటానికి ."

భారతమ్మ ప్రోద్బలంతో వీలు చేసుకొని చాలా పుణ్యక్షేత్రాలను దర్శించారు రాహుల్ రూపలు .
       
                                                                                                   *      *     *     *      *

ఎన్నాళ్ళ నుంచో ఎదురుచూస్తున్న భారతమ్మకి రూప గర్భవతి అయిందని తెలియగానే అమిత ఆనందాన్ని పొందింది . రాహుల్ ఆనందానికి అంతులేదు . రూపని అపురూపంగా చూసుకొంటున్నారు .ఫామిలీ డాక్టర్ పర్యవేక్షణలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నది మెడిసిన్స్ తో పాటు .

భారతమ్మ మనసులో జానకిరామయ్య గారు చెప్పిన సమయానికే అపురూప గర్భవతి అయిందని అర్ధం చేసుకున్నది . జానకిరామయ్య గారిని ఓ మారు రమ్మని కబురంపింది.

జాతకాలు క్షుణ్ణంగా పరిశిలించిన మీదట "   అమ్మగారు వారసుడే వస్తున్నాడు , అందుకు సందేహమేమీ లేదు . అయితే ..... "

"   జానకిరామయ్య గారు , రాక రాక యిన్నాళ్ళకు ఈ యింటికి వంశాంకురం వస్తుంటే మళ్ళీ ఆ అయితే ... ఏమిటండి  ? "   అన్నది కంగారుగా .

"   భయపడవలసిన పనేమి లేదమ్మా , కాకుంటే నార్మల్ డెలివరీ మాత్రం కాదు , సిజేరియన్  ".

"   ఆ విషయం డాక్టరు గారు చెప్పలేదే , పైగా నార్మల్ డెలివరీ అని ,అన్నీ సక్రమంగా వున్నాయని అన్నారే "  .

"   డాక్టరు చెప్పినా , చెప్పకపోయినా జరిగేది జరుగక మానదు , నార్మల్ డెలివరీ మాత్రం కానే కాదు , సిజేరియన్ , అది కూడా పెద్దదే "   అన్నాడు .

"   మఱి తల్లీ , బిడ్డా క్షేమంగా వుంటారా "    అన్నది .

"    ఆ విషయంలో సందేహించాల్సిన అవసరం లేదు . ఇలాంటి వాస్తవాలని వెల్లడించిన సమయంలో , శాస్త్రాల్ని నమ్మకుండా ,తూలనాడుతుండటం వలన , కొంతమంది జ్యోతిష్కులు తమ బ్రతుకు బరువు కాకుండా వుండేటందులకు ,ఆ శాస్త్రాన్ని తమ బ్రతుకుకి తెరువుగా ఉపయోగించుకుని లేనిది చెప్పటం వలన ,  ఆ శాస్త్రాల్ని ఎవ్వరూ నమ్మని పరిస్థితి వచ్చేసింది . ఫలితంగా శాస్త్రం మీద సమాజంలో నమ్మకం తగ్గిపోయింది . ఆ వచ్చే వారసుడి నక్షత్రం దోషభూయిష్టమైనది . అందులకు గ్రహాలకు శాంతులు , హోమాలు చేయించవలసి వుంటుంది .
ఇంక నే వెళ్ళొస్తానమ్మా "   అన్నాడు .

"   అలాగాండి  ! సరే మా చిరంజీవితో సంభాషించి మీకు మళ్ళీ కబురు చేస్తాను "   అన్నది .

                                                                                                         *      *      *       *

"   ఒరేయ్ రాహుల్ పుట్టబోయే శిశువు దోషనక్షత్రంలో జన్మిస్తాడని , నార్మల్ డెలివరీ కాదని , సిజేరియన్ అని అది కూడా పెద్దదేనని సెలవిచ్చారురా జానకిరామయ్య గారు . డాక్టరు గారేమంటున్నార్రా "   అడిగింది భారతమ్మ .

"   అమ్మా నార్మల్ డెలివరీ అనే చెప్పారు , సందేహమేమీ లేదు "   అన్నాడు .

"   ఎంతమందో డాక్టర్లు మీలో ఏ లోపమూ లేదన్నారు , వెంటనే సంతానం కంటారని చెప్పారు . ఈ 11 ఏళ్ళ కాలంలో మీరెన్నో గుళ్ళు , గోపురాలు చుట్తి  వచ్చారు , పూజలు పునస్కారాలు చేశారు , కాని మీకు సంతాన ప్రాప్తి కలగ లేదు . శాస్త్రుల్లుగారు చెప్పినట్లు రూప ఇప్పటికి గర్భవతి అయింది కదా ! నాకెందుకనో జానకిరామయ్య గారి మాటలు నిజమనిపిస్తున్నాయిరా ."

"   అంతగా నమ్మకం నీకుంటే ఓ పని చేద్దామా ? "   అన్నాడు .

"   ఏం చేద్దాం ? "   అడిగింది భారతమ్మ .

"   మానవుడు గ్రహాల మీద పట్టు బిగిస్తున్న ఈ రోజుల్లో , పిల్లల్ని వెంటనే కనాలా ? వద్దా ? లేక కొంచెం ఆలస్యంగానా ! అన్నది తనే డిసైడ్ చేసే పరిస్థితుల్లో ఉన్నప్పుడు , ఆ పిల్లల్ని మంచి నక్షత్రంలో కనేటట్లుగా ప్లాన్ చేసుకోవటం పెద్ద కష్టమేమీ కాదుగా . ఎటూ సిజేరియన్ పెద్దదే అన్నారు కదా ! అందులోనూ దోష నక్షత్రం అన్నారు కనుక , పంచాంగాలలో శిశుజననము ఆపరేషనులకు మంచి సమయములు అని వివరంగా తెలియచేస్తున్నారు . అందులో మనం ఓ పండిత బ్రాహ్మణుడిని అడిగి మంచి నక్షత్రం చూసుకొని ఆ పెద్ద ఆపరేషన్ చేయించేద్దాం , అప్పుడింక బాధే ఉండదుగా "   అన్నాడు .

"   ఈ ఆలోచన బాగానే ఉందిరా , అలాగే చేద్దాం "   అన్నది భారతమ్మ .

"    అమ్మా మంచి నక్షత్రం చూసి ఫైనల్ చేస్తే , డాక్టరు గారితో సంప్రతించి పెద్దాపరేషనుకు తేదీ ఫిక్స్ చేస్తాను " అన్నాడు .

                                                                                                              *     *     *     *

"   అమ్మా  పండిత బ్రహ్మ గారు చెప్పినట్లుగా డాక్టరుగారు పెద్దాపరేషనుకి టైం ఫిక్స్ చేశారు ఉదయం 10 గంటలకు "   అన్నాడు.

"   ఆ మంచి నక్షత్రం ఎంతవఱకు ఉందో  అన్నీ జాగ్రత్తగా చూడరా . ట్రాఫిక్ ని దృష్టిలో పెట్టుకొని ఆలస్యం చేయకుండా ఎర్లీగా బయలు దేరితే చాలా మంచిది  "   అన్నది .

"   అలాగేనమ్మా , అందుకే ఉదయం 8 గంటలకే ప్లాన్ చేశాను . డాక్టరు గారు కూడా కరెక్ట్గా 1 గంట ముందే ధీయెటర్లో ఉంటానన్నారు . నేను 8 గంటలకే రూపతో బయలుదేరతాను . అన్నీ అరేంజ్ చేశాను , నువ్వేమీ కంగారుపడక , చిరంజీవి మనం అనుకున్నట్లు మంచి నక్షత్రంలోనే జన్మిస్తాడు "   .

"   సంతోషం క్షేమంగా వెళ్ళి లాభంగా రాండి  "   అన్నది .

రూపని తీసుకొని యిన్నోవాలో  బయలుదేరాడు . థీయెటర్ కి కాల్ చేసి అన్నీ సిధ్ధం చేశారో లేదో యింక్వైరీ చేస్తున్నాడు డ్రైవింగ్ చేస్తూనే . జే ఎన్ టీ యు చేరేసరికి తెలంగాణా యిష్యూ ఫైనల్ చేయకుండా మళ్ళీ మళ్ళీ పోష్ట్ పోన్ చేసే దిశగా స్టేట్మెంట్ కేంద్రం జారీ చేసిందని , అప్పటికప్పుడు రాస్తా రోకో నిర్వహిస్తుండటంతో ట్రాఫిక్ టెరిఫిక్ గా నిల్చిపోయింది . రంగా యిన్నోవా మధ్యలో వుండిపోయింది , ఆతృత పెరిగింది , అటూ యిటూ దిక్కులు చూస్తున్నాడు , ఎటైనా వెళ్ళే అవకాశాలేమైనా ఉన్నాయోనని . ఏ మార్గం కనపడలేదు .ఇంతలో తన ఇన్నోవాకు పక్కగా తెలంగాణా ఐకాస అద్యక్షుడు కోదండరాం వెళ్ళటం గమనించిన  రాహుల్ "   కోదండరాం గారు , నమస్తే  ఒక్క క్షణం డెలివరీ కేసిది , మా ఆవిడని అర్జెంట్ గా  పెద్దాపరేషన్ కొఱకు హాస్పిటల్ కి తీసుకువెళ్తున్నాను , కొంచెం
దారి యిప్పించండి , ప్లీజ్ "  అని రెక్వెష్ట్ చేశాడు .

వెంటనే "   ఈ యిన్నోవాకు దారిచ్చి పంపండి "   అనౌన్స్ చేశాడు మైకులో . అది వినగానేభారంగా "   హమ్మయ్య  " నిట్టూర్పుతో కూడిన శ్వాసల నడుమ యిన్నోవా స్టీరింగ్ స్టార్ట్ చేశాడు . "   కోదండరాం గారు అర్ధం చేసుకున్నందులకు థాంక్స్ "    చెప్పి దూసుకు వెళ్ళిపోయాడు .

ఆ సరికే 9 గంటలు దాటింది . హాస్పిటల్ కి చేరుకొనే సమయం లోపల ధీయెటర్లోని అరేంజ్మెంట్స్ చేసి , స్ట్రెచర్ తిసుకొని రమ్మని సలహా యిచ్చాడు . సరిగ్గా 9.45 అయింది ,  వెంటనే ధీయెటరుకి తీసుకు వెళ్ళారు . డాక్టరుగారు రెడీగా ఉండటంతో హాపీగా ఫీలయ్యాడు  రాహుల్, రూపతో కలసి .అనుకున్న ప్రకారం ఆపరేషన్ 10 గంటలకే ఆరంభమైంది .  ఆపరేషన్ పెద్దది కావటం వలన గంటన్నర టైం పడ్తుందని ముందుగానే డాక్టర్ తెలియ
చేయటంతో బయటే నిరీక్షిస్తున్నాడు .

ధీయెటర్ లోపల ఆపరేషన్ జరుగుతున్నది , 45 నిముషాలు  గడిచాయి . ఎప్పటికప్పుడు ఎలాగుందో , ఎంతవఱకు వచ్చిందో అక్కడి సిష్టర్స్ ని అడిగి తెలుసుకుంటున్నాడు , వాళ్ళమ్మకు  తెలియచేస్తున్నాడు , ఆమె టెన్షన్ పడకుండా ఉండేందుకు .

సడెన్ గా లోపలనుంచి ఓ స్ట్రెచర్ బైటకు తీసుకు వస్తున్నారు కంగారుగా సిష్టర్స్

" ఏమైంది " అడిగాడు .

"   మీ డాక్టర్ గారు  మెలికలు తిరుగుతూ ఆపరేషన్ ధీయెటర్లోనే సడెన్ గా పడిపోయారు ,పరీక్ష చేస్తే 24 గంటల కడుపునొప్పి అని కంఫర్మ్ అయింది , అందుకే అర్జెంట్ గా ధీయెటరుకి తీసుకు వెళ్తున్నాం "   బదులిస్తూనే నడుస్తున్నారు మర్~ఓ ఆపరేషన్ ధీయెటరుకి .

"   మఱి మా ఆవిడ ఆపరేషన్........? "   కంగారుగా .

"   కంగారు పడకండి , వేరే ఫేమస్ డాక్టరు గారిని పిలిచాము . వస్తున్నారు , హి యీజ్ ఆన్ ద వే ."

"   టైం 11 గంటలు దాటింది , ఎంతసేపట్లో వస్తారు ? "

"   ట్రాఫిక్ లేకుంటే ఓ గంటలో వచ్చేస్తారు , ఈ ఆపరేషన్ ఎవరు పడితే వాళ్ళు చేసేది కాదు . ప్లీజ్ ఓపిక పట్టండి , మాకూ తెలుసుగా "   అని బదులిచ్చారు .

చేసేది ఏమీ లేక రాహుల్ టెన్షన్ పడటం , ఎదురు చూడటం తప్ప .

ఎదురుగా గడియారం 12 గంటలు దాటింది , డాక్టరు గారినుంచి కాల్ వచ్చింది రెసెప్షన్ కి .

ఆశగా "   ఎప్పుడొస్తారు డాక్టరు గారు "    అడిగాడు రాహుల్ .

"   ట్రాఫిక్ లో ఉన్నారుట , ఆ తెలంగాణా వాళ్ళ రాలీ అక్కడుందట , ఇంకో గంటో , గంటన్నరో పట్టవచ్చు అన్నారు "    అన్నది రెసెప్షనిష్ట్ .

"   అంత టైమా ? అంటే 2 గంటలు దాటుతుందిగదా ! ఈ లోపలే ఆపరేషన్ పూర్తి చెయ్యాలి "

"   ఆ విషయం నాకు తెలియదండి "    అన్నది రెసెప్షనిష్ట్.

"   ఇలా అయితే ఎలా ? "

"   మీ డాక్టరు గారికి ఇలా అవుతుందని ఎవరికి తెలియదు కదా ! కొన్ని కొన్ని అనుకోకుండా వచ్చినప్పుడు ఎవరు మటుకు ఏం చేస్తారు వెయిట్ చేయటం తప్ప "   బదులిచ్చింది రెసెప్షనిష్ట్ .

3 గంటలు కావస్తుండగా డాక్టరు గారు కారు దిగి హడావుడిగా ధీయెటరు లోనికి వెళ్ళారు .మఱో 45 మినిట్స్ గడిచిన తర్వాత , సిష్టర్ బైటకు వచ్చి "   రాహుల్ గారు , మీకు మగశిశువు , తల్లీ ,బిడ్డ క్షేమంగా ఉన్నారు "   చెప్పి లోనకు వెళ్ళింది .

ఆ వార్త విన్న రాహుల్ కి ఆనందం కంటే దిగులే కలిగింది .

భారతమ్మ కాల్ కి బదులుగా , దిగాలుగా "    అమ్మా 4 గంటల 15 నిముషాలకు మగ శిసువుని ప్రసవించింది , తల్లీ ,బిడ్డ క్షేమమే "   అని కట్ చేశాడు .

వెంటనే "   జానకిరామయ్య గారు మా రూప మగశిశువుని ప్రసవించింది  సాయంత్రం 4-15 కి . మఱి నక్షత్రం చూసి , ఏమేమి  శాంతులు , ఎలా చేయాలో చూసి సెలవియ్యండి రేపు "   అన్నది భారతమ్మ .

"   అలాగేనమ్మగారు . జ్యోతిష్య శాస్త్రం ఎన్నటికీ తప్పు కాదు . శాస్త్రాలు వ్రాసింది మనుషులే  . అంత మాత్రాన తేలికగా తీసిపారెయ్యకూడదు .  ఎన్నో తరాల మానవుల అనుభవాలని ఆకళింపు చేసుకొని వ్రాసినవే కాని , పుక్కిటి పురాణాలు కాదు అని ముందు తరాల వారికి , మన ముందు యుగాల వారు తెలియచేశారు  . ఏదైనా శాస్త్రం అంటే పంచభూతాలతో యిమిడి వుంటుందన్నది మనం మఱచి పోకూడదు . మన శరీరం పంచభూతాలతో సృష్టించబడ్డది . కనుక ఆ పంచభూతాల ప్రభావం ఎప్పుడూ మనపై ఉంటుందన్నది మనకి ఎఱుకలో వుండాలి  . ఏటికి ఎదురీదాలనుకోవటం ఎప్పటికీ తప్పే అవుతుంది  "  అని సెలవిచ్చారు జానకిరామయ్య గారు .


                                                                                         *  స  *  మా  *  ప్తం  *             

8 comments:

 1. శర్మగారు,
  నమస్తే.
  కథ బాగానే ఉంది.
  కాని జ్యోతిషం వంటి విషయాల మీద ఆధారపడిన కథలను ఎవరికి అనుకూలమైన వాదనలతో వారు వ్రాసుకోవచ్చును.
  జనసామాన్యానికీ ఈ విషయం స్పష్టమే కాబట్టి, ఇటువంటి కథలు పెద్దగా ప్రభావం చూపిస్తాయని అనుకోను.
  ఐతే, మీ అభిప్రాయం బాగానే వ్యక్తం చేసారు. అభినందనలు.

  మరొక్క ముఖ్య విషయం:
  ఇటీవల మీరు వ్రాసిన 'ఆ రాముడు మానవుడా ? దానవుడా ?' అన్న టపాకు నేను 17వ తేదీన చేసిన వ్యాఖ్యకు మీరు నొచ్చుకొని ఉంటే మన్నించ వలసినదిగా విజ్ఞప్తి. మిమ్మల్ని కించపరచటం నా ఉద్దేశం కాదు. నా అభిప్రాయం నేను చెప్పాను. పొరపాటు లేవైనా ఎత్తి చూపి నందుకు కోపగించుకొన రని భావిస్తున్నాను. మీరు ఆ టపాను తొలగించటం గమనించాను. నా వ్యాఖ్యకు సమ్మతిగా కాని మీ‌రు పునరాలోచించుకుని కాని అలా చేసి ఉంటే సరే. అలా కాక, నేనేదో దాడి చేసానని భావిస్తే క్షంతవ్యుడను.
  ఈ విషయం మీకు ఇ-మెయిల్ ద్వారా చెబుదామని ప్రయత్నిస్తే మీ‌ ప్రొఫైల్‌లో నాకు అది కనిపించ లేదు కాబట్టి ఇక్కద వ్యాఖ్యతో జోడించి చెప్పవలసి వచ్చింది. స్వస్తిరస్తు.

  ReplyDelete
  Replies
  1. శ్యామలీయం గారు ,

   నమస్తే .

   మీరు , తోటి మన బ్లాగు మిత్రులు ఆ నాటి టపా " ఆ రాముడు మానవుడా ? దానవుడా ? " ని చదివి వ్రాసిన మీ విశ్లేషణలను చదివాను . నొచ్చుకోలేదు , అపార్ధం చేసుకొనలేదు , సహృదయుడనై అర్ధం చేసుకొన్నాను .
   ఇటువంటివి దుర్భావనలు సమాజంలోకి విస్తరించకూడదు , విస్తరిస్తే అర్ధాలకంటే , అనర్ధాలు ప్వాటిల్లే( చక్కగా ఒక గాడిలో వెళ్తున్న సమాజం యిటువంటి విషయాలతో తప్పుగా అర్ధంచేసుకొనే ) ప్రమాదమున్నదని అర్ధం చేసుకొన్నా . మన పూర్వీకుల సలహాల , ఆచరణల మేరకు , మనవంతు మనం ( చేయగలిగితే ) సమాజానికి సేవ చేయాలే గాని , హాని మాత్రం చేయకూడదు అని అర్ధం చేసుకొన్నా . కనుకనే యిటువంటి విషయాలు యింకెవ్వరూ చదవరాదు అన్న సదాలోచనతో , తక్షణమే టపా నుంచి తీసివేయటం జరిగింది .
   మీలాంటి పెద్దల సలహాలకు ( ఆ నాడు నా టపాలో విశ్లేషణ చేసిన నాగేంద్ర అయ్యగారికి , ఎనానిమస్ గారికి , కష్టే ఫలి శర్మ గారికి , చిరంజీవి సాగర్ కి మఱియు మిత్రులు హరీస్బాబు గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు .
   " సద్భావనతో సాధించలేనిది లేదు , దుర్భావనలు దూషణలతొ వేధించగలవి తప్ప , ప్రగతి పధానికి అనుకూలమైనవి కావు " .
   Delete
  2. This comment has been removed by the author.

   Delete
  3. శర్మగారూ, నేనూ శ్యామల్రావు గారనుక్కున్నట్టే అనుక్కున్నాను ఆ అభిప్రాయంతోనే ఉన్నానూ ఈ నాలుగు రోజులూ..నొప్పించి ఉంటే పెద్ద మనసుతో మన్నించగలరు

   ధన్యవాదాలతో

   Delete
  4. అయ్యగారి నాగేంద్ర గారు ,

   ఇందులో మన్నించటానికేమున్నదండి , బియ్యపుగింజలో వడ్లగింజే కదండి నా టపా ! కనపడలుండా దాగి వున్న ఆ వడ్లగింజని నాకు మిలాంటి వారందరూ చూపించారు .అందుకే అర్ధం చేసుకొని తీసేస్తున్నాను కదండి .

   Delete
 2. కథలో మీరు చెప్పిన విషయం చాలా బాగుంది, శ్యామలీయం గారన్నట్లు ఇలాంటివి నమ్మకాలపై ఆదారపడి ఉంటాయి.

  ReplyDelete
 3. ఫాతిమాజీ ,

  ప్రాజెక్ట్ పనుల వలన బిజీగా వుండటం వలన బ్లాగులేమీ చూడటం లేదు . బ్లాగులో ఏమీ వ్రాయటం లేదు . గమనించి వుంటావనుకుంటున్నాను . ఈ రోజు నా మెయిల్లో నీవిచ్చిన కమెంటుకి బదులివ్వటం నా బాధ్యతగా భావించి బదులిస్తున్నాను .

  ReplyDelete