ఏలికా మేలుకో ?

                                                                                                                                     రచన : శర్మ జీ ఎస్

మాట పెదవి దాటినా , ఆడవాళ్ళు గడప దాటినా పర్యవసానం తీవ్రంగా వుంటుందని మన ముందు యుగాల వారన్ననానుడి మఱచారనుకుంటా

మామూలు వ్యక్తి  , ఒక పబ్లిక్ వ్యక్తిగా  రూపాంతరం చెందినప్పుడు , ఆ వ్యక్తి మాట్లాడే ప్రతి మాటకూ రియాక్షన్స్ వుంటాయని తెలుసుకోవాలి . తెలుసుకోకుండా ఏదైనా మాట్లాడుతాను , ఏమైనా చేస్తాను అంటే సామాన్య ప్రజలు ఊర్కోరని తెలుసుకోవటాం ఎంతైనా అవసరం .

మఱి అటువంటి రాజకీయ నాయకుడు పెదవి విప్పితే ఫృధ్వి దాటినట్లేనని , అది అత్యంత ప్రమాదకరమని తెలుసుకున్నట్లు లేదు కాబోలు ఈ ములాయం సింగ్ యాదవ్ .  

ఒక సీనియర్ నాయకుడు , ముఖ్యమంత్రి పదవినేలిన , ఏలుతున్న వ్యక్తి మహిళలపట్ల యిలా వ్యాఖ్యలు  చేయటం ఖండిచతగినవే . మహిళల సంక్షేమానికి పాటు పడవలసిన ముఖ్యమంత్రే యింతటి నీచభావాలు కలిగి వుంటే సమాజానికి మేలెలా కలుగుతుంది ?  ఇందుకు ములాయం సింగ్ యాదవ్ మఱల పత్రికా ముఖంగా కాని , బుల్లితెర ద్వారా గాని క్షమాపణలు చెప్పి తీరవలసిందే .

" మగాళ్ళు కొన్ని కొన్ని సందర్భాలలో తప్పులు చేస్తారు . అంత మాత్రాన వాళ్ళకు మరణదండన విధించటం తప్పు " అని , ఇంకా " మగాళ్ళు ఎప్పుడూ మగాళ్ళే " అని ఓ ప్రముఖ రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడైన ములాయం సింగ్ యాదవ్ గారు యిలాంటి వ్యాఖ్యలు చేయటం , మహిళల పట్ల ఆయనకున్న చులక భావనని , సద్భావన లేదని , మహిళలెన్నటికీ మగవాళ్ళకు సరి తూగరని  బట్ట బయలు చేస్తున్నాయి . అందులో ఆయన సాదా సీదా రాజకీయ నాయకుడు కానే కాదు . ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా .

ముఖ్యంగా ఈ అత్యాచార  కేసుల్లో యిలాంటి  వ్యాఖ్యలు చేయటం సంచలనాన్ని రేపటం సర్వ సహజం కదా!
ఇలాంటి వ్యాఖ్యలు ఈ అత్యాచార కేసులోనే కాదు , ఏ అత్యాచార కేసులోనూ  చేయనే కూడదు .ఎందుకంటే  అత్యుత్తమమైన సుప్రీం కోర్టు తీర్పు అంటేనే ప్రజాశ్రేయస్సుతో కూడుకున్నదని మఱచినట్ట్లున్నారు .
ములాయం సింగ్ వ్యాఖ్యలని ఖండించి తీరవలసిందే . అవసరమైతే చట్టాల్ని తన వ్యాఖ్యలకు సరి తూగేలా ఇదివరకున్న చట్టాల్ని సవరించేస్తాడట . ఇటువంటి భావాల నాయకులు ప్రధానమంత్రి పదవికి కూడా ఆశపడ్తున్నారంటే , దేశం ఏమైపోతుందో ? ఎటు వైపు నడుపబడ్తుందో ఆయనకు , ఆయన సహచరులకే ఎఱుక .

ఇటువంటి వారిని ఓటర్లు బాగా ఆలోచించి తమ ఓటును సద్వినియోగం చేసుకొనటం ఎంతైనా అవసరం .

ఏలికా మేలుకో , మహిళలను , సమాజాన్ని క్షమాపణలు కోరుకో వెంటనే . ఇంక జాగు చేయకు . నీ ఉనికికే పెను ముప్పు పొంచి వున్నది . 


                                                                                                       ******

2 comments: