ప్రాచీన ప్రదేశాలు - ఆధునిక నామధేయాలు -1

                                                                                                                                  సేకరణ : శర్మ జి ఎస్ 
                                               రామాయణం లోని కొన్నిటికి వివరణలు . 
                                                                       
1. భగీరథుడు గంగను భువికి దింపిన స్థలం - గంగోత్రి, ఉత్తరాఖండ్
2. కపిల మహర్షి ఆశ్రమం,(శ్రీరాముని పూర్వీకులు సగర చక్రవర్తి తనయులు 60,000మంది కాలి బూడిదైన స్థలం.గంగానది వారి భస్మరాసుల మీద ప్రవహించి వారికి పుణ్యలోకాలు ప్రసాదించి బంగాళాఖాతంలో కలుస్తుంది) -
గంగాసాగర్, వెస్ట్ బెంగాల్
3. కాంభోజ రాజ్యం - ఇరాన్ (శ్రీరాముని ముత్తాత రఘు మహారాజు సామ్రాజ్యం ఉజ్బెకిస్తాన్, తజకిస్తాన్, కజఖిస్తాన్, దాటి యింతవరకూ విస్తరించింది)
4. రక్షస్థలం (రావణుడు తన పది తలలు నరికి శివున్నిపూజించి వరాలు పొందిన చోటు)- లాంగకో, టిబెట్, చైనా
5. గోకర్ణ,శివుని ఆత్మలింగాన్ని గణేశుడు నేలవైచిన చొటు - గోకర్ణ, కర్ణాటక
6. సీతాదేవి భూమిలో లభించిన చోటు - సీతామర్హి, బీహార్
7. మిథిల (సీతాదేవి పుట్టినిల్లు) - జనక్ పూర్, నేపాల్
8. కోసలదేశం - రాజధాని అయిన అయోధ్య నుండి నేపాల్ లోని కొన్ని ప్రాంతాల వరకు ఉన్న ప్రదేశం
9. దశరథుడు పుత్రకామేష్ఠి యాగం చేసిన స్థలం - ఫైజాబాద్,ఉత్తర్ ప్రదేశ్
10. సరయూ నది (ఈ నదీ తీరంలోనే అయోధ్య నిర్మితమైనది) - ఘాఘర నది
11. ఆయోధ్య / సాకేతపురం (శ్రీరాముని జన్మస్థలం,బంగారు సీతతో అశ్వమేధ యాగం చేసిన స్థలం,సరయూ నదిలో మునిగి వైకుంఠం చేరిన స్థలం) - అయోధ్య,ఉత్తరప్రదేశ్
12. తాటక వధ జరిగిన ప్రదేశం - బక్సర్, బీహార్
13.అహల్య శాపవిమోచన స్థలం - అహిరౌలి,బీహార్
14. కుశనాథపురం (విశ్వామిత్రుడు యాగం చేసిన స్థలం) - సుల్తాన్ పూర్, ఉత్తర్ ప్రదేశ్
15. గుహుడు సీతారామలక్ష్మణులను కలిసిన చోటు- శృంగబేరిపురం, అలహాబాద్ దగ్గర
16. దండకారణ్యం - చత్తీస్ ఘడ్ లోని బస్తర్ జిల్లా, ఆంధ్ర, ఒరిస్సా, మధ్యప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలు
17. చిత్రకూటం (సీతారామలక్ష్మణులు వనవాసం చెసిన చోటు) - సాత్న జిల్లా, మధ్యప్రదేశ్
18. పంచవటి (శూర్పణఖ ముక్కూచెవులు కోసిన స్థలం) - నాసిక్, మహరాష్ట్ర
19. కబంధాశ్రమం - కర్దిగుడ్, బెల్గావి, కర్ణాటక
20.శబరి ఆశ్రమం - సర్బన్, బెల్గావి, కర్ణాటక
21.హనుమంతుడు రామలక్ష్మణులను మొదటిసారి గా కలసిన ప్రదేశం - హనుమాన్ హళ్ళి,కొప్పాళ,కర్ణాటక
22. ఆంజనేయ పర్వతం (హనుమంతుడి జన్మస్థలం), కిష్కింద (సుగ్రీవుని రాజ్యం), ఋష్యమూక పర్వతం-తుంగభద్ర నదీతీర ప్రాంతం,హంపి దగ్గర,కర్ణాటక
23.విభీషణుడు రాముని శరణు కోరిన స్థలం - ధనుష్కొటి, తమిళనాడు
24.శ్రీరాముడు వానరసైన్యం తో వారధి నిర్మించిన చోటు- రామేశ్వరం,తమిళనాడు
25.రత్నద్వీపం / సింహళం / లంక - శ్రీలంక
26.అశోకవనం (సీతాదేవి బందీగా ఉన్న ప్రదేశం) - కాండీ దారిలోని సీత ఏళియ, శ్రీలంక
27.శ్రీరాముడు రావణుని వధించిన చోటు - దునువిల్ల, శ్రీలంక
28. సీతాదేవి అగ్నిప్రవేశం చేసిన ప్రాంతం - దివిరుంపోల, శ్రీలంక
29.వాల్మీకి ఆశ్రమం / సీతాదేవి కుశలవులకు జన్మనిచ్చిన స్థలం / భూదేవిలోఐక్యమైన స్థలం - ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ నుంచి 30 మైళ్ళ దూరంలోని బితూర్.
30.కుశపురం (సీతారాముల పెద్ద కుమారుడు కుశుడు కట్టించిన నగరం) - కుశార్, పాకిస్తాన్
31.లవపురం (సీతారాముల చిన్న కుమారుడు లవుడు కట్టించిన నగరం) - లాహోర్, పాకిస్తాన్
32.తక్షశిల (శ్రీరాముని తమ్ముడైన భరతుని పెద్దకొడుకు తక్షుడు నిర్మించిన నగరం) - తక్షశిల, పాకిస్తాన్
33.పుష్కలావతి / పురుషపురం (శ్రీరాముని తమ్ముడైన భరతుని రెండవ కొడుకు పుష్కరుడు నిర్మించిన నగరం) -పెషావర్, పాకిస్తాన్ .

గమనిక : ఈ ఎగువ ఉదహరించిన విషయాలు నాకు వాట్సప్ లో ఆదిపూడి వెంకటశివ సాయిరాం నుంచి లభ్యమైనవి .
అందరూ కాకున్నా కొంతమందైనా తెలుసుకుంటారన్న సద్భావనతో ఈ టపాలో పొందుపరచటం జరిగింది . 


ఒప్పు ఒప్పు తప్పు తప్పు

                                                                                                                              వ్యాస రచన : శర్మ జీ ఎస్ 

పాఠకులందరికీ ,
66 వ గణ తంత్ర దినోత్సవ శుభాకాంక్షలు .
శుభోదయం .

పాప పుణ్యాలు . 

ఇది అంతు తెలియని , అంతు చిక్కని అంశంగా అందరి మనసుల్లో ఆస్థానం ఏర్పరచుకొన్నాయి . 

అలాగే దేవుళ్ళు , దేవతలు కూడా  ఈ కోవ లోకే  .

పాపం చేస్తే ఈ మానవులు మరణించిన తర్వాత నరకలోకానికి తోసివేయబడి , తాము చేసిన ఘోర కృత్యాలన్నింటికీ , ఆ  ఘోర శిక్షలు అనుభవించవలసి వస్తుందని మన వేదాల ద్వారా  వారు  తెలుసుకొన్నవి మన ముందు యుగాల వారు తెలియ చేస్తూ వస్తూనే వున్నారు .

అలాగే పుణ్యం చేస్తే ఈ మానవులు మరణించిన తర్వాత  నరకలోకం నుంచి స్వర్గ లోకానికి తీసుకువెళ్ళబడ్తారని , వాళ్ళు మానవ జన్మలో చేసిన తమ సత్ప్రవర్తన తీరుకు , వాళ్ళకు అంతకు ముందెన్నడూ ఊహించని , అనుభవించని సుఖాలని అందిస్తారని చెబుతూ వున్నారు . 

ఇక దేవుళ్ళు , దేవతలు ఈ ప్రాణికోటి జీవన గమనాల్ని ఎప్పుడూ గమనిస్తూనే వుంటారని , మనమేమైనా సత్కార్యాలు చేస్తుంటే , వాళ్ళు చేయూత నిస్తారని ( పరోక్షంగా ) , మానవులు కోరుకున్న సత్కోరికలను తీర్చేటందుకు దోహద పడ్తారని మన ముందు యుగాల వాళ్ళు తెలియజేస్తూ వస్తూనే వున్నారు . ఈ ప్రాణికోటి  ఉనికికి మూలం గతం . ఆ గతాన్ని ఆధారం చేసుకొని ఈ ప్రాణికోటి  జీవన గమనం సాగుతూ వచ్చింది .

విచిత్రమైన విషయం ఏమిటంటే , ఈ పాప పుణ్యాలు గాని , ఈ దేవుళ్ళు దేవతలు గాని ఈ ప్రాణికోటికి  కనపడనివే . 

అలా కనపడని వాటిని ఈ ప్రాణికోటి జీవన గమనానికి ముడి వేయటం జరిగింది . 

ఎవరి చేత ???????????????

ఆ నాటి మానవుని చేతనే .

ఎందుకు ????????????????

ఒకటి నుంచే అనేకం పుట్టుకొస్తున్నాయి . ఇదే కళ్ళ ముందు కనపడ్తున్ననగ్న సత్యం . 

దీనివల్ల ఆరంభంలో వున్న శక్తి లేకుండా పోతున్నది . మంది ఎక్కువైతే మజ్జిగ పల్చబడినట్లు . కనుక క్రమేపీ బలహీనుడైపోతున్నదీ ప్రాణికోటి . . కనుక సమస్యలెన్నో ఎదురౌతాయి సహజీవనంలో . 

మొక్కలోనే వంగనిది , మానైనాక వంగుతుందా ? అన్న సందేహంతో ,కొన్ని సృష్టించబడ్డాయి .

ఆ కోవలోకి చెందినవే ఈ పాప పుణ్యాలు , దేవుళ్ళు , దేవతలు .

ఎందుకంటే ఈ ప్రాణికోటిలోని ఓ కోవకు చెందిన 

మానవులకు భయమైనా వుండాలి , లేకుంటే భక్తి అయినా వుండాలి అన్న ధృఢ నిశ్చయానికి వచ్చిన ఆ నాటి మానవులు ,అప్పుడే ఈ సమాజంలో సహజీవనం సజావుగా సాగుతుందన్న సద్భావనతోనే ఆనాడే వీటిని సృష్టించారు .

పాప పుణ్యాల సంఖ్య వృధ్ధి అయింది రకరకాలుగా . కాని పేర్లు మాత్రం అలానే వుండిపోయాయి .

దేవతలు మాత్రం యుగ యుగాలుగా వృధ్ధి చెందుతూనే వచ్చారు . ఎందువల్లంటే , ఈ మానవులు తాము చేస్తున్న , చేయవలసి వచ్చిన తప్పుడు పనులకు భయపడ్తూ , అలా కొత్త కొత్త దేవుళ్ళని , దేవతల్ని సృష్టిస్తూనే వస్తున్నారు . 

అందుకే రక రకాల దేవుళ్ళు , దేవతలూనూ . ఆ దేవుళ్ళకి , దేవతలకి కొత్త కొత్త పేర్లని ఈ మానవులే నామకరణం చేస్తూ అలా వృధ్ధి చేసుకొంటూ వస్తున్నారు , వాళ్ళ వాళ్ళ అవసరాలకు తగ్గట్ట్లుగా .

వాస్తవానికి ఆనాటి మన ముందు యుగాల వారు ఆరంభదశలో ఈ దేవుళ్ళనీ , దేవతలని , పాప ,పుణ్యాలని సృష్టించినది సమాజం సజావుగా సాగాలన్న సదుద్దేశంతోనే .

ఈ దేవుళ్ళు , దేవతలు బాహాటంగా కనపడనివి . పాప ,పుణ్యాలు మాత్రం బాహాటంగా కనపడేవి . 
ఎలాగంటే వాళ్ళ వాళ్ళ నడవడితో .

కనపడుతున్న ఈ పాప పుణ్యాలని , కనపడని ఆ నరక ,స్వర్గ లోకాలకు ముడిపెట్టారు .

ఐతే ఒక్క విషయం మాత్రం నిజం . ఇన్ని రకాల భయ భక్తులుంటేనే సమాజం సజావుగా సాగటం లేదు . 

ఇవే లేకుంటే .................. అమ్మో ???????????????????????????????????????????????

వీటిని సృష్టించటంలోని ఆనాటి మానవుల అంతరార్ధం మెచ్చుకోదగ్గది . 

ఉన్నాయో , లేవో  అప్రస్తుతమే కదా ! ఉన్నారనుకొంటుంటేనే యిన్ని ఘోర కృత్యాలు నిత్యం జరుగుతూ , పెరుగుతూనే వున్నాయి . 

లేరంటే ? అమ్మో ??????????????????????????????????????????????????????


ఆ ప్రపంచాన్ని ఊహించుకోవటానికి కూడా వీల్లేదు .

కనుక దేవుళ్ళు , దేవతలు ఉన్నారనుకోవటంలో వున్న ఆనందం మరెందులోను లభించదు .

ఆ దేవుళ్ళని , దేవతలని మన మానవాకారంలోనే మనం పూజిస్తున్నాము . 

వాస్తవానికి , మన మానవులకు , ఆ దేవుళ్ళకు , దేవతలకు భేదమేమిటంటే , 
మనలో  వున్నది , వుండేది మితమైన శక్తి మాత్రమే , 
మఱి ఆ దేవుళ్ళకి , ఆ దేవతలకి అనంతమైన శక్తి వున్నది . ఆ శక్తి అనంత కోటి దేవుళ్ళ , దేవతల రూపాలలో వుండి ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నది .

కనుక , దేవుళ్ళు , దేవతలు వున్నారనుకోవటమే ఒప్పు ఒప్పు . పాప , పుణ్యాలు లేవనటం తప్పు తప్పు .


                                                                                                    ************                         

తెలుసుకొని మసులుకోవటమే మంచిదే

                                                                    వ్యాస రచన : శర్మ జి ఎస్

1  . మనం తఱచూ భజనలు చేసేవారిని , చేయించేవారిని చూస్తుంటాము , భజనలు వింటుంటాము .
భజనలు కీర్తనలతో ముడిపడి వుంటాయి . కీర్తనలు ఆధ్యాత్మికతకు అద్దం పడ్తుంటాయి , అందులోని అంతర్భావం తెలుసుకున్నప్పుడు . లేకుంటే ఆర్భాటానికే తావిస్తాయి .
ఉదా : హరే రామ , హరే రామ ,      రామ రామ హరే హరి .
          హరే కృష్ణ హరే కృష్ణ ,           కృష్ణ కృష్ణ హరే హరి .
ఇది నాకు తెలిసిన భజన కీర్తన .
దీని సారాంశమేమిటంటే ,
       హరియే రాముడు , హరియే రాముడు , రాముడే రాముడే హరియే హరి .  
       హరియే కృష్ణుడు , హరియే కృష్ణుడు ,      కృష్ణుడే , కృష్ణుడే , హరియే హరి  
అని నొక్కి నొక్కి చెప్పటం జరిగింది భజన కీర్తన ద్వారా .
కాని భజన చేసేవాళ్ళు , భుక్తి కొఱకు చేస్తున్నట్లు తప్ప అంతర్భావాన్ని వ్యక్తపరచలేక పోతున్నారన్నది కళ్ళకు కట్టినట్లు కనపడ్తున్న , వినపడ్తున్న సత్యం .
అసలు భజన ఎంతసేపు చేశామని గాని , చేయించామనిగాని కాదు ముఖ్యం . అంతర్భావాన్ని ఒక్క మారైనా వ్యక్తీకరించగలిగామా ? లేదా ? అవగాహన చేసుకొన్నామా ? లేదా ? అన్నదే అసలు ముఖ్యం .
పోటీలు పడి అలాంటి భజనలు చేయవలసిన అవసరం లేదు .
రోజుకొక్కమారైనా అంతర్భావాన్ని మది కెక్కించుకొంటే మనసు మఱి హాయిని పొందును కదా !
2  . చాలా మంది " శ్రీ రామకోటి " వ్రాస్తూ వుంటారు .
శ్రీ రామకోటి ఎన్ని పుస్తకాలు వ్రాశామన్నది కాదు  , ఎంతసేపు వ్రాశామన్నది కాదు , ఎలా వ్రాశామన్నదే అసలు విషయం . 
ఎందుకంటే చేసే పనియందు దృష్టి కేంద్రీకరణ కావాలి . అప్పుడే ఆ పనిలోని అంతర్భావం బోధపడ్తుంది . 
అదే కాకుండా   శ్రీ రామకోటి పుస్తకంలో గడులు దీర్ఘ చతురస్రాకారంలో వుండే గదుల రూపంలో వుంటాయి .
ఆ గడుల గదులలో 'శ్రీ రామ ' అని వ్రాయాలిట . ఇక వ్రాయటానికి మొదలు పెట్టిన క్షణం నుంచి మనసు పరి పరి విధాల పరుగులు తీస్తూ మనసుని లగ్నం కానీయక , హడావుడి చేసి , త్వరగా పేజి ముగిస్తే బాగుండు అన్న భావన స్థిరమై , అతి కష్టం మీద , అప్పుడో , లేక అంచెలంచెలుగానో పూర్తి చేసేవాళ్ళు అత్యధికంగా వుంటారు .
వాస్తవానికి వ్రాయకపోయినా శ్రీరాముడు వీళ్ళనేమీ అనడు , ఏమీ హాని కలిగించడు అన్నది వీళ్ళకు  తెలియదు అనుకోకూడదు .
భయంతో చేసే కార్యమైనా ఎన్నాళ్ళో నిలవక పోగా ఆ దురలవాటుని అన్ని పనులలో విస్తరింపజేస్తుంది . అదే భక్తితో చేసే కార్యమైనా క్రమశిక్షణ అలవరచి ,ఆ అలవాటుని అన్ని పనులలో విస్తరింపజేస్తూ కలకాలం నిలిచిపోతుంది
వ్రాయటం ఎందుకు పెట్టారంటే మన పూర్వీకులు , మన మనసు పరి పరి విధాల పరుగులు తీయకుండా , స్థిరంగా ఒక చోట లగ్నమయ్యేటందుకు మాత్రమే .అలా ఒక్కచోట అంటే ప్రశాంత చిత్తానికి మారు రూపాలైన మహాను భావుల మీద లగ్నమైనప్పుడు , మన మనుగడ మంచి రీతిన సాగుతుందని యిలాంటివి , వాళ్ళు అనుభవించి , స్వానుభవం లోకి తీసుకొని , ముందు తరాల వారు కూడా మార్గంలో నడచుకొంటే వాళ్ళ జన్మ సార్ధకత పొందు తుందని ఆశించి , వీటిని మనకు అందించారు .
మరొక ముఖ్య విషయమేమిటంటే శ్రీరామకోటి లో వున్న చిన్న చిన్న గడులు గదులలో మాత్రమే ' శ్రీరామ ' వ్రాయమన్నారు . అంటే మనకు యిచ్చినంత స్థలలోనే మనం వ్రాయాలన్నమాట . అలాగే మన జీవితాన్ని కూడా మనకు ఉన్నంతలో మనం సర్దుకుపోవాలన్నది అందులోని అంతరార్ధం . అలా సర్దుకు పోవటం అలవాటు చేసుకొంటే , రేపు ఎంతటి ఉన్నత స్థానం లభించినా గర్వానికి వశం కాము అని తెలుసుకోవాలి .
వ్రాయగా వ్రాయగా వ్రాత కుదుటపడి అందాన్ని సంతరించుకొంటుంది
నీకందుబాటులో వున్న నీ వ్రాతని , నీ చేత్తో బాగు చేసుకొమ్మన్నారు . పై భగవంతుడే చూస్తాడంటారు .

ఇవన్నీ నా ఆలోచనలు . ఎవరినీ బలవంతం చేయటం లేదు పాటించమని , అలవరచుకోమని . అర్ధమైందనుకుంటాను . వాదనలు నాకిష్టం లేదు .


                                                                                           **********

సత్తాకి సత్కారాలు


             “ సత్తాకి సత్కారాలు “

                                                                                                                                రచన:  శర్మ జి ఎస్  
ఈ కధ " మాలిక వెబ్ మ్యాగజైన్ లో ఈ జనవరి 2015 లో ప్రచురింప బడినది .
నరలోకంలో జీవితం గడపినన నరులు వారి దేహం చాలించిన పిమ్మట , మొదట నరకలోకానికి తరలించబడ్తారు . అచ్చట  వారా నరలోకంలో ఎలా , ఏ రకంగా జీవనం సాగించారో తనిఖీ చేసిన చిత్రగుప్తుడు , వారి ప్రభువులైన యమధర్మరాజుల వారికి విన్నవించి వారి ఆదేశానుసారము , తదనుగుణంగా వారిని ఏ రకంగా గౌరవించాలో ఆ నరకలోకంలో నిర్ణయం చేసేస్తుంటారు .
ఆ యమలోకం నుంచి నరలోకంలో ధర్మబధ్ధతతో గడిపిన వారిని , దేవలోకానికి తరలించి , ఆ జీవులను ఆ దేవ సభలోని ఆనాటి తారల చేత నృత్య ప్రదర్శనలతో రంజింప చేస్తుంటారు .
నరలోకంలో ధర్మబధ్ధత లేకుండా గడిపిన జీవులను , వారి నరకలోకంలోనే వుంచి , వారికి తగిన శిక్షలు వేసి అమలు జరుపుతుంటారు . ఆ జీవులు బుధ్ధి వచ్చినది అని పదే పదే వేడుకొనగా , మఱల  నరలోకానికి కొత్త కొత్త ఆకారాలతో జన్మనిచ్చి అనుభవించుడు అని పంపెదరు , అదీ యమధర్మరాజుల వారి ఆదేశాల మేరకు .
ఈ యమలోకాన్ని సృష్టించినది , ఇటువంటి నరుల కొఱకేనన్నది దీన్ని బట్టి స్పష్టంగా తెలియ వస్తోంది .
ఇదే ఈ యమలోక నియమావళి .
*      *    *
అది దేవలోకం . ఆ దేవలోకాన్ని ఇంద్రుడు పరిపాలించటం చేత ఈయనను దేవేంద్రుడు అని పిలవ బడ్తుంటాడు.
ఈ దేవలోకంలో కూడా మానవలోకంలో లాగే అచటి వాళ్ళెవరూ శాశ్వతం కాదు . ఆ ఆస్థానాలు శాశ్వతం కాదు . ఆ స్థానాలు మాత్రమే శాశ్వతం .
ఇచట నిర్వహించే సభను దేవేంద్ర సభ అని పిలుస్తారు . ఈ సభను దేవ ఋషులు , యింకా మరెందరో మానవలోకంలో ధర్మబద్ధతతో జీవించిన జీవులు అలంకరించి వుంటారు .
ఈ దేవలోకం ఆరంభమైన నాటి నుంచి పేరు పొందిన రంభ , ఊర్వశి , మేనక , తిలోత్తమలు  ఆ ఆస్థానీసుడైన దేవేంద్రుడి ఆదేశాల మేరకు సభలోని అందరినీ తమ తమ నృత్య రీతులతో , ఆట , పాటలతో రంజింప చేస్తున్తుంటారు .
ఆ సమయానికి దేవేంద్రుని ఆసనం అలంకరించినది మరెవ్వరో కాదు . మానవలోకంలో చలనచిత్ర పరిశ్రమను స్థాపించి , ఎందఱో నట , నటీమణులను పరిచయం చేసి కళామతల్లి నీడలో వాళ్ల జీవితాలను సద్వినియోగ పడేలా చేసిన బి . నాగిరెడ్డి గారు .
ఆశ్చర్యపోతున్నారా ? ఆశ్చర్యపడవలసినది ఏమీ లేదు. ఎందుకంటే నరలోకంలో తనువు చాలించిన ప్రతి ప్రాణి ముందుగా నరకలోకానికి యమభటుల చేత కొని రాబడతారు .
తదుపరి వారి వారి నరలోక జీవన శైలిని చిత్రగుప్తుడు పరిశీలించిన పిమ్మట, తదనుగుణముగా (ధర్మ బద్దతతో జీవించిన ) వారికి తగిన మర్యాదలు చేయబడ్తాయి. ఆ మర్యాదలు పలు పలు రకాలు. కొంతమందిని ఆ సభకు సభ్యులుగా ,ఇంకొంత మందిని సలహాదారులుగా , మరికొంత మందిని దిక్పాలకులుగా నియమిస్తుంటారు.
ఇంకా కొంతమందికి ఆ దేవేంద్రుడి స్థానం యివ్వటం కూడా జరుగుతుంటుంది. దానికి కూడా కాలపరిమితి నిర్ణయించబడి వుంటుంది.
ఆ నాటి దేవేంద్రుని సభనలంకరించిన వారికి అలనాటి రంభ, మేనక , ఊర్వశి, తిలోత్తమల నృత్యాభినయం రంజింప చేయలేకపోవటంతో, నాడు ఆ సభలో ఆశీనులైన ఉన్న యమధర్మరాజుకి తెలుగు చలన చిత్ర సీమలోని ప్రముఖ నట నటీ మణులను పంపించ వలసిందిగా ఆదే శాలివ్వటమైనది.
ఆ నటులను యిటకు రప్పించినచో  ఎలా ఉపయోగ పడెదరు అన్న సందేహాన్ని వెలిబుచ్చారు యమపురి యమధర్మరాజు.
అనేక యుగాలుగా ఈ రంభ, మేనక , ఊర్వశి తిలోత్తమల నృత్యం బోరు కొడుతుందట, ఇచ్చటకు వేంచేసిన ఈ సభనలం కరించిన వారికి. వీళ్ళు ఎన్ని మారులు వచ్చినను వీరి నృత్యంలో నూతనత్వం లేకుండెనట . అందులకు తమరు అచ్చటి ప్రముఖులను (నిర్మాతలను, కదా నాయకులను, కదా నాయకిలను, హాస్య నటులను, విలన్ పాత్రధారులను, సంగీత చక్రవర్తులను , దర్శక చంద్రులను , ఇలా ముఖ్యమైన పలువురను ఇచ్చటకు పంపించవలసినదిగా వారి వారి అర్హత (ధర్మ బద్దత జీవన శైలి) కనుగుణముగానని మా మనవి ” అని దేవేంద్రుడైన ఆ నాటి బి నాగిరెడ్డి గారు సెలవిచ్చారు.
లెస్స బలికితిరి దేవేంద్రా. మా అభిప్రాయమును అదియే ” అని అచ్చటనే ఆశీనుడై ఉన్న నందమూరి తారక రామారావు , మిక్కిలినేని, నాగ భూషణం, రావు గోపాల రావు, రాజనాల, రమణారెడ్డి, చలం, పద్మనాభం, గుమ్మడి వెంకటేశ్వర రావు, ముళ్ళపూడి వెంకట రమణ, సూర్యకాంతం, కన్నాంబ సావిత్రి వగైరా సబ్యులందరూ వంత పలికారు.
” ఈ వంత పలికే వారందరూ ఆ కోవలోని వారే కదా ! వీరి చేత చేయించవచ్చు కదా ! ” తన ఆలోచనని వెలిబుచ్చాడు యమధర్మరాజు.
నాకూ ఆ ఆలోచనే వచ్చినది. కాకుంటే వీళ్ళు ఈ దేవసభకేతించిన తరుణంలోని దేవేంద్రులు వారిని అలాగే కొనసాగించటంతో , వాళ్ళు మేం నటించి చాల ఏళ్ళు అయినది. మా సహచరులు మా భూలోకంలో వున్నారు. వారిని పిలవండి ” అని ఓ చిన్న సలహా యిచ్చారు.
“ఇచ్చటకు రావటానికి వారికింకా చాల టైముండి వుంటుంది, అలా వీలుపడదు ” అని చెప్పాడు యమధర్మ రాజు.
ఆ సభలోని పై సభ్యులందరూ మూకుమ్మడిగా లేచి, ” అటులైన అచ్చట ఉన్న వారి జీవన ఆయు: పరిమాణాన్ని యిచ్చట ఉపయోగించండి ” సలహా ఇచ్చారు .
దేవేంద్రుడికి ఆ సలహా నచ్చి ” యమధర్మ రాజా అటులనే కానీయండి ” .
” అటులనే దేవేంద్రా ” .
” ఈ కోవకు చెందిన మానవలోకంలోని వారికి, యింకనూ ఒక సంవత్సర కాలము సమయమున్నది. దేవేంద్రా ఆనతి కాలంలోనే తమరి సభకు పంపెదను. వారితో నాట్యము చేయింతురా ఏమి ? ”
” నాట్య మొక్కటియే కాదు, యిచ్చట మా ఆస్థాన సభ్యులు నూతనత్వమును కోరుచున్నారు , కనుక అచ్చటి ఆ ప్రముఖుల చేత కొన్ని దృశ్య కావ్యములు, క్రొంగొత్త  నృత్యరీతుల భంగిమలు, చలన చిత్రములు నిర్మించి మా ఈ సభికులందరు రంజింప చేదలచితిమి. అప్పుడు కదా మాలాంటి వారి రాకకు యిచ్చట ప్రాధాన్యత కలుగును ” అని తన ఆలోచనను వెల్లడి చేశాడు ఆ దేవేంద్ర పదవిని అలంకరించిన బి నాగిరెడ్డి.
“భళా భళి. లెస్స పలికితిరి. అటులనే పంపించెద . ”

******

చిత్రగుప్తా, ఆ నరలోకవాసుల యమచిట్టా కొని రమ్ము ” ఆదేశించాడు యమధర్మరాజు.
” ఇదిగో ప్రభూ ” అందించాడు చిత్రగుప్తుడు.
” భూలోకవాసుల కాలమానం ప్రకారం ఒక సంవత్సర కాలంలో యిచ్చటకు వచ్చు వారి జాబితా చూపించుము “.
” అటులడిగిన చూపుట కష్టతరమే ఆగును ప్రభూ ! ఏలన మానవలోకము నానాటికి ఉత్పత్తి మీదనే ( అన్ని రకములగా ) వారి దృష్టిని కేంద్రీకరించింది. కనుక ఆ చిట్టాలో తమరు కనుగొనుట కష్టమే. ” సెలవిచ్చాడు.
” ప్రభూ యిటు పరికించుడు. భూలోక వాసులందరూ రాబోయే 2014 సంవత్సరానికి ఆహ్వానం పలుకుచున్నారు అత్యంతోత్సాహలతో.”
” మరుక్షణమా ఆనందం వుంటుందో లేదో తెలియకనే ఈ క్షణానికి అలా చిందులు వేస్తుంటారు ఆ ప్రాణికోటి . ”
” ఆ ఆ పరికించితిని . అటులైన నటులైన , సహాయ నటులైన , సాంకేతిక నిపుణూలైన , తెలుగు చలన చిత్ర సీమలోని ప్రముఖుల జాబితా చూపుము “.
అటులనే ప్రభూ అంటు ,తెలుగు చలన చిత్ర పరిశ్రమ లోని వారి జాబితాని తీసి చూపించుతూ ,” ప్రభూ వీరికింకను ఆయుర్దాయమున్నది. కానీ దేవేంద్రుల వారి ఆదేశాల మేరకు వీరిని రాబోయే సంవత్సరంలో ఈ క్రింద పేర్కొన్న సమయములో రప్పించి, యిచ్చట దేవేంద్రుల వారి కొలువులో పదవులను యిప్పించెదము. ”
” సరే అటులనే వారిని సగౌరవంగా తీసుకొని రండు ” .
” ఉదయ కిరణ్ 05.01.2014 యువ హీరో ”
” అంజలి, బహు భాషా హీరోయిన్, 13.01.2014 ”
అక్కినేని నాగేశ్వరరావు , బహు బిరుదాంకితుడు, హీరో , 22.01.2014″.
” తెలంగాణ శకుంతల 14.06.2014 క్యారెక్టర్ యాక్టర్, లేడీ విలన్ గా పేరు గాంచినది. ”
” బాపు (సత్తిరాజు లక్ష్మి నారాయణ ) చిత్రకారుడు, చరిత్రకారుడు, దర్శకుడు, తెలుగు వ్రాత రాతనే మార్చేసిన వాడు, తెలుగు లోగిళ్ళను సృష్టికర్త కంటే అందంగా చిత్రించి అహ సృష్టించిన వాడు 31.08.2014 ”
” పి జె శర్మ క్యారెక్టర్ యాక్టర్ 14.12.2014 ”
” చక్రి సంగీత దర్శకుడు 15.12.2014 ”
” కైలాసం బాలచందర్ దర్శక చంద్రుడు పలు భాషలలో, ఎందరినో చలన చిత్రసీమకి పరిచయం చేసి ఏలికలుగా మార్చినవాడు 23.12.2014 ”
” వీరందరూ దేవలోకానికి అర్హులే. ఈ నరకలోకంలో ప్రవేశించగనే, దేవలోకానికి పంపుడు. దేవేంద్రుల వారు వారికెలాంటి సత్కార్యాలు చేయాలో చేసి, ఎలా వారిని చూడాలో అలా చూస్తారు”.
” అటులనే ప్రభూ ” .

***** సమాప్తం *****

(పలు లోకాల నుంచి అనుదినం కాదు అనుక్షణం జీవరాసులు పుడుతూ గిడుతూనే వుంటాయి. ఇది ఆ అనంత శక్తి శాసనంగా శాసించబడి అన్ని లోకాలలో నడుస్తూనే వున్నది. దీన్నెవ్వరూ (ఏ జీవరాసి ) తప్పించనూ లేరు, తప్పించుకోనూ లేరు.
అలాంటిటి ఒకటైన ఈ నరలోకంలో ఈ నడుమ తెలుగు చలన చిత్రసీమలో బహు పేరు ప్రఖ్యాతులు గాంచిన పలువురు ప్రముఖులు పరలోకానికి వెళ్లి పోతున్నారు వెంట వెంటనే . ఈ సంఘటనలే ఈ కధకు మూల కారణాలు .)

Print Friendly
    Comments