రాహు - కేతువులు

                                                                                                                                      రచన  : శర్మ జి ఎస్

శ్రీ కాళహస్తీశ్వర దేవస్థానం గురించి నేడు T V 9 వారు చూపించారు . ఈ దుస్థితి ఈ నాటిదే కాదు , కొన్నేళ్ళ నుంచి అలా కొనసాగుతూనే వున్నది .

అందులకే ఈ టపా .

ఏ పాలక వర్గం ఏ దేవస్థానంలో వచ్చినా వాళ్ళ తరఫున ఆదాయం పెంచాలనే తపన తప్పితే , ఆ దేవును ఉనికికి దెబ్బ వస్తుందేమోనన్న ఆలోచనే వుండదు .
                                                                                         ఓ నాడు
                                                 
శ్రీ కాళహస్తి అనగానే కన్నప్ప కధ , ఆ పై సాలె పురుగు , సర్పము , ఏనుగులు ఎలా పూజ చేసి తరించాయో అన్న కధ గుర్తుకు వస్తుంది .
అసలు ఈ శ్రీ కాళహస్తీశ్వర దేవస్థానం నిర్మాణం జరిగే సమయంలో ఆ కూలీలకు ఎంత ముట్టాలో ఆ స్వర్ణముఖి నది తెలియచేసేదట .
సహజంగా నది అంటేనే ప్రవహించేది .  అందునా స్వర్ణముఖి నది అంటే బంగారు ఛాయతో , బంగరు గుణము కలిగి ఉండేది . ఆ ప్రవాహంతో కళకళలాడుతూ , గలగలా శబ్దం చేస్తూ ప్రవహించేది . ఏ దుష్ట శక్తులు ఆవహించాయో యిప్పుడు అహ కాదు ఎప్పుడో ఆ కళకళలు , ఆ గలగలలు లేనే లేవు . 

ఇక్కడ ఆ స్వర్ణముఖి నదికి  2 స్నాన ఘట్టాలు వున్నాయి . ఈ రెండు ఘట్టాలలో స్నానం చేస్తే సర్వ పాపాలు పోతాయని ప్రతీతి . అలా నేటికి ఆ బోర్డులు అపసవ్యంగా , అపహాస్యంగా దర్శనమిస్తూనే వున్నాయి గట్టి తాళాలతో .
అయినా భక్తులు వచ్చి ఈ బోర్డులనే చూసి , తాము స్నానాలు చేసినట్లుగా భావించి తమ పాపాలను పోగొట్టుకొంటు న్నారనుకొంటున్నారో , లేక దర్శనంతో పోతాయిలే అని సర్దుకుపోతున్నారో మఱి . 

దేవస్థానం మాత్రం భక్తులను ఆకర్షించేటందులకు ఆర్భాటాలనే మాత్రం తగ్గించటం లేదు . 

ఆ ఆలయ పరిసరాల్లో ఎక్కడ చూసినా అన్ని రకాల దొంగల బెడద యిబ్బడి ముబ్బడిగ వున్నదని తెలియచేసే బోర్డులు దర్శనమిస్తుంటాయి . 

మరలా వాలంటీర్లు , రక్షక భటులు ఎక్కువగానే వున్నారు .

భక్తులకు మనసు దేవుని మీద లేకుండా వీటి మీదనే వుండిపోతోంది . భక్తులకు రక్షణ కల్పించాలి , అదే సమయం లో ఎంతో దూరాన్నుంచి వచ్చే వారి మనసులు దేవుని మీద లగ్నమయ్యేటందులకు కావలసిన పరిసరాలను తగు రక్షణ భద్రతతో ఏర్పాటు చేస్తే బాగుంటుంది .

                                                                                ఈ నాటి స్థితి దుస్థితే మఱి 

అంతటి ప్రాముఖ్యం గల ఆ స్వర్ణముఖి నది నేడు మురికి కాలువగా మార్చేశారు . మరో వైపు శ్రీ కాళహస్తీశ్వర దేవస్థానం వారు యాత్రికుల వాహనాల సౌకర్యార్ధం ఆ స్వర్ణముఖి నదిని ( దర్జాగా కబ్జా చేసి ) పార్కింగ్ స్థలంగా మార్చేశారు కొంత మేరకు .
వారి సౌకర్యార్ధం ప్రభుత్వం కూడా అందులకు అనుగుణంగా ఓ వంతెన కూడా నిర్మించింది .
ఇంకో వైపు మఱి కొంతమంది పేదలు కూడా ఆ స్వర్ణముఖి నదిని కొంత మేరకు తమ పంట పొలాలుగా మార్చేసు కుంటున్నారు .
ఆ స్వర్ణముఖి నది నలువైపులను బహిర్బూమిగా ఉపయోగిస్తున్నారు . ఆ స్వర్ణముఖి నదిని నేడు ఆ ఊరి మురికికి మూలస్థానంగా చేసేశారు . 


స్వఛ్ఛంగా ఉండే నీటిని , పాచితో పచ్చగా వుండేలా చేస్తున్నారు , చూస్తున్నారు . 

ఎక్కడైనా , ఎప్పుడైనా బడా బాబులుగాని , కబ్జాదారులు గాని కబ్జా చేసే ముందు ఆ నాటి రాష్ట్ర , కేంద్ర ప్రభుత్వ మంత్రుల అనుమతితోనే చేసేవారు . వారి చేతనే ప్రారంభోత్సవాలు చేయించేవారు .

ఆ కోవ లోనే ఆ స్వర్ణముఖి నదిని కబ్జా చేసి కట్టిన కట్టడాలు కూడా  కొన్ని వెలిశాయి .

అంతే కాకుండా యిసుక త్రవ్వకాలు జోరుగా సాగుతున్నాయి పబ్లిగ్గానే . అయినా నీటి ఆనవాళ్ళు కనపడక ఎండిపోతున్నది ఆ స్వర్ణముఖి నది . 

శ్రీ కాళహస్తి అనగానే ఈశ్వరుడు , పాతాళ విఘ్నేశ్వరుడు , జ్ఙ్నాన ప్రసునాంబ అమ్మవారు , కన్నప్ప , స్వర్భముఖి నది .

నేడు ఆ ఈశ్వరుడు , పాతాళ విఘ్నేశ్వరుడు , జ్ఙ్నాన ప్రసునాంబ అమ్మవారు , కన్నప్ప , స్వర్భముఖి నది ఏవీ చాలా వరకు కనుమఱుగవుతున్నాయనే చెప్పు కోవాలి . శ్రీ కాళహస్తీశ్వర దేవస్థానం పాలక వర్గం వారు కూడా ఆ దిశగానే అడుగులు వేస్తున్నట్లు కనపడ్తోంది . వారి దృష్టి అంతా వ్యాపార పరమై పోయింది " రాహు - కేతువుల పూజలతో బిజీ అయిపోయింది .

ఈ రాహు కేతువుల పూజలలో కొన్ని రకాలు .

ఆ పూజకు రుసుములు 300/= , 750/= & 1500/= వసూలు చేస్తున్నారు .

వాస్తవంగా చాలా మంది ఈ రాహు కేతువుల పూజలు చేయించుకొనేది వాళ్ళకున్న అవస్థలు తొలగిపోతాయన్న నమ్మకంతో .

మఱి ఆ పూజలకు వసూలు చేసే రుసుములను పరికిస్తే వాటి నిష్పత్తిలోనే వాళ్ళ అవస్థలు తొలగిపోతాయను కోవలసి వస్తుంది .

పిండి కొద్దీ రొట్టెలా అయింది .
శ్రీ కాళహస్తీశ్వర దేవస్థానం వారు భక్తుల , పేదల బలహీనతలను సొమ్ము చేసుకొంటున్నారనే చెప్పుకోవాలి .

దేవుళ్ళు వున్నారో లేదో మాట అటుంచి , వున్నారనుకొనే వారిని యిలా దోచుకోవటం ఏ మాత్రం బాగా లేదు .

నెలసరి ఆదాయానికేమి తక్కువ లేదు దాదాపుగా కోటి వరకు చేరుతుంటుంది . 


ఆ ఆదాయాన్ని వేరే ఎవరికి వుపయోగించినా , వుపయోగించక పోయినా కనీసం ఆ ఊరిని చక్కగా తీర్చి దిద్దటానికి ఉపయోగించి (యాత్రా ప్రదేశ అభివృధ్ధి చూడ ముచ్చటగా , విశాలమైన రోడ్లతో చక్కని అందమైన అన్ని వసతులు గల దేవస్థాన సత్రాలతో , స్వర్ణముఖీ నదీ ప్రక్షాళన , చక్కటి స్నాన ఘట్టాలను అమర్చి ఆడవాళ్ళకు అనువుగా చేసినట్లై ) తే కొంతవరకు సబబే .

వీటన్నింటికి సంబంధించిన ప్రభుత్వాధికారులందరికీ బాధ్యత వున్నది .

రాహు - కేతువులు జనాలని పట్టుకొన్నారనుకొని పూజలకొస్తుంటారు .

వాస్తవానికి ఆ శ్రీ కాళహస్తీశ్వర దేవస్థానాన్నే ఆ రాహు - కేతువులు దేవస్థానం పాలక వర్గం  , ప్రభుత్వం రూపాల్లో అనిపిస్తోంది ఈ స్థితి చూశాక .

ప్రభుత్వాధికారులు , దేవస్థానం పాలక వర్గం మంచి మనసు చేసుకొని ప్రవర్తిస్తే అక్కడ వుండే ప్రజల్కు , ఎక్కడనుంచో వచ్చే భక్త ప్రజానీకానికి మేలు జరుగుతుంది . 


శ్రీ కాళహస్తీశ్వర దేవస్థానం ప్రపంచంలోనే నంబర్ 1 దేవస్థానాన్ని సంపాదించుకొని , మిగిలిన దేవస్థానాలకు మార్గ దర్శక మవ్వాలని ఆశిస్తున్నా .

గమనిక : ఈ టపా ఉద్దేశం ఎవ్వరి లోపాలు ఎత్తి చూపాలని కాదు , కాకుంటే ఆ దేవుడు అందఱివాడు అన్నప్పుడు , ఆ పరిసరాలను చక్కగా కాపాడుకొనే బాధ్యత అందఱిదీ కదా ! 

అసలు అక్కడ ఆ ఊరు ఏర్పడటానికి కారణమే ఆ శ్రీ కాళహస్తీశ్వర దేవస్థానమే నన్నది ఎవ్వరూ మఱచి పోరాదు .

  
                                                              *                    *                    *

No comments:

Post a Comment