తొలి , తొలి ఎంత మధురమో .....

                                                                                                                                       రచన : శర్మ జీ ఎస్

తొలి కి మన జీవితాలకి చాలా అన్యోన్య సంబంధం వున్నది . పరిశీలిస్తే మనకే బాగా అర్ధమవుతుంది .
మనకు తెలియకుండానే ఎన్నో మారులు ఎంతమందికో అంతులేని ఆనందాన్ని అందించటం , మనం పొందటం కూడా జరుగుతుంటుంది . 

మాతృ గర్భంలోంచి భూమి మీదకి రాగానే తొలి చూపుతో ఎంతమందినో ఆనందంలో ముంచేస్తాము .
తొలి ఏడుపుతో సంబంధితవారినెందరినో ఆనందానుభూతికి లోను చేస్తాము .
తొలి బోసినవ్వుతో మరలా ఎనలేని సంతోషాల్ని కలిగిస్తాము .
తొలిసారి తల్లి పాలు తాగుతుంటే ఆ మాతృమూర్తి పొందే అనుభూతి వర్ణనాతీతం .
తొలిసారి బోర్లా పడటంతో బొబ్బట్లు చేసి సంతోషంతో అందరికీ పంచుతుంటారు .
ఆ తొలిసారిగా పారాడుతున్న ఆ వేళ అమిత ఆనందం చెందేవాళ్ళు .
ఆ పై తల్లిపాలు ( ద్రవ పదార్ధములు ) తగ్గించి ఘన పదార్ధం అలవరుస్తున్న తొలి సారి చప్పరించే ఆ చప్పరింతలకు చప్పట్లు కొడ్తున్నట్లుగా ఆనందించే వాళ్ళు .,
తొలిసారి అలాగే పారాడుతూ గడపలు అతి కష్టంతో దాటుతున్న వేళ గారెలు చేసుకుని ఆరగిస్తూ ఆనందపడిపోయే వాళ్ళు .
తొలి సారిగా చిగురులు గట్టిపడి పళ్ళు వస్తున్న తరుణంలో , విరోచనాలతో బాధపడ్తున్నఆ పసిపిల్లలను చూస్తూ భలే ఆనందం చెందేవాళ్ళు .
తొలి సారిగా తడబడుతూ తప్పుటడుగులు వేస్తున్న సమయాన్ని సంతోషంగా ఇంటిల్లిపాది పంచుకొనేవారు .
తొలి సారిగా  ఏదో చెప్పాలనే తపనతో "  త్త , త్త , త్త "  అంటూ వెంటపడ్తుంటే , దానికి పెద్దవాళ్ళు ' చూశారా బామ్మగారు వీళ్ళు ఇంత చిన్న వయసునుంచే అత్తయ్యను కాకా పడ్తున్నారంటూ వాళ్ళు పొందే ఆనందం అంతా , యింతా కాదు .
తొలి సారిగా అన్నాన్ని అలవాటు చేయాలని వాళ్ళు నోటిలో పెడ్తున్నప్పుడు ఆ పసిపిల్లలు చూపించే ఆ హావ భావాలను చూసి , పదే పదే పెడ్తూ ఆనందపడేవాళ్లు .
తొలిసారిగ పాఠశాలకు పంపుతున్నప్పుడు ఆ ఆనందాన్ని అందరితో పంచుకోవాలని , ఆ పాఠశాలలోని సహ విద్యార్ధులకు తినుబండారాలు , పలకలు , బలపాలు పంచి ఆనందించేవాళ్ళు .
తొలిసారిగా చదువులో అత్యున్నతమైన ప్రధమ స్థానాన్ని సాధించినపుడు ఆనందం అలాగే కొనసాగాలని ఆశీర్వదిస్తూ వాళ్ళు పొందే ఆనందం అనివచనీయమైనది .
తొలిసారిగా ( ఆడపిల్లైతే రజస్వల / మగపిల్లవాడైతే నూనూగు మీసాలు ) వస్తుంటే మా పిల్లలు పెద్దవాళ్ళౌతున్నారు అని అందరితో చెప్పుకుంటూ , ఆ ఆనందాన్ని పంచుకొంటూ ఆనందించేవాళ్ళు .

ఇంతవరకు మన ప్రమేయం లేకుండా మనం ఎంతమందినో ఆనందపరచిన సందర్భాలు .

ఇక ఇప్పటినుంచి ఆ తొలి అనుభూతి ఎలా వుంటుందో ఎవరికి వారికి తెలియటం మొదలవుతుంది .

తొలిసారిగా ప్రేమ తెలియటం ఆరంభమైనప్పుడు .
తొలిచూపులోనే ఎదుటివారి మనసు దోచినప్పుడు .
తొలిసారిగా సంపాదన ఆరంభమైనప్పుడు .
తొలి రాత్రి  తొలి స్పర్శతో జరిగే సంగమమప్పుడు .
తొలిసారిగా మాతా , పితరులౌతున్నప్పుడు .

సో  తొలి , తొలి ఎంత మధురమో ..... .  గో ఎ హెడ్ మలి వరకు , ( అదీ ధర్మబధ్ధంగానే సుమా ! )అవకాశం , ఓపిక వున్నంతవరకు .

                                                                                                ******

బుల్లి తెరల నిత్య భాగోతం

                                                                                                                      రచనా సంకలనం : శర్మ జీ ఎస్

1 )     


' తోమాలసేవ '
' సుప్రభాత సేవ ' లు చేసి ,
' నిత్యపూజలివిగో ' అంటు పూజలు చేసి ,
' భగవత్ దర్శనం ' చేసుకొని ,
' నాదనీరాజనం ' సమర్పించుకొని ,
' శతమానం భవతి ' దీవెనలందుకొని ,
' శ్రీవారి కళ్యాణోత్సవం '
' పద్మావతి అమ్మవారి కళ్యాణం ' లు చూసుకొని ,
' కలియుగ వైకుంఠం ' ఇదే అంటూ చూపిస్తుంది .

  ******

2 )    


' శ్రీ లలితా సహస్రనామం ' పఠించి ,
' హనుమాన్ చాలీసా ' స్మరించి ,
' అర్చన ' జరుపుకొని ,
' గ్రహబలం ' ఎలాగున్నదో తెలుసుకొని ,
' పుణ్యక్షేత్రంలో ' దేవుని ,
'  కృష్ణావతారం ' చూసి ,
'  కృష్ణ తత్వం ' తెలుసుకొని  ,
' ప్రత్యక్ష దర్శనం ' చేసుకొని ,
' శ్రీ లక్ష్మీ స్తోత్రం ' ,
' మహేశ్వర వైభవం ' చూస్తూ ,
' ఓం నమః శివాయ ', ' ఓం నమః శివాయ ' ,
  అని జపించడంతో  ,
  భక్తి విశేషాలు తెలియబడ్తాయంటుంది . 

*****

3 )   


' తమసోమా జ్యోతిర్గమయి ' అంటూ ,
'  ఆరాధన ' తో ఆరంభించి ,
'  ప్రార్ధనా ' సమయాన్ని కేటాయించుకొని ,
'  తీర్ధయాత్రలు ' చేస్తూ ,
'  సరదా సరదాగా ' గడుపుతూ ,
'  సుఖీభవ ' లుగా వుండవచ్చని ,
'  ఆంధ్రావని ' లోని ,
'  అన్నదాత ' సహకారంతో ,
'  జీవనజ్యోతి ' ని వెలిగించుకొమ్మంటుంది .

*******


4 )      

'  వార్తలు ' వినిపించి ,
'  శుభలగ్నం ' చూడమని ,
'  వాణి రాణి ' ల ,
'  మధుబాల ' ల ,
'  స్వయంవరం ' అంటూ ,
'  సంప్రదాయం ' మరువకుండా ,
'  ఆహ్వానం ' పలుకుతూ ,
'  మూడు ముళ్ళ బంధం ' లాంటి ,
'  అనుబంధాలు ' కలసి ,
'  మరో చరిత్ర ' ను సృష్టిస్తాయని ,
'  ఛాంగు ఛాంగురే బంగారు రాణి ' చాటుతోంది .

*****

5 )     

'  గోపురం ' చూపిస్తూ ,
'  శ్రీకరం శుభకరం ' అంటూ ,
'  భక్తి సమాచారం ' తెలియచేస్తూ ,
'  అత్తారింట్లో 5 గురు కోడళ్ళు ' ,
'  కలవారి కోడళ్ళు ' అని చాటుకోకుంటే ,
'  గడసరి అత్త సొగసరి కోడలు '
'  పునర్వివాహం ' యోచనకవకాశం యివ్వద్దని ,
'  పెళ్ళినాటి ప్రమాణాలను ' మరచిపోకుండా ,
'  పసుపు కుంకుమ ' లను మరువకుండా ,
'  గోరంత దీపం ' కొండంత వెలుగు నిస్తుందని ,
'  బృందావనం ' గా చేసుకోవచ్చని ,
'  మమతల కోవెల ' గా మలుచుకొమ్మంటుంది .

*******

6 )      

'  జీవన వేదం ' లో ,
'  హర హర మహదేవా ' ప్రాముఖ్యాన్ని ,
'  సిల్వర్ స్క్రీన్ ' మీద చూపుతూ ,
'  శ్రీ చాగంటి దుర్గా వైభవం '
   కంటికి తెలిసేలా చేస్తూ ,
'  మోడ్రన్ మహలక్ష్మి '
'  మా ఊరి వంట ' రుచి చూడమంటుంది ,
'  పుట్టింటి పట్టుచీరను '
'  పవిత్ర ' చేత పెట్టి ,
'  అభినందన ' స్వీకరించింది ,
'  కోడలా కోడలా కొడుకు పెళ్ళామా '
'  పెళ్ళంటే నూరేళ్ళ పంట ' ,
'  అత్తారిల్లు ' లో ,
'  కాంచన గంగ '
'  చూపులు కలసిన శుభవేళ '
'  చిన్నారి పెళ్ళికూతురు ' గా అయిన సందర్భంలో ,
'  ళుషీ ' గా ,
'  అష్టా చెమ్మా ' ఆడుకుంటూ ,
'  భలే ఛాన్సు లే ' అనుకొంది .

*****

7 )      

'  ప్రభాత తుషారం ' తాకిన ,
'  తెలుగింటి అమ్మాయి '
'  గురుదేవో భవ ' అని కీర్తించి ,
'  అమ్మ మనసు '
'  మందార మకరందాలు ' గా భావించి ,
'  కిసాన్ '
'  రైతు నేస్తాల ' సహకారంతో ,
'  తెలుగుతోట ' లో పండించి ,
'  భారత నిర్మాణంలో '
'  ఆరోగ్యభారతం '
   ప్రధాన పాత్రగా తలవమంటుంది .

*****

ఆలోచించండి


                                                                                                                                      రచన : శర్మ జీ ఎస్



ఇంతటి అంతరార్ధంతో కూడుకున్న ఈ పెళ్ళి , ఆ తర్వాత ఆ భర్త కాలం చేస్తే , ఆ అమ్మాయి మెడలో తాళి , నుదుట కుంకుమ , కాళ్ళకు పసుపు , కళ్ళకు కాటుక , జడలో పూలు , పాదాల వేళ్ళకున్న మెట్టెలు , చేతులకున్న గాజులు తొలగిస్తారు . ఇక ముందు జీవితంలో నీకా అర్హత లేదని . ఆ సుఖాలకు నువ్వు అర్హురాలివి కాదు అని . 

ఆ స్త్రీని ఎవరు చూసినా మోజుపడకుండా వుండేలా , అందవికారంగా ( జుట్టు కూడాతీయించేవారు ) తయారు చేసేవారు . ఈ చర్యలకు వయసు తారతమ్యం లేదు ( భార్య అయిన అర్హత మాత్రం చాలు ) .

ఇది ఎంతవరకు సమంజసం ?

ఆ చేతులకు గాజులు ఆడపిల్లగా పుట్టినప్పటినుంచీ  పెడ్తూ వున్నవే కదా !
ఆ కళ్ళకు కాటుక ఆడపిల్లగా పుట్టినప్పటినుంచీ పెడ్తూ వున్నవే కదా !
ఆ నుదుట కుంకుమ / తిలకం ఆడపిల్లగా పుట్టినప్పటినుంచీ పెడ్తూ వున్నవే కదా !
ఆ కాళ్ళకు పసుపు ఆడపిల్లగా పుట్టినప్పటినుంచీ  పెడ్తూవున్నవే కదా !
ఆ జడలో పూలు ఆడపిల్లగా పుట్టినప్పటినుంచీ  పెడ్తూ వున్నవే కదా !

పుట్టినప్పటి నుంచి వున్న వీటిని కూడా భర్త పోగానే తీసేయటం , మగ మహారాజుల  కర్కశపు కార్యక్రమాన్ని ఆ నాటి ఆడవాళ్ళు వాళ్ళ స్వార్ధపరత్వంతో సహకరించిన దుశ్చర్యగా భావించి తీరవలసిందే . 

ఇవన్నీ కూడా ఆడవాళ్ళు , మగవాళ్ళు కలసి  వారికనుకూలంగా తయారుచేసినవనే నా భావన .

ఇక్కడ రెండు రకాల ఆడ (ఛాందసవాదులు)వాళ్ళు  , మగ (ఛాందసవాదులు)వాళ్ళున్నారు  .

1 . వాళ్ళ పిల్లకు భవిష్యత్తులో మరే మగ పశువుకి బలి కాకుండా చేసినవారు . 
2 . తమ అబ్బాయి పోయినప్పుడు , తను మళ్ళీ పెళ్ళి చేసుకుంటే ( పిల్లలని కని వుంటే ) వాళ్ళనెవరు పెంచుతారు ,
ఓ వేళ తను పెళ్ళి చేసుకోకపోయినా , తనకి ఆ కోర్కెలు కలగకుండా వుండాలన్న సదుద్దేశంతో / దురుద్దేశంతో కొంతమంది ఆడ , మగ  ఛాందసవాదులు  చేసిన స్వార్ధపూరిత చర్యగా భావించి తీరవలసిందే .

ఇలాంటి విధానాలను తమ ఆచారంగా , సంప్రదాయంగా సమాజంలో చెలామణీ చేశారు . దీని వలన చాలామంది మనసులు , అహ మనసులే కాదు ,జీవితాలు కూడా నిస్సత్తువగా మారి , వాళ్ళను నిర్జీవులుగా మిగిల్చేశాయి / మిగిల్చేస్తున్నాయి / మింగేస్తున్నాయి అన్నదానిలో యిసుమంత సందేహపడవలసిన పని లేదు .

ఆ భర్త పోయిన ఆడవాళ్ళను చూడగానే గుర్తొచ్చేలా తెలియాలనే ఇలాంటి చెత్త చేష్టలను ఆచారంగా , దుష్ప్రచారం చేశారు . చూసేవాళ్ళ కొరకు భర్త పోయిన ఆడవాళ్ళను అలా , అందవికారంగా తయారు చెయ్యాలా ? అంటే దీని వెనుక ఓ వింత అంతరార్ధం కాదు అంతా  స్వార్ధమే దాగి వుంది . ఏ మగవాళ్ళకు ఆ స్త్రీని చూడగానే ( ఆనాటి ఆడవాళ్ళు గృహనిర్బంధం లోనే వుండేవారు కదా ! పొరపాటున ఆ ఇంటికి వచ్చిన ఏ మగవాళ్ళు చూడటం జరిగితే  ) అటువంటి దుర్భావన కలగకుండా వుండాలని యిటువంటి దురాచారాలను ప్రోత్సహించారు  . 

వాళ్ళూ మనలాంటి మానవ జీవులే . వారికీ కోరికలుంటాయి . సారీ వారికి కాదు వారి వయసుకీ , మనసుకీ కోరికలుంటాయి . అవి సక్రమంగా తీర్చుకొనే అవకాశం మన సమాజం వాళ్ళకు అందించాలి . అలా అందించిన నాడు చాలా వరకు అక్రమ సంబంధాలకు స్వస్తి పలికిన వాళ్ళమౌతాము . అలాంటి ఆడవాళ్ళను క్రమబధ్ధీకరణ చేయ ప్రయత్నిస్తే అక్రమ మార్గంలో తీర్చుకోవాలనే ఆకాంక్షే వాళ్ళ మనసుల దరిదాపునకు కూడా రాదు  / రాలేదు
పబ్లిక్ గా దొరకే వస్తువుని మన యింటిలో నిల్వ చేయం అన్నది సర్వులకూ విదితమే కదా! ఏ వస్తువుకైతే కంట్రోల్ విధిస్తారో , ఆ వస్తువు మీద మనకు మక్కువ పెరిగి , ఎపుడెపుడు అక్కున ఠక్కున చేర్చుకొందామన్న తపన అధికమౌతుంటుంది . ఆ పై వాళ్ళను వక్ర మార్గంలోకి తీసుకు వెళ్తుంది , దాన్ని ఎలాగైనా దక్కించుకోవాలనో / పొందాలనో  .

ప్రాయంలో , నడివయసులో  భర్తను పోగొట్టుకున్న ఆడవాళ్ళు , మరలా పెళ్ళి చేసుకోకుండా యింత అందవికారంగా వుండాలా ? 

అదే భార్య పోయిన భర్త ( తన మొదటి భార్యకు పుట్టిన పిల్లలున్నా ) సంవత్సరం కూడా తిరగకుండానే పెళ్ళి చేసుకోవచ్చా ? ఇదెక్కడి న్యాయం ? ఇదేనా న్యాయం ? ఇదే నా న్యాయం అంటూ ఆ నాటి వింత పశువులు / ఛాందసవాదులు చేసిన గొప్ప దురాచారం / దుస్సంప్రదాయం .

ఏ వయసులో మగవాళ్ళకే కోరికలుంటాయా  ? అవి వాళ్ళ స్వంతమ ? ఆడవాళ్ళకి అలా వుండవా ? వుండకూడదా ? 

ఏ వయసు మగవాడికైనా కోరిక ఉంటే తీర్చుకోవలసినది మరి ఈ ఆడవాళ్ళే కదా ! అంటే వీళ్ళు అక్రమ పధ్ధతిలో ఈ వింత పశువుల / ఛాందసవాదుల కోరికో లేక కొంచెం దురదో తీరుస్తూ సమాజంలో పతిత అని ముద్ర వేయించుకోవాలా ? 

ఆచారాలకి అర్ధముండాలే గాని , స్వార్ధపరుల చేతిలో సంప్రదాయంగా మారకూడదు .

మీరూ ఆలోచించండి కొంచెం విశాలహృదయంతో . మీకూ యిది తప్పనిపిస్తే ప్రోత్సహించకండి . ఒప్పనిపిస్తే , మళ్ళీ మళ్ళీ ఆలోచించండి తప్పేనని అనిపించేటంతవరకు .

ఈ దురాచారాన్ని సత్వరమే రూపు మాపేటందుకు ఎవరికి వారు సంసిధ్ధులు కండి .

ఈ విషయంలో కొంతమేరకు విజయపధంలో నడిపించిన శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారిని మనం స్ఫూర్తిగా తీసుకొనవలసిందే . ఆయనకు మన నమోవాకములు సమర్పించవలసిందే .

                                                                                                   ******

నా న్యూ నుడులు - 9

                                                                                                                                      రచన : శర్మ జీ ఎస్

1  .  when your body is excess sizes ,
       you need the exercises .

2  . పేగు తెంచుకొని జనిస్తాడు ,
       పేరు కొరకు తపిస్తాడు .        

3 .  ఆనాడు వందేమాతరం అన్నారు ప్రతి ఒక్కరు ,
      ఈనాడు మందే మా తరం అంటున్న  యువత .

4  . నాడు పవిట వేయటం పరదా ,
      నేడు పవిట తీయటం సరదా .

5  . నిప్పు లేనిదే పొగ రాదు ,
     తప్పు చేయనిదే పగ కాడు .

6  . అయినవాళ్ళు ఆవుల్లాంటివారు ,
      కానివాళ్ళు కాకుల్లాంటివారే .

7  . ఆలోచనలకు నిదానమే అమృతం ,
      ఆచరణకు ఆలస్యమే విషం .

8  '  నాడు పని మీదే ధ్యాస
       నేడు మనీ మీదే ఆశ        

9  . చాటుగా చెప్పేది కంప్లెయింట్ ,
     ఎదురుగా యిచ్చేది కాంప్లిమెంట్ .

10 . కనపడేది శాశ్వతం కాదు ఈ దృష్టికి ,
     శాశ్వతమైనది కనపడదు ఈ దృష్టికి .

                                                                                                                                                                                                                                                                                              ( మళ్ళీ కలుసుకొందాం ) 

కట్టు - బొట్టు - కట్టుబాట్లు

                                                                                                                                        రచన : శర్మ జీ ఎస్

ఆడపిల్లలకు చిన్నతనంలో  స్కర్ట్స్ , మిడ్డీస్ , స్లీవ్లెస్స్ గౌన్స్ లాంటివి వేస్తుంటారు .

ఆ తర్వాత కొంచెం 10 , 12 ఏళ్ళ వరకు పరికిణీ , జాకెట్ వేస్తుంటారు .

ఆ తర్వాత ప్రధమ రజస్వల కాగానే , ఓ మూల కూర్చోపెట్టి 4 రోజులపాటు ఎక్కడకి వెళ్ళకుండా చేసి , తెలిసిన వారిని , బంధువులను పిలచి , ఓ వేడుకగా జరుపుతారు .
ఇందులోని అంతర్భావం ఏమిటంటే , మా అమ్మాయి పెద్దమనిషి అయింది , మీకు తెలిసిన యిలాకాలో   ఏవైనా మంచి  పెళ్ళి సంబంధాలుంటే  తెలియచెప్దురు అని .
ఈ తతంగంతో ఆ ఆడపిల్లకు వయసు ప్రభావంతో , అదనపు ఆకర్షణలుగా అగుపించే ఆ అవయవ సంపదను భద్రపరిచే సదుద్దేశంతో వస్త్రవిధానం మారుస్తారు , పరికిణీతో పాటు , జాకెట్ కొంచెం పైకి కట్టిస్తూ , ఓణీ ఒకటి అదనంగా కట్టిస్తారు . 

అలా ఆ అమ్మాయిని ఎవరైనా చూస్తే , ఆ అమ్మాయికి వయసొచ్చిందని , ఆ పిల్లను పెళ్ళి చేసుకొనటానికి ఇంకొంచెం ముందుకొస్తారని అంతర్భావన .

అలా ఆ ఆడపిల్లలకు వివాహం చేసినప్పుడు , ఇంకొన్ని అదనంగా తగిలించి , బాధ్యతలుగా ఆనందిస్తారు   . అవేమిటంటే పెళ్ళి . ముందు జీవితానికి ఇదొక ముఖ్యమైన ఘట్టం . ఈ ఘట్టంలో బంధువులను , పరిచయస్తులను పిలుచుకొని , అలా ఆ అందరి ఎదుట ఈ పెళ్ళి కార్యక్రమం జరిపించి , ఆశీర్వచనాలు కోరటంలో గల విశేషం ఏమిటంటే , ఈ యిరువురు భార్యాభర్తలు . వీళ్ళు దగ్గరయేటందులకు వయసు అవసరాలు తీర్చుకొనేటందులకు ,ఈ పెళ్ళి వారధి కాగలదు , ఈ యిరువురిని ఎవరూ ఎక్కడ , ఎప్పుడూ అభ్యంతర పెట్టకూడదు . ఈ యిరువురు , ఒకరికి తెలియకుండా , ఒకరు వేరొకరితో ఆ వయసు సంబంధాలు పెట్టుకొంటే , అది మనమెవ్వరం ప్రోత్సహించ కూడదు అని , ఇంకా ఈ యిరువురిలో మనస్పర్ధలు తలెత్తితే , మీరందరూ సాక్షిగా నిలచి , తగు న్యాయం చేయాలని . 

ఇక ఈ పెళ్ళి తతంగంలోని అంతరార్ధం ఏమిటంటే ,

వరుడికి అంతకుముందే ఉపనయనం జరిగివుంటే , 3 దారాలు కలిపి ముడివేసిన ఒక యజ్ఞోపవీతం వేసుకొని ఉన్నట్లయితే ,యిపుడు అలాంటివి 3 ( మొత్తం )అతనికి ఎడమ భుజము నుండి కుడి నడుము వరకు వచ్చేలా వేస్తారు . దానితో అతను భవిష్యత్తులో ఏ ఆడపిల్లను చూసి మనసు పడ్డప్పుడు , నీకు పెళ్ళైంది , నువ్వు ఎలాంటి దురాలోచనలు చేయకూడదు , తప్పు అని తెలియచేసేటందులకే ఆ యజ్ఞోపవీతం .అంతేగాని వీపు దురద పెడ్తున్న ప్పుడు ( వీపు గోక్కోవటానికి వీలుపడని ప్రదేశం కనుక ) గోక్కోవటానికి కాదు అని అర్ధం చేసుకోవాలి .

ఇక వధువు విషయానికొస్తే , ఆ పెళ్ళి పేరుతో ఆమె మెడలో తాళి ( మంగళసూత్రం ) కట్టటానికే తలవంచ మన్నట్లుగా తలవంచి కడ్తాడు వరుడు . అంటే నువ్వు అతని వద్ద తలవంచి తీరాల్సిందేనని నోటితో చెప్పకనే చెప్తారు ఇలా క్రియా రూపంలో . ఆ వధువుకి కూడా నీకు పెళ్ళైనది , భర్త వున్నాడు , నీ కోరికలను , కష్టసుఖాలను అతనితోనే జరుపుకోవాలి ,అందుకోవాలి , మరెవ్వరితో పాలు పంచుకోకూడదు అని గుర్తుచేయటానికేఆమె మెడలో ఆ తాళి కట్టబడ్తుంది . కాళ్ళకు మెట్టెలు పెట్టిస్తారు వరుడి చేత . ఇంకా వాళ్ళ వాళ్ళశక్తిని బట్టి ఆభరణాలు కూడా పెడ్తుంటారు .

ఇవన్నీ కూడా ఆడవాళ్ళను ( వంటింటికే పరిమితం చేయటం వలన ) ఆకర్షించటానికి వుపయోగించబడిన అస్త్రాలు .ఐతే ఇలా ఆకర్షించటంలో స్వార్ధ చింతన కూడా యిమిడి ఉంది .

ఆడవాళ్ళ శరీర సౌష్టవం  అందానికి , ఓర్పుకి , నేర్పుకి ప్రతీక

మగవాళ్ళ శరీర సౌష్టవం  మొరటుతనానికి ప్రతీక .

అందువలన సంపాదించే పనులు మగవాళ్ళు తీసుకొని , ఆడవాళ్ళకు అలా సంపాదించి తెచ్చి ఇచ్చే ఆ సంపాదనను , పిల్లలని జాగ్రత్తగా చూసుకోమని అప్పజెప్పారు . అంతే కాకుండా తమ ఆడవాళ్ళ అందాలను ఎవరూ దోచుకో కూడదని వంటింటిలోనే బంధించారు . అలా బంధిస్తూ ఈ ఆభరణాలను ఎఱ చూపారు . సహజంగా స్త్రీ తన అందాన్ని పెంపొందించుకోవాలని తాపత్రయపడ్తుంటుంది ( తను అందంగా లేకపోయినా / ఉన్నా ) . అలా ఆ అందాలతో తన భర్తను ఆకర్షించి , ఆనందాలని అందించాలన్న ఆలోచనలతో ఆ చట్రంలో యిరుక్కుపోయింది .

ఇంకా యిలాంటి కొన్ని చిరు కార్యక్రమాలు , ఆ యిరువురిలో నున్న బెరుకును పోగొట్టి వారిని దగ్గర  అయేలా చేస్తాయి .

రెసెప్షన్ సమయంలో ఒకరి ఎంగిలి ఇంకొకరికి తినిపిస్తారు అందరి ముందు . అంటే అందరిలో ఎంగిళ్ళు మొదలెట్టాం ,అంగిళ్ళు అక్కడ చూసుకోవచ్చు అని తెలియచేస్తుంది ఈ కార్యక్రమం .

పెళ్ళి కాగానే , పెద్దలందరి వద్దకు ఈ యిరువురిని తీసుకువెళ్ళి ఆశీర్వదించమని కోరతారు .

ఆ తర్వాత అత్తవారింటికి పంప బోయే కార్యక్రమమే అప్పగింతలు . అంటే ఇన్నేళ్ళు గారాబంగా మా అందరితో  కలసి పెరిగిన ఈ పిల్లను మీకు అప్పజెప్తున్నాం , జాగ్రత్తగా చూసుకోండి అని అర్ధమన్న మాట . ఇలా చేయించే టప్పుడుఅమ్మాయి నడుముకి ఓ మానెడు ( 2 కిలోలకు పైన కొంచెం )బియ్యం పోసి ఓ తెల్ల తుండుగుడ్డతోకట్టి , ఆ నవ దంపతులను ,అక్కడ వున్న యిరు పెద్దలకు వంగి నమస్కారం చేయిస్తారు . అంటే నువ్వు ముందు ముందు గర్భవతివి అవుతావు , అప్పుడు నీవు కడుపుతో ఉన్నా ఇంటెడు చాకిరీ చేయాలి .అందులో తప్పు లేదు అని తెలియ చెప్పటం .

ఆ పై దంపత్తాంబూలాలంటూ ఆ నవ దంపతుల చేత అక్కడ వున్న దంపతులకు యిప్పిస్తారు . ఆ తర్వాత అక్కడే ఓ చిన్న వుయ్యాల వేసి , ఓ చక్క బొమ్మను పెట్టి , ఆ నవ దంపతులచేత ఉయ్యాలూపిస్తారు . అంటే మీ 
యిరువురకు భవిష్యత్తులో  పిల్లలు పుడ్తారు , ఆ పిల్లల్ని మీరిరువురూ పెంచాలి అని అర్ధం .

ఆ తర్వాత అప్పగింతల కార్యక్రమం , ఓ పళ్ళెంలో నీళ్ళు , పసుపు ,కుంకుమ కలిపి ఎఱ్ఱనీళ్ళుగా చేసి ఆ నీళ్ళలో ఆవధువు చేతులు ముంచి , భర్తకి , అత్త మామలకు , ఆడపడుచులకు , తోడికోడళ్ళకు , బావ మరదులకు అద్దించి అప్పజెప్తారు . అంటే మా అమ్మాయిని మీ అందరి చేతులలో పెడ్తున్నాను , కష్టం రాకుండా చూసుకోండి అని .

అలాగే 16 రోజుల పండగ వరకు తొలి రాత్రి కార్యక్రమాన్ని జరిపించేవారు కాదు . దానికి కారణం ఈ లోపల ఎవరు యిష్టపడకపోయినా , దూరమైపోవచ్చన్న అంతర్భావన ఆ పెద్దల మనసుల్లో వుంచుకొని ఇలా నడచుకొనేవారు .

ఏ పెళ్ళయిన జంటకైనా ఆ మొదటి సంవత్సరంలో ఆషాఢమాసం వస్తుంది . అపుడు కొత్త కోడలు పుట్టింటికి వెళ్ళటం , అక్కడకి అల్లుడు రాకుండా  ఆ గడప దాటకుండా , అత్తా అల్లుడు , ఒక యింటిలో వుండకూడదని ఓ ఆచారాన్నిసృష్టించారు .ఎందుకంటే కొత్తగా పెళ్ళైన ఆ జంట అంతకు మునుపే దాంపత్యం రుచి చూసిన వారవటంతో, ఆ నవ వధువులకు ఒకరి మీద ఇంకొకరికి ప్రేమ పొంగిపొరలాలని .

అయితే యిపుడు ఆ పెద్దలు చేసే పెళ్ళిళ్ళు లేవు  , యిప్పుడు దాటకూడని గడపలు లేవు , అన్నీ లాడ్జింగులే కదా ! కనుక యిపుడా సమస్యలే లేవనుకోండి .

ఇవి అన్నీ సద్భావనలే . తెలిసినవారెందరు ? తెలుసుకొని మసులుకొంటే జీవితమే ఆనందమయమే కదా ! 

                                                                                                        ******

పెళ్ళి అంతరార్ధం

                                                                                                                                     రచన : శర్మ జీ ఎస్

            
పెళ్ళి జరిగే విధానం :

స్నాతకం : స్నాతకం అంటే బ్రహ్మచర్యాన్ని వీడడం అన్నమాట .

మన ఆచారం ప్రకారం మగ పిల్లవాడు కాశీలో చదువు పూర్తయిన తరువాత బ్రహ్మచర్యం తీసుకోవాలనుకుంటే
అక్కడే వుండి పోయి , ఆ గురువర్యులకు సేవ చేస్తూ దేవుళ్ళుగా భావించే ఆ కాశీ అన్నపూర్ణ, విశ్వేశ్వరుల సన్నిధిలో ఉండేవాడు .  ఐహిక విషయాలు అనగా డబ్బు , సంపాదన ,అందం, పిల్లలు, పెళ్లి లాంటివన్నీమర్చిపోవాలి .

 అంతవరకు పెంచిన జుట్టు , గెడ్డం ఈ పెళ్ళి సంధర్బంగా అందంగా చేస్తారు. 

( ఆ నాటి కాలమాన పరిస్థితులను బట్టి ఆ చదువులు చదువుకున్నవాళ్ళు ఆచరించవలసిన విధానమే యిది . ఈ కాలానికిది సరికాదు . )

ఇది పెళ్ళికి మొదటి మెట్టు.

కాశీ యాత్ర :

పెళ్లి కూతురు తండ్రి పెళ్లి కొడుకుని తన కూతుర్ని పెళ్లి చేసుకొని గృహస్తాశ్రమాన్ని తీసుకోవలసినదిగా ఆహ్వానిస్తాడు  . పెళ్ళికూతురు అన్నయ్య(తమ్ముడు) తన చెల్లిని (అక్కను) పెళ్లి చేసుకొని మున్ముందు జీవితాన్ని ఆనందమయం చేసుకోమని కోరతారు . 

( ఆ నాటి కాలమాన పరిస్థితులను బట్టి ఆ చదువులు చదువుకున్నవాళ్ళు ఆచరించవలసిన విధానమే యిది )


సంకల్పం :
మనం దేవుని ఎదుట మనస్పూర్తిగా ప్రార్ధన చేయాలి . 

(  పంచభూతాలు ప్రకృతితో ముడిపడినవి . వీటికి  అతీతమైన శక్తి వున్నది . అందువలననే ఈ ఐదింటిని భూతాలుగా వర్ణించారు  .  ఈ పంచభుతాలను శాసించగల శక్తికి దేవుడు అని పేరు పెట్టి పూజించటం ప్రారంభించారు అనాది నుండి . నిజానికి  సంకల్పం చేయడం అంటే సదాలోచన  చేయడమే . ఆ విషయాన్ని సూటిగా చెప్పకుండా డొంక తిరుగుడుగా చెప్పడమే దేవుని ప్రార్ధించాలని చెప్పడం .

అంకురార్పణం :
పెళ్ళి కూతురు మట్టి కుండలలో కొండల నుండి తెచ్చిన మట్టితో నింపి తొమ్మిది రకాల గింజలు వేస్తారు. అది
మనిషి పుట్టుకకు అనుకరణ .

( దీని అర్ధం , నువ్వు జీవించాలంటే , నికు ధాన్యం అవసరం , కనుక నువ్వు వాటిని పెంచాలి అని అంతరార్ధం )

గౌరి పూజ:
పవిత్రతకు పెళ్లి కూతురు ప్రతీక .  పార్వతీదేవి శివుని అర్ధనారీశ్వరానికి ప్రతీక. పెళ్ళికూతురు  పెళ్లికొడుకుతో సుఖ , సంతోషాలతో ఉండాలని మనసా, వాచా , కర్మణా త్రికరణశుధ్ధిగా కలిసిపోవాలని పెళ్ళి కూతురితో ఈ పూజ చేయిస్తారు .

( ఆ పరమేశ్వరుడు పార్వతీదేవిని ఎలాగైతే తన అర్ధభాగమిచ్చి అనుక్షణం చూసుకొంటున్నాడో , అలాగ నువ్వూ నన్ను చూసుకోవాలన్న అభ్యర్ధనే ఈ గౌరీ పూజకు మూలకారణం )

వర పూజ :


వరుడి చేత చేయించబడేది .ఇది కూడా అలాంటిదే ,

కన్యాదానం : 
పెళ్లి కూతురు తండ్రి పెళ్లి కొడుకుని విష్ణువుతో పోల్చి తన కుమార్తెను ఇచ్చి అతని ముందు ఏడు తరాలుకు బ్రహ్మ
లోకం ప్రాప్తించాలని పూజిస్తారు . ఆమెతో సఖ్యంగా వుంటూ , తరువాత తరం పిల్లలు మంచిగా పుట్టాలని  , మీరిరువురూ సుఖంగా ఉండాలని కోరుకుంటారు.

(ఇక్కడ విష్ణువు అంటే పోషణకారి అని మనం గ్రహించాలి . అంటే అనాదినుండి ఆడవాళ్ళను పోషించాల్సింది మగవాళ్ళేనని శాసించారన్నమాట . వాస్తవానికి ఆడవాళ్ళకున్న నేర్పు, ఓర్పు మగవాళ్ళకు వుండనే వుండదు . ఆ విషయాన్ని బైటాకు చెప్పకుండా యిలాంటి దురాచారా( దురాలోచన , దూరాలోచన )లతో ఇంట్లోనే బందించేశారు ఆ నాటి వారు . అందుకు ఆడ , మగ తలలూపారు . నిజాన్ని కప్పిపుచ్చే ప్రయత్నంలో ఏర్పడిన ఆచారమే యిది )

ఇప్పుడు పెళ్ళికొడుకుకి , పెళ్లి కూతురుకి  మధ్య పరదాగా ఓ తెల్లటి వస్త్రాన్ని ఉంచుతారు. అతనికి తన కుమార్తెను మంచి అణకువ, స్వచ్చమైన,ఆరోగ్యమైన అమ్మాయిని భార్యగా ఇస్తున్నట్టు ఒట్టు వేసి చెప్తారు .

( ఆ నాటి ఆచారం ప్రకారం ఆ యిరువురూ ఒకరినొకరు చూసుకోకపోవటం వలన ఆ పరదా కార్యక్రమం వాళ్ళలో ఒకరినొకరు చూసుకోవాలన్న ఆత్రుతను పెంచటానికి దోహదకారి అవుతుంది . ఈ రోజుల్లో యిలాంటి కార్యక్రమాలు చేయటం ఒకరకంగా మనల్ని మనం మోసం చేసుకోవటం , అందర్నీ మోసం చేయటం , ఇలాంటివాటిని ఆచరించమని చెప్పకనే చర్యల ద్వారా చెప్తూ ప్రోత్సహిస్తున్నట్లు అవుతుంది కదూ )

సుముహర్తం (జీలకర్ర బెల్లం ధారణ):

పరదా తొలగించకుండా , పెళ్లి కొడుకు , పెళ్లి కూతురు ఇద్దరు ఒకరి తల మీద ఒకరు జీలకర్ర బెల్లం  (అంటే కుండలిని శక్తి ప్రదర్శనమయ్యే చోట) పెట్టిస్తారు . 

( అంటే జీలకఱ్ఱ , బెల్లం లా మీరిరువురూ మీ ముందు జీవితంలో కలసిపోవాలన్న సద్భావన దీనికి ప్రధాన కారణం  )
ఆ పిమ్మట ఆ మధ్యలోని పరదా తొలగిస్తారు. అప్పుడే పెళ్ళికొడుకు , పెళ్ళికూతురు ఒకరినొకరు చూసుకొనటం జరుగుతుంది .

( అంటే పెద్దలు చూసినవాళ్ళతోనే అటు ఆడపిల్లలకు గాని , మగపిల్లలకు గాని వివాహాలు జరిగేవని చెప్తున్నారు . వినటానికే వింతగ బహు కొత్తగా వుంది కదూ ) 

జీలకర్ర ఎందుకు ?

జీలకర్ర బెల్లం కలిపి చేసిన ముద్దలో ఒక రకమైన పాజిటివ్ విద్యుత్ తరంగాలు ఉంటాయి. మన తలమీద ఒకానొక
స్థలం మీద ఆ ముద్ద పెడితే నిద్రాణావస్థలో ఉన్న ఆ కేంద్రం విచ్చుకొని సహస్రార చక్ర గుండా అగ్న చక్రగుండా (ఈ
స్థలంలో మన ఆధ్యాత్మికత మేల్కొపే స్థలం) భృకుటి( రెండు కళ్ల మధ్య ఉన్న స్థలం) ద్వారా ఉత్తేజితం అవుతుంది .
ఆ సమయంలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఒకరినొకరు చూసుకున్నప్పుడు ఒకే రకమైన ఆలోచనలు కలిగి సంసార జీవితం మీద మంచి అభిప్రాయంతో ఒకే బాటలో నడుస్తారని .

( భావన మంచిదే , ఆచరణ యోగ్యం కాదు , ఎందుకంటే ఆ యిరువురికి అన్నీ అంతక్రితమే అయిపోతున్న ఈ రోజుల్లో ఈ అవకాశం ఎక్కడుంటుంది ? మరలా మనం మనలని మోసం చేసుకుంటూ , అందరినీ కూడా మోసంచేస్తున్నాము )

యోక్త్రధారణ (ఒక రకమైన గడ్డితో తాడు కట్టడం)

పెళ్లి కొడుకు పెళ్లి కూతురి నడుం చుట్టూ ధర్బ ( ఎండిన గరిక ) తో అగ్ని దేవుణ్ణి స్మరిస్తూ ఒక తాడులా కడతాడు.

దీని అర్ధం : మనం ఒక కష్టమైన పని మొదలుపెట్టినప్పుడు నడుం చుట్టూ గుడ్డ చుట్టుకుంటాం . దాని వల్ల వెన్నుపూసకి అదనపు బలం ఇస్తాం. అదే విధంగా పెళ్లి అయిన తరువాత అదనపు బాధ్యతలు వస్తాయి కనుక పెళ్లి కొడుకు పెళ్లికూతురుకి తోడునీడగా ఉంటానని చెప్పడం .

( ఈ కార్యక్రమాలు చేయటంలో హడావుడి , ఆర్భాటం ముందరకు వస్తున్నాయి . ఆ మంత్రాల అర్ధాలు / భావనలు ఎంతమందికి తెలుసు ? ఆత్మవంచనే మళ్ళీ )

హిందూ వివాహంలో ఇది ప్రధానమైన ఘట్టం . 

మాంగల్యధారణం : (మూడు ముళ్లు వేయడం)

( ఇక్కడ ఓ సందేహం కలగవచ్చు , ఆడవాళ్ళ మెడ వంచి ఆ మాంగల్యధారణ ఎందుకు చేస్తాడు అని ? ఆడవాళ్ళు మగవాళ్ళ మీద ఆధారపడి వుండాలన్నదే ప్రధానమైన వుద్దేశం )

మాంగల్యం అంటే మంచిది అని, ధారణ అనగా ధరించడం అని .

పెళ్లి కూతురి మెడలో రెండు పుస్తెలు పెళ్లి కొడుకు కడతాడు . అందులో ఒకటి పెళ్లి కూతురు తరఫునుండి , మరొకటి పెళ్లికొడుకు తరఫు నుండి. ఈ మాంగల్యం నమ్మకానికి , మనస్సాక్షికి ప్రతిరూపంగా, జీవితాంతం తోడునీడగా ఉంటానని పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి అందరి ముందు ప్రమాణం చేస్తున్నాడనటానికి ప్రతీక . మూడు ముళ్లు వేస్తాడు . అవి స్థూల శరీరానికి ( భౌతిక శరీరం ), సూక్ష్మ శరీరానికి ( పరబ్రహ్మ) , కారణ శరీరానికి ( ఆత్మ) కి ప్రతిరూపాలు . మనసా, వాచా , కర్మణా (నమ్మడం ,చెప్పడం ,చేయడం ) లకు కూడా ప్రత్రిరూపాలుగా మాంగల్యధారణ జరిగేటప్పుడు పంతులుగారు ఈ క్రింది మంత్రాలు చెబుతారు .

"  మాంగల్యం తంతునానేన మమజీవన హేతునా ,
  కంఠే బద్నామి శుభగే త్వం శరదశ్శతం "   

( ఇక్కడ ఒక పుస్తె పెళ్ళి కూతురి తరఫు నుండి , ఇంకొక పుస్తె పెళ్ళి కొడుకు తరఫు నుండి తేవటంలో మున్ముందు జీవితంలో కష్ట , సుఖాలకు , ఎదురయ్యే సమస్యలకు ఆ యిరువురి పెద్దలు బాధ్యులుగా వుంటారని , వుండాలని . )

తలంబ్రాలు :

ఇది సరదా కార్యక్రమం . పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఒకరిపై ఒకరు తలంబ్రాలు (అక్షింతలు - సాఫ్రాన్ - పసుపు - బియ్యంలో కలుపుతారు) వేసుకుంటారు .

( సహజంగా ఎదుటివారి మీద అక్షతలు చల్లటం , హుషారుగానే సాగిపోతుంటుది . అందుకే అతి సరదాగా జరుగుతుంటుంది . ఈ  రూపేణా వాళ్లలో వున్న బెరుకుతనం పోయి , కొంచెం చేరువ అవటానికి కూడా దోహదకారి అవుతుంది . ఆ పై మున్ముందు జీవితంలో ఒకరిపై , ఒకరు అక్షతలు చల్లుకోవటం జరుగుతుంది . దానికి పునాదే యిది అని చెప్పకనే చెప్పే కార్యక్రమం యిది )  

హోమం :

అనగా పవిత్రమైన అగ్ని. హోమం (అగ్ని) మనిషికి దేవునికి వారధిగా ఉంటుంది . హోమం చుట్టూ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మనస్సాక్షిగా ఒకరిని ఒకరు అంగీకరిస్తున్నట్టు అందరి ముందు ఒకరి చేయి ఒకరు పట్టుకొని ఏడు సార్లు తిరుగుతారు . ఈ ఏడు అడుగులు పెళ్లి ప్రమాణాలకి సూచికలు .

౧. ఇద్దరు కలిసి సంసార బాధ్యతలు తీసుకుంటాం
౨. ఇద్దరం ధైర్యంతో , శక్తితో గుండె నింపుకొని అన్ని అవసరాలని తీర్చుకుంటాం
౩. ఇద్దరం కలిసి కుటుంబ సుఖం కోసం , సంఘం వర్ధిల్లడం కోసం పాటుపడతాం
౪. కష్టసుఖాలలో కలిసి ఉంటాం
౫. కలిసి మంచి బుద్ధులు వచ్చేటట్టు పిల్లల్ని పెంచుతాం
౬. ఇద్దరం కలిసి సుఖ,శాంతి కోసం పాటుపడతాం. ఆధ్యాత్మికంగా పురోగతి చెందుతాం.
౭. జీవితాంతం ఆలు మగల పెళ్లి బంధంతో ఉంటాం.

( ఇది ఆ యిరువురి చేత ప్రతిన చేయించటం , వీటికి కట్టుబడి వుంటాం అని . అగ్ని దహిస్తుంది కనుక , మనిషి అగ్నికే భయపడ్తాడు . వేటిల్లో నుంచి అయినా తప్పించుకోగలడు కాని , అగ్ని నుంచి తప్పించుకోలేడని పూర్వీకులు ఈ పధ్ధతిని ఆచరణీయం చేశారు . ఈ అంతర్విషయాలు ఎంతమందికి తెలుసు ? 

నాగవల్లి :

ఒక సిల్క్ ఉయ్యాల తయారు చేసి దానిలో చందనం కర్ర ముక్క, పండిన అరటి పండు(లేక మామిడి పండు) మరియు పసుపు ఒక పళ్లెంలో ఉంచుతారు. పండిన పండు ఆరోగ్యవంతమైన , పసుపు పవిత్రమైనదిగా , చందనం స్వయం సుగంధమైనదిగా , అందరికి భావిస్తారు . మంచిని పంచే మంచి పిల్లలు కలగాలని ఈ కార్యక్రమం చేస్తారు .

( ఈ కార్యక్రమం ద్వారా మీ యిరువురి దాంపత్య జీవితంలో పిల్లలు పుడతారు . ఆ పిల్లల్ని మీ యిరువురూ , ఈ ఉయ్యాలనెలాగైతే ఊపుతున్నారో , అలాగ పంచుకోవాలి వాళ్ళ పెంపకంలో అని అర్ధం .
ఆ తర్వాత వీరిరువురూ చేరువయ్యేటందులకు ఇది కూడా ఓ మార్గమే .

దీని తరువాత ఒక సన్నని (ద్వారం ) బిందెలో ఉంగరం వేసి పెళ్లి కొడుకు , పెళ్లి కూతురుని ఒకే సారి చేయి పెట్టి ఎవరు ఉంగరం ముందు తీస్తారో చిన్న సరదా పోటి కార్యక్రమం పెడతారు .

వీరిరువురూ చేరువయ్యేటందులకు ఇది కూడా ఓ మార్గమే .

సన్నికల్లు:

పెళ్లి కొడుకు పెళ్లి కూతురి ఎడమ బొటను వేలుని పట్టుకొని సన్నికల్లు మీద పెట్టిస్తాడు. పక్కనే అగ్ని జ్వలిస్తూంటుంది . ఆ సమయంలోని మంత్రాలర్ధం "ఈ రాయిని ఎక్కు. మన మెదడుని రాయిలా జీవితంలో వచ్చే కష్ట సుఖాలకి చలించక స్థిరంగా ఉంచుకొందాం" అని ప్రమాణం చేస్తారు . తరువాత పెళ్లి కొడుకు పెళ్లి కూతురుకి మెట్టెలు (సిల్వర్ రింగులు) కాళ్ల వేళ్లకి పెడతాడు.

తరువాత పంతులుగారు అరుంధతి (మహర్షి వశిష్టుని భార్య) నక్షత్రాన్ని చూపిస్తూ అరుంధతి పవిత్రత గురించి చెప్పి అలా ఆదర్శగృహిణిలా ఉండమని అరుంధతి దీవెనలు వధూవరులు తీసుకోమంటారు .

(దీనివెనుక ఒక ప్రధాన కారణమున్నది. వశిష్ట , అరుంధతీ ద్వయం ఆదర్శ దంపతులకు ఒక ప్రతీక . కొత్తగా పెళ్ళైన దంపతులు సైతం వారివలెనే ఉండాలనే ఉద్దేశ్యంతో మనవారు ఆ దంపతులిద్దర్ని తారారూపంలో వీక్షింపచేస్తూ రావడం ఒక సాంప్రదాయమైంది . ఆ నాటి కాలంలో మునులైనా సంసారం లోని సారాన్ని అందుకుంటూ , సత్ప్రవర్తనలో నడవగలిగారని తెలియబడ్తుంది . కనుక మీరూ అలాగ నడుచుకోవలసినది అని తెలియచేయటానికే ఈ అరుంధతీ నక్షత్రాన్ని చూపించటం జరుగుంది . కాని ఏ పంతులుగారు వశిష్టుని చూడమని ఎపుడూ , ఎక్కడా చెప్పిన దాఖలాలు తెలియరాలేదు . అయితే ఈ మానవులకు ఏదైనా ఆశ చూపనిదే ఏదీ చేయరన్న దృఢనమ్మకంతో యిలా వీరిద్దర్ని సందర్శించడం వలన దంపతులకు ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యము, సౌభాగ్యములు కలుగుతాయి అని ఎఱ వేయటంతో అదో ఆచారంగా , సంప్రదాయంగా మారిందే కాని , ఆ అరుంధతిని ఆకాశంలో చూసిన వారెవ్వరూ ఉండి ఉండరు . ఎందుకంటే ప్రక్కన వున్న మంచివాళ్ళనే చూడలేకపోతున్నారు . మనకు తల్లితండ్రుల ద్వారా సంక్రమించిన రెండు కళ్ళు కొంత మేర మాత్రమే స్పష్టంగా చూడగలవు అని మనం ఎన్నటికీ మరచిపోకూడదు . ఆ ఆకాశంలో వున్న వాటిని చూడాలంటే , అందుకు ఆ కనపడని జ్ఞాన నేత్రం ( భృకుటి వద్ద వుంటుందని ) ద్వారా మాత్రమే చూడగలమని , అందుకే లింగ భేదం లేకుండా అందరూ బొట్టు పెట్టుకొనమని చెప్తూ , దాన్ని ఓ ఆచారంగా అలవాటు లోకి తెచ్చారు . ఈ విషయాన్ని కూడా అంతర్భావంగానే వుంచారు . అందరకు తెలిసేలా బయటకు వెల్లడి చేయలేదు . ఇలా చాలా సద్విషయాలను కట్టడి చేయటం జరిగింది . తెలియకుండా అగ్నిని పట్టుకుంటే కాలుతుందన్నది సత్యమే . కాని ఎంతమంది అలా తెలియకుండా పట్టుకొంటారు అని మాత్రం ఆలోచించలేకపోయారు ఆ నాటి మహానుభావులు . ప్రతి ముఖ్య విషయాన్ని వాళ్ళ ( మంత్రాల ) గుప్పెటలో పెట్టుకుని సమాజం మీదకు వదిలారు . అన్నీ అగ్ని లాగే తమ స్వభావాన్ని తెలుపలేవు అన్నది ఒక్కమారు ఆలోచిస్తే మంచిది . ( పంతులుగారు అరుంధతి నక్షత్రాన్ని చూపించాలని ప్రయత్నించినా ( ఆ పంతులుగారికే కనపడదు లెండి ) , చూసినవారెవ్వరు ? చూడలేదంటే మనల్ని అవమానిస్తారని భావించి చూశామని చెప్పేవాళ్ళే అందరూ . 

పాణి గ్రహణం :

దీని అర్థం ఒకరి చేయిని ఒకరు పట్టుకోవడం. ఇది చాలా ముఖ్యమైనది. పురోహితులు ఈ కార్యక్రమాన్ని పుణ్యకాలంలో చేయిస్తారు.
పెళ్లి కూతురు కుడి చేయి వేళ్లని శంఖం ఆకారంలో ముడిచి పెళ్లి కొడుకు అదే విధంగా పెట్టి పెళ్ళి కూతురు వేళ్లని పట్టుకుంటాడు . పెళ్లి కూతురు చేయి పైకి పెళ్లి కొడుకు చేయి కిందకి ఉండేటట్టుగా పట్టుకుంటారు.

పెళ్లి కొడుకు కింది విధంగా ప్రార్ధన చేయాలి:

అర్ధాంగి! ఈ రోజు నీ చేయిని అందరి ముందు పట్టుకున్నాను . నీతో జీవితాంతం సుఖ సంతోషాలతో ఉండాలని మంచి పిల్లలను కని పెంచాలని తోడు నీడగా ఉంటానని వాగ్దానం చేస్తున్నాను. లక్ష్మీ దేవి కటాక్షంతో నిన్ను,మన పిల్లల్ని గుడ్డ,బట్ట,తిండి,చదువు ,ఐశ్వర్యం, సంతోషంతో ఉంచాలని ఆ తల్లిని ప్రార్ధిస్తున్నా. నేను అందరి ముందు నిన్ను నా భార్యగా స్వీకరిస్తున్నా. వాయు దేవుడు అన్ని దిక్కులు వెళ్లి అందరికి బంగారం పంచాలని, అగ్ని దేవుడు అందరికి ఆహారం సమకూర్చాలని , నీవు , నేను సర్వదా సుఖంతో ఉండాలని కోరుకుంటున్నాను.

( నీతులెవరు చెప్పినా చాలా చాలా బాగుంటాయి కదా ! అలాగే ఈ భావనలెపుడూ మంచివే , ఆచరణలే అసాధ్యమైనవి . ఇంత క్రితం చెప్పించినా మరల చెప్పించటంలో మరచిపోరాదు అన్నదే ఇచ్చట అర్ధం )

లజ హోమం :

పురోహితుడు నూతన దంపతులతో హోమం లో ఉబ్బిన బియ్యం వేయిస్తారు . ఇలా చేయడం ద్వారా వధువు వరుడు ఎక్కువ కాలం జీవించాలని , పిల్లపాపలతో సుఖంగా ఉండాలని పుట్టింటి వారు , మెట్టింటి వారు కలిసి ఉండాలని  కోరుకొనటం . ఇలా హొమం చుట్టూ మూడు సార్లు వధూవరులు ఉబ్బిన బియ్యం వేస్తూ ప్రార్ధిస్తారు .

( ఆ యిరువురి ఆలోచనలు ఒకే రకంగా వుండాలన్న భావనే )

పెళ్లి కూతురుకి నడుం చుట్టు కట్టిన దర్భని తొలగించడం :

పెళ్లి కూతురు క్రింది విధంగా ప్రార్ధనలు చేస్తూ  ఆ దర్బని తొలగిస్తుంది.

పరమేశ్వరుడు ఇచ్చిన ఈ వరుడు కట్టిన దర్బని తొలగిస్తూ  , నీవు , నేను  సుఖసంతోషాలను పంచుకుంటూ బ్రహ్మ లోకం చేరుదాం .

( అంటే ప్రతి సృష్టికి కారకులవదామని , ఆనందాలని పంచుకుంటూ )

నేను అనుమతి ఇస్తున్న నీకు ఆ దర్బ లేకుండ నాతో సుఖంగా ఉండవచ్చు అని.

( ఆ వరుడు నేను నీ నడుమును చుట్టేస్తాను . ఇంక ఆ దర్భతో పనిలేదు , ఆ దర్భను తీసివేయి అందుకు నేను అంగీకరిస్తున్నాను , ఈ క్షణం నుంచి నువ్వు నా శ్రీమతివి అంటాడు .) 

                                                                                              ******

( సృష్టి ప్రారంభంలో జనాభా అల్పం . అందువలన ఆనాటి చదువులు అలా సాగాయి . అన్ని భాషలకు మూలం సంస్కృతం కావటం వలన , అన్నింటిని సంస్కృతంలోనే సిధ్ధం చేశారు . అందుకే ఆచారాలు  , మంత్రాలు , సంస్కృత మంత్రాలలోనే యిమిడి వున్నాయి . క్రమేపి జనాభా అధికమైనట్లే , భాషలు అధికమైనాయి . అయినా మూల మంత్రాల్ని సంస్కృతంలోనే వుంచి జీవనం కొనసాగిస్తూ వచ్చారు . వేదాలు , పురాణేతిహాసాలు , రామాయణ మహా భారతాల లాంటి వాటిని మాత్రం వారి వారి ప్రాంతీయ భాషలలోకి మార్చుకున్నారు . అలా మార్చినందువలన అందులోని అంతర్భావమేమీ దెబ్బతినదు కదా ! అవే మంత్రాలైతే అంతర్భావం బయట పడితే సమస్యలు తలెత్తుతాయి . కనుక ఆ సంస్కృత భాషని నేర్చుకున్న వారు మహా పండితులుగా చెలామణీ అయి కాలక్రమంలో  . వారే బ్రాహ్మణులని నిర్ధారణ చేసుకున్నారు . ప్రపంచంలో వారే పూజార్హులు , పురోహితులు . 
పురోహితులు అంటే , పురమునకు హితము చేకూర్చేవాళ్ళు అని అర్ధం కదా ! ఏంతవరకు హితము చేకూర్చారన్నది ఆలోచిస్తే అందరికీ అర్ధమవుతుంది .
మంత్రాలు అంటే మంచి భావనలకు మూలమైనవని అంతరార్ధం . కాని అవి స్వార్ధంతో కూడుకోవటం వలన సంస్కృతం లోనే వుండిపోయాయి ఈ నాటివరకు .

నిత్యం ఎన్నో పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి . ఎంతో మంది దంపతులవుతున్నారు . ఇంతకు ముందు అయ్యారు , ఇప్పుడూ అవుతున్నారు . పెళ్ళి చేయించే పంతులుగార్లకి కూడా ఈ అర్ధాలు బహుశా వాళ్ళకెంతమందికి తెలుసో ఒకమారు ఆలోచించండి . ఎంతమందికి ఈ వేద మంత్రాల భావన తెలుసు ? ఎంతమంది అర్ధం చేసుకొని జీవనం సాగిస్తున్నారు ? అర్ధం తెలియనిదేదైనా వ్యర్ధమేనన్నది అక్షర సత్యమే కదా ! కొంచెం ఆలోచించండి . ఈ పెళ్ళి తతంగం సరదాల దురద తీర్చుకోవటానికి తప్ప చక్కటి జీవనం సాగించటానికి దోహద పడటం లేదని , దోహద పడాలని ఆశిస్తూ ఈ వ్యాసం వ్రాయటం జరిగింది . 

ఏ ఒక్కరినీ దూషించాలని గాని , వేలెత్తి చూపాలని గాని నా ఉద్దేశం కాదని తెలియచేస్తున్నాను .


శ్రధ్ధగా ఆలోచించి ఆచరణయోగ్యం చేయటానికి మీ వంతు మీరు ప్రవర్తిద్దురూ .  

గమనిక : ప్రవరాఖ్యుడు పెళ్ళి గురించి వ్రాసినదానినాధారంగా ఇలా  మరింత విపులంగా విశ్లేషణ చేయటం జరిగింది . 

మరలా మరో మారు కలుసుకుందాం / మరింత తెలుసుకుందాం .



                                                                                            *** ముగిసింది ***

లిబర్టీ స్టాట్యూ

                                                                    
                                                                                                                                        రచన : శర్మ జీ ఎస్


లిబర్టీ స్టాట్యూ 
ఎడిసన్ నుంచి  మాకుటుంబం వరకు లిబర్టీ స్టాట్యూ చూసి వద్దామని ఉదయం10.30 గంటలకు బయలుదేరాము . వర్షసూచన 20 శాతం అని గూగుల్ నెట్ లో చూసి , అందుకు కావలసిన సరంజామా ( స్వెట్టర్లు , మంకీ క్యాప్స్ , యియర్ క్యాప్స్ ) తీసుకొని మా ఇన్నోవాలో బయలుదేరాం . 45 మినిట్స్ లో చేరుకున్నాము . 


 మాన్యుమెంట్
26 సెప్టెంబర్ 2009 లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ల్లో మరణించిన వాళ్ళ జ్ఞాపక  చిహ్నంగా కట్టిన దారి ( మాన్యుమెంట్  ) గుండా ఆ లిబర్టీ పార్క్ దగ్గరికి వెళ్ళాము .

పోర్ట్ ఆఫ్ ఎంట్రీలా పనిచేసిన ఆ నాటి రైల్వే స్టేషన్
గతంలో యిక్కడ విదేశాలనుంచి వచ్చినవాళ్ళను చెక్ చేయటాన్ని పోర్ట్ ఆఫ్ ఎంట్రీ లా ఉపయోగించేవాళ్ళట ఆ రైల్వే స్టేషన్ ని . ఆ విషయం తెలుసుకొని ముందుకు అలా నడచుకుంటూ వెళ్ళాము . ఈ లోగా మా అబ్బాయి వెహికిల్ పార్కింగ్ చేయటానికి వెళ్ళి వచ్చి , యిక్కడ లిబర్టీస్టాట్యూని చూడటనికి అనుమతులు ఆపుచేశారుట జూలై 4 వరకు అని తెలియచేశాడు . దాంతో మొదట కొంచెం నిరుత్సాహపడ్డా , మెల్లగా ఆ చుట్టుపక్కలే చూసుకుంటూ కొన్ని ఫొటో
లు తీసుకొన్నాము  . 







                                                                                     
                                                                     బహుళ అంతస్తుల భవనసముదాయం 

షుమారుగా 1.15 కి అలా ఆవల ( న్యూయార్క్ ) వైపు వున్న బహుళ అంతస్తుల భవన సముదాయం ప్రక్కనే వున్నబ్యాటరీ పార్క్ వద్దకి వెళ్ళి , అలా బోట్  మీదగా వెళ్ళి దగ్గరగా చూడాలనుకొన్నాము . 2.30 కి అక్కడకు చేరుకొని , 3 గంటలకి   బోట్ లో తీసుకువెళ్ళి చూపిస్తారంటే టికెట్లు తీసుకొని , వెళ్ళి లైన్లో నుల్చొన్నాము . ఈ లోపల అక్కడే ఒకళ్ళు మీరెంతమంది అని , అందర్నీ నుల్చోమని ఓ ఫొటో తీశారు . ఫొటోబాగుంటే ,ఇష్టమైతే తీసుకోవచ్చు మనీ పే చేసి . 4 గంటలకు ఆఖరు అన్నారు . 2.30 బోట్ వచ్చింది , వరుసగా అందరం ఎక్కాము . కొంతమంది లోపల , ఇంకొంతమంది పైన ఎక్కారు . అప్పటికి మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరింది . 

అలా ఆ బోటులో వెళ్తుంటే , ఆ ప్రక్కనే హెలికాఫ్టర్ రైడింగ్ ఉన్నది . ఆ హెలికాఫ్టర్స్ పసుపు రంగులో ఉంటాయట . కాని మాకు కనపడిన హెలికాఫ్టర్లు వేరే రంగులో వున్నాయి . అవి భద్రతావిధుల వాళ్ళకు సంబంధించినవట .లోపలనే ఆ చుట్టుప్రక్కల వాటి గురించి వివరంగా వివరించబడ్తాయి స్పీకర్ ద్వారా . అలా అలా చుట్టురా వున్నబహుళ అంతస్తుల భవనాలను చూసుకొంటూ , లిబర్టీ స్టాట్యూ వద్దకు చేరుకొన్నాము . లోపలకు ఇప్పుడు ఎలౌ చేయటం లేదు కొన్ని రిపేర్ల కారణంగా . దూరాన్నుంచే ఆ లిబర్టీ స్టాట్యూ ఫొటోలు తీసుకొని వీడియోలు తీసుకుని నలువైపులా చూస్తూ , 4.15 గంటలకు  మెల్లగా రిటర్న్ అయినాము . 





ఇక్కడ అండర్ గ్రౌండులో     
వ్యాపారదుకాణాల సముదాయం వుంటుంది.వాటికి ఇనప తలుపులు వాడతారు  . 





 
ఫుట్ పాత్ మీద వున్న పాన్ షాప్


అక్కడ ఫుట్ పాత్ మీద వున్న పాన్ షాప్ లను ఫొటో తీసుకుని నడుచుకొంటూ వస్తుంటే వర్షం పడింది . ఆగాము , పది నిముషాలలో పార్కింగ్ కి వెళ్ళి , అక్కడనుంచి అటు , ఇటు తిరిగి ఎడిసన్ కి
6 గంటలకు వెళ్ళాము . 

                                                            


                                                                                                           *********

నా న్యూ నుడులు - 8

                                                                                                                                    రచన : శర్మ జీ ఎస్

1  . కాపురంలో కష్టాలు ,
     వ్యాపారంలో నష్టాలు ,
     అరుదుగ తప్పవు .

2  . పదవి , పెదవి ఈ ఫృధ్విలో ,
     చెలామణీ అవుతున్నాయి  ( అనాది నుండి ) .

3  . ఒకమ్మాయికి కన్ను కొట్టాడంటే
     మనసు పడ్డాడనుకోవచ్చు ,
     కనపడ్డమ్మాయికల్లా కన్ను కొడ్తున్నాడంటే ,
     జబ్బున పడ్డాడనుకోవలసిందే .

4  . ఎంగిలి పడటానికి ఓ సమయం వుంది  కాని ,
      దొంగలు పడటానికి సమయం లేనే లేదు .

5  . ఎదపై చక్కగుంటే అది చున్నీయే ,
      ఎదపై ఎగుడు దిగుడుగా వుంటే ఫన్నీయే .

6  . పేక అంటే ,
      పే దవారిని , లవారిగా ,
      కలవారిని పేదవారిగా మార్చగలిగేదే .

7  . విందులో , మందులో , పొందులో ,
      కులమతాల ప్రసక్తే  వుండదు .
      
8  .  ఓ నాడు యావశ్శక్తి కనుగొనటానికే ధారపోశారు ,
       ఈ నాడు యావశ్శక్తి కొనుక్కొనటానికే ధారపోస్తున్నారు .

9  .  అరుదుగానైనా బోన్ లేని మనుషుల్ని చూడగలం ,
       ఫోన్ లేని మనుషుల్ని మాత్రం చూడలేమేమో .

10 . ఎవరి పాపడి వారికే అందం ,
       ఎవరి పాపం వారికే అంతం .

                                                                                                                     ( మళ్ళీ కలుసుకొందాం )    

ఇదేనా మన స్వాతంత్ర్యం

                                                                
                                                                                                                                   రచన : శర్మ జీ ఎస్

అసలు స్వాతంత్ర్యం అంటే ఏమిటి ? ఎవరిష్టమైనట్లు వారు ఆనందంగా ఉండటం , ఎదుటివారి స్వేఛ్ఛకు యిబ్బంది కలిగించకుండా ఉండటం . ఇది ఆడవారికే కాదు , మగవారికి కూడా అవసరం .

"   ఆడవాళ్ళు అర్ధరాత్రి నడిరోడ్డున నిర్భయంగా నడచి వెళ్ళిన రోజే అసలైన స్వాతంత్ర్యం అన్నారు  "   ఓ మహానుభావుడు  .

ఇలా  అనటంలో , మగవారికి స్వేఛ్ఛ ఇంతకుముందే వుందనా ? లేక ఎలాగైనా ( బలాత్కారంగా నైనా ) తీసుకోగలనా ? అన్న సందేహం మన దేహాలలో వున్న మనసుకు పొడసూపుతుంది .

అంత కాదు గాని , పట్టపగలు , నట్టనడిబజారులో  అత్యాచారానికి గురి కాకుండా వుంటే , స్వాతంత్ర్యం వచ్చిందనుకుందాం , అలా అనుకోవటంలో తప్పు లేదు కూడా . 

ఎవరో తెలియనివారో , తెలిసి చేసేవారో చేస్తున్న అత్యాచారాలకంటే , అనునిత్యం , అనుక్షణం ప్రక్కనే వుంటూ , మానసిక హింసకు గురి చేసే మ(ప )గ భర్తలున్నంతకాలం స్వాతంత్ర్యం వచ్చిందనగలమా ? అనుకోగలమా ?

స్వాతంత్ర్యం కావాలనుకోవటం మంచిదే . ఎలాంటి స్వాతంత్ర్యాన్ని మనం కోరుకోవాలో , అలా కోరుకోవటంలో మన విచక్షణ ఎంతైనా అవసరం అన్నది మనం అనుక్షణం గుర్తుంచుకోవాలి .

స్వాతంత్ర్యాన్ని కోల్పోతే కోల్పోయాం , కనీసం విచక్షణాజ్ఞానాన్నికోల్పోకుండా ప్రయతిద్దాం .

మన అందరిలో ఎన్నో లోపాలున్నా , ఎదుటివారిలోని మంచిని మనం నొచ్చుకోకుండా , మెచ్చుకొనగలగటం అలవాటు చేసుకొంటే , మన దేశాన్ని మనం పొగుడుతున్నవాళ్ళం అవుతాం , గౌరవించిన వాళ్ళమవుతాం .ఇలా మన దేశాన్ని గౌరవిస్తూ మన జీవనం మనం కొనసాగిస్తుంటే , మనమూ , మన దేశమూ , ప్రపంచదేశాలన్నింటిలో అత్యుత్తమమైన దేశంగా భాసించే అవకాశం వస్తుందని భావిద్దాం .

పైన చెప్పిన యిన్ని అవలక్షణాలున్న మనం ఈ దేశంలో వుంటూ మన దేశం బాగా లేదనుకోవటం , ఓ రకంగా మన మనసుని మనం మోసం చేసుకొంటున్నామని , ఆత్మవంచన చేసుకొంటున్నామని గ్రహించటం సబబేమో . కొంచెం ఆలోచించి చూడండి . 

నిజమనిపిస్తే ఆ దిశగా అడుగులు వేయండి . అబద్ధమనిపిస్తే ఆమడ దూరంలో ఉండండి . 

మీకు నచ్చిన విధానానంలోనే మీరు నడవండి . 

ప్రత్యేకంగా ఈ దేశాన్ని ఎవరూ బాగుచేయలేరు . 

కాకుంటే ఎవరికి వారు సన్మార్గంలో నడిస్తే , యాంత్రికంగా దేశం బాగుపడిపోతుంది . ఇంతే మనం చేయాల్సిందల్లా మనము సన్మార్గంలోకి మారితే చాలు ( గతంలో లేకుంటే ) . 


                                                                                                    *******   

ష్రెక్ 4 డి

                                                                               
                                                                                                                             రచన : శర్మ జీ ఎస్

ఒక మారు యూనివర్సల్ స్టూడియో ప్రవేశం టికెట్ కొన్న తర్వాత లోపల ప్రదర్శించే ఏ ప్రదర్శనలైనా ఉచితంగా చూపించేవే . మళ్ళీ మనం టికెట్ కొనవలసిన పనే లేదు .  కాకుంటే పేద్ద పేద్ద క్యూలు బారులు తీరి ఉంటాయి .  చూడాలనుకున్నప్పుడు ఆ క్యూలలో నిరీక్షించి చూసి తీరవలసిందే .



అలా ముందుకు నడిచాము . ఈ లోగా ష్రెక్ , అతని భార్య ఫియోనా నడుచుకొంటూ వెళ్తున్నారు . అతనిని మా కెమేరాలో బంధిచాను అందంగా . 



                                                                                            ష్రెక్ , అతని భార్య ఫియోనా 

ఆ తదుపరి అక్కడ ఒక మంచి సీనరీ ఉన్నది , ఆ రోడ్డు రిపేరులో వున్నట్లుగా బారికేడ్లు అడ్డం పెట్టి వున్నాయి . మేము వాటి ముందు నుల్చొని ఫొటో తీయించుకున్నాము .  



                                                                                   న్యూయార్క్ నగర ప్రధాన వీధి

కొంచెం  ముందుకు వెళ్ళాము  , కుడివైపున ష్రెక్ 4 - డైమెన్షన్ థియెటర్  క్యూ కనపడ్తున్నది . 

అలా  ఆ క్యూలో 20 నిముషాలు నిరీక్షించగా , అంతక్రితం షో అపుడే ముగిసి అటువైపు అందరూ బయటకు వస్తున్నారు . ఒక 10 నిముషాలలో ఆ థియేటర్ రెడీ చేశారు . మేము లోపలకు ప్రవేశిస్తుంటే బాక్సులలో 4 డైమెన్షన్ కి సంబంధించిన కళ్ళజోళ్ళు ఉన్నాయి . అవి ఒక్కొకటి తీసుకొని లోపలకు వెళ్ళాము . ముందు ఉపోద్ఘాతం ఒక 10 నిముషాలు చెప్పి , పక్కనే వున్న ధియెటర్లోకి వెళ్ళటానికి ఆ పక్కనే వున్న ధియేటర్ డోర్స్ తెరుస్తారు . వెళ్ళి సీట్లలో కూర్చొన్నాము . మనం వచ్చేటప్పుడు వెంట తెచ్చుకున్న స్పెషల్ ఎఫెక్ట్స్ కళ్ళజోడుని పెట్టుకొని ఆ మూవీ చూడటం ఆరంభించాలి . మూవీ మువ్ అవుతోంది . 

స్క్రీన్ మీద పాత్రలన్నీ ఒకటొకటిగ పరిచయమవుతున్న తరుణంలో ఆకస్మికంగా వాళ్ళు మన వద్దకు వచ్చి మనల్ని తాకుతున్నారన్నట్లుగా ఫీలవుతాము . ఇది కాకుండా , ఆ స్క్రీన్ మీద ఒక డైనోసారా లాంటిది పైనుంచి నీళ్ళలోకి దూకగానే ఆ నీళ్ళు మనమీద చిందులు పడ్తాయి . ఆ మూవీలో ఒక క్యారెక్టర్ తన ముక్కుని ముందుకు పెడ్తుంటే , ఆ ముక్కు మనలను తాకుతుందన్నట్లుగా అనిపిస్తుంది .ఇంకా ఆ ష్రెక్ రైడ్ చేస్తుంటే మనం కూడా ఆ కుర్చీల్లో ఉండే మనం కూడా రైడ్ చేస్తున్నట్లు ఆ రైడ్లో పాల్గొంటున్నట్లుగా ఊగిపోతుంటాము . ఆ స్క్రీన్ లో పాత్ర నీళ్ళు స్ప్రెడ్ చేస్తే మనమీద పడ్తాయి .అలాగే అక్కడ ఫైర్ అవుతుంటే , ఆ ఫైర్ మన దగ్గఱకు వచ్చినట్లుండి కంగారుకు లోనవతాము . ఈ అనుభం మాకు మొదటిసారి కావటం వలన కాబోలు చాలా చక్కగా ఆనందించాము మేమిరువురం . 20 నిముషాలలో ప్రదర్శన ముగిసింది . బైటకు వచ్చి ఆ 4 డైమెన్షన్ కళ్ళజోడుని వెలుపల వున్న బాక్సులలో డ్రాప్ చేయాలి . ఆ ధియేటర్లో ప్రతి  నిముషాలకొకమారు ష్రెక్ 4 డి మూవీ ప్రదర్శిస్తుంటారు .

మఱల మరుసటి రోజు టైం ఉంటే , మరోమారు ఆ ష్రెక్ 4 డి మూవీకి వెళ్ళాను . మూవీ మొదలైంది . తర్వాత ఏం జరగబోతుందో నాకు తెలిసుండటం వలన , నాకు నిన్నటి ఆ ఆదుర్దా లేదు . ఈ రోజు నేను చూస్తున్న దృక్పధం మారింది . ఎలా ఇలా ఫీలవుతున్నాము ? అని ఆలోచించి ఆ స్పెషల్ కళ్ళ జోడు తీసి చూశా . మామూలు మూవీ చూస్తున్నట్లుంది . మరలా కళ్ళజోడు పెట్టుకొని చూస్తున్నా . ధియేటర్ సీలింగ్ లో అపుడపుడు కొన్ని లైట్లు వెలుగుతూ , కొన్ని కొంచెం ముందుకు వస్తూ వెనక్కి వెళ్ళిపోతున్నాయి . ఎందుకలా వస్తున్నాయని ఆలోచించి అలాగే పైకి చూస్తున్నాను . ఇంతలో కొన్ని లైట్స్ , ఇంకొన్ని పరికరాలు ముందుకు వచ్చి నీళ్ళు మనమీద స్ప్రెడ్ చేసి వెనక్కి వెళ్ళాయి . ఆ సమయంలో మూవీలో ఒక క్యారెక్టర్ మరో క్యారెక్టర్ మీద నీళ్ళు చల్లి వెళ్ళాయి . ఆ తర్వాతకొంచెం  సమయం తర్వాత ష్రెక్ మూవీలో రైడ్ చేస్తుంటే మనం కూర్చున్న కుర్చీలు కూడా ఊగుతున్నాయి . ఈ కుర్చీలకు కూడా టెక్నికల్ కనెక్షన్స్ అరేంజ్ చేయటంతో ఆ రేంజ్ లో దర్శనమిస్తున్నాయి . స్క్రీన్ మీద ఒక క్యారెక్టర్ మొరొక క్యారెక్టర్ మీద నిప్పు మంటలు చెలరేగిస్తుంటే , మన మీదకు ఆ నిప్పు మంటలు వస్తున్నట్లుంటాయి . ఇది కూడా ఆ సాంకేతిక పరిజ్ఞాన ప్రభావమే .ఇలాంటి అరేంజ్మెంట్స్ లేకుంటే అలాంటి అనుభూతులు మనకు అందవు కదా ! .   

అయితే ఒక్కటి ఇక్కడ చెప్పుకొని తీరాలి .

"   మనకు కూర్చొనే వీలు లేనప్పుడు , ఒక తొడ ఆనించే అవకాశం వస్తే బాగుండు అనుకొని , అలా అవతల వాళ్ళని అడుగుతాము ప్రయాణంలో . వాళ్ళు సరేలే అని , ఆ అవకాశం మనకు యిస్తే , మొదట కూర్చొని రిలాక్స్ అయి , ఆ తర్వాత మనం ఫ్రీగా కూర్చొనే ప్రయత్నాలు అతి ముమ్మరంగా చేస్తుంటాము . అంటే సూది మొనంత అవకాశం యిస్తే , దబ్బనం కాదు , గునపం పట్టేటంత వెడల్పు చేయటానికి సర్వ సన్నాహాలు చేస్తాం . ఇది మన మానవ నైజం . "

నేనూ మానవుడినే కనుక , నేనూ ఆ దిశగానే అడుగులు వేసి యిన్ని కొత్త విషయాలు తెలుసుకోగలిగాను . ఇంతకుముందు నాకు తెలియవు కనుక .

మొత్తానికి ఇది ఓ అద్భుతమైన ఆనందానుభూతే . అనుభవించి ఆనందం చెందాల్సిందే . కాకుంటే మనము అనుభవించేవి మనకెలా అందుతున్నాయో , అందిస్తున్నారో తెలుసుకొనటం మన కనీస ధర్మం .


  
                                                                                              *********