అటు ఏడు ఇటు ఏడు

                                                                                                                                 రచన : శర్మ జీ ఎస్ 

పెళ్ళిళ్ళు చేయటానికి అటు ఏడు తరాలు , ఇటు ఏడు తరాలు చూసేవాళ్ళు మా పెద్దవాళ్ళు . ఇపుడేమిటి , ఇలా చూస్తున్నారు , అలా  చేసేసుకుంటున్నారు అని మా బామ్మ అంటుండేది . ఆ మాట వినగానే నాకు ఆశ్ఛర్యం అనిపించింది .

"   అదేమిటి బామ్మా ? అలా అంటావేమిటి ? ఏం చూసేవాళ్ళేంటి ? "   అడిగాను .

"   ఔనురా  "   పెళ్ళి అంటే నూరేళ్ళ పంట "   అని ఓ మహా కవి అని ఎలుగెత్తి పాడించాడు . వినలేదా ? "

"  విన్నాను బామ్మా ? చాలా విన సొంపుగా వుంది . పెళ్ళి జరిగే విధానాన్ని చక్కగా తెలియజేశారు .వినసొంపుగా వుండాలంటే ఏ మాటైనా సంగీతపరంగా రాగయుక్తంగా ఆలాపిస్తే బాగానే వుంటుంది . "

"   ఇప్పుడు మనకు కావలసింది అది కాదు . పెళ్ళి అంటే నూరేళ్ళ పంట అంటే ఏమిటి ? అని . "

"   నువ్వు చెప్పు బామ్మా , నేను వింటాను . తెలుసుకోవాలనిచాలా కుతూహలంగా వున్నది . "

"   పెళ్ళి చేసేటప్పుడు గాని / చేసుకొనేటప్పుడు గాని / చేయవలసివచ్చినప్పుడు గాని చాలా చాలా ముఖ్యమైన విషయాలు చూడవలసి వున్నది . దాని మీదే భవిష్యత్తు బంగారుబాట అయ్యే అవకాశం వుంటుందిరా . 

పెళ్ళికూతురి వైపు వాళ్ళు పరిశీలించాల్సినవి .
1 . వాళ్ళ వంశం వాళ్ళకు ఆడవాళ్ళను గౌరవించే అలవాటు వున్నదా ?
2 . వాళ్ళ వంశంలోని మగవాళ్ళు ఆడవాళ్ళకంటే ముందే టపా కట్టేస్తారా ? అప్పుడు ఆ యింటి భారం ఈ అమ్మాయిమీద పడ్తుంది కనుక .
3 . వాళ్ళకు వంశాభివృధ్ధి తప్ప ఆరోగ్యవృధ్ధి చూసుకొనే అలవాట్లు ఉన్నాయా ? లేదా ?
4 . వాళ్ళు వాళ్ళ యింటికి సంబంధం కలుపుకొని తెచ్చుకుంటున్న అమ్మాయిని చాకిరీ తగ్గించి సుఖపెడ్తారా ? లేదా ?
5 . వాళ్ళు మనమ్మాయి చేత ఉద్యోగం చేయించి డబ్బులు కూడబెట్టుకోవాలనుకుంటున్నారా ?
6 . వాళ్ళు అవసరాలకు ఖర్చు పెడ్తారా , లేక ఎందుకులే అని వదిలేస్తారా ?

పెళ్ళికొడుకు వైపు వాళ్ళు పరిశీలించాల్సినవి .
1 . ఆ కోడలుగా అడుగిడబోయే అమ్మాయి గుణ గణాలే వాళ్ళ వంశ వారసులకు ప్రధానమైన విషయం గనుక              పరిశిలించాల్సిందే .అవే ముందు తరాల వారసులకు వారసత్వమౌతూ కొనసాగుతాయి .
2 . ఆ అమ్మాయి పెద్దలను గౌరవిస్తుందా ? లేక మొగుడిని మాత్రమే గౌరవిస్తుందా ?
3 . ఆ అమ్మాయి చదివిన చదువు తన సంసారాన్ని ( అవసరమైతే ) సరిదిద్దుకోగలదా ?
4 . ఆ అమ్మాయికి తన స్వేఛ్ఛ ముఖ్యమా ? లేక ఆ ఇంటిలోని నలుగురి శ్రేయస్సు ముఖ్యమా ?
5 . ఆ అమ్మాయి మన వంశప్రతిష్టలకు భంగం కలగకుండా నడుచుకోగల నడవడిక గలదేనా ?
6 . ఆ అమ్మాయి తన పిల్లలని ( వంశ వారసులను ) చక్కగా పెంచగలదా ? ( కొంతమందికి పిల్లను కనటం యిష్టం   లేదనుకునే వాళ్ళను దృష్టిలో పెట్టుకొనవలసి వస్తోంది ) .నక్షత్రాలను , రాశులను , లగ్నములను  చూసి పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు . "

"   ఇవేంటి బామ్మా . నక్షత్రాలేమో ఆకాశంలో వుంటాయి . మనమేమో భూమ్మీద వుంటాము . వాటిని మనం చూడటమేమిటి ? అవి మనల్ని కాపాడటమేమిటి ? అంతా అయోమయంగా వుంది బామ్మా . "

"   ఈ ప్రపంచంలో ఏదైనా తెలియకముందు , అంతా అయోమయంగానే వుంటుంది . తెలుసుకున్న తర్వాత  , యింతేనా ? అని మన మనసు తేలిక పడ్తుంది . ఇక ఆపై  దాన్ని వుపయోగించాలనే తహ తహ అధికమౌతుంటుంది . "

"   అదేమిటో వివరంగా చెప్పు బామ్మా . "

"   చెప్తా శ్రధ్ధగా విను . వినటమే కాదు ,ఆలోచించి ఆచరణలో పెట్టాలి మంచిది అనిపిస్తే , అర్ధమైందా ? "

"   అలాగే బామ్మా , మా మంచి కోరి చెప్తున్నప్పుడుమీ పెద్దల మాట తప్పకుండా వింటాము . "

"    ఈ భూమండలం , నక్షత్ర మండలాల  చుట్టూరా  చుట్టి వస్తుంటుంది . ఆ నక్షత్ర మండలాల ప్రభావం ఈ భూమండలం మీద పడ్తూనే వుంటుంది . ఈ విషయాన్ని మన పూర్వీకులు ( ముందు తరాల వారు ) ఎన్నో పరిశోధనలు చేసి , ఎంతో మంది జీవితాలను కూడా పరిశీలించి ఇటువంటి మంచి విషయాలను ఎన్నిటినో కనుక్కొని , రాబోయే తరాల వాళ్ళకు కానుకగా యిచ్చి , మార్గదర్శకులయ్యారు .
నిజానికి ఈ నాడు మనం చేస్తున్నవన్నీ , మనమేమీ కొత్తగా ఏమీ చేయటం లేదు . మనం చేస్తున్నవన్నీ మన పూర్వీకులు చేసినవే . కాకుంటే విషయం అదే గాని , విధానమే మారుతుంది . కనుక మనవి ఎంగిలి బతుకులే . దీనికే  మనం ఏదో కొత్తగా , కనుక్కున్నామని , చేస్తున్నామని , మనం లేకపోతే ఈ ప్రపంచానికి ఎంతో నష్టం వాటిల్లుతుందని విఱ్ఱవీగుతుంటాము . ఇది చాలా పెద్ద పొఱపాటు .

ఇక అసలు విషయానికి వస్తున్నా ( నక్షత్రాలు , రాశులు , లగ్నములు  ) . 
నక్షత్రాలు 27 , ఒక్కొక్క నక్షత్రానికి  పాదాలు 4 , 27 x 4  = 108 పాదాలు . వాటిని చూసే ఈ రాశులు 12 , ఈ నక్షత్రాలకు అధిపతులుగా  , అంటే ఈ 108 పాదాలుగల నక్షత్రాలను పరిపాలిస్తుంటాయి .
అంటే ఒక్కొక్క రాశిలో 9 పాదాలు ఉంటాయి . ఆ 27 నక్షత్రాలు 12 రాశుల అధీనంలో ఉంటాయి . ఈ రాశుల గుణ గణాలను కూలంకషంగా పరిశీలించిన మీదట అవి ఏ గుణం కలవో , ఏ గణం కోవకు చెందినదో నిర్ణయిస్తారు .
ఇక్కడ ఇంకొకటి చెప్పుకోవాలి , గుణం అంటే బుధ్ధికి సంబంధించినది . గణం అంటే అంశకు సంబంధించినది .

1 . మేషం  ( అశ్వని 4 పాదాలు  దేవగణం  , భరణి 4 పాదాలు మనుష్యగణం . & కృతిత్తిక 1 వ పాదం రాక్షసగణం . ) = మేక అంటే ఈ రాశికి సంబంధించిన నక్షత్రాల పాదాలలో సాధుగుణం గలిగి , మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు .

2 . వృషభం ( కృత్తిక 2,3,4 పాదములు రాక్షసగణం  , రోహిణి 4 పాదములు మనుష్యగణం & మృగశిర 1 , 2  పాదములు దేవగణం   = ఎద్దు , మొరటుగ వుండి బండ చాకిరీ చేయటానికి ఏ మాత్రం వెనుకాడరన్నది తెలుస్తోంది .

3 . మిధునం ( మృగశిర 3,4 పాదములు దేవగణం  , ఆరుద్ర 4 పాదములు మనుష్యగణం , పునర్వసు 1,2,3 పాదములు దేవగణం  ) = అంటే దాంపత్య కలయిక . కామ గుణాన్ని చక్కగా ఆనందించాలనుకునే మనస్తత్వం కలవారు .

4 . కర్కాటకం ( పునర్వసు 4 వ పాదము దేవగణం  , పుష్యమి 4 పాదములు దేవగణం , ఆశ్లేష 4 పాదములు రాక్షసగణం ) = ( ఎండ్రకాయ ) అవకాశం కొరకు ఎదురుచూస్తూ , వచ్చినప్పుడు వదులుకోకుండా గట్టి పట్టు పట్టే స్వభావం గలవారు .

5 . సింహం ( మఖ 4 పాదములు రాక్షసగణం , పుబ్బ 4 పాదములు మనుష్యగణం , ఉత్తర 1 వ పాదం మనుష్యగణం ) =  సింహంలా కనపడ్తూ , అధికారాన్ని వినియోగించుకుంటుంటారు .

6 . కన్య ( ఉత్తర 2,3,4 పాదములు , హస్త 4 పాదములు  దేవగణం  & చిత్త 1, 2 పాదములు రాక్షసగణం ) = కన్యలా సంతోషంగా జీవిస్తారు ఎవరికీ తలవంచకుండా ) .

7 . తుల ( చిత్త 3,4 పాదములు రాక్షసగణం , స్వాతి 4 పాదములు  దేవగణం & విశాఖ 1,2,3 పాదములు రాక్షసగణం ) = వస్తువులను తూనిక వేయాల్సి వచ్చినప్పుడు త్రాసు ( కాటా ) ని తీసుకొని తూస్తాము ఎటూ మొగ్గు చూపకుండా . అలాగే వీళ్ళు బ్యాలెన్స్ డ్ గా వుంటారు .

8 . వృశ్చికం ( విశాఖ 4 వ పాదము రాక్షసగణం , అనూరాధ 4 పాదములు  దేవగణం & జ్యేష్ట 4 పాదములు రాక్షసగణం ) = తేలు , ఇది తనని ఎవరూ ఏమీ చేయకుండా ఎదుటివారిని కుట్టటంలో అత్యంత ప్రావీణ్యత గలిగిన ఓ కీటకం . అవకాశం వదులుకోరు ఈ రాశి స్వభావులు .

9 . ధనుస్సు ( మూల 4 పాదములు రాక్షసగణం , పూర్వాషాఢ 4 పాదములు మనుష్యగణం & ఉత్తరాషాఢ 1 వ పాదం మనుష్యగణం  ) = విల్లు . అవసరం వచ్చినప్పుడు విల్లు వాడటం చాలా చాలా సద్గుణం . ఈ రాశివారు ఈ స్వభావం కలిగి వుంటారు .

10. మకరం ( ఉత్తరాషాఢ 2,3,4 పాదములు మనుష్యగణం  , శ్రవణం 4 పాదములు  దేవగణం  & ధనిష్ట 1 , 2 పాదములు రాక్షసగణం ) = మొసలి . నిద్రపోతున్నట్లే వుంటుంది , కాని అవకాశం కొరకు ఎదురుచూస్తూ వదలిపెట్టనే పెట్టదు .

11. కుంభం ( ధనిష్ట 3 , 4 పాదములు రాక్షసగణం , శతభిషం 4 పాదములు రాక్షసగణం & పూర్వాభాద్ర 1,2,3 పాదములు మనుష్యగణం ) = కలశం లాంటి నిండు కుండ . సద్గుణాల రాశులు .

12. మీనం ( పూర్వాభాద్ర 4 వ పాదం మనుష్యగణం  , ఉత్తరాభాద్ర 4 పాదములు మనుష్యగణం  & రేవతి 4 పాదములు  దేవగణం  ) = అంటే చేప . ఇది నీటిలోనే వుంటూ ఆంతులేని ఆనందాలను అనుభవిస్తున్నట్లు హడవుడిగా గెంతుతూ పైకి కనపడ్తుంది . తన స్థావరాన్ని దాటి బయటకు రావటానికి యిష్టపడనే పడదు .  గీసిన గిరి లోనే జీవించటంలో ఆనందాల్ని అనుభవిస్తుంటుంది .

సహజంగానే కొన్ని జంతువులకు వైరం వుండనే వున్నది . అందులో వివాహ విషయంలో తప్పక ఆ జంతు వైరం గల నక్షత్రాలు గల ఆడ మగ వాళ్ళకు వివాహం చేస్తే ఆ యిరువురి నడుమ అడుగడుగునా , భేదాభిప్రాయాలు , తఱచుగా కొట్లాటలు , యిరువురి నడుమ ప్రేమ భావం చాలా తక్కువగా వుంటుంది .
అంతే కాకుండా గణ పొంతన కూడా చాలా అవసరమైనదిగా భావించాలి . దేవగణం , మనుష్యగణములైతే ఎంతో మంచిది . దేవ , మనుష్యగణములు గాని ,రాక్షస మనుష్యగణములు గాని పనికి రావు . రెండు ఒకే గణములైన యిబ్బందులుండబొవు .
అయితే శాస్త్ర ప్రకారం గణములు అన్నీ కుదరకపోయినా , కనీస వైర జంతువులను చూసుకొనగలిగితే చాలావరకు జీవితం ఆనందమయంగా వుంటుంది .
అది కూడా చాలా మంది చూడక , ఆ శాస్త్రాన్నే అవతల పెట్టి , తమ కనుకూలంగా ముహూర్తాలు పెట్టించుకొని పెళ్ళిళ్ళు హడావుడిగా చేసేసుకొంటున్నారు . ఆ తర్వాత వచ్చే యిబ్బందుల్ని ఎదుర్కోలేక విడిపోతున్నారు .


మన భూమండలం చుట్టి వస్తున్న నక్షత్ర మండలాల ప్రభావం మన మనుగడ మీద ఎంతగా వున్నదో అర్ధమైందిగా . కనుక అటు ఏడు , ఇటు ఏడు తరాలే కాకుండా పెద్దలు చెప్పిన వీటిని గూడా చూడటం ఎంతో శ్రేయస్కరం కదా ! ఆలోచించుకో .

                                                               ********    

సవారీయా ? సవాలా ?


                                                                                                                                       రచన : శర్మ జీ ఎస్ 

నేను , నా శ్రీమతి  
ఈ మమ్మీ రైడ్ కి వెళ్ళే వాళ్ళు ఏ విధమైన బ్యాగులు క్యారీ చేయకూడదుట . కనుక మా బ్యాక్  ప్యాక్ ఆ ప్రక్కనే వున్న ఫ్రీ లాకర్లో పెట్టాము . ఆ లాకర్ కంప్యూటర్ లో మన ఫింగర్ ప్రింట్ ద్వారా లాక్ చేయబడ్తుంది . నా శ్రీమతి హ్యాండ్ బ్యాగ్ మాత్రం తన వద్దనే వుంచుకోచ్చు అన్నారు .

ఆ భారీ లైన్లలో అలా నడుచుకొంటూ వెళ్తుండగా "   రకరకాలవారు రాగిమీసాలవారు  "   అన్న చందాన అక్కడే ఆలింగనాలు , ముద్దులు , మురిపాలు చూడ తటస్థించింది . 


ఓ పడుచు కుఱ్ఱవాడు తన క్రాఫ్ ని కోడిపుంజు నెత్తిపై నున్న ఎఱ్ఱకిరీటంలా చేసుకున్నాడు . బహుశా తను పెట్ట కాదు , పుంజునని అందరకు తను చెప్పకనే తెలిసిపోవాలనుకున్నాడు కాబోలు .

అది మనకు మాత్రం ఓ వింత  కాగా , మా కెమేరాలో బందించాను . ఈ  రైడ్స్ కి నిర్ణీత సమయం వుందని ప్రకటనల పలక మీద ప్రకటిస్తుంటాడే గాని , ఒక సమయమంటూ లేదు , నిరంతరం ఒక బోటు తర్వాత మరో బోటులో ఎక్కించి పంపుతుంటారు . ఆ లైన్లన్ని నడచి మేం ఆ సాధనాన్ని  చేరేసరికి  6.20 అయింది .

ఏ రైడ్ల కైనా ఒక్కరు వెళ్తే వాళ్ళను ఎక్కడో ఒక చోట కూర్చో పెట్టి పంపుతుంటారు . అదే ఎక్కువమంది అయితే వాళ్ళను పక్కపక్కన కూర్చోపెట్టి పంపుతుంటారు .

మాయిరువురిని ఆ  సాధనంలో  ఒక చోట కూర్చోమన్నారు . రెండవ వరుసలో ఆఖరున కూర్చొన్నాం . వెంటనే లాక్ చేసేశారు . కూర్చోగానే అక్కడి స్టాఫ్ అలా వెళ్ళే వాళ్ళందరకి హ్యాపీ రైడ్ చెప్తారు . బయలుదేరింది .మలుపు తిరిగింది , అలుపూ మొదలైంది , జీవం కోల్పోయిన అస్థిపంజరాలు  కూడా జీవం వున్నవారిని భయ పెడ్తున్నాయి మన మీదకు వచ్చి . ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే మన పై నుంచి  మన మీదకు ఆ అస్థి పంజరాలు వాటి చేతులతో మనల్ని పట్టుకొన ప్రయత్నిస్తున్నట్లుగా చేతులను చాచుతూ కదుల్తుంటాయి . ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే పైన వేదికలా వున్న ఆ చోట ఒక శవాకారం మాట్లాడుతుండగా మనం పైకి చూస్తుండగా ,   సడెన్ గా మన కుడి , ఎడమల రెండు అస్థిపంజరాలు ఠక్కున కనపడి కాలి బూడిదవుతాయి .

అది దాటి ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి పైకి ఎక్కుతూ వేగం పుంజుకొంటుంది మా వాహనం . ఆ వేగంలో ఎటు పోతున్నామో , ఏం చూడబోతున్నామో తెలియని అదో రకపు అయోమయ స్థితి . ఇదో రకమైన థ్రిల్ . ఆ వేగం అంతా , యింత అని చెప్పలేని పరిస్థితి . అంధకారాన్ని మనం తరచూ చూస్తూనే వుంటాం .  గాడాంధకారం , కళ్ళు విప్పార్చినా ఏమీ కనపడని స్థితి యిది .  ఏ ఆలోచన దరిజేరనీయదు , ప్రాణాన్ని గుండెలోనే నొక్కి పట్టి ఒకరికొకరు గట్టిగ పట్టుకొని ఉన్న స్థితిలో వేగంగా అష్ట కాదు అనేక వంకరలు తిరుగుతూ , పైకి , క్రిందకు పల్టీలు కొడుతూ , మధ్య మధ్యలో మనమీదకు దూకే అస్థిపంజరాలు , ఛటుక్కున ఎదురుగా ఏదో వస్తే ( సడెన్ బ్రేక్ తో ఆగినట్లు )ఆగిపోయింది .

ఇంతదాకా హాహాకారాలతో తమ ఉనికిని తెలుపుకుంటున్న అందులోని మా సహచరులు ( పలు భాషా ప్రజలు ) ఒక్కమారుగా హమ్మయ్య బ్రతికిపోయాం రా అన్న భావాన్ని తమ నిట్టూర్పులతో వ్యక్తపరిచారు . ఇంకా గాడాంధకారం వీడిపోలేదు . ఉచ్వాస , నిశ్వాసల ద్వారా , మేము ఊపిరి తీసుకొంటున్నామని తెలుసు కొనటం జరిగింది . ఆ తర్వాత ఎలా ఉంటుందో , ఏమో అని , ఎందుకైనా మంచిది అని మరల హాయిగా , ఒక రెండు నిముషాలు ఊపిరిని ఉఛ్ఛ్వాస , నిశ్వాసలతో పీల్చుకున్నాము .

మా వాహన కదలికలు మళ్ళీ ఆరంభమయ్యాయి , మేమంతా మరల ఏం జరుగుతుందోనని సంసిధ్ధమయ్యే సమయంలో , ఎటు వెళ్తుంది  , ఈ గేట్ తీస్తాడేమో , ఇంకా ఏమి చూపిస్తాడో అనుకుంటుండగా అదే వేగంతో , వెను తిరిగింది  .

ఎందుకంటే , ఇంతవరకు తెలియకుండా జరిగిన ఈ ప్రయాణం ఆశ్చర్యాన్ని , ఆనందాన్ని అందించింది మన ప్రిపరేషన్ ఏమీ లేకుండానే . అదే వంకర టింకర ప్రయాణం మరల సాగింది . ఈ మారు భయభ్రాంతులకు గురైనాము . మళ్ళీ అదే ప్రయాణమా ? అన్న భయం  ఆవహించినా , మనం అరిచి గీ పెట్టుకున్నా , వచ్చి ఆదుకొనే నాధుడెవడూ లేడు కనుక నోరు మూసుకొని సాగిస్తున్నామనుకొంటే పొరపడినట్లే . నోరు బాగా తెరచి , బిగ్గరగా , రణగొణ ధ్వనులతో హాహాకారాలు మొదలయ్యాయి . అలా , అలా వెనక్కి తీసుకువెళ్తూ , ఎప్పుడు మలుపు తిరుగుతుందో మనకు తెలియదు , చిట్ట చివరికి ఒక్కమారు ఆ పై నుంచి క్రిందకు తోసేసింది .

గుండెలవిసిపోయాయి అని మా  పెద్దవాళ్ళు అంటుంటె విన్నాను గాని దాని భావమేమిటో తెలుసుకోలేకపోయాను . ఇప్పుడు అనుభవంలో తెలుసుకున్నాను .

అందరం  బ్రతికి బయటపడ్డాంరా బాబూ అనుకున్నంత ఆనందంతో బయటకు వచ్చాము .

నిజానికిది కూడా వాళ్ళు ప్రకటించిన నియమ నిబంధనలను చూడకుండానే ఈ రైడ్ కి మేమిరువురం వెళ్ళి వచ్చాం . బైటకు వచ్చేసరికి , 7 గంటలయింది . సూర్యుడికి కూడా ఈ అమెరికా బాగా నచ్చినట్లుంది .  5 గంటలకల్లా వస్తున్న లేత వెలుతురుతో సూర్యుడూ పరుగులు తీస్తూ పై పైకి గబగబా వచ్చి తొంగి చూస్తుంటాడు ఇక్కడి ప్రకృతిని . తన వెలుగు , జిలుగులతో ఝిగేలుమనిపిస్తుంటాడు . ప్రతాపాన్ని చూపబుధ్ధికాక , ప్రకాశాన్నే అందంగా అందజేస్తాడు . అలాగే సాయంత్రాలు కూడా .అంత పొద్దున్నే వచ్చాడు కదా అని  తొందరగా వెళ్ళిపోడు . ఆయన ఈ అమెరికాలోని అందాలను తనివితీరా చూస్తూ , ఆ మైమరపులో ఆలస్యంగా వెళ్తున్నట్లుగా మనకనిపిస్తుంది .

అలా తను పొందిన ఆనందాలని ఈ జీవకోటికి అందించాలన్న సదాలోచనతో రాత్రి 8.45 నుంచి 9 గంటలలోపు తిరిగి వెళ్ళిపోతాడు .

                                                                                       
                                                                                                           *********** 

ఆధ్యాత్మికతలో పురోగతి

                                                                                                                                        రచన : శర్మ జీ ఎస్

శ్యామలీయం గారి ఈ నెల 5 న ఆయనకు అనుభూతమైన ' ఒక విచిత్రానుభవం ' , 6 న కలిగిన ' ఏమో అనుకొంటి ' టపాలు చదివిన పిమ్మట నా భావ పరంపరలు . )

ఈ ఆధ్యాత్మికత మార్గంలో పయనిస్తున్న వాళ్ళని అణిమాది సిధ్ధులు ఆకర్షిస్తుంటాయి . అవి షులు తపస్సు చేసుకొంటుంటే ( కావలసినదేదో ఆశించి ) ఆ తపమును భంగం కలిగించే దిశగా , రంభ , ఊర్వశి , మేనకలను ఆ ఇంద్రుడు వుసిగొల్పినట్లు , ఈ అణిమాది సిధ్ధులు ఏవో కొన్ని అనుభూతులను కలిగించి , జరగబోయే కొన్ని ముఖ్య విషయాలను ముందే తెలియబరచి , మన దృష్టిని పక్కకు మళ్ళిస్తాయి . దానితో అధః పాతాళానికి నెట్టబడటం జరుగుతుంది . ఇలాంటి విషయాల మీద  మన దృష్టి పోనీయకుండా ( ఎవ్వరికీ , ఆఖరికి మీ దేహంలో అర్ధభాగమైన అర్ధాంగికి కూడా తెలియచేయకూడదు అన్నమాట . ఎందుకంటే , ఈ ప్రపంచంలో ఎవరికి ఎవరూ లేరు , ఎవరితో ఎవరూ ఎన్నడు రారు , ఈ మానవ జన్మలో తను నీ భార్య , గత జన్మలో తానెవరో , నీవెవరో . ) ) మన ఆధ్యాత్మిక సాధనను మనం మరింత ముందుకు నడిపించుకోగలిగితే , మనం మరింత  ఎంతో అత్యున్నత శిఖరాలను అధిరోహించగలం .

ఆ తర్వాత మనం మన అనుభవాలను అందరితో పంచుకొనవచ్చు . అదే మన ఆధ్యాత్మికతకు అనుమతి .

ఉదా : ఒకరు కలెక్టర్ గారి వద్ద అపాయింట్మెంట్ తీసుకున్నారు ఉదయం 10 గంటలకు . తను ప్రొద్దునే లేచి తన నిత్య కృత్యాలు తీర్చుకొని , తను కలెక్టరు గారి బంగళాకు 9 గంటలకే చేరుకున్నాడు . సెక్యూరిటీకి తన అపాయింట్మెంట్ టైం చూపించాడు . అతను 9.30 గంటలకి అనుమతిస్తామన్నాడు . సరే నని అక్కడే నిరీక్షించాడు చెప్పిన  ప్రకారం 9.30 గంటలకి సెక్యూరిటీ అనుమతించాడు . ఆ కలెక్టరు గారి బంగళా చాలా లోపలకి వున్నది . నడుచుకొంటూ పోవాలి . ఆ మార్గంలో యిరువైపులా అందమైన పూలమొక్కలు , కొన్ని కొన్ని చెట్లు అందంగా కత్తిరించి అందమైన కళాకృతులుగా మలిచారు . మరికొన్ని పూల మొక్కలు సువాసనలు వెదజల్లుతూ వెంటబడ్తుంటాయి , తమనో కంట చూడమని . ఇలాంటి వాటి వెంట వున్న మార్గంలో నడుస్తూ వెళ్తున్న అతను వీటి అందాల్ని , ఆ కళాకృతులను చూస్తూ , ఆ సువాసనలను ఆఘ్రాణిస్తూ మెల మెల్లగా ముందుకు సాగాడు ( గతంలో అతనెన్నడూ యిలాంటి దృశ్యాలను వీక్షించి వుండలేదు . ఆ సరికే 10.30 గంటలు అయింది . అక్కడే వున్న కలెక్టర్ గారి పర్సనల్ సెక్రెటరీకి చూపించాడు . 

 "  అతను , సారీ , మీ షెడ్యూల్ టైం అయిపోయింది , ఇపుడు వేరే వాళ్ళతో బిజీగా వున్నారు అన్నారు . "   

"   మరి నన్నెప్పుడు అనుమతిస్తారు ? "   అని అడిగాడు . 

"   మళ్ళీ మీరు అపాయింట్మెంట్ తీసుకోవాలి . "   

"   ఎప్పుడు ? రేపే దొరుకుతుందా ? " 

"   రేపే ఎలా దొరుకుతుంది ? ఇప్పుడు మీరు తీసుకొన్న అపాయింట్మెంట్ ఎన్నాళ్ళనుంచి ప్రయత్నించారో మీకు తెలియనిది కాదుగా . "

"   అవును , ఎన్నాళ్ళనుంచో ప్రయత్నిస్తే , యిప్పటికి దొరికింది . "

"   దాన్ని వృధా చేసుకున్నారుగా . "

"   కావాలని చేసుకోలేదు కదండి . "

"   మీరెలా చేసుకొన్నా మాకవసరం లేదు . మళ్ళీ అపాయింట్మెంట్ దొరుకుతుందో , లేదో కూడా గట్టిగా చెప్పలేను . ఆయనను కలవటానికి ఎంతోమంది అపాయింట్మెంట్ క్యూలో వున్నారు . ఎపుడైనా వచ్చిన అవకాశం వదులుకొని , మరో అవకాశం కొఱకు ఎదురుచూడకూడదు . తర్వాత అంటే వాతే నన్నది మఱచిపోకూడదు . "

"   నేను అపాయింట్మెంట్ టైం కంటే 1 గంట ముందే వచ్చాను యిక్కడకి . "

"   గేటు ముందుకు రావటం ముఖ్యం కాదు , ఆయన గారి ఆఫీసుకి టైంకి రావటం ముఖ్యం . ఏది ఏమైనా ఆయనను కలుసుకొనాలనుకొంటుంటే మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేయండి ( మీకా ఉత్సాహం , తప్పక కలుసుకొనాలన్న బలంగా స్థిరపడి వుంటే > ) వెనువెంటనే కాకపోయినా , చిట్ట చివరికైనా లభిస్తుంది . ఈ మారు మాత్రం మార్గమధ్యంలో వున్న అందాలకు ,అనుబంధాలకు లొంగకండి .  వెళ్ళి మళ్ళీ రావటానికి ప్రయత్నించండి ."

ఇక్కడొక సందేహం చదువరులకు కలగవచ్చు .

"    మఱి ఈ ప్రపంచంలో చాలామంది వాళ్ళ వాళ్ళ అనుభవాలను  బైటకు చెప్తూనే వున్నారు గదా ! అని . "

వాళ్ళ ఆధ్యాత్మికత అభ్యాసాలు పూర్తి కాకుండా  బైటకు చెప్పుకొని , తమను తాము గొప్పగా డప్పులు కొట్టుకోవటం వలననే వాళ్ళందరూ అధోగతి పాలౌతున్నారు . మనమూ నిత్యం చూస్తూనే వున్నాం . ఎంతో ఉన్నతంగా కనపడ్తూ , వున్నట్లుండి  నీచస్థితిలోకి వెళ్ళిన వాళ్ళని చూస్తూనే వున్నాము . ఒక్కటి బాగా ఈ జీవితకాలం  అందరూ  గుర్తుంచుకొని తీరవలసిందే ఆధ్యాత్మికత / ఏదైనా సాధించదలుచుకొన్నప్పుడు . 
    . 
"    మనము విద్యార్ధిగా ఆ(ధ్యాత్మికత) పాఠశాలలో అడుగు పెడ్తూ , మనము తెలుసుకున్న కొంచెం మన సహాధ్యాయులకి నేర్పాలనుకోవటం అవివేకం . "   

అందుకే ఎంత నేర్చుకున్నా సద్గురువుల అనుమతి యీయకుండా సమాజంలోనికి రా(లే)రు ఏ శిష్యులైనా . ఎందుకంటే సద్గురువులు ఎల్లవేళలా సమాజ శ్రేయస్సుకై పాటుపడ్తుంటారు . అందుకని ఆ సద్గురువులు ఈ సమాజానికి ఎటువంటి మంచి చేయాలనుకున్నారో , ఆ విషయాన్ని శిష్యుల ముఖంగా చేయచూస్తారు . అందుకని శిష్యులను ఆ దిశగా సంసిధ్ధుల్ని కావించి , ఆ తర్వాత అనుమతిస్తారు సమాజ శ్రేయస్సుకై .   

కనుక ఏదైనా సాధించదల్చుకున్నప్పుడు గోప్యంగా వుంచటమే అన్ని విధాలా శ్రేయస్కరం . ఈ విషయాన్ని మన పూర్వీకులు మన నిత్యజీవితాల నడవడిలో అలవర్చారు . 
ఉదా : పెళ్ళైన ఆదవాళ్ళకి నెల నెలా వచ్చే ఋతుక్రమం తప్పగానే 3 వ నెల వచ్చేటంతవఱకు ఆ విషయాన్ని ( గర్భం అని ) ఎవరికీ వెల్లడి చేయరు . 3 మాసాలు గడచిన పిమ్మట , గుట్టుగా ' దొంగ చలిమిడి చేసి పెడ్తారు . ఆ తర్వాత 4 వ నెల గడచిన తర్వాత వాళ్ళు చెప్పదల్చుకున్న వాళ్ళ వాళ్ళకి తెలియచేస్తారు . 

ఏ రంగంలో నైనా పురోగతిలో పయనించాలనుకొనే వాళ్ళు , సాదించేవరకు , సౌమ్యంగా , మౌనంగా వుండటం ఎంతో శ్రేయస్కరం .


                                                                                       ** స ** మా ** ప్తం ** 

  

నా న్యూ నుడులు - 11

                                                                                                                                     రచన : శర్మ జీ ఎస్

1  .  గమ్యం ఒక్కటే
       దారులు ఎన్నో .

2  .  రోగమొక్కటే ,
       రావటానికి కారణాలు ఎన్నో  .

3  .  సాధించే వారొక్కరే ,
       వేదించేవారెందరో .

4  .  హతుడయ్యేవారొక్కడే ,
       హతాశులయ్యేవారెందరో .

5   .  విత్తనమొక్కటే ,
        కాయలెన్నో .

6  .  సంపాదించే వారొక్కరే ,
       అనుభవించే వారెందరో .

7  .  మంచి కోరే వారొక్కరే ,
       మెచ్చుకొనే వారెందరో .

8  .  కోరికలు కోరే వారెందరో .
       కోరిక తీరే వారే ఎక్కడో
      
9  .  అదృష్టం రాలేదనుకునేవారు తప్ప ,
       వచ్చినదానిని నిలబెట్టుకొనే వారు అరుదు .

10 . అందుకోలేదని బాధపడేవారు తప్ప ,
       అందినదానితో ఆనందంగా గడిపేవారే కరువు .


                                                                                                                 ( మరో మారు కలుసుకుందాం )

సీ సా

                                                                                                                          కవితా రచన : శర్మ జీ ఎస్                        
                                 ( మాలిక యాగ్రిగేటర్ లో ప్రచురించిన పెండెం గారి చిత్రానికి నా చిరు కవిత )


ప్రేమించటం , 
పెళ్ళి చేసుకోవటం ,
ఆనందించటం ,
వారసులను కనటం ,
అన్నీ హడావుడి  (ప్ర) క్రియలే ,
వారసులని కనగానే సరిపోదు ,
వాళ్ళని భావిపౌరులుగా తీర్చి దిద్దవలసిన ,
బాధ్యత మనదే అన్నది మరువరాదు ,
వాళ్ళకు మంచి విద్యను అందించాలంటే ,
ఆ విద్యల వెయిట్  , పిల్లలకంటే అధికమై ,
ఆ విద్యాలయం అందనంత ఎత్తులో వున్నది ,
సహజంగా పిల్లల వెయిట్ని కిలోలలో చూస్తాము ,
విద్యల వెయిట్  డబ్బుతో చూస్తున్న రోజులివి  ,
అందుకే పిల్లల  వెన్ను మీద వెయిట్ తగ్గించి ,
ఆ వెన్నుకు అండగున్న తల్లి తండ్రులపై వేశారు  ,
పిల్లలకు సీ సా ర్పరచి ఆడుకొమ్మన్నారు ,
ఆ విద్యాలయానికి మెట్లు లేనే లేవట ,
ర్పరచిన సీ సా నే విద్యార్జనకు అసలు మెట్టన్నారు ,
విద్యాలయం వైపు చిరంజీవిని కూర్చోపెడ్తారుట ,
ఆ తల్లితండ్రులు తాము ఆర్జించినదంతా ఆవల వైపు  , 
గోనె సంచుల్లో రాశులుగా పోసి వుంచాలట ,
ఆ ధన రాశుల వెయిట్ తో ఆ విద్యార్ధి ,
మెట్లు లేని ఆ విద్యాలయంలోకి అడుగెడతాడుట ,
అప్పుడే ఆ అధ్యాపకుడు అనుమతిస్తాడట ,
విద్యనార్జించటానికి అర్హుడౌతాడట ,
ఈ సీ సా విద్యలకొక రకమైన వీసానే .
కనుక  చిరంజీవులని కనక ముందే ,
అధిక మొత్తంలో  సమకూర్చుకొనటమే ఎంతైనా సబబు .

*******