బాప్ రే

                                                                                                                           వ్యాస రచన : శర్మ జీ ఎస్                              

                                                            అందాలకు ,ఆనందాలకు మారుపేరు మన బాపు 
ప్రకృతి మొత్తాన్ని చూడలేము ,
కనుక బాపు బొమ్మల్ని చూస్తే ,
ఆ లోటు తీరిపోయినట్లే .
పిల్లల అల్లర్ని ఎపుడూ చూస్తూనే వుంటుంటాం , 
కానీ  ,
వాళ్ళ అల్లర్ని ఆనందంగా చూడటం 
బాపు గారి నుంచే నేర్చుకొన్నాం .
ఎంకి , నాయుడులు ఎనకటి మాలోకాలు ,
బాపు గారి ద్వారా ప్రపంచ ప్రఖ్యాతులయ్యారు 
పక్కింటి పిన్ని గారంటే ,
బాపు గారు సృష్టించిన ఆ చిత్రం ,
హాస్యానికి మారుపేరైపోయింది .
వంటింట్లో అప్పడాల కఱ్ఱ చేత బట్టిన ,
ఆ పిన్ని గార్ని చూస్తే బుడుగులే కాదు , 
మొగుళ్ళు ( మగవాళ్ళు ) కూడా ఝడవాల్సిందే నన్న ,
నూతన ఒరవడికి ,
శ్రీకారం చుట్టిన బాపు గారి ,
ఆకారం ఎన్నటికీ , ఎవ్వరూ ,
మరచిపోలేనిది , మరువరానిది .
ఆనందం ఎక్కడో లేదు , 
అడుగడుగున మన నడవడిలోనే వున్నదని ,
చాటిచెప్పిన మేటి ఘనత బాపు గారి చిత్రాలదే .

ఇటువంటి బాపు గారిని విస్మరించకుండా ,
సదా స్మరించుకొంటూ , ఆయనను యిలా చూసుకొందాం . 

*********

ఇండియాలో స్వాతంత్ర్యం


                                                                                                                                     రచన : శర్మ జీ ఎస్ 


                                                                        


బ్లాగు మిత్రులకు , పాఠకులకు 2014 ఆగష్ట్ 15 వ తేదీన 66 సంవత్సరములు నిండి 67 వ స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు .

స్వాతత్ర్యం వచ్చింది అనుకుంటూ సంబరాలు అంబరాన్ని తాకాలని అత్యాశతో జరుపుకుంటున్నాము .

స్వాతంత్ర్యము అన్ని రంగాలలో అందరికీ ఈనాటికీ రాలేదనే చెప్పుకోవాలి . 

స్వాతంత్ర్యం అంటే మన మనసుకి తగ్గట్లు , చెడు త్రోవలు పట్టకుండా సన్మార్గంలో నడుచుకోవటమే .

ఇది ఎవరికి వారికి స్వానుభవం అయ్యేదే . 

ఈ విషయాన్ని మఱచి ఎదుటివారి స్వాతంత్ర్యాన్ని ఎవరికి వారు (అప)హరిస్తుంటుంటారు వాళ్ళకు తగ్గట్లుగా  వాళ్ళు నడచుకోవాలనే తీవ్ర తెలియని స్వార్ధ పరమైన అర్ధంతో . అలా చేస్తున్నామని వాళ్ళకు తెలియదు . ఓ వేళ తెలిసినా అది తప్పు కాదు నూటికి నూరు పాళ్ళు ఒప్పు అన్న భావంలో గట్టిగా ఫిక్స్ అయిపోతుంటారు .

అదే వాళ్ళకు అనుభవమైనప్పుడు అది తప్పని భావిస్తుంటారు . వాళ్ళు ఎదుటివాళ్ళ మీద అమలు జరిపేటప్పుడు మాత్రం తప్పదని భావిస్తుంటారు .

వాస్తవానికి ఈ స్వాతంత్ర్యం దేశానికి సంబంధించినది మాత్రమే . మనుషుల మనస్తత్వాలకు సంబంధించినది ఏ మాత్రం కానే కాదు .

మన ఇళ్ళలో , మన జీవితాలలో ఎంతో మందికి కనీసం వాక్స్వాతంత్ర్యం కూడా లేనే లేదు .

ఇది వచ్చిన నాడే నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లు అని నా భావన .

అందుకు ఎవరికి వారు ప్రయత్నించాలే తప్ప యుధ్ధాలు , రాధ్ధాంతాల వల్ల లభించదు . 

సిధ్ధాంతాలు పుస్తకాలకే పరిమితమై పోతున్నాయి . జీవితాలఓ ఆచరణకు నోచుకోవటం లేదు .

కొంచెం ఎవరికి వారు ఒంటరిగా ఆలోచించి చూడండి . మనసుని కూడా ప్రశ్నించి చూద్దాం .

  
                                                                       ********

నందికేశుని నోము ( హాస్య కధ )

నందికేశుని నోము ( హాస్య కధ )

రచన : శర్మ జీ ఎస్ 
( ఈ హాస్య కధ " మాలిక వెబ్ మ్యాగజైన్ లో ఆగష్ట్ మాసపత్రికలో ప్రచురించబడినది .)
  sharma gunturi
రంగారావు కాలం చేసిన తర్వాత , కొడుకు స్టేట్స్ కి వెళ్ళిన తర్వాత , భారతమ్మ కోడలుకి తోడుగా వుండటం తనకు నీడగా భావించింది .
తమ పెద్దల నుంచి తాము నేర్చుకున్న , తెలుసుకున్న ఆచారాలను ఆచరిస్తూ , సంప్రదాయలను పాటిస్తూ ,తమ వారసులకు నేర్పించాలనే తాపత్రయంతో కొత్త కోడలు చేత , రేపు వచ్చే రధ సప్తమి నాడు నోము పట్టించాలని , స్టేట్స్ లో వున్న వాళ్ళబ్బాయికి తెలియ చేశారు .
విషయం తెలియగానే ఒక్క మారు గత స్మృతులు కళ్ళముందు దొర్లగా ,
భారతమ్మ ఓ రధ సప్తమి నాడు ప్రభాత సమయాన్నే లేచి ,వాకిలి ముంగిట పేడ నీళ్ళు చల్లి , ముగ్గులు వేస్తూ,
” త్వరగా తలనిండా స్నానం చేయరా ” అన్నది .
“ చేశానమ్మా “  అన్నాడు .
“ ఊరికే చేయటం కాదురా , అవిగో ఆ జిల్లేడు ఆకులు , ఆ చిక్కుడు ఆకులు , తలమీద , రెండు భుజముల మీద రెండు పెట్టుకొని తల మీదగా నీళ్ళు పోసుకోవాలి . అలా 3 మారులు చేయాలి .”
“ అప్పుడే రధసప్తమి స్నానం చేసినట్లురా ” అన్నది .
“ సరేనమ్మా “ అంటూ మఱలా స్నానం చేసి వచ్చాడు .
” నేను మడి కట్టుకున్నా, నన్నే కాదు , అక్కడ పెట్టిన ఏ వస్తువులు గాని , నీళ్ళు గాని తాక వద్దు  , నేను నోము పడ్తున్నాను “  చెప్పింది .
“ అలాగే లేమ్మా . నేనేవీ తాకనులే గాని ,  ఈ మడినీళ్ళు ఎక్కడనుంచి పట్టుకొచ్చావమ్మా ? ఈ పండుగల సమయంలో ఎక్కడైనా , ఎవరైనా సరఫరా చేస్తారా అమ్మా ? “ అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు శ్రీనివాసు అమాయకంగానే .
“ అలా ఎవరూ అమ్మరురా చిట్టి తండ్రీ . ఆ మున్సిపాలిటీ వారు సరఫరా చేస్తున్న కుళాయిల ద్వారా మనమే పట్టుకుంటామురా .”
“ అలా పట్టుకుంటే ఆ నీళ్ళు మడినీళ్ళు అయిపోతాయా అమ్మా .”
“ ఇంటిలో వాళ్ళు , అందుబాటులో వున్న వాళ్ళు , పొడి గుడ్దలతో వున్నవాళ్ళు ఈ తడి బట్టలతో నీళ్ళు పట్టుకొనే వాళ్ళను తాకకుండా ఉంటే , అవే మడి నీళ్ళురా .”
“ ఎక్కడినుంచో వచ్చే నీళ్ళలో ఎవరెవరు ఏ రకంగా వాడబడిన నీళ్ళో ,ఆ నీళ్ళను ఈ కుళాయిల ద్వారా  తడి బట్టలతో పట్టుకుంటే మడినీళ్ళు అయిపోతాయటమ్మా .”
“ తప్పురా అలా విమర్శించకూడదురా ! “
“ ఎవరు చెప్పారమ్మా ? “
“ మా పెద్దలు మాకు చెప్పారు . మేం నమ్మాం , మేం మీకు చెప్తున్నాం , మీరు నమ్మాలి. అది సరే గాని త్వరగా పూజ చేసుకొని , పాలు పొంగించి ,  .”
” రోజూ పొంగిస్తూనే వున్నావుగా భారూ ( ముద్దు పేరు లెండి ) , ఆ పొయ్యి మీద పాలు పెట్టి అటూ యిటూ పచార్లు చేస్తూ ” ఆఫీసుకు రెడీ అవుతున్న  రంగారావు అన్నాడు .
” సమయం చిక్కితే చాలు నన్ననటం తప్ప , పిల్లవాడికి అర్ధమయ్యేటట్లు చెప్పొచ్చు కదండి ? “ అన్నది .
” నేనేం చెప్పినా నువ్వది ఒప్పుకోవుగా , నేను మెల్లగా తప్పుకోవటం తప్ప . అందుకే ఆ ఛాన్స్ నీకే యిచ్చేశాలే ” అన్నాడు .”
“మంచి పనే చేశారు . జాగ్రత్తగా వెళ్ళి రండి . వాడికి అర్ధమయ్యేటట్లు నేనే చెప్తాలెండి ” అంటూ భర్తను పంపింది .
” అమ్మా త్వరగా చెప్పమ్మా ” అన్నాడు ఆతృతగా కొత్త విషయమేదో తెలుసుకుందామనుకున్న వాడైన శ్రీనివాసు .
” రోజుటిలాగ ఈ పాలు పొయ్యి మీద పెట్టం . పిడకలు పొయ్యిలా పేర్చి వాటి నడుమ నిప్పు వేసి ఆ పైన పాల గిన్నె పెట్టి పొంగేవరకు అక్కడే వుండి , పొంగుతున్నప్పుడు దణ్ణం పెట్టుకొని పట్టదలచుకొన్న నోము కధ చదువుకొని అక్షింతలు నెత్తిన వేసుకోవాలి అలా చేస్తే ఎంతో మంచిదిట . ఆ తర్వాత ఆ పాలను అందరం తాగుతాం . “
“ నెత్తిన అక్షింతలు వేసుకొంటే ఏమి వస్తుంది ? “
“ పుణ్యం . “
” అదెలా వుంటుంది ? “
“ మంచిగా వుంటుంది .”
“ ఎంత వస్తుందమ్మా ? ”
“ మనసుకు తృప్తినిచ్చేటంతరా .”
“ సరేలేమ్మా . ఇంతకీ ఏం నోము పడ్తున్నావు ? “.
“ నందికేశుని నోము “ .
“ అంటే ఏం చేయాలి ? “
“ ఏముందిరా 9 రకాల పిండివంటలు 5 శేర్ల సోలెడు చొప్పున ఒక్కొక్కటి చేయాలి . అలా మడితో చేసి సూర్యోదయం నుంచి , సూర్యాస్తమయం లోపల మన కులస్థులకి మాత్రమే తిన్నంత పెట్టాలి . ఇల్లు దాటి బయటకు పంపరాదు ఆ పిండివంటలని . ఇంటిలోనే వుంచి అంతా ఖర్చు చేయాలి . “
“ ఓ వేళ ఖర్చు చేయలేకపోతే ? అనుమానంగా అడిగాడు .”
“ కంగారు పడవలసినదేమీ లేదులేరా . అలా ఖర్చు కాకుంటే , ఆవులకు మేతగా పెట్టవచ్చు . ఆవులు అందుబాటులో లేకుంటే , మన ఇంటి ఆవరణలోనే పూడ్చి పెట్టవచ్చు . “
“ ఇదెవరు చెప్పారమ్మా ? “
“ అది మాత్రం నాకూ తెలియదురా . మా పెద్దలు చెప్పారు , మేం విన్నాం , ఆచరిస్తున్నాం అంతేరా .”
“ సరెలే అమ్మా . అలా 9 రకాల పిండి వంటలు విడివిడిగా వాళ్ళకున్న వసతులను బట్టి చేస్తారురా . అది కూడా చాలా మంది పూర్తి చేయలేకపోతారురా . “
“ అదేంటమ్మా . ఓ వేళ రధసప్తమి నాడే చేయాలన్నా , ప్రతి సంవత్సరం వస్తుందిగా ఈ పండుగ . 9 రకాల పిండివంటలు 9 సంవత్సరాలలో పూర్తి అవుతాయిగా .”
“ అలా ఈ రోజే చేయాలని లేకపోయినా అవి అందరూ పూర్తి చేయలేకపోతున్నారు . ఎప్పుడు చేద్దామనుకొన్నా ఏవో రక రకాల అవాంతరాలు వచ్చిపడ్తుంటాయిరా . అంతే కాదురా , కొంతమంది అయితే రెండు పిండివంటలు ఒక్క మారే చేసి ఆ నోముని పూర్తి చేయ ప్రయత్నిస్తుంటారు . అలా చేసినా అందరూ పూర్తి చేయలేకపోతున్నారురా .”
“ ఇంతకీ ఆ పిండివంటలు రుచిగా వుండనివేమో ? అందుకే ఖర్చు కావటం లేదేమో ? “
“ అదేం కాదురా . అన్నీ రుచికరమైన పిండివంటలేరా .”
“ ఏమిటో చెప్పు అన్నాడు .”
1 . విఘ్నేశ్వరుడికి    ఇష్టమైన ఉండ్రాళ్ళు .
2 . పార్వతీదేవికి       ఇష్టమైన పులగం .
3 . శివుడికి               ఇష్టమైన తెల్ల నువ్వులతో చేసే చిమ్మిరి .
4 . నందికి                ఇష్టమైన శనగలు .
5 . ఖాలభైరవుడికి   ఇష్టమైన గారెలు .
6 . సూర్యుడికి          ఇష్టమైన పరమాన్నం .
7 . చంద్రుడికి           ఇష్టమైన చలిబిండి .
8 . సరస్వతీ దేవికి    ఇష్టమైన దోసెలు .
9 . అర్జునుడికి         ఇష్టమైన అప్పాలు / బూరెలు .
“ ఇవేరా ఆ 9 రకాల పిండివంటలు . “
“ ఆ దేవుళ్ళ పేరుతో మన కులస్థులందరికి చేసి పెడితే పుణ్యం వస్తుందంటావు . మనకు మంచి జరుగుతుందంటావు . సరేలే , పుణ్యం వస్తుందో , రాదో ముందర మన కడుపులు నిండుతాయి ఈ రకరకాల పిండివంటలతో . బాగున్నాయమ్మా ఈ నోములు .”
***         ***      ***
స్వగతంగా వున్న గతం లోంచి భవిష్యత్తులోకి వచ్చాడు శ్రీనివాసు . అమ్మ బాబోయ్ ఇప్పుడు నా భార్య చేత ఈ నందికేశుని నోము పట్టిస్తామంటోంది అమ్మ ,  నేను లేకుండా చూసి . తను కన్నతల్లిని నొప్పించనూ లేడు , కట్టుకున్న ఆలిని ఒప్పించనూలేడు , . ఈ ఆపద నుంచి తన భార్యను  తప్పించలేకపోయినా , కనీసం కొంచెం ఉపశమనం అన్నా కల్గిస్తే మంచిది అనుకున్న వాడై ఆలోచించసాగాడు . అది స్టేట్స్ , సమయం రాత్రి 9 గంటలైంది
సరిగ్గా ఆ సమయంలో భారతదేశంలో పగలు 10 .30 గంటలైంది .
ఆలోచించగా , ఆలోచించగా , మెఱుపులా తళుక్కుమని మెరిసింది ఓ ఐడియా ,  . వెంటనే ఇండియాలోని ఇంటికి కాల్ చేసి ,
“ అమ్మా నువ్వా పెద్దదానివయ్యావు , దానికా యివన్నీ వాళ్ళింట్లో అలవాటు లేదు . అలాగని వద్దనటం లేదు .”
“ అయితే ఏం చేయమంటావ్ ? “
“ ఏముందమ్మా ? ఆ పిండివంటలన్నీ ఏ రోజు ఏమి కావాలో వివరంగా ఆ క్యాటరింగ్ వాళ్ళకు ఎంత కావాలో ఆర్డరిస్తే ఆ టైముకి వాళ్ళు చక్కగా , శుచిగా తెచ్చి యింటిలో మన వంటింట్లో పెట్టిపోతారు . మీకే శ్రమా వుండదు  . మన కులస్థులని పిలుచుకోవటం వచ్చినవాళ్ళకు వడ్డించటం తప్ప . “
“ అలా చేస్తే మడితో చేసినట్లవుతుందిరా ? “
“ మడితో చేసినట్లంటే , నీలా తడి బట్టలతో చేయరు , ప్రత్యేకంగా మినరల్ వాటర్ తెప్పించుకొని శుచిగాను , రుచిగానూ  చేస్తారు . అసలు ఈ రోజుల్లో అందరూ బయట తిండ్లకు అలవాటు పడ్డవాళ్ళే తప్ప ఇంటి తిండి చాలావరకు మానేసేశారు ఆఖరుకి ఆడవాళ్ళు కూడా . అందుకే ఎక్కడ చూసినా క్యాటరింగులే .  అర్ధం చేసుకోమ్మా”
“ మనం పిలిస్తే వచ్చినవాళ్ళందరకి చల్లటివి పెడ్తామటరా ? “
“ అదా నీ కంగారు . అదేం ఫరవలేదమ్మా ! ఇలాంటి పరిస్థితులు మీలాంటీ పెద్దలు ఎదుర్కోవలసి వస్తుందనే , పలు పెద్ద పెద్ద ఎలక్ట్రానిక్ కంపెనీలు మైక్రో ఓవెన్లను కనిపెట్టారు . ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వేడి చేసి పెట్టుకోవచ్చు . రేపే కదా ! మా ఆవిడకు చెప్తాను . అహ లేదులే ఈ రోజే అంతర్జాలంలో బుక్ చేసి పేమెంట్ చేసేస్తాను . రేపే మనింటికి తెచ్చి యిస్తారు సరేనా  . ఖర్చు అయిపోతుందని ఆలోచించకు నీకంటే నాకెక్కువేదీ కాదమ్మా . నువ్వనుకున్నది అనుకున్నట్లు యిలా చేసేయమ్మా ! “
“ఏం చేస్తాను , నాకు ఓపిక లేనప్పుడు చేయకుండా అసలు మానేయటం కంటే , ఏదో రకంగా చేయటమే సరైన పధ్ధతనిపిస్తోందిరా నాకు కూడా . సరేలేరా  “
“ అలాగేలేరా అని ఫోన్ పెట్టేసింది భారతమ్మ .”
****
ఆ రోజు రానే వచ్చింది . ఈ నందికేశుని నోములోని 9 రకాల పిండివంటలలో , ప్రమధ గణాలలో ప్రధముడైన గణనాధుడికి యిష్టమైన వుండ్రాళ్ళ పిండివంట ఒక్కటే మొదటగా పెట్టుకొన్నారు . క్యాటరింగ్ వాళ్ళకి ఆర్డరిచ్చారు . ఉదయం 6.30 కే కావాలంటే 6 .15 కే వంటింట్లో నీటుగా సర్ది పెట్టేసి వెళ్ళిపోయారు వాళ్ళు . అనుకున్నట్లుగానే త్వరగ అయిపోయాయి సూర్యాస్తమయం కాకుండానే . ఇంకా కొంతమందికి పెట్టలేకపోయారు . మనసు కొంచెం చివుక్కుమన్నది . కాని ఎక్కువ పెట్టటానికి మనింట్లో జరుపుకుండే విందు కార్యక్రమం కాదాయె .
“ అంతా కొలమానంతో కూడుకొన్నదాయె . ఈ సారి యిలా కాదే కోడలు పిల్లా , రెండు పిండివంటలు పెట్టుకుందామె . అప్పుడు వచ్చిన వాళ్ళందరికి రెండు పిండివంటలు కొంచెం కొంచెం పెడితే అందరికీ పెట్టినవాళ్ళమవుతాము , మనకు రెండు ఒకేసారి అయిపోతాయే .”
6 మాసాలు గడచింది . ఇంతకుముందు అనుకున్నట్లుగానే శనగలు , చలిమిడి క్యాటరింగ్ వాళ్ళకి ఆర్డరిచ్చేశారు . మునుపటిలాగానే 15 నిముషాలకు ముందే తెచ్చి వంటింట్లో నీటుగా సర్దేసి వెళ్ళిపోయారు .
వాళ్ళ పిల్లతో కొంతమంది , ఇంకొంతమంది ఒంటరిగా వచ్చిన ఆడవాళ్ళు , అలా వస్తూనే వున్నారు ,. వచ్చినవాళ్ళకి వచ్చినట్లు వరుసగా వేడి వేడిగా వీళ్ళు వడ్డిస్తూనే వున్నారు చక చకా .  సూర్యుడు నడినెత్తికొచ్చేసరికి సగానికి పైనే అయిపోయాయి . హమ్మయ్య త్వరగా అయిపోతున్నాయి , యింకేముంది సూర్యాస్తమయం వరకు దేనికి ? 3 గంటలయ్యేసరికి సంపూర్ణంగా అయిపోతాయి అనుకొని ఆనందించారు .
మధ్యాహ్నం ఒంటిగంట దాటినప్పటి నుంచి ఆహ్వానించిన వాళ్ళ రాక మందకొడిగా సాగుతోంది . అడపా ,తడపా పరామర్శించటానికి వచ్చినట్లుగా అప్పుడొకళ్ళు , అప్పుడొకళ్ళుగా వస్తున్నారే గాని , శనగలు తిన్న వాళ్ళు చలిబిండి  తినటం లేదు . చలిబిండి తినేవాళ్ళు శనగలు తినటం లేదు .
చలిబిండి కొంచెమే వుంది గాని , శనగలు అయితే ఒక సోలెడు వరకు వున్నాయి . ఏం చేయాలో తోచక కంగారు పడ్తుంటే , “ కోడలా కంగారు పడకు మనవాళ్ళు అందుకే చెప్పారుగా అవి ఖర్చు కాకపోతే ఆవులకి పెట్టమన్నారు , అలా వీలులేకపోతే , మన యింటి ఆవరణలోనే పాతి పెట్టమన్నారుగా అన్నది భారతమ్మ . “
ఇలా తను అనుకున్న నందికేశుని నోములో 6 రకాల పిండివంటలు 3 సంవత్సరాలకు పూర్తి చేయగలిగింది అని చెప్పుకొంటుందే గాని , పూర్తిగా పదిమంది సాటి కులస్థులకు పెట్టి ఖర్చు చేయలేకపోయింది .
ఎందుకని పూర్తిగా చేయలేకపోతున్నాము అన్న ఆలోచనతో కోడలు పిల్ల మనసు ఎంతగానో బాధపడ్తోంది .
ఇదిలా వుంటే , “ ఆ మిగిలిన 3 రకాల పిండి వంటలు కూడా పూర్తి చేయవే . నేను పూర్తి చేయలేకపోయినది నాకోడలు పిల్లైనా చేసిందనుకొంటానే . ఇది త్వరగా పూర్తి చేశావంటే ,మీ అక్కయ్య గారి అబ్బాయికి ఉపనయనం చేస్తున్నారుగా , ఓ వేళ చేయకపోతే , ఏ గుడిలో ఎవరైనా ఉపనయనం చేసుకుంటుంటే , అక్కడకి వెళ్ళి . ఆ ఉపనయనంలో ఆ ఒడక పెళ్ళీకొడుకుకి నువ్వు ఉద్యాపన చేసుకొంటున్నావంటే , ఈ నోములు సంపూర్ణం అయిపోతాయి . ఆ తర్వాత
రేపొచ్చే రధసప్తమి నాడు మళ్ళీ ఇంకో నోము పట్టుదువు గాని ” అన్నది భారతమ్మ .
****
ఇంక అత్తగారికి ఓపిక తగ్గేసరికి తాను చేయలేకపోతున్నవన్నీ తన చేత  చేయించాలనుకుంటున్నట్లుగా ఆలోచన చేస్తున్నట్లుగా తోచింది . కారణం తను చదువుకొన్నా ఉద్యోగం చేయకుండా ఇంటి యిల్లాలుగా వుంటున్నందుకే కదా ఈ పరిస్థితి . తనే ఉద్యోగం చేస్తే ఈ సమస్యలలో యిరుక్కు పోవాలసిన పరిస్థితి తనకు రాదు అనుకొన్నదై భర్త చెవిలో చెప్పింది పడక గదిలో .
అంతా విన్న శ్రీనివాసు , “ సరే నువ్వు ఉద్యోగవేటలో వుండు . నేను అమ్మకు చెప్తాలే “ అన్నాడు .
“ హమ్మయ్య “ అత్తగారి నోముల నుంచి బయట పడ్డాననుకున్నది .
“ అలా తప్పుగా  అనుకోకు . ఈ నోముల విషయంలో ఆమె తప్పిదము ఏమీ లేదు . ఎందుకంటే ఆ పాతకాలంలో ఆడవాళ్ళు ఇంటినంటిపెట్టుకొని ఇల్లు , పిల్లల బాధ్యతలను చక్కగా తీర్చి దిద్దే నిర్వర్తించటంలో సఫలీకృతమయ్యే వాళ్ళు .
అస్సలు ఈ నోములు రధసప్తమి నాడే ఎందుకు పడ్తారంటే , సప్తాశ్వారూఢుడైన సూర్యభగవానుడిని ప్రార్ధిస్తారు . ఈ సూర్యుడివలన ఈ ప్రపంచంలోని జీవరాశులన్నింటి మనుగడకి మూలమైనది . ఈ సూర్య శక్తి అసామాన్యమైనది , అంతటా నిండి వున్నది . ఏడు రకాలుగా ఈ మానవ మనుగడకి వుపయోగపడ్తున్నది .
ఆ ఏడు రకాలు :
ప్రకాశము ,
ఉష్ణోగ్రత ,
చల్లదనం ,
ఉత్పత్తి ,
అరుగుదల ,
ఎదుగుదల ,
ఒదుగుదల .
ఇలాంటివెన్నో ఆ సూర్యుడి వలన మనం పొందగలుగుతున్నాము . అందులో కొన్ని ముఖ్యమైనవాటిని మాత్రం తీసుకొని , ఆ నాటి మన పూర్వీకులు కృతఙ్నతా భావాన్ని పెంపొందించదలచి యిలాంటి నోముల కార్యక్రమాలు ప్రారంభించారు . ఆ పరంపర లోనివే ఈ నోములు , వ్రతాలు .
ఇదీ అస్సలు అంతరార్ధం .
ఇది కూడా ఆ అంతరార్ధం లోని భాగమే .
ఈ నోములు అనుకొన్న ప్రకారం పూర్తి చేసిన తర్వాత , సాటి కులస్థులలో గాని , తమ బంధువర్గంలోని వారి పిల్లల ఉపనయన కార్యక్రమంలో ఉద్యాపన చేసుకోవాలంటారు . అంటె ఈ నోము వాళ్ళ యిలాకాలో పిల్లలకు వివాహ సంబంధాలు చూసుకొనేటందుకు ఈ సందర్భం బాగా ఉపయోగపడ్తుంది . ఆనాడు చిన్న వయసులోనే తమ చిన్న పిల్లలకు వివాహము చేస్తుండేవారు  కదా !
ఆ ఆడవాళ్ళకు బయట ప్రపంచంతో సంబంధాలు ఎలా ఏర్పడతాయి . అందుకని యిలాంటి కార్యక్రక్రమాలతో వాళ్ళను అలా దిగ్బంధనం చేశారు ఆనాటి మగమేధావులు . ఈ కార్యక్రమాల వలన ఆడవాళ్ళకి గాని అందులో పాల్గొనే వాళ్ళకి గాని సామర్ధ్య శక్తి అధికమవుతుంది . ఎలాగంటే , సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపల పూర్తి చేయటమంటె , నిర్ణీత సమయంలో అనుకున్నది అనుకున్నట్లు చేసే శక్తి సామర్ధ్యాలను పొందగలగటం . ఒక 5 శేర్ల సోలెడు అన్న కొలత కూడా ఆ కోవకు చెందినదే . ఆ పై సాటి కులస్థులకే పెట్టి ఆరగింపజేయాలి అంటే , సాటి కులస్థులెవరో మున్ముందు  సంబంధ బాంధవ్యాలు కలుపుకొనటానికని అర్ధం చేసుకోవాలి .
ఇలాంటివి చేయటం వలన , మనం కొంతైనా ఖర్చు చేయనిదే ఏ లాభం పొందలేము అన్నది మనం గ్రహించాలి . ఆనాటి సమాజంలోలా నేటి ఆడవాళ్ళు ఇళ్ళలో వుండిపోవటం లేదు . బయట మగవాళ్ళకు దీటుగా వాళ్ళు అన్ని రంగాలలో రాణిస్తున్నారు . మీకా అవసరం లేకపోవచ్చు . కాని ఆనాటి వాళ్ళు అలా అలవాటు పడినవాళ్ళు ఈనాటి ఈ విధానాలతో సమాధాన పడలేరు . వాళ్ళనీ వాళ్ళ విధానాలనీ తక్కువగా చూడవద్దు .”
భర్తని బిగి కౌగిలో బంధించింది ( చాలా కాలం స్టేట్స్ లో వుండి రావటం మూలాన అనుకొందాం, అంతేగాని ఏ మాత్రం తప్పుగా అనుకోవద్దు సుమా ! )
*** స *** మా ** * ప్తం ***
Print Friendly