బాప్ రే

                                                                                                                           వ్యాస రచన : శర్మ జీ ఎస్                              

                                                            అందాలకు ,ఆనందాలకు మారుపేరు మన బాపు 
ప్రకృతి మొత్తాన్ని చూడలేము ,
కనుక బాపు బొమ్మల్ని చూస్తే ,
ఆ లోటు తీరిపోయినట్లే .
పిల్లల అల్లర్ని ఎపుడూ చూస్తూనే వుంటుంటాం , 
కానీ  ,
వాళ్ళ అల్లర్ని ఆనందంగా చూడటం 
బాపు గారి నుంచే నేర్చుకొన్నాం .
ఎంకి , నాయుడులు ఎనకటి మాలోకాలు ,
బాపు గారి ద్వారా ప్రపంచ ప్రఖ్యాతులయ్యారు 
పక్కింటి పిన్ని గారంటే ,
బాపు గారు సృష్టించిన ఆ చిత్రం ,
హాస్యానికి మారుపేరైపోయింది .
వంటింట్లో అప్పడాల కఱ్ఱ చేత బట్టిన ,
ఆ పిన్ని గార్ని చూస్తే బుడుగులే కాదు , 
మొగుళ్ళు ( మగవాళ్ళు ) కూడా ఝడవాల్సిందే నన్న ,
నూతన ఒరవడికి ,
శ్రీకారం చుట్టిన బాపు గారి ,
ఆకారం ఎన్నటికీ , ఎవ్వరూ ,
మరచిపోలేనిది , మరువరానిది .
ఆనందం ఎక్కడో లేదు , 
అడుగడుగున మన నడవడిలోనే వున్నదని ,
చాటిచెప్పిన మేటి ఘనత బాపు గారి చిత్రాలదే .

ఇటువంటి బాపు గారిని విస్మరించకుండా ,
సదా స్మరించుకొంటూ , ఆయనను యిలా చూసుకొందాం . 

*********

ఇండియాలో స్వాతంత్ర్యం


                                                                                                                                     రచన : శర్మ జీ ఎస్ 


                                                                        


బ్లాగు మిత్రులకు , పాఠకులకు 2014 ఆగష్ట్ 15 వ తేదీన 66 సంవత్సరములు నిండి 67 వ స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు .

స్వాతత్ర్యం వచ్చింది అనుకుంటూ సంబరాలు అంబరాన్ని తాకాలని అత్యాశతో జరుపుకుంటున్నాము .

స్వాతంత్ర్యము అన్ని రంగాలలో అందరికీ ఈనాటికీ రాలేదనే చెప్పుకోవాలి . 

స్వాతంత్ర్యం అంటే మన మనసుకి తగ్గట్లు , చెడు త్రోవలు పట్టకుండా సన్మార్గంలో నడుచుకోవటమే .

ఇది ఎవరికి వారికి స్వానుభవం అయ్యేదే . 

ఈ విషయాన్ని మఱచి ఎదుటివారి స్వాతంత్ర్యాన్ని ఎవరికి వారు (అప)హరిస్తుంటుంటారు వాళ్ళకు తగ్గట్లుగా  వాళ్ళు నడచుకోవాలనే తీవ్ర తెలియని స్వార్ధ పరమైన అర్ధంతో . అలా చేస్తున్నామని వాళ్ళకు తెలియదు . ఓ వేళ తెలిసినా అది తప్పు కాదు నూటికి నూరు పాళ్ళు ఒప్పు అన్న భావంలో గట్టిగా ఫిక్స్ అయిపోతుంటారు .

అదే వాళ్ళకు అనుభవమైనప్పుడు అది తప్పని భావిస్తుంటారు . వాళ్ళు ఎదుటివాళ్ళ మీద అమలు జరిపేటప్పుడు మాత్రం తప్పదని భావిస్తుంటారు .

వాస్తవానికి ఈ స్వాతంత్ర్యం దేశానికి సంబంధించినది మాత్రమే . మనుషుల మనస్తత్వాలకు సంబంధించినది ఏ మాత్రం కానే కాదు .

మన ఇళ్ళలో , మన జీవితాలలో ఎంతో మందికి కనీసం వాక్స్వాతంత్ర్యం కూడా లేనే లేదు .

ఇది వచ్చిన నాడే నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లు అని నా భావన .

అందుకు ఎవరికి వారు ప్రయత్నించాలే తప్ప యుధ్ధాలు , రాధ్ధాంతాల వల్ల లభించదు . 

సిధ్ధాంతాలు పుస్తకాలకే పరిమితమై పోతున్నాయి . జీవితాలఓ ఆచరణకు నోచుకోవటం లేదు .

కొంచెం ఎవరికి వారు ఒంటరిగా ఆలోచించి చూడండి . మనసుని కూడా ప్రశ్నించి చూద్దాం .

  
                                                                       ********

నందికేశుని నోము ( హాస్య కధ )

నందికేశుని నోము ( హాస్య కధ )

రచన : శర్మ జీ ఎస్ 
( ఈ హాస్య కధ " మాలిక వెబ్ మ్యాగజైన్ లో ఆగష్ట్ మాసపత్రికలో ప్రచురించబడినది .)
  sharma gunturi
రంగారావు కాలం చేసిన తర్వాత , కొడుకు స్టేట్స్ కి వెళ్ళిన తర్వాత , భారతమ్మ కోడలుకి తోడుగా వుండటం తనకు నీడగా భావించింది .
తమ పెద్దల నుంచి తాము నేర్చుకున్న , తెలుసుకున్న ఆచారాలను ఆచరిస్తూ , సంప్రదాయలను పాటిస్తూ ,తమ వారసులకు నేర్పించాలనే తాపత్రయంతో కొత్త కోడలు చేత , రేపు వచ్చే రధ సప్తమి నాడు నోము పట్టించాలని , స్టేట్స్ లో వున్న వాళ్ళబ్బాయికి తెలియ చేశారు .
విషయం తెలియగానే ఒక్క మారు గత స్మృతులు కళ్ళముందు దొర్లగా ,
భారతమ్మ ఓ రధ సప్తమి నాడు ప్రభాత సమయాన్నే లేచి ,వాకిలి ముంగిట పేడ నీళ్ళు చల్లి , ముగ్గులు వేస్తూ,
” త్వరగా తలనిండా స్నానం చేయరా ” అన్నది .
“ చేశానమ్మా “  అన్నాడు .
“ ఊరికే చేయటం కాదురా , అవిగో ఆ జిల్లేడు ఆకులు , ఆ చిక్కుడు ఆకులు , తలమీద , రెండు భుజముల మీద రెండు పెట్టుకొని తల మీదగా నీళ్ళు పోసుకోవాలి . అలా 3 మారులు చేయాలి .”
“ అప్పుడే రధసప్తమి స్నానం చేసినట్లురా ” అన్నది .
“ సరేనమ్మా “ అంటూ మఱలా స్నానం చేసి వచ్చాడు .
” నేను మడి కట్టుకున్నా, నన్నే కాదు , అక్కడ పెట్టిన ఏ వస్తువులు గాని , నీళ్ళు గాని తాక వద్దు  , నేను నోము పడ్తున్నాను “  చెప్పింది .
“ అలాగే లేమ్మా . నేనేవీ తాకనులే గాని ,  ఈ మడినీళ్ళు ఎక్కడనుంచి పట్టుకొచ్చావమ్మా ? ఈ పండుగల సమయంలో ఎక్కడైనా , ఎవరైనా సరఫరా చేస్తారా అమ్మా ? “ అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు శ్రీనివాసు అమాయకంగానే .
“ అలా ఎవరూ అమ్మరురా చిట్టి తండ్రీ . ఆ మున్సిపాలిటీ వారు సరఫరా చేస్తున్న కుళాయిల ద్వారా మనమే పట్టుకుంటామురా .”
“ అలా పట్టుకుంటే ఆ నీళ్ళు మడినీళ్ళు అయిపోతాయా అమ్మా .”
“ ఇంటిలో వాళ్ళు , అందుబాటులో వున్న వాళ్ళు , పొడి గుడ్దలతో వున్నవాళ్ళు ఈ తడి బట్టలతో నీళ్ళు పట్టుకొనే వాళ్ళను తాకకుండా ఉంటే , అవే మడి నీళ్ళురా .”
“ ఎక్కడినుంచో వచ్చే నీళ్ళలో ఎవరెవరు ఏ రకంగా వాడబడిన నీళ్ళో ,ఆ నీళ్ళను ఈ కుళాయిల ద్వారా  తడి బట్టలతో పట్టుకుంటే మడినీళ్ళు అయిపోతాయటమ్మా .”
“ తప్పురా అలా విమర్శించకూడదురా ! “
“ ఎవరు చెప్పారమ్మా ? “
“ మా పెద్దలు మాకు చెప్పారు . మేం నమ్మాం , మేం మీకు చెప్తున్నాం , మీరు నమ్మాలి. అది సరే గాని త్వరగా పూజ చేసుకొని , పాలు పొంగించి ,  .”
” రోజూ పొంగిస్తూనే వున్నావుగా భారూ ( ముద్దు పేరు లెండి ) , ఆ పొయ్యి మీద పాలు పెట్టి అటూ యిటూ పచార్లు చేస్తూ ” ఆఫీసుకు రెడీ అవుతున్న  రంగారావు అన్నాడు .
” సమయం చిక్కితే చాలు నన్ననటం తప్ప , పిల్లవాడికి అర్ధమయ్యేటట్లు చెప్పొచ్చు కదండి ? “ అన్నది .
” నేనేం చెప్పినా నువ్వది ఒప్పుకోవుగా , నేను మెల్లగా తప్పుకోవటం తప్ప . అందుకే ఆ ఛాన్స్ నీకే యిచ్చేశాలే ” అన్నాడు .”
“మంచి పనే చేశారు . జాగ్రత్తగా వెళ్ళి రండి . వాడికి అర్ధమయ్యేటట్లు నేనే చెప్తాలెండి ” అంటూ భర్తను పంపింది .
” అమ్మా త్వరగా చెప్పమ్మా ” అన్నాడు ఆతృతగా కొత్త విషయమేదో తెలుసుకుందామనుకున్న వాడైన శ్రీనివాసు .
” రోజుటిలాగ ఈ పాలు పొయ్యి మీద పెట్టం . పిడకలు పొయ్యిలా పేర్చి వాటి నడుమ నిప్పు వేసి ఆ పైన పాల గిన్నె పెట్టి పొంగేవరకు అక్కడే వుండి , పొంగుతున్నప్పుడు దణ్ణం పెట్టుకొని పట్టదలచుకొన్న నోము కధ చదువుకొని అక్షింతలు నెత్తిన వేసుకోవాలి అలా చేస్తే ఎంతో మంచిదిట . ఆ తర్వాత ఆ పాలను అందరం తాగుతాం . “
“ నెత్తిన అక్షింతలు వేసుకొంటే ఏమి వస్తుంది ? “
“ పుణ్యం . “
” అదెలా వుంటుంది ? “
“ మంచిగా వుంటుంది .”
“ ఎంత వస్తుందమ్మా ? ”
“ మనసుకు తృప్తినిచ్చేటంతరా .”
“ సరేలేమ్మా . ఇంతకీ ఏం నోము పడ్తున్నావు ? “.
“ నందికేశుని నోము “ .
“ అంటే ఏం చేయాలి ? “
“ ఏముందిరా 9 రకాల పిండివంటలు 5 శేర్ల సోలెడు చొప్పున ఒక్కొక్కటి చేయాలి . అలా మడితో చేసి సూర్యోదయం నుంచి , సూర్యాస్తమయం లోపల మన కులస్థులకి మాత్రమే తిన్నంత పెట్టాలి . ఇల్లు దాటి బయటకు పంపరాదు ఆ పిండివంటలని . ఇంటిలోనే వుంచి అంతా ఖర్చు చేయాలి . “
“ ఓ వేళ ఖర్చు చేయలేకపోతే ? అనుమానంగా అడిగాడు .”
“ కంగారు పడవలసినదేమీ లేదులేరా . అలా ఖర్చు కాకుంటే , ఆవులకు మేతగా పెట్టవచ్చు . ఆవులు అందుబాటులో లేకుంటే , మన ఇంటి ఆవరణలోనే పూడ్చి పెట్టవచ్చు . “
“ ఇదెవరు చెప్పారమ్మా ? “
“ అది మాత్రం నాకూ తెలియదురా . మా పెద్దలు చెప్పారు , మేం విన్నాం , ఆచరిస్తున్నాం అంతేరా .”
“ సరెలే అమ్మా . అలా 9 రకాల పిండి వంటలు విడివిడిగా వాళ్ళకున్న వసతులను బట్టి చేస్తారురా . అది కూడా చాలా మంది పూర్తి చేయలేకపోతారురా . “
“ అదేంటమ్మా . ఓ వేళ రధసప్తమి నాడే చేయాలన్నా , ప్రతి సంవత్సరం వస్తుందిగా ఈ పండుగ . 9 రకాల పిండివంటలు 9 సంవత్సరాలలో పూర్తి అవుతాయిగా .”
“ అలా ఈ రోజే చేయాలని లేకపోయినా అవి అందరూ పూర్తి చేయలేకపోతున్నారు . ఎప్పుడు చేద్దామనుకొన్నా ఏవో రక రకాల అవాంతరాలు వచ్చిపడ్తుంటాయిరా . అంతే కాదురా , కొంతమంది అయితే రెండు పిండివంటలు ఒక్క మారే చేసి ఆ నోముని పూర్తి చేయ ప్రయత్నిస్తుంటారు . అలా చేసినా అందరూ పూర్తి చేయలేకపోతున్నారురా .”
“ ఇంతకీ ఆ పిండివంటలు రుచిగా వుండనివేమో ? అందుకే ఖర్చు కావటం లేదేమో ? “
“ అదేం కాదురా . అన్నీ రుచికరమైన పిండివంటలేరా .”
“ ఏమిటో చెప్పు అన్నాడు .”
1 . విఘ్నేశ్వరుడికి    ఇష్టమైన ఉండ్రాళ్ళు .
2 . పార్వతీదేవికి       ఇష్టమైన పులగం .
3 . శివుడికి               ఇష్టమైన తెల్ల నువ్వులతో చేసే చిమ్మిరి .
4 . నందికి                ఇష్టమైన శనగలు .
5 . ఖాలభైరవుడికి   ఇష్టమైన గారెలు .
6 . సూర్యుడికి          ఇష్టమైన పరమాన్నం .
7 . చంద్రుడికి           ఇష్టమైన చలిబిండి .
8 . సరస్వతీ దేవికి    ఇష్టమైన దోసెలు .
9 . అర్జునుడికి         ఇష్టమైన అప్పాలు / బూరెలు .
“ ఇవేరా ఆ 9 రకాల పిండివంటలు . “
“ ఆ దేవుళ్ళ పేరుతో మన కులస్థులందరికి చేసి పెడితే పుణ్యం వస్తుందంటావు . మనకు మంచి జరుగుతుందంటావు . సరేలే , పుణ్యం వస్తుందో , రాదో ముందర మన కడుపులు నిండుతాయి ఈ రకరకాల పిండివంటలతో . బాగున్నాయమ్మా ఈ నోములు .”
***         ***      ***
స్వగతంగా వున్న గతం లోంచి భవిష్యత్తులోకి వచ్చాడు శ్రీనివాసు . అమ్మ బాబోయ్ ఇప్పుడు నా భార్య చేత ఈ నందికేశుని నోము పట్టిస్తామంటోంది అమ్మ ,  నేను లేకుండా చూసి . తను కన్నతల్లిని నొప్పించనూ లేడు , కట్టుకున్న ఆలిని ఒప్పించనూలేడు , . ఈ ఆపద నుంచి తన భార్యను  తప్పించలేకపోయినా , కనీసం కొంచెం ఉపశమనం అన్నా కల్గిస్తే మంచిది అనుకున్న వాడై ఆలోచించసాగాడు . అది స్టేట్స్ , సమయం రాత్రి 9 గంటలైంది
సరిగ్గా ఆ సమయంలో భారతదేశంలో పగలు 10 .30 గంటలైంది .
ఆలోచించగా , ఆలోచించగా , మెఱుపులా తళుక్కుమని మెరిసింది ఓ ఐడియా ,  . వెంటనే ఇండియాలోని ఇంటికి కాల్ చేసి ,
“ అమ్మా నువ్వా పెద్దదానివయ్యావు , దానికా యివన్నీ వాళ్ళింట్లో అలవాటు లేదు . అలాగని వద్దనటం లేదు .”
“ అయితే ఏం చేయమంటావ్ ? “
“ ఏముందమ్మా ? ఆ పిండివంటలన్నీ ఏ రోజు ఏమి కావాలో వివరంగా ఆ క్యాటరింగ్ వాళ్ళకు ఎంత కావాలో ఆర్డరిస్తే ఆ టైముకి వాళ్ళు చక్కగా , శుచిగా తెచ్చి యింటిలో మన వంటింట్లో పెట్టిపోతారు . మీకే శ్రమా వుండదు  . మన కులస్థులని పిలుచుకోవటం వచ్చినవాళ్ళకు వడ్డించటం తప్ప . “
“ అలా చేస్తే మడితో చేసినట్లవుతుందిరా ? “
“ మడితో చేసినట్లంటే , నీలా తడి బట్టలతో చేయరు , ప్రత్యేకంగా మినరల్ వాటర్ తెప్పించుకొని శుచిగాను , రుచిగానూ  చేస్తారు . అసలు ఈ రోజుల్లో అందరూ బయట తిండ్లకు అలవాటు పడ్డవాళ్ళే తప్ప ఇంటి తిండి చాలావరకు మానేసేశారు ఆఖరుకి ఆడవాళ్ళు కూడా . అందుకే ఎక్కడ చూసినా క్యాటరింగులే .  అర్ధం చేసుకోమ్మా”
“ మనం పిలిస్తే వచ్చినవాళ్ళందరకి చల్లటివి పెడ్తామటరా ? “
“ అదా నీ కంగారు . అదేం ఫరవలేదమ్మా ! ఇలాంటి పరిస్థితులు మీలాంటీ పెద్దలు ఎదుర్కోవలసి వస్తుందనే , పలు పెద్ద పెద్ద ఎలక్ట్రానిక్ కంపెనీలు మైక్రో ఓవెన్లను కనిపెట్టారు . ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వేడి చేసి పెట్టుకోవచ్చు . రేపే కదా ! మా ఆవిడకు చెప్తాను . అహ లేదులే ఈ రోజే అంతర్జాలంలో బుక్ చేసి పేమెంట్ చేసేస్తాను . రేపే మనింటికి తెచ్చి యిస్తారు సరేనా  . ఖర్చు అయిపోతుందని ఆలోచించకు నీకంటే నాకెక్కువేదీ కాదమ్మా . నువ్వనుకున్నది అనుకున్నట్లు యిలా చేసేయమ్మా ! “
“ఏం చేస్తాను , నాకు ఓపిక లేనప్పుడు చేయకుండా అసలు మానేయటం కంటే , ఏదో రకంగా చేయటమే సరైన పధ్ధతనిపిస్తోందిరా నాకు కూడా . సరేలేరా  “
“ అలాగేలేరా అని ఫోన్ పెట్టేసింది భారతమ్మ .”
****
ఆ రోజు రానే వచ్చింది . ఈ నందికేశుని నోములోని 9 రకాల పిండివంటలలో , ప్రమధ గణాలలో ప్రధముడైన గణనాధుడికి యిష్టమైన వుండ్రాళ్ళ పిండివంట ఒక్కటే మొదటగా పెట్టుకొన్నారు . క్యాటరింగ్ వాళ్ళకి ఆర్డరిచ్చారు . ఉదయం 6.30 కే కావాలంటే 6 .15 కే వంటింట్లో నీటుగా సర్ది పెట్టేసి వెళ్ళిపోయారు వాళ్ళు . అనుకున్నట్లుగానే త్వరగ అయిపోయాయి సూర్యాస్తమయం కాకుండానే . ఇంకా కొంతమందికి పెట్టలేకపోయారు . మనసు కొంచెం చివుక్కుమన్నది . కాని ఎక్కువ పెట్టటానికి మనింట్లో జరుపుకుండే విందు కార్యక్రమం కాదాయె .
“ అంతా కొలమానంతో కూడుకొన్నదాయె . ఈ సారి యిలా కాదే కోడలు పిల్లా , రెండు పిండివంటలు పెట్టుకుందామె . అప్పుడు వచ్చిన వాళ్ళందరికి రెండు పిండివంటలు కొంచెం కొంచెం పెడితే అందరికీ పెట్టినవాళ్ళమవుతాము , మనకు రెండు ఒకేసారి అయిపోతాయే .”
6 మాసాలు గడచింది . ఇంతకుముందు అనుకున్నట్లుగానే శనగలు , చలిమిడి క్యాటరింగ్ వాళ్ళకి ఆర్డరిచ్చేశారు . మునుపటిలాగానే 15 నిముషాలకు ముందే తెచ్చి వంటింట్లో నీటుగా సర్దేసి వెళ్ళిపోయారు .
వాళ్ళ పిల్లతో కొంతమంది , ఇంకొంతమంది ఒంటరిగా వచ్చిన ఆడవాళ్ళు , అలా వస్తూనే వున్నారు ,. వచ్చినవాళ్ళకి వచ్చినట్లు వరుసగా వేడి వేడిగా వీళ్ళు వడ్డిస్తూనే వున్నారు చక చకా .  సూర్యుడు నడినెత్తికొచ్చేసరికి సగానికి పైనే అయిపోయాయి . హమ్మయ్య త్వరగా అయిపోతున్నాయి , యింకేముంది సూర్యాస్తమయం వరకు దేనికి ? 3 గంటలయ్యేసరికి సంపూర్ణంగా అయిపోతాయి అనుకొని ఆనందించారు .
మధ్యాహ్నం ఒంటిగంట దాటినప్పటి నుంచి ఆహ్వానించిన వాళ్ళ రాక మందకొడిగా సాగుతోంది . అడపా ,తడపా పరామర్శించటానికి వచ్చినట్లుగా అప్పుడొకళ్ళు , అప్పుడొకళ్ళుగా వస్తున్నారే గాని , శనగలు తిన్న వాళ్ళు చలిబిండి  తినటం లేదు . చలిబిండి తినేవాళ్ళు శనగలు తినటం లేదు .
చలిబిండి కొంచెమే వుంది గాని , శనగలు అయితే ఒక సోలెడు వరకు వున్నాయి . ఏం చేయాలో తోచక కంగారు పడ్తుంటే , “ కోడలా కంగారు పడకు మనవాళ్ళు అందుకే చెప్పారుగా అవి ఖర్చు కాకపోతే ఆవులకి పెట్టమన్నారు , అలా వీలులేకపోతే , మన యింటి ఆవరణలోనే పాతి పెట్టమన్నారుగా అన్నది భారతమ్మ . “
ఇలా తను అనుకున్న నందికేశుని నోములో 6 రకాల పిండివంటలు 3 సంవత్సరాలకు పూర్తి చేయగలిగింది అని చెప్పుకొంటుందే గాని , పూర్తిగా పదిమంది సాటి కులస్థులకు పెట్టి ఖర్చు చేయలేకపోయింది .
ఎందుకని పూర్తిగా చేయలేకపోతున్నాము అన్న ఆలోచనతో కోడలు పిల్ల మనసు ఎంతగానో బాధపడ్తోంది .
ఇదిలా వుంటే , “ ఆ మిగిలిన 3 రకాల పిండి వంటలు కూడా పూర్తి చేయవే . నేను పూర్తి చేయలేకపోయినది నాకోడలు పిల్లైనా చేసిందనుకొంటానే . ఇది త్వరగా పూర్తి చేశావంటే ,మీ అక్కయ్య గారి అబ్బాయికి ఉపనయనం చేస్తున్నారుగా , ఓ వేళ చేయకపోతే , ఏ గుడిలో ఎవరైనా ఉపనయనం చేసుకుంటుంటే , అక్కడకి వెళ్ళి . ఆ ఉపనయనంలో ఆ ఒడక పెళ్ళీకొడుకుకి నువ్వు ఉద్యాపన చేసుకొంటున్నావంటే , ఈ నోములు సంపూర్ణం అయిపోతాయి . ఆ తర్వాత
రేపొచ్చే రధసప్తమి నాడు మళ్ళీ ఇంకో నోము పట్టుదువు గాని ” అన్నది భారతమ్మ .
****
ఇంక అత్తగారికి ఓపిక తగ్గేసరికి తాను చేయలేకపోతున్నవన్నీ తన చేత  చేయించాలనుకుంటున్నట్లుగా ఆలోచన చేస్తున్నట్లుగా తోచింది . కారణం తను చదువుకొన్నా ఉద్యోగం చేయకుండా ఇంటి యిల్లాలుగా వుంటున్నందుకే కదా ఈ పరిస్థితి . తనే ఉద్యోగం చేస్తే ఈ సమస్యలలో యిరుక్కు పోవాలసిన పరిస్థితి తనకు రాదు అనుకొన్నదై భర్త చెవిలో చెప్పింది పడక గదిలో .
అంతా విన్న శ్రీనివాసు , “ సరే నువ్వు ఉద్యోగవేటలో వుండు . నేను అమ్మకు చెప్తాలే “ అన్నాడు .
“ హమ్మయ్య “ అత్తగారి నోముల నుంచి బయట పడ్డాననుకున్నది .
“ అలా తప్పుగా  అనుకోకు . ఈ నోముల విషయంలో ఆమె తప్పిదము ఏమీ లేదు . ఎందుకంటే ఆ పాతకాలంలో ఆడవాళ్ళు ఇంటినంటిపెట్టుకొని ఇల్లు , పిల్లల బాధ్యతలను చక్కగా తీర్చి దిద్దే నిర్వర్తించటంలో సఫలీకృతమయ్యే వాళ్ళు .
అస్సలు ఈ నోములు రధసప్తమి నాడే ఎందుకు పడ్తారంటే , సప్తాశ్వారూఢుడైన సూర్యభగవానుడిని ప్రార్ధిస్తారు . ఈ సూర్యుడివలన ఈ ప్రపంచంలోని జీవరాశులన్నింటి మనుగడకి మూలమైనది . ఈ సూర్య శక్తి అసామాన్యమైనది , అంతటా నిండి వున్నది . ఏడు రకాలుగా ఈ మానవ మనుగడకి వుపయోగపడ్తున్నది .
ఆ ఏడు రకాలు :
ప్రకాశము ,
ఉష్ణోగ్రత ,
చల్లదనం ,
ఉత్పత్తి ,
అరుగుదల ,
ఎదుగుదల ,
ఒదుగుదల .
ఇలాంటివెన్నో ఆ సూర్యుడి వలన మనం పొందగలుగుతున్నాము . అందులో కొన్ని ముఖ్యమైనవాటిని మాత్రం తీసుకొని , ఆ నాటి మన పూర్వీకులు కృతఙ్నతా భావాన్ని పెంపొందించదలచి యిలాంటి నోముల కార్యక్రమాలు ప్రారంభించారు . ఆ పరంపర లోనివే ఈ నోములు , వ్రతాలు .
ఇదీ అస్సలు అంతరార్ధం .
ఇది కూడా ఆ అంతరార్ధం లోని భాగమే .
ఈ నోములు అనుకొన్న ప్రకారం పూర్తి చేసిన తర్వాత , సాటి కులస్థులలో గాని , తమ బంధువర్గంలోని వారి పిల్లల ఉపనయన కార్యక్రమంలో ఉద్యాపన చేసుకోవాలంటారు . అంటె ఈ నోము వాళ్ళ యిలాకాలో పిల్లలకు వివాహ సంబంధాలు చూసుకొనేటందుకు ఈ సందర్భం బాగా ఉపయోగపడ్తుంది . ఆనాడు చిన్న వయసులోనే తమ చిన్న పిల్లలకు వివాహము చేస్తుండేవారు  కదా !
ఆ ఆడవాళ్ళకు బయట ప్రపంచంతో సంబంధాలు ఎలా ఏర్పడతాయి . అందుకని యిలాంటి కార్యక్రక్రమాలతో వాళ్ళను అలా దిగ్బంధనం చేశారు ఆనాటి మగమేధావులు . ఈ కార్యక్రమాల వలన ఆడవాళ్ళకి గాని అందులో పాల్గొనే వాళ్ళకి గాని సామర్ధ్య శక్తి అధికమవుతుంది . ఎలాగంటే , సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపల పూర్తి చేయటమంటె , నిర్ణీత సమయంలో అనుకున్నది అనుకున్నట్లు చేసే శక్తి సామర్ధ్యాలను పొందగలగటం . ఒక 5 శేర్ల సోలెడు అన్న కొలత కూడా ఆ కోవకు చెందినదే . ఆ పై సాటి కులస్థులకే పెట్టి ఆరగింపజేయాలి అంటే , సాటి కులస్థులెవరో మున్ముందు  సంబంధ బాంధవ్యాలు కలుపుకొనటానికని అర్ధం చేసుకోవాలి .
ఇలాంటివి చేయటం వలన , మనం కొంతైనా ఖర్చు చేయనిదే ఏ లాభం పొందలేము అన్నది మనం గ్రహించాలి . ఆనాటి సమాజంలోలా నేటి ఆడవాళ్ళు ఇళ్ళలో వుండిపోవటం లేదు . బయట మగవాళ్ళకు దీటుగా వాళ్ళు అన్ని రంగాలలో రాణిస్తున్నారు . మీకా అవసరం లేకపోవచ్చు . కాని ఆనాటి వాళ్ళు అలా అలవాటు పడినవాళ్ళు ఈనాటి ఈ విధానాలతో సమాధాన పడలేరు . వాళ్ళనీ వాళ్ళ విధానాలనీ తక్కువగా చూడవద్దు .”
భర్తని బిగి కౌగిలో బంధించింది ( చాలా కాలం స్టేట్స్ లో వుండి రావటం మూలాన అనుకొందాం, అంతేగాని ఏ మాత్రం తప్పుగా అనుకోవద్దు సుమా ! )
*** స *** మా ** * ప్తం ***
Print Friendly
    
 


దశల దిశలు


అకారానికి నాలుగు దశలు ఏర్పడతాయి ,

బాల్యం , యౌవనం , కౌమారం , వార్ధక్యం ,

బాల్యం లో తనకేం కావాలో తెలియకపోవటం వలన చుట్టు ప్రక్కల వాళ్ళందరి నడవడి ప్రభావం పడి ,
తనకు తెలియకుండానే గడిచిపోతుంది .

ఇక యౌవనం , ఈ దశలో అవయవాలు పెరుగుతూ , వాటికి కొన్ని అవసరాలుంటాయని , అవి తీర్చు
కోమని , తొందర చేస్తుంటాయి . ఈ తొందరలో దాదాపుగా పధ్ధతిగా ( నిజంగా తనకు భవిష్యత్తులో ) ఏం
కావలసి వస్తుందో తెలియనీయకుండా తొందర చేసి భవిష్యత్తుని అంధకారమయం చేస్తుంటుంది .  ఈ
దశలోనే ఈ దశలను అనుభవించిన వాళ్ళు , వాళ్ళ అనుభవాన్ని దృష్టిలో వుంచుకొని , కనీసం మిగిలిన
( తన ) వాళ్ళ జీవితాలు అలా కాకుండా ఉండాలని యోచించి ఆ యౌవ్వనులకు , వివాహాలు చేస్తుంటారు .
కొంతమంది వింటారు , ఇంకొంతమంది వినకుండా , మా జీవితం మాది , మాకు తెలుసు , ఎలా జీవిం
చాలో , ఎటువంటి వారిని నా సహచరులుగా ఎంచుకోవాలో అని ఆ దిశగా నడుచుకొంటుంటారు .

మూడవది కౌమారం : ఈ దశలో తాము వయసులో చేసిన పొరపాట్ల వల్లనో , లేక ఆ అలవాట్ల వల్లనో ,
తమకు కలిగిన సంతతిని అలా పెంచకుండా సక్రమంగా పెంచాలని ( తాము సరిగా పెరిగుంటే ఇలా ఆలో
చించటం సబబే . తాము అల్లర చిల్లరగా పెరిగున్నా , తమ పిల్లల భవిష్యత్తైనా చక్కగా ఉండాలన్న సదు
ద్దేశం కూడా  ఒక కారణం కావచ్చు ) ఎక్కువగా వెంటపడ్తుంటారు . తమ ఆనందాలను అనుభవించటా
నికి విశ్వ ప్రయత్నం చేస్తూనే ఉంటారు .

నాల్గవది వార్ధక్యం : పై మూడు దశలలో అనుభవించిన తదుపరి లభించే దశ ఇది . ఇక్కడ చాలావరకు
తమ వారసులను సరైన మార్గంలో వాళ్ళ జీవనం సాగించాలని , వాళ్ళను తమ అనుభవాలతో ప్రభావితం
చేయాలని ప్రయత్నం చేస్తూ , ఆఖరి పయనం కొరకు నిరీక్షిస్తుంటారు .


        **************
నా న్యూ నుడులు - 13

                                                                                                                                    రచన : శర్మ జీ ఎస్1.  మంచాలలో రక్తి  ,
    లంచాలతో విరక్తి .


2.  పాటలు పాడగలం 
   పాట్లు మాత్రంపడలేం

3. పదవి కొఱకు నాయకులు ,
 అరాచకాలను సృష్టిస్తారు .

4.  పెదవి కొఱకు  కాముకులు ,
     అత్యాచారాలకు ఒడిగడతారు .

5.  ఎదుటివాడు చేస్తే అది తప్పు ,
    అదే మనం చేస్తే గొప్ప ఒప్పు .

6.  ఆడవాళ్ళకు ఆభరణాలు అందం
        ఆడవాళ్ళకు ఆ భరణమూ ఆనందమే .

7.  స్వార్ధంతో సమస్యలు ఉత్పన్నమౌతాయి
      అర్ధం చేసుకొంటే దూరంగా పారిపోతాయి .

8.  ఆ వినాయకుడిని ఏమైనా , ఎన్నైనా అడగొచ్చు
       ఈ నాయకుడిని ఏలాగైనా , ఎప్పుడైనా కడగొచ్చు. 

9.  సహజంగా  చెప్పిందే  చెప్పటాన్ని నస అంటారు
పదే పదే అదే విషయాన్ని పదుగురితో చెప్పటాన్ని 
ఈనాటి పనసగా పేరుగాంచింది .


10. తన ప్రాణ రక్షణ కొఱకు ఎదుటి  జీవిని చంపటం తప్పు కాదట ,
    మానవులు తప్ప మరే జీవులైనా దీన్ని పాటిస్తే పేద్ద తప్పట ,
అదే అసలు సిసలు ధర్మమట

*******

తెలుసుకో - మసులుకో

                                                                                                                                              శర్మ జీ ఎస్


ఇల్లలకగానే పండుగ కాదు

తాళి కట్టగానే శోభనం కాదు

రోగం అప్పటికప్పుడు రాదు

వచ్చినా  , వెంటనే తగ్గిపోదు

స్థలం కొనగానే విలువ పెరగదు

నారు వేయగానే పంట పండదు

ఇల్లు కట్టి చూడు , పెళ్ళి చేసి చూడు

ఆలోచన రాగానే ఆచరణకు నోచుకోదు

ఎసరు పెట్టగానే అన్నం తయారు కాదు

ప్రేమించగానే పెళ్ళాము కాదు , మొగుడు కాడు

కడుపుతో వుండగానే పిల్లలను ప్రసవించలేరు

బ్యాంకులో డిపాజిట్ చేయగానే వడ్డీ కలవదు


ఇలాంటి వాటన్నిటి వెనుక మనకు కనపడకుండా ఒకటి దాగి వున్నది .
అదే కాలం .

ఇవన్నీ అందరకీ తెలిసినవే అయినా , వాటిలోని అంతత్రార్ధం తెలుసుకోకుండా ఫలితాల కొఱకు ఎదురు చూడటం . అవి అందనప్పుడు నిరాశ చెందటం పరిపాటి అయిపోయింది . అప్పుడు కాలాన్ని నిందించటం సర్వ సాధారణమై పోయింది .

అసలు ఈ ప్రపంచంలో మానవ మనుగడకు మూలాధారమైనది కాఇలం అని తెలుసుకొంటే సమస్యలు సమస్యలుగా కనపడవు . వెఱపు లేకుండా ఆనందంగా జీవించే అవకాశాలు అధికంగా లభ్యమౌతాయి .

                                                                    ********
వాడుక మఱచెదరేలా ?


                                                                                                                            వ్యాస రచన :శర్మ జీ ఎస్
                                                                      
                                                                       

                                                                               


ఒక్కడి కోసం ఎందరినో చంపటం అమానుషం 
ఎందరి కోసమో ఒక్కడు చావటం ఆదర్శం .

అసలు వస్తువు కనుగొనటానికి మూలకారణం ప్రజా ప్రయోజనాల కొఱకు మాత్రమే .
అలాంటి సదుద్దేశంతో కనుగొన్న పిమ్మట , వాటిని ఉపయోగించే వాళ్ళు దుర్వినియోగానికి పాల్పడటం శోచనియం .
అలాంటి దురుద్దేశాలతోనే ఆ కనుగొనబడిన మూలపురుషుడి ఆత్మ ఎంతగా ఘోషిస్తుందో , కళ్ళెదుట యిటువంటి ఘోరాలు అవలీలగా జరిగిపోతుంటే కళ్ళు చెమల్చని వాళ్ళుంటారా ?

తుపాకీ : కనుక్కొన్నది ఆత్మ రక్షణకు , దుష్టుల శిక్షకు .
ఆ పేరులోనే వుంది . 
అవసరమైనప్పుడు వాడితే అది తుపాకి
అనవసరమైనప్పుడు వాడితే తు పాకీ అని .

అణుబాంబు : కనుక్కొన్నది దేశ రక్షణకు మాత్రమే .

చలన చిత్ర నిర్మాణం పుట్టింది : సమాజంలో జరుగుతున్న పొరపాట్లను చూపిస్తూ , ఆ పొరపాట్లను ఎలా ఎదుర్కోవాలో చూపించటం . ఇందులో నీతి వున్నది .
కాని ఆ చలన చిత్ర నిర్మాణాన్ని బూతుల దృశ్యాలకు కేటాయించి మనుషుల మనస్తత్వాలను బళీన పర్చటం అతి పెద్ద నేరం .

టెలివిజన్ : ఎప్పటికప్పుడు సమాజంలో , దేశంలో , ప్రపంచాలలో జరుగున్న పరిణామాలను చూపించటం కొఱకు కనుగొనబడినది . ఆనందం అధికంగా కేటాయించబడినది . క్రమేపీ ఆ విషయం మఱుగున పడి ,కక్ష , కార్పణ్యాలు , ద్వేషా విద్వేషాలను , ఆడవాళ్ళ్కు ఆడవాళ్ళే శత్రువులుగను చూపించటం ఎంత ఘోరమో . 
ఎక్కడో ఒకచోట ఒక చిన్న పొరపాటు జరిగితే దానిని కొత్తవారితో చిత్రీకరించి , హంగామాల విశ్లేషణలతో ప్రసారం చేయటం నేరమే .

ఇలా సదుద్దేశంతో కనుగొనబడిన ప్రతిదీ దుర్వినియోగ పాలవటం , ఈ నాడు క్షిపణితో కూల్చబడ్డ మలేసియా విమానంతో సమానమే .

కనుక ఎవరికి వాళ్ళు కొంచెమైనా ఆలోచించి సద్బాటకు దోహదపడ్తే మఱి కొంత కాలానికైనా మంచే జరుగుతుందని ఆశిద్దాం .

ఆ మలేసియా విమానంలో అసువులు బాసిన వారి ఆత్మలకు శాంతి కలగాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను .

ఇక నైనా

                                                                                                                                               శర్మ జీ ఎస్

                                                                                 
                                                                                 


ఫేస్ బుక్ లో స్వాతి ఎకౌంట్ ఓపెన్ చేసింది
తన ఫేస్ ని చూపిస్తూ కొత్త ఫేసులను చూడ్దామనుకున్నది 
కొత్త కొత్త ఫ్రెండ్స్ పరిచయమౌతారని
ఆ ఒరవడిలో సూరజ్ సింగ్ తో పరిచయం 
ఒక్కరోజులోనే ప్రణయానికి దారి చూపింది 
ఫలితంగా అతనితో గుట్టుగా ప్రయాణించింది
ఆ పరిచయం తన ఫేటునే మార్చేస్తుందనుకున్నది
చివరికి తన ఫేస్ నే ఎవరూ గుర్తుపట్టనంతగా మార్చేసింది 
ప్రణయంగా మారుతుందనుకున్నది ప్రళయంగా మారింది .
చున్నీఈకి అర్ధం తెలుగులో పయ్యెద అని
పయ్యెద అంటే అసలు అర్ధం పై ఎద అని
ఎదపై వేసుకొనేది కనుక పై ఎద 
గుర్తుకొచ్చేటట్లుగా పేరు పొందింది .

*******

గమనిక : నూతనత్వం  మంచిదే . అయితే దానిని ఎలా వాడుకోవాలో అలాగే వాడుకొంటే అందువలన సత్ఫలితాలు వస్తాయి . ఓ వేళ రాకున్నా దుష్ఫలితాలు రావు .

దేనిని ఎలా వాడాలో అలా వాడకుండా వుంటే ఏదైనా దుష్ఫలితాలనే అందిస్తుంది .

ఉదా : సైకిలు మీద ఆడవాళ్ళు వెళ్ళదలుచుకున్నప్పుడు , చీరె , పరికిణీ , పావావడాల కంటే , పంజాబీ డ్రెస్స్ వేసుకొంటే చాలా మంచిది .
టూ వీలర్స్ మీద ప్రయాణించేటప్పుడు , ప్రYఅణానికి వీలుగా వుండేవి ధరిస్తేనే సుఖంగా వుంటుంది .అటువంటి చున్నీ మీద శ్రధ్ధ లేకుంటే పరిణామాలు యిలాగే ఉండే అవకాశాలు ఎక్కువగా వుంటాయి .

దీనినే ఆంగ్లేయులు చాలా సింపుల్ గా చెప్పారు . డ్యాన్స్ అకార్దింగ్ టు ద ట్యూన్ అని .
దాన్నే ంసన వాళ్ళు : ఏ ఎండకా గొడుగు పట్టమన్నారు . సరిగా అర్ధం చేసుకొంటే అందరికీ మంచిదే .

గ్రహించుకొని మసులుకొంటే మనుగడకెంతో మంచిది .

*******


మా నవ జీవనం

                                                                                                                                        రచన : శర్మ జీ ఎస్

బాల్యంలో నచ్చినవి ,
ప్రాయంలో నచ్చలేదు ,

ప్రాయంలో నచ్చినవి ,
యౌవనంలో నచ్చలేదు .

యౌవనంలో నచ్చినవి ,
కౌమారంలో నచ్చలేదు .

కౌమారంలో నచ్చినవి ,
వార్ధక్యంలో నచ్చలేదు .

వార్ధక్యంలో నచ్చినా , నచ్చకున్నా ,
వదులుకోక వెళ్ళక తప్పటంలేదు .

చివరగా ,
 ఏ వయసులో నచ్చాల్సినవి ,
ఆ వయసులో నచ్చక పోవటమే ప్రధాన కారణం ,
నచ్చిన వాటితో , నచ్చిన వారితో ,
ఆనందించలేకపోవటమే కదా 
ఈ మా(నవ )జీవనం

******

లేదే ఆ జాడ


                                                                                

                                                                                                                              కవితా రచన : శర్మ జీ ఎస్


ఏ దేశమేగినా ,
ఎందు కాలిడినా ,
పొగడరా నీ తల్లి ,
భూమిభారతిని ,
అన్నారు ఆ నాడు ఆ గురజాడ .

ఒట్టి మాటలు కట్టిపెట్టవోయ్ ,

గట్టి మేల్ తలపెట్టవోయ్ ,
అన్నారు అదే గురజాడ గారు .

మాతృమూర్తిని ,
మాతృభూమిని ,
ఎన్నటికీ మరువరాదు ,
నిజమే మరి .

ఎందరో మహానుభావుల
ప్రవచనాలను , సూక్తులను ,
వల్లె వేస్తున్నారు  , 
కాని ,
ఆచరించేవారే ,
కరువైపోయారు ,

ఏడా కానరాదే ,
 ఆ జాడ ఓ గురజాడ ........


 *******


నేను లేక నువ్వు లేవు

                                                
                                                                                                                             కవితా రచన : శర్మ జీ ఎస్


ఎక్కడెక్కడి వారినో కలుపుతుంది , 
దగ్గరున్నవారిని దూరం చేస్తుంది ,
ముక్కూ , ముఖం తెలియకుంటే ,
ఫేస్ బుక్ లో ఫేస్ చూపించుకోమంటుంది ,
ఒకరినొకరిని అందులోనే చూసుకోమంటుంది ,
వ్యవహారం తనే నడుపుతానంటుంది ,
ముద్దులు ముమ్మరంగా పెట్టుకోమంటుంది ,
హద్దులు దాట ప్రయత్నించమంటుంది ,
పదే పదే పని వదలి పింగ్ చేయమంటుంది ,
నేను లేక నువ్వు లేనే లేవంటుంది ,
నువ్వు లేక నేను లేననే స్థాయికి తీసుకు వెళ్తుంది 
తరచి చూస్తే నిజమేననిపిస్తోంది కదూ .

  
 *******

                        

నాడు - నేడు


                                                                                                                                        రచన : శర్మ జీ ఎస్
నాడు ,
అందరి సంపాదన యజమానిదే
ఆజమాయిషీ యజమానురాలిదే
అదే ఉమ్మడి కుటుంబం ,
అయినా ,
మదులు అంతా ఆ యజమాని ,
ఆ యజమానురాళ్ళవే ,
ఉమ్మడిగా కిచెన్ , డైనింగ్ & బాత్ రూములు మాత్రమే ,
డైనింగ్ మాత్రం మూకుమ్మడిగా ముగిస్తారు ,
ఎవరి గదులు మాత్రం వారివే ,
ఆ ఉమ్మడి కుటుంబమే ,
ఉన్నత కుటుంబం ,
కలసి వుంటే కలదు సుఖం అన్నారు 

నేడు ,
ఎవరి సంపాదన వారిదీ ,
ఆజమాయిషీ అందరిదీ ,
ఎవరికి వారే యమునా తీరే ,
ఎవరి కుటుంబం వారిదే,
ఎవరి గదులు , మదులు వారివే ,
పైకి కనబడేది స్వార్ధానికి ప్రతీకని , కానే కాదు ,
అవసరాలను బట్టి యిలా అడుగులేయవలసి రావటమే  ,
కూడా ఈ విఛ్ఛిన్నానికి ఓ కారణం అయి వుండవచ్చు .


         ******

నా న్యూ నుడులు - 12

                                                                                                                                      రచన : శర్మ జీ ఎస్

1 .  రాతను మార్చేది ఎవరో , కాని 
     వ్రాతను సరిదిద్దుకోవలసినది మాత్రం మనమే .

 2.  చెప్పు చేతిలోకి రాకూడదు ,
      చెప్పు చేతల్లో ఉంటే చాలు .

3.  శాసనాలు కలకాలం ఉంటాయి ,
     వాసనలు క్షణకాలమే ఉంటాయి .

 4 . నడక బాగున్నంత మాత్రాన సరిపోదు ,
     నడత బాగుంటే ఎక్కడైనా మెప్పు పొందగలం .

5 . ఓర్పుని ఎదుటివాళ్ళలో చూడాలనుకొంటుంటారు ,
    నేర్పు మాత్రం తమలోనే చూడమంటుంటారు .

6 . ఒకరికి ఆ మూల ఈశాన్యంగా భావిస్తారు ,
     ఆ ముందువాళ్ళకు అదే మూల వాయవ్యం .

7 . ఒకరు ఆ మూలని నైఋతిగా భావిస్తారు ,
     అదే మూలని అటు వాళ్ళు ఆగ్నేయంగా భావిస్తారు .

8 . శాస్త్రాలు మన ముందు తరాల వాళ్ళ అనుభవ సారాలు ,
    నేడు అవసరానికి వాడుకొనే అత్యంతోత్సాహ అస్త్రాలు .

9 . మార్పు ఎదుటివారిలో రావాలని కోరుకొంటుంటారు ,
     అదే మార్పు తలో రావాలంటే  మాత్రం తట్టుకోలేరు .

10 . ఒకరు ఓ పని చేస్తే తప్పుగా పరిగణిస్తారు ,
       అదే పని వారు చేస్తే ఒప్పుగా , బహు గొప్పగా భావిస్తారు  .                                                                                                             ( మఱి కొన్ని , మఱి కొన్నాళ్ళలో )

చాతుర్యుగాల జీవన సారాంశం

                                                                                                                              కవితా రచన : శర్మ జీ ఎస్


కృతయుగంలో ,
ఆకాశం నుంచి వెలువడ్డ  
వేద శాస్త్రాల సారాంశం ,
 ఉపనిషత్తుల సారాంశమూ అదే ,
ఇందులో మరే వాదానికి అవకాశమే లేదు ,
ఇదే ఆ లోకనాధుల  అంతరార్ధం ,
మన జీవితాకిలా అన్వయించుకోవాలి .

త్రేతాయుగం లో ,
సీతా రామ లక్ష్మణ ఆంజనేయులు ,
మానవులుగానే , మనలాగే జన్మించారట ,
ఈతి బాధలు మనలాగే  అనుభవించారట ,
శ్రీరాముడు పితృ వాక్య పరిపాలకుడట ,
పర స్త్రీ వ్యామోహితుడు కాదట ,
ఏకపత్నీ వ్రతుడట , 

సీతా దేవికి  వనమైనా , జీవనమైనా ,
భర్త సన్నిధే సకల పెన్నిధట ,
పతియే సతికి ప్రత్యక్ష దైవమట ,

లక్శ్మణుడు అన్న మాట జవదాటడట ,
వదినె సీతాదేవి  అతనికి తల్లితో సమానమట ,

శ్రీ ఆంజనేయుడు , రామనామమే ,
వరనామంగా భావించాడట ,
అంతులేని శక్తిమంతుడయ్యాడట ,

రావణాసురుడు ఎంత శక్తిమంతుడైనా ,
శివుని ఆత్మ లింగాన్ని సంపాదించినవాడైనా ,
పరస్త్రీ వ్యామోహంతో నాశనమైపోయాడట ,
ఆనాటి రామాయణమే ,
మన జీవనగమనానికి మార్గదర్శకం .

ద్వాపరయుగం లో ,
శ్రీకృష్ణుడికి సమాజ శ్రేయస్సే ప్రధానమన్నాడు , 
లౌకికం తెలుసుకొని వ్యవహరించాలన్నాడు ,
తననెంతమంది కోరుకుంటున్నా ,
అందినట్లుగా కనిపిస్తూ,
అందకుండా వుండాలన్నాడు ,
తామరాకు మీద నీటి బొట్టులా .

గోపికలు కోరికలకు ప్రతిరూపాలన్నాడు  ,

పాండవులు ,
పంచేద్రియాలకు ప్రతిరూపాలట ,
కర్ణుడు ఆరోప్రాణమట ,

కౌరవులు ,
అంతులేని కోరికలకు తార్కాణమట ,
దుర్యోధనుడు ఎంత గొప్పవాడైనా ,
ఓ ఆడది అవమానించిందని ,
అవమాన భారంతో , 
దుష్ట చతుష్టయ సావాసంతో ,
మానాల్నే మంటగలిపేశాడట ,
ఇదే మహాభారతమట ,

కలియుగం లో ,
యుగాలు మారేకొద్దీ ,
జనాభా పెరుగుతోంది ,
దేవుళ్ళ సంఖ్యా ,
అధికమౌతోంది ,
అదే నిష్పత్తిలో ,
ఇదే  యుగ ధర్మమట ,
దైవం ఎక్కడ  ? అని ప్రశ్నిస్తే ,
ఎక్కడా లేడంటారు , 
ఆ పై , ఎక్కడో లేడు ,  
క్కడే  వున్నాడంటూనే ,
ఎక్కడ లేడంటారు ?

దైవానికి మారుపేరు విశ్వాసమేనట ,
ఆ విశ్వాసంతోనే ,
ఎందరో దేవుళ్ళట ,
ఎందరో దేవతలట ,
ఏ దేవుడు చెప్పినా , 
ఏ దేవత చెప్పినా , 
మంచిగా బ్రతకమన్నాట , 
పదిమందికి సాయం చేయమన్నాట ,

ఇలా ఎందరో మానవులు మహానుభావులై ,
అన్ని సద్గుణాలతో దేవుళ్ళు , దేవతలై ,
పిలువబడ్తున్నారట , కొలువబడ్తున్నారట .

ఏ యుగానికైనా , ఎప్పటికైనా ,
ఇవే అసలు సిసలు పునాదులట 

ఇదే వేద శాస్త్రాల ( ఉపనిషత్తుల ) , రామాయణ , 
మహాభారతాల , నడుస్తున్న చరిత్రల అంతః సారాంశం , 
ఎఱిగి మసులుకుంటే  మన మనుగడే ఆ స్వర్గసీమౌను కదా ! .

******

మమ్ము వదలి.......                                                                                                                           పేరడీ పాట : శర్మ జీ ఎస్


( బాబూ మూవీస్ వారి ఆదుర్తి సుబ్బారావు గారు దర్శకత్వం వహించిన ఈ " మంచి మనసులు " చిత్రం 1962 లో విడుదలై విజయభేరి మ్రోగించబడింది . ఆ చిత్రానికి మన సుకవి మనసుకవి ఆచార్య ఆత్రేయ గారు వ్రాసిన ' నన్ను వదలి నీవు పోలేవులే అదీ నిజములే " అన్న పాటకు ఈ నాటి రాజకీయాలకు పేరడిగ వ్రాయబడ్డది .)

మమ్ము వదలి మీరు పోలేరులే అదీ నిజములే' ,
ఓట్లు లేక మీరు నిలువలేరులే... లేరులే ,
మమ్ము వదలి మీరు పోలేరులే అదీ నిజములే' ,
ఓట్లు లేక మీరు నిలువలేరులే... లేరులే .

ఓట్లు లేని మాకు విలువలేదులే ఇదీ నిజములే ,
మీరు  లేని మేము లేనె లేములే... లేములే  ,
ఓట్లు లేని మాకు విలువలేదులే ఇదీ నిజములే ,
                        మీరు  లేని మేము లేనె లేములే... లేములే  .                          

మీ మనసే చిక్కుకునే మా ఓట్ల వలలో ,
మా ఓట్లు మీ నోట్లు నిండెను మీ మదిలో ,
మీ మనసే చిక్కుకునే మా ఓట్ల వలలో ,
మా ఓట్లు మీ నోట్లు నిండెను మీ మదిలో ,
చిరకాలపు మీ కలలే ఈ నాటికి నిజమాయే ,
దూరమైన ఆ స్థానాలు చేరువైపోయె ఓ... ,

ఓట్లు లేని మీకు విలువలేదులే ఇదీ నిజములే ,
                           మేము లేని మీరు లేనె లేరులే... లేరులే .                           

మందు మత్తులో కనులు మూసుకుని ,
మొఖము వంచుకుని ,
చెయ్యరాని ఘోరాలు చెయ్యమని , 
మందు మత్తులో కనులు మూసుకుని ,
మొఖము వంచుకుని ,
చెయ్యరాని ఘోరాలు చెయ్యమని .
ఆకర్షించే ఆ సీటులో అమాంతంగా కూచొని ,  
                        పొంగిపోయే శుభదినం రానున్నదిలే ఓ... ,                           

మమ్ము వదలి మీరు పోలేరులే అదీ నిజములే' ,
ఓట్లు లేక మీరు నిలువలేరులే... లేరులే .


అసెంబ్లీలో  అగపడుతూ , తడబడుతూ  మెలమెల్లగా ,
మీరు కూర్చోగా , 

ఆ సీటు హొయలు మీలోని పొగరు మాలోన ,
కంగారు రేపగా , 

నాయకులు కలసి ఉయ్యాలలూగి అవకాశమే ,
అందుకొనగా ,
      పైపైకి సాగి అసెంబ్లీలు దాటి అందరాని స్థానాలు అందుకోగా ,  

                ఆహా..ఓహో..ఉహూ...ఆ..ఆ..ఆ... ,                          

ఓ...మిమ్ము వదలి మేము పోలేములే ఇదీ నిజములే ,

మీరు లేని మేము లేనె లేములే..లేములే  ,

ఓ...మిమ్ము వదలి మేము పోలేములే ఇదీ నిజములే ,

                      మమ్ము వదలి మీరు పోలేరులే అదీ నిజములే' .                       


                                                                                                    ******                                                                                                                                                                                                                                

ఓటు - వేటు

                                                                                                           
                                                                                                                                     రచన : శర్మ జీ ఎస్

దవాఖానాలో ఉన్నా ,
ఆఖరికి ,
పాయిఖానాలో వున్నా , 
చిట్లించుకొంటున్నా ,
ఛీదరించుకొంటున్నా , 
నాకూ , నా వాళ్ళకి ,
యిచ్చినంత ప్రాముఖ్య ,
వాళ్ళ భార్యకే కాదు ,
వాళ్ళను కన్నవాళ్ళకు గాని ,
వాళ్ళు కన్నవాళ్ళకు గాని ,
ఇవ్వనే యివ్వరు ,

వాళ్ళ 5 ఏళ్ళ రాజకీయ భవితవ్యాన్ని ,
తేల్చే వాడిని , నేనేనని  ,
( ఓటరుని  కదా ! )
కటిక నేలపైనైన ,
ఏ నాయకులైనా  , 
నాకొఱకు పడిగాపులు కాస్తారు ,

అలా నా ఓటు అందుకున్నాక ,
అదేనండి , 
రేపు గెలిచాక ,
ఆ పదవులను అంటిపెట్టుకొని , 
ఆ సీటు కొఱకు తాము వెచ్చించిన దానికి ,
పదింతలని రాబట్టుకోవటంలో వాళ్ళు చూపే శ్రధ్ధలో , 
నన్నే మఱచిపోతారు ,
మఱచిపోవటం మానవ నైజమేనని ,
అనుకొని సర్ది చెప్పుకోవచ్చు ,
కానీ , 
నేనెవ్వరో గుర్తు చేసినా , 
గుర్తుకు వచ్చినా , రానట్లు , 
అసలు తెలియనట్లు ప్రవర్తించే ఆ తీరుకే , 
ఓటు వేయాలన్న మనసు ,
కలగటం లేదు ,
 ఆలోచనే రావటం లేదు ,
చదువుకున్న నాకైనా , 
చదువు తెలియని మా అమ్మా , అయ్యలకైనా ,
డొనేషన్లు కట్టి చదువు కొనే నా వారసులకైనా .

  ******

(ని)దర్శనం


                                                                                                                                      రచన : శర్మ జీ ఎస్నా(యకుల)కు రెండే రెండట ,
మొదటిది సీటట , దానికే ఓట్లట ,
ఏం చేయటానికైనా వెనుకాడరట .

నా(యకుల)కు పార్టీ ముఖ్యంకాదంటారు ,
అధికారమే ముఖ్యమంటూనే 
అదీ ప్రజాసేవకంటారు .

ఎజెండాలేమిటంటే ,
ఏ జెండా ఐనా ఫరవాలేదంటారు  ,
లెజెండునయితే చాలంటారు .

ఆ సీటు కొఱకు ,
ఏ గడియైనా తడతానంటారు ,
ఏ చర్యకైనా వెనకాడనంటారు .

ప్రజలకు దగ్గరయ్యేటందుకు ,
ప్రజాసేవ చేసేటందుకు ,
ఇదొక్కటే అనువైన మార్గమంటారు .

జయంతి , వర్ధంతులకు కనపడ్తారు ,
దండలు వేస్తారు , ఫొటోలకు పోజులిస్తారు ,
చప్పట్లు కొట్టించుకొంటారు .

నేటి బాలలని రేపటి పౌరులుగా చాటేస్తారు ,
తమకే తప్పక ఓట్లెయ్యాలని వాటేసుకొంటారు ,

ఈ ఎన్నికల ప్రచారంలోనే వారి మహద్దర్శనం ,
ఆ పై కానరారు అదే వారి రాజకీయాలకు నిదర్శనం .

******

మీ మా లు


                                                                                                                                     రచన : శర్మ జీ ఎస్

" ఎన్నికలు " అంటేనే , మనకు కావల్సిన అనటం కంటే , మనలను చక్కగా పరిపాలించేవాళ్ళను " ఎన్నిక " చేసుకోవటమని మనందరకు తెలిసిన విషయమే .

మన " ఎన్నిక " ఎలా వుండాలంటే , "మన్నిక " కెంత ప్రాధాన్యత యిస్తామో , అలాగే ఈ ఎన్నిక(ల )కు కూడా అంతకంటే అధిక ప్రాధాన్యతను యీయవలసి వుంటుంది .  

మనం ( ఓటర్లు ) ఈ విషయాన్ని ఎన్నటికీ మఱచిపోకూడదు . 

మనలను సక్రమంగా పరిపాలించే నాయకులను మనమే ఎన్నుకోవటం స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి మనకు ఆనవాయితీలోకి వచ్చింది . 

ఆ ఆనవాయితీ క్రమేపీ వారసత్వంలోకి మారింది . 

ఆ వారసత్వం ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఎగబాకింది .

ఆ వారసత్వ పోరుతోటే సుపరిపాలన అందించే నాయకులను ఎన్నుకోవసిన ఈ ఓటర్లను తికమక పెట్టి వాళ్ళ వారసత్వాధిపత్యాన్ని కొనసాగించేటందుకు గాను , 

కొన్నాళ్ళు ఓటర్లను మద్యానికి , 
కొన్నాళ్ళు ధనానికి , 
కొన్నాళ్ళు వాళ్ళ స్వ అవసరాలను తెలుసుకొని వాటిని అందిస్తూ వచ్చారు . అలా కొంతకాలం సాగింది .

ఎప్పుడైతే వాళ్ళ వారసత్వపు పరిపాలనా దక్షతకు , ఆధిపత్యపు ఆటలకు అడ్డుకట్ట పడినదో ,అప్పుడు కొత్త కొత్త ఆలోచనలతొ , పోటీదారులను ఎక్కువ మందిని వాళ్ళే నిలబెట్టి , ఓట్లను చీల్చి , వాళ్ళు అనుకొన్న విధంగానే , ఆ వారసత్వపు పరిపాలనా అధికారాన్ని మఱల చేజిక్కించుకోవటం అలవాటు చేసుకొంటూ వచ్చారు . 

ఐతే  , ఈ మార్గాలన్నీ మూసుకు పోయేసరికి , ఎవరితో స్నేహం చేసి అయినా సరే అధికారం దక్కించుకోవాలన్న ఉద్దేశ్యంతో , తోటి రాజకీయ పార్టీలను ( తమకంతకు ముందు శత్రువులైనా సరే ) స్నేహబంధం అనే ఎత్తుగడలతో పొత్తుల పొత్తాన్ని బైటకు తీసి ఎదురుచూస్తున్నారు .

గతంలో లాగా ప్రజలు ఇప్పుడు వెఱ్ఱివాళ్ళు కారు అన్నది అన్ని రాజకీయ పార్టీలు గ్రహించటం చాలా అవసరం వారి భవిష్యత్ కార్యాచరణలకు .

ఓనాడైతే , ఆ నాయకులు ఏం చెపితే అది విన్నారు , నమ్మారు  ఓటర్లు . 

కాని నేడు అలా కాదు . ప్రసార మాధ్యమాల ( రేడియో , పత్రికలు , బుల్లితెరల ) పుణ్యమా అన్ని విషయాలు ( జరిగిన ) అరక్షణంలోనే తెలిసిపోతున్నాయి  ఓటర్లకు .

అందువలన ఓటర్లు జాగృతులైనారన్నది నాయకులు మఱచిపోరాదు .

మద్యంతో , మనీతో , గూండాయిజంతో , అధికారాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నం చేయకండి నాయకులారా ! 

చూపులకి , కాగితాలకి పరిమితమయ్యే బూటకపు ప్రజా సంక్షేమ ఆకర్షణ పధకాల ప్రణాలికలతో ఓటర్ల వద్దకు రాకండి .  

అమలు జరపగలిగే ఆచరణ యోగ్యమైన , అర్ధవంతపు చేతలతో ఓటర్ల వద్దకు రండి .  ఓట్లు అడగండి .

గెలిచి , అధికారానికొచ్చిన తర్వాత మీరిచ్చిన   ఆచరణ యోగ్యమైన ప్రణాలికలోని అంశాలను ఆచరణలో పెట్టండి .

ఈ విషయాలు మీకు తెలియనివని చెప్పటం లేదు . ఓట్ర్ల నాడి మారిందని తెలియచేస్తున్నా . 

తెలుసుకొని తదనుగుణంగా మసులుకొంటే రాబోయే తరాల నాయకులకు మార్గదర్శకులౌ తారు . చరిత్రలో చరిత్రకారులౌతారు .
లేకుంటే చరిత్రహీనులుగా మిగిలిపోతారు .

కనుక నాయకులూ యికనైనా తెలుసుకొని మసులుకొంటే మీ , మా మనుగడకే మంచిది .
  
                                                                                                       ********

ధనం , ఇంధనం , సాధనం


                                                                                                                                      రచన : శర్మ జీ ఎస్ 

ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని తెలిసిన నాటి నుంచి  ప్రతి రోజు బుల్లితెరలో  నిత్యం నల్లధనాన్ని పట్టుకుంటున్న వివరాలన్నీ పోలీస్ అధికారులు , ఎన్నికల అధికారులు కూడా ఎప్పటికప్పుడు తెలియచేస్తుంటే , అన్నీ ప్రత్యక్షంగా చూస్తూనే వున్నాము , వింటూనే వున్నాము , పత్రికలలో నిత్యం చదువుతూనే వున్నాము .

అంతగా పట్టుబడ్తున్న ఆ నల్లధనం యిప్పటికి 6.48 కోట్ల వఱకు చేరిందని , మఱల ప్రభుత్వానికే చేరిపోతుందని వింటున్నాము . 

వాస్తవంగా ఆ నల్లధనం అక్రమంగా నాయకులు ఓటర్లకు లంచం రూపంలో ముట్టజెప్పదలచుకొన్నదే గదా!  

మన ఈ ఆంధ్ర రాష్ట్రంలో కనీస అవసరాలు కూడా లేని పరిస్థితులలో అట్టడుగున జీవిస్తున్న కోట్ల మంది ప్రజలను , పల్లెలను నిత్యం ప్రముఖ పత్రికలలో చిత్రాలతో చూస్తూ చదువ్తున్నాము  , బుల్లితెరలలో దృశ్యాలతో సహా చూస్తున్నాము కూడా చూస్తున్నాము , వింటున్నాము .

అలాంటి ఆ ధనాన్ని మఱల ప్రభుత్వానికి చేర్చి గమ్ముగా కూర్చొనే కంటే , ఆ నల్లధనాన్ని యిలాంటి వాటికి ప్రభుత్వాధికారుల పర్యవేక్షణలో వాటి బాగోగులకు వినియోగించటం అన్ని విధాలా శ్రేయస్కరం .

ఆ నల్లధనాన్నిలా సద్వినియోగం చేస్తే , భవిష్యత్తు ఎన్నికలలో ఎవ్వరూ ఓటరల్ ధనాన్ని పంచాలనుకోరు . ఎందుకంటే , వాళ్ళ నల్లధనం వాళ్ళ పేర్లతో ( కనీసం ) వినియోగం కావటం లేదు కదా! .

ధనం సమాజ శ్రేయస్సుకి ఉపయోగపడినప్పుడు అది ఇంధనమౌతుంది , సాధనమౌతుంది .

గమనిక : ఈ వ్యాసాన్ని ఏప్రియల్ 4 వ తారీఖున ఈనాడు తెలుగు దినపత్రికకు పంపగా వారు ప్రచురించలేదు . అందువలన ఈ వ్యాసాన్ని నా బ్లాగులో ప్రచురించటమైనది . 

                                                                                                            *******