మే డే నేడే
ఆనాడు ,
ఏ బాసవారైనా అచ్చట బానిసలే

గట్టిగా ఊపిరి పీల్చనీయకుండా
వెట్టి చాకిరీతో ఊపిరి పీల్చేవారు

కడుపు పట్టుకొని చేత్తో
కడుపుకి కట్టుకున్న పసికందులతో
పగలనక రాత్రనక
నడుం వంచి , నడిఎండలో
వెట్టి చాకిరీ చేయించేవారు
వట్టి చేతులు చూపేవారు
వారే ఆ తెలివిమీరిన తెల్లవారు ,
తెల్ల గుఱ్ఱాల తేరుపై 
ఇంద్ర పదవులను అనుభవిస్తున్నారు,
ఆ తెలివిమీరిన తెల్లవారు .   

ది కామందుల మతం , కాదు
కామందులుగా కనపడే రాబందుల మదం
ఈ కామందులనే రాబందులపై
ప్రశ్నల బాణాలు గుప్పించింది
మారుతున్న యువతరం
"   మేం మనుషులమే  , పశువులం కాదు " 
పశువులకీ ఉంది స్వేఛ్ఛ
మాకూ కావాలి స్వేఛ్ఛ
8 గంటల చాకిరే చేస్తాం
అంతకుమించి చేసేవి సమ్మెలు  
దేనికైనా ఉండాలి మితం
మితంగా ఉండటమే మా మతం
ఇదే మా అందరి సమ్మతం
చికాగో శ్రామికులు 
ఎన్నో పోరాటాలు జరిపి
కోలాటాలు మ్రోగించి ,
ప్రాణాలు పణంగా ఒడ్డారు
ఇదే ఆ డే 
ఆ డే మే డే నేడే
చికాగో కార్మికులు
చిరస్మరణీయులు  సదా .

      ******
ముద్దులు


( ఈ కవితలు ' ఆదివారం ' 6-12-1981 న ప్రచురితమైనది )

ముద్దులు 

కలసి ఉన్న 
పెదవులు
విడిపోతూ 

ఒకరిని
ఇంకొకరిని
కలుపుతూ
చెక్కిళ్ళను
స్పృశిస్తూ
కలుస్తాయి
ఆ పెదవులు

సవ్వడితో 
జనిస్తాయి
ముద్దులు

  ***** 


ప్రళయ తాండవం


దివిలో
ఉఱుముల
వాయిద్యంతో
వాన 
పాట 
పాడుతుంటే

గాలి
వంత పలుకుతోంది

మెఱుపుల
తళతళలే
నాట్య భంగిమలై
ప్రళయ తాండవం
చేస్తున్నాయి
భువిలో .

   ***

అంగరక్షకుడు

                                                                                                                                                                                                                                               
                                   ( ఈ  కధ  29-04-1994 మయూరి వారపత్రికలో ప్రచురించబడినది )
                                 

"   సృజనా డాళింగ్ ! తొందరపడకు, ఆ మూడు ముళ్ళ తర్వాతే ఏ ముచ్చటైనా ఎచ్చటైనా "   అన్నాడు రాజేష్.

"   ఏమిటి డియర్, మన యిరువురం గాఢంగా ప్రేమించుకొన్నాం . రేపో మాపో పెళ్ళీ చేసుకోబోతున్నాం . ఇంకా ఆలస్యమెందుకు ? ఆ ఆలోచనెందుకు ? ఆ ఆనందాలందుకునేటందుకు "   అన్నది అన్నింటా లేడీస్ ఫష్టేనని మరో మారు నొక్కి చెప్పాలనుకున్న సృజన .

"   నువ్వు చెప్పినవన్నీ నిప్పులాంటి నిజాలే . ఈ నిజాల వెనక నీడలా దాగివున్న అసలు విషయం గ్రహించలేకపోతున్నావు. ఆ ఆనందాల మాటున ఆపద పొంచి వుంది . ఈ రోజు మొగ్గామంటే యిదే అలవాటు చేసి పదిమందిలో తల వంచాల్సిన పరిస్థితిని కలుగజేస్తుంది . అందాకాఆగితే చాలా మంచిది "

"   మఱి పెళ్ళెప్పుడు చేసుకొందాం ? "

"   పరీక్షలుఅయిం తర్వాత ."     

"  ముందే చేసుకొంటే అంతరాయమా ? "

"   ఆనందాలకు అంతరాయమే . ప్రాక్టిసు కంటే టెస్టులకే ఎక్కువ టైం తీసుకొంటుంది . అదే హాలిడేస్ లో అయితే హాయిగా ఎంచక్కా ప్రాక్టీసుని  ఎన్నో ట్యాక్టీసులతో , హనీమూన్ కి వెళ్ళి ఎంజాయ్ చేసెయచ్చు ."

"   అమ్మో అంతవరకు ఆగలేను డియర్ . "

"   అప్పటివరకు పై పై వ్యవహారాలతో సర్దుబాటు చేసుకో  "   అంటూ ముందుకు జరిగి  గట్టిగా కౌగిలించు
కున్నది . పబ్లిక్ పార్క్ అన్న విషయం గుర్తున్నా , విషయం తన వ్యక్తిగతమనుకొని అలాగే అయిదు నిముషాల సమయం ఆనందించింది .

"   డాళింగ్ ! ఈ రోజుకి యింతటితో ముగిద్దాం , పద పోదాం "   అంటూ లేచాడు .

                                                      ********
"
   సృజనా ప్రదీప్ తో నీ పెళ్ళి ఖాయం చేశాం "   అన్నది తల్లి.

"   బావతోనా ? "

"   అవునే . నువ్వు భూమిమీద పడ్డనాటి నుంచి అనుకొంటున్నదే . "

"   ఎవరినడిగి నిశ్చయించారు ? "

"   అడగవలసిన అవసరమేమున్నది యిందులో ? "

"   నా పెళ్ళి నన్నడిగి చేయాలి . మీ యిష్టం వచ్చినట్లు చేయకూడదు ".

"   కన్నప్పుడు నిన్నడిగి కన్నామా ? కావాలనుకున్నాం ,కన్నాం .మంచి సంబంధం చేయాలనుకున్నాం , చేస్తున్నాం అది మా బాధ్యత "   అన్నాడు అంతవరకు మాట్లాడకుండా కూర్చున్న తండ్రి .

"   నన్ను పెంచటంతోపాటు నా మంచి కోరే బాధ్యత మీమీద వుండవచ్చు . నేనెల్లప్పుడూ మీ పంచనే వుండేటట్లయితే ( పెళ్ళైనా ) నా పెళ్ళి కూడా మీ స్వవిషయమే నాన్నగారూ, కాని పెళ్ళి తర్వాత అంతవరకు ప్రాణపదంగా చూడబడిన ఈ కన్నెపిల్ల కన్నవాళ్ళ చేతనే , చుట్టపుచూపుగా చూడబడ్తున్న ఈ సమాజంలో ఎవరి జీవితం వారికి స్వంత విషయమే అవుతున్నది. రాజేష్ ని ప్రేమించాను . అతనినే వివాహం చేసుకుంటున్నాను ". 

"  ఎవరో ముక్కూ, ముఖం తెలియనివాడిని చేసుకోవటం దేనికి ? "  అన్నది తల్లి .

"   బుధ్ధిమంతుడు , అందగాడు , వయసులో వున్నవాడు .ఇంతకు మించి యింకా ఏం తెలియాలి ? నేనంటే ప్రాణమిస్తాడు "  . 

"   చూడమ్మా  ప్రదీప్ స్వయానా రక్తం పంచుకొని పుట్టిన నా తోబుట్టువు కొడుకమ్మా . ఈడూ జోడుగా వుంటుందమ్మా, కాదనకు"  అంటూ బ్రతిమలాడుతున్నట్లుగా ,నెమ్మదిగా ఆకళింపు చేసుకోమన్నాడు తండ్రి .

"   బావలో ఈడు మాత్రమే మిగిలింది .అవిటితనంతో జోడు చెదిరింది .జోడులేని ఈడు నాకవసరం లేదు "   .

"  ఆ అవిటితనం పుట్టుకతో వచ్చినది కాదుగా . మధ్యలో వచ్చినదానికి ఏం చేస్తాం ? రేపు చేసుకున్న తర్వాత వస్తే ఏం చేస్తాం ? వదిలేస్తామా ? అలా అనకమ్మా "   అన్నాడు .

"   చేసుకున్న తర్వాత వస్తే వదిలేయలేమని చూస్తూ చూస్తూ అవిటివాడిని చేసుకోలేం నాన్నగారు . ఇదే పరాయివాడు అవిటివాదైతే మీరిచ్చి చేయగలరా ? మీ చెల్లెలి కొడుకని మీరంతగా అభిమానం చూపిస్తున్నారని అర్ధం చేసుకొంటున్నాను . మీమీద నాకే కోపం లేదు . పెళ్ళంటూ చేసుకుంటే రాజేష్  నే చేసుకుంటాను . మీరాశీర్వదించాలనుకుంటే మీచేతుల మీదనే పెళ్ళి జరిపించండి. లేకుంటే గవర్నమెంటు వారుండనే వున్నారుగా , వాళ్ళే జరిపిస్తారు , ఆశీర్వదిస్తారు .

"   కొంత వయసు వచ్చిన తర్వాత చెప్పి చూస్తాం , వినకుంటే వారి దారికే మాలాంటి పెద్దలు వస్తారు "  అన్నాడు తండ్రి .

                                                                       ********

" బావా బాగున్నావా ? "

"   నేనింకా గుర్తున్నానా సృజనా ? "

"   అదేమిటి బావా , నిన్ను చేసుకోనంతమాత్రాన బంధుత్వాన్నెలా మరచిపోతాను " .

"   ఎపుడొచ్చావ్ ? అన్నయ్యగారు కులాసేనా ? "

"   సాయంత్రమే వచ్చాను. ఆయనగారు కులాసే. అవును అక్కయ్యనెప్పుడు చూపిస్తావు ? "

"   ఇప్పట్లో అటువంటి ఆలోచనలు లేవు ".

"   ఎందుకని ?"

"   అనుకున్నవి ( అనుకోకుండా ) జరగకుండా ఆగినప్పుడు  , అనుకోవటం అనవసరమని నిపించింది ".

"   ఒంటరి జీవితం భారమైపోదూ !".  

"నా పనులు నేను చేసుకోగలను ఈ కఱ్ఱ తోడుతో. ప్రశాంతత మనసుకి సంబంధించినది . మనసు యిష్టపడని పనిచేసి ఆ మనసుకి అశాంతిని అందించటానికి అంగీకరించలేకపోతున్నా ".

"   పెళ్ళి చేసుకుంటే ఈ శ్రమ తప్పుతుంది, హాయి కలుగుతుంది కదా ? "

"   ఎవరిని చేసుకోను ? "

"   ఎవరినైనా, నీకేం తక్కువ . గవర్నమెంటు ఉద్యోగస్థుడివి.నీవు రెడీ అనాలే గాని రయ్ మంటూ సంబంధాలు వచ్చి నీ ముంగిట వాల్తాయి  " .

"   పుట్టుకతో వచ్చింది కాకున్నా , పిలవని పేరంటంలా వచ్చి తిష్ట వేసుక్కూర్చొన్న ఈ అవిటితనాన్ని మఱచిపో ప్రయత్నిస్తున్నా. వయసులో వున్న వరుసైన మఱదలుపిల్లే చేసుకోలేదంటే , అతనిలో ఏ లోపముందోనని అనుమానించి నన్ను చేసుకోవటానికి ఎవరు ముందుకు దూకుతారు ".

"   అంతటి నింద వేయకు బావా. ఇప్పటికే నేనెంతగానో కుమిలిపోతున్నా".

"   మొదటి నుంచి నిన్ను అమితంగా ప్రేమించిన నెను మధ్యలో వచ్చిన నీ అవిటితనాన్ని చూసి అసహ్యించు కొన్నాను .ఆ సమయంలో నా కళ్ళకు అందంగా కనిపించిన రాజేష్ ని ప్రేమించాను.ఎన్నోమారులు తొందర చేశాను . ప్రతి సారి , తొందరపడకు సృజనా డాళింగ్ అంటూ నీతి వాక్యాలు చెప్తూ కాలం గడిపేవాడు  . ఏ రోజూ తొందర పడేవాడు కాదు , తీరా ఆ రోజు రానే వచ్చింది .
అంతవరకు ఎదురుచూసిన ఆనందం ఆ రోజు పొందబోతున్నానని ఎంతగానో మురిసిపోయాను . నాలుగు గోడల నడుమ , మల్లెల పానుపుపై సరసాలతోనే తెల్లవారిపోయింది , సల్లాపాలతో మాత్రం కాదు.గత 6 నెలలో అన్ని రాత్రులూ అలాగే గడిచిపోయాయి . ఎన్ని మారులు సిగ్గు విడిచి వేడుకున్నానో , ప్రయోజనం మాత్రం శూన్యం .గమ్యం చేరుకోలేనని , చేరుకున్నదానితో సంతృప్తి పడమని , లేనిదాన్నిగురించి తను బాధపడనని ఏదో మెట్ట వేదాంతంతో కాలక్షేపం చేశాడీనాటి వరకు .ఏం చేయగలను ? ఓ ఆడది ఓ మగవాణ్ణి పెళ్ళీ చేసుకొనేది దేనికొరకు ? ఆ ఆనందం కొరకు , తోడుగా , నీడలా వెన్నంటి ఉంటాడనేగా కదా ! ఆ ఆనందమే లభించని నాడు ఆ పెళ్ళికి అర్ధమేమున్నది ? సార్ధకత ఏమున్నది ?
బావా పదే పదే ముందడుగు వేసి తొందర చేసినా దూరంగా తిరిగాడు  . ఈ నాటి వరకు ఆ ఆనుభవం చవి చూడలేకపోయానంటే నమ్మలేకపోతున్నావు కదూ , నిజం బావా ,  ఇలా మనసు విప్పి చెప్తునందుకు తప్పుగా తలచకు"   అంటూ తన గోడును అతని ముందు వెల్లడించింది .

"   అంతగా నష్టపోయావా సృజనా ! "   ఓదార్పు హృదయంతో అన్నాడు .

"   ఇలా తెగించి అడుగుతున్నందుకు మరో విధంగా అనుకోకు .ఇంకా నువ్వు పెళ్ళి చేసుకోలేదుగా . ఒక్కమారు ఆ ఆనందం అందించమని అర్ధిస్తున్నాను , ప్లీజ్ కాదనకు . పరాయి వారితో ఆ ఆనందం పంచుకునాలనే మనస్తత్వం నాకు లేదనీ నీకూ తెలుసు . వరుసైనవాడివి , నామీద మనసైన వాడివి కనుక నిన్ను అడుగుతున్నాను"    అంటూ తన అంతరంగని అభ్యర్ధన అతని ముందుంచింది .

"   బాధపడకు , నీకీ స్థితి కలిగినందుకు నేనెంతగానో చింతిస్తున్నాను నీ శ్రేయస్సు కోరేవాడిగా  . ఆ ఆలోచన మానెయ్ . అన్యస్త్రీ పొందు అనర్ధాలకు విందు లాంటిది అన్నారు " .

"   లేదు బావా. నీకు నీవుగా నన్ను పొందాలనుకున్నా , ఆ ఆనందం నా భర్త నుండి నేను పొందుతూ , మరొకరి నుంచి పొందాలనుకోవటం తప్పుగా పరిగణించడుతుంది . కాని యిప్పటి నా స్థితి యిందుకు పూర్తి భిన్నం . ఏ ఆనందం కొరకు ఆడపిల్ల ఓ కొత్త వ్యక్తితో జీవితకాలపు జీవనాన్ని సాగించాలని కన్న తల్లితండ్రులను , 
తన తోబుట్టువులను వదలి వెళ్తుందో , ఆ ఆనందం దొరకనప్పుడు , అందుబాటులో వున్న చోట పొందటం పొరపాటు కాదని అభిప్రాయపడ్తున్నాను "   అన్నది .

"   నీవంటున్నది కొంతవరకు నిజమే కావచ్చు . కానీ యిది ఎంతవరకు సమంజసం ?"   అంటూ ఆలోచనలో పడ్డాడు .

అలా ఆలోచనలో వున్న అతనిని అమాంతంగా "   ముమ్మాటికీ అంతే బావా "   అంటూ భుజం చుట్టూ చేయివేసి ముద్దులతో ముంచెత్తుతూ , శృంగారానికి శ్రీకారం చుట్టింది .

 ఎన్నోమారులు తను పొందాలని కోరినా , అవకాశం యివ్వని మఱదలు పిల్ల , ఈ రోజు తనంత తానే ముందుకు దూసుకుపోతుంటే , అంతకుమించిన అదృష్టం తన స్థితికి ఎక్కడినుంచి వస్తుందని అమాంతంగా మెడ చుట్టేసి సృజన సాయంతో  పడక  వైపు నడిచాడు .

ఇరువురూ ఏకబిగిన ఏడడుగులు నడిచారు . పడకచేరి తన గుండె చప్పుడు వినమని తన హృదయాన్ని అతనికందించింది . మంత్రముగ్ధుడిలా , బుధ్ధిమంతుడిలా ఆమె అభ్యర్ధనని ఆచరణయోగ్యం చేశాడు . అంగాంగాలను అదుపులో వుంచగల 'అంగరక్షకుడు ' అతనే అనిపించాడు. ఆకాశాన్నందుకోవాలనే ఆరాటంతో పైపైకి పెరిగే 
అశోకవృక్షాలలా , ఆనంద(న)వనం లోని ఆనందాల శిఖరం పెరిగిపోతున్నది .  ఎంతగానో ఎదురుతెన్నులు కాచిన ఆ అవయవాల పిలుపులకి సరైన సమాధానం చెప్పగలుగుతున్న సమర్ధుడు తన బావేనని అవగతం చేసుకొన్నది . పోగొట్టుకున్నదేదో తిరిగి పొందుతున్నట్లుగా గ్రహించింది . ఆ ఆనంద తన్మయత్వంలో  ఈ అందం సాంతం నీ స్వంతం . ఆ ఆనందం ఆసాంతం అందించెయ్ . ఇన్నాళ్ళూ నీ అవిటితనాన్ని , చేతకానితనంగాభావించి ఎంతో నష్టపోయా . నీతోనే  ఉంటా . నీ తోడునవుతా , నాకు జోడుగుండు "   అంటూ తన మనసులోని మాటను బైటకి వెల్లడి చేసింది యిదే అదనుగ భావించి .

"   సృజనా ! తొందరపడకు . ఆ ఆనందం కొఱవ అయిందని ఆవేశపు నిర్ణయాలు తీసుకోకు . క్షణికమైన ఆనందం కొఱకు జీవితాంతం నా ఈ అవిటితనాన్ని భరించటమంత తేలికైన విషయం కాదు . మరల మరల ఆలోచించి నిర్ణయం తీసుకో, తొందరేమీ లేదు "   సర్ది చెప్పబోయాడు .

"   చూపులలో అవిటితనం లేనివాడు రాజేష్,సంసారంలో జీవితకాలానికి సరిపోయే అవిటితనం కలవాడు . పైకి కనపడే నీ అవిటితనం నిన్నుభూమ్మీద నిలబడనీయక పోవచ్చేమో గాని , సంసారంలోని నీ సమర్ధత అనిర్వచనీయమైనది . ఇప్పటికి తెలుసుకోగలిగాను . ఈ ఆనందం కలకాలం కావాలి , అందులకు నువ్వు నా స్వంతం కావాలి . రాజేష్ కి విడాకులిచ్చేస్తాను . అమ్మా నాన్నలకి రేపు నచ్చజెప్తా  "   అంతర్గతంగా తనలో దాగివున్నతన కోరికని నిర్భయంగా చెప్పేసింది .

"   జీవితకాలం ఈ నా అవిటితనాన్ని ఆనందంగా అనుభవించగలవా ? నలుగురిలో ఫీలవ్వకుండా ఉండగలవా ? "

"   ఫరవాలేదు బావా , నిజానికి అవిటితనాన్ని పైపైన కనపడేవాటితో అంచనా వేయకూడదు . నేను మనఃస్ఫూర్తిగా అంగీకారం తెలుపుతున్నాను . జీవితకాలం ఆనందం పొందటానికి ఆకారం ప్రధానం కాదని ఆధారమే  ప్రధానమని ఆలస్యంగా తెలుసుకున్నాను . అసలైన అంగవికలుడు అతను ( రాజేష్ ) , నువ్వు నిజమైన నా "   అంగరక్షకుడివి ".

ఆ యిరువురి బిగి కౌగిలిలో మన్మధుడు మెలకువతో మెలుగుతూ గాలిని కూడా చొఱబడనీయకుండా , తను తన్మయత్వం పొందుతూ , వారిని ఆనందపరుస్తున్నాడు  .

                                                             * స * మా * ప్తం *


నా ( న్యూ ) నుడులు - 31                  పన్ను మీద పన్ను వస్తే   అదృష్టం .
                    పన్ను మీద పన్ను వేస్తే ముదరష్టం .

2                  ఆలోచనలలో ఆత్రం  చూపకు
                    ఆచరణలో ఆలస్యం చేయకు .

3                   ముడతలు పడ్డ శరీరం
                     మడతలు పడ్డ కాగితంతో సమానం .

4                   ఆడది ఆడది కలిస్తే
                     సెక్సు అవుతుందా ?
                     వెక్సు అవుతుంది .

5                   సంసారం సాగరం అయితే
                     బిజినెస్ బే ఆఫ్ బెంగాలే  మఱి  .

6                   ఉధ్ధరించటానికి ఉధ్ధరిణెకిచ్చినంత విలువ ఇవ్వాలి
                     ఉధ్ధరిణె చిన్నదే కదా అని
                     ఉధ్ధరించటంలో  చిన్నచూపు  చూడకూడదు .

7                    దేశ భాషలందు తెలుగు లెస్స
                      అన్యదేశములందు తెలుగు లెస్సు .

8                     పంతం  
                       కొన్ని సమయాల్లో
                       తిరోగమనానికి ప్రధమ కారణం
                       మరి కొన్ని సమయాల్లో
                       పురోగమనానికి పరమపద సోపానం .

9                     ఒంట్లో బాగలేకున్నా ,ఇంట్లో బాగలేకున్నా
                       ఒడిదుడుకులు చోటు చేసుకొంటాయి .

10                   తిరగమోత వేసేటప్పుడు వచ్చే సువాసన
                       తినేటప్పుడు ఉండకపోవటం అతి సహజం .
               

                                                                                                           ( మళ్ళీ కలుసుకుందాం )

బలి


అమ్మోరి విగ్రహంలో ,
అగుపించును ఆగ్రహం ,

అయ్యోరి విగ్రహంలో ,
కానరాదు నిగ్రహం ,

పల్లెల్లోన భీభత్సమే ,
అమ్మోరికి ఆనందం ,

అమ్మోరి కోరచూపులు ,
నోట మాట లేని జీవాలపైనే ,

అయ్యోరి ఓరచూపులు ,
పెండ్లి కాని కన్నెలపైనే ,

అమ్మోరి ఆగ్రహానికి ,
నోరు లేని జీవాలే బలి ,

అయ్యోరి ఆనందాలకి ,
అన్నెం , పున్నెం ఎఱుగని అబలలే ఖాళి .

         *********

భార్యా భర్తల బంధం
ఈ భార్యా భర్తల బంధం కధ " మాలిక " వెబ్ మ్యాగజైన్ లో 28-2-2013 న ప్రచురించబడినది.

” భార్యా భర్తల బంధం “

రచన : శర్మ జి ఎస్
పెళ్ళైన కొత్తలో తను  ఇంటికి కావలసినవి చెప్తుంటే ,  నాకన్నీ తెలుసును,  మా ఇంట్లో ఏది కావలసిన నేనే చూసే వాడినని అన్న వసంతరావు, నేడు నీ ఎం ఏ ఆలోచనల ముందు , నా బి ఏ ఆలోచనలే మూలకు, కనుక అన్నివిషయాలలో నీదే ఫైనల్ నిర్ణయం  అంటుంటే   ఆశ్ఛర్యపోతున్నది వసుంధర.అతనిలొని ఈ మార్పుకి కారణం  ఆలోచించసాగింది.
ఈ భావన అతనిలో మొదటినుంచి లేదు.హాయిగా, చాలా సరదాగా ఉండేవాడు. ప్రతి విషయంలోను అతనే
నిర్ణయం చేసేవాడు.  అతను అలా వుండటమే , తనకెంతో ఆనందాన్ని కలిగించేది.  అలా ఉన్న నాడు
తను ఏదైనా కావాలంటే అతను వద్దన్నా , తను  బాధపడలేదు.
బి ఏ కంటే, ఎం ఏ ఎక్కువే గదా. కనుక నీకంటే , నీ భార్యే ఎక్కువ అని ఎవరో నూరిపోశారు.  అందువల్లే యిలా మాట్లాడుతున్నారు. ఎలాగైనా ఈ భావన నుంచి అతనిని బయటపడేయాలి. ఎంత తక్కువ చదువు  చదివినా , భర్త  అంటె భార్య కంటే ఎక్కువే అని తెలియచేయాలి. భార్య ఎక్కువ చదువు చదివిందువలకు ,తన ఆలోచనలని, తెలివితేటలని  సక్రమంగా ఉపయోగించాలి. లేకుంటే ఆ ఉన్నత చదువులకి అర్థమే లేదు
                                            *      *     *
ఏమండీ  మన వయసు పెరుగుతున్నట్లుగా , ఖర్చులు పెరుగుతాయి. నేనెంత ట్యూషన్స్ చెప్పినా , ఈ సంపాదన అప్పుడు చాలదండి.  అందుకని ఓ పని చేద్దామా ?
నిజంగా తన భార్య తనకంటే బాగా ఆలోచిస్తున్నది ఇంటిగురించి , తనకంటే పై చదువులు చదవటం వలన అని
మనసులోనే అనుకొంటూ , అయితే ఏం చేద్దామంటావ్ ?
ఉన్నత చదువులకు ఉన్నతమైన ఉద్యోగాలు లభిస్తాయి. మీరు ఐ ఏ ఎస్ కి ప్రిపేర్ కండి.  అపుడు ఈ సమస్యలకు సులువుగా పరిష్కారం  దొరికినట్లే. ఏమంటారు ?
నేను ప్రిపేర్ కాగలనంటావా ?
నేనూ , మీ ప్రక్కనే ఉంటాగా. ఇరువురం ప్రిపేర్ అవుదాం. చక్కగా వ్రాయగలరు.
అలాగే, అన్నీ రెడీ చేయి.
ఆ సమాధానం విన్న వసుంధర సంతోషించి , ఈ క్షణం నుంచి ఆ పనిలో నిమగ్నమై ఉంటా అన్నది.
                                         *     *    *
వసుంధరా నువ్వు ప్రిపేర్ అవుతున్నావా ? లేదా ?  పరీక్షలు  ఎంత దూరంలోనో లేవు. రెండే రెండు వారాల టైం మాత్రమే ఉంది. ఎక్కువ కష్టపడి చదవాలి.
ప్రిపేర్ అవుతాలెండి .
అయినా నాలాగా నువ్వు శ్రమ పడి చదవవలసిన అవసరం లేదనుకుంటా. అందుకే అంత శ్రధ్ధ చూపిస్తున్నట్లు లేదు .
అదేమీ కాదండి, టెంత్  క్లాస్, ఫష్ట్ యియర్ , సెకండ్ యియర్ ఇంటర్మీడియెట్ విద్యార్ధుల ఎక్జాంస్ కదా వచ్చే నెలలో వాళ్ళను ప్రిపేర్ చేస్తున్నా. అందుకే కొంచెం శ్రధ్ధ తక్కు వైన మాట నిజమేనండి.
ఎవరి గురించి వాళ్ళాలోచించాలంటావుగా ఎప్పుడూ.  ముందు నీ గురించి ఆలోచించు, వాళ్ళ గురించి కాదు.
ఆ మాట నిజమే . కాకుంటే ఇపుడు నా ఒక్కదాని కొఱకు , ఎంతోమంది విద్యార్థుల బంగారు భవిష్యత్తుని పాడు చేయటం నాకిష్టం లేదండి. అయినా ఇంకా రెండు వారాలున్నాయిగా, ప్రిపేర్ అవుతాలెండి. టెన్షన్ పడక , మీరు చక్కగా ప్రిపేర్ అవ్వండి.
నేను ప్రిపేర్ అవుతూ , నీకొకమారు గుర్తు చేశానంతే. నీ మాటకు ఎదురు చెప్పను.
అలాగేనండి.
                                          *      *      *
ఏమండోయ్ ఈ రొజు మన ఐ ఏ ఎస్ రిజల్ట్స్ వస్తాయటండి . మీరు ఇంటర్నెట్ లో చెక్  చేసి  చెప్పండి అన్నది
వసుంధర ఫోను లోనే.
చెప్తాలే అని ఫోను పెట్టేశాడు.ఇంటర్నెట్ లో చూడటం ఆరంభించాడు.
మొదట వసుంధర నంబరుని ఫష్ట్ గ్రేడు లో చూశాడు . నంబరు లేదందులో. సెకండ్ గ్రేడు లో చూశాడు, అక్కడా లేదు. థర్డ్ గ్రేడు లో కూడా చూశాడు. అక్కడా లేదు. ఆశ్ఛర్యం ఆతని వంతు అయింది.తనకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. తను కంటిన్యువస్ గా మొబైల్ కి కాల్ చేస్తూనే వున్నది. ఇంక తప్పని సరై మొబైల్ ఆన్ చేసి ,  సారీ వసుంధర ఏం చెప్పాలో తెలియటం లేదు అన్నాడు బాధగా.
చెప్పండి. మీ నంబరు లేదా ?
నా నంబరు దాకా పోయావు , నీ నంబరే లేదు .
నా నంబరు లేదా ? మఱి మీ నంబరు …… ?
నీ నంబరే లేకుంటే , నా నంబరెందుకుంటుంది , అందుకే ఇంకా నే చూడలేదు.
చూసి ఫోన్ చేయండి ఆలస్యమైనా ఫరవాలేదు.
నువ్వే పాస్ కాకుంటే , నేనెలా అవుతాను ?
ఎవరి లక్కు వారిది , ఎక్జామ్ కి అటెండ్ అయినందుకైనా ఓ మారు  మీ నంబరు కొరకు  చూడండి.
సరే చూస్తాను .
మఱలా ఇంటర్నెట్ రిజల్ట్స్ లో తన నంబరు ఉందేమోనని చూడటం ఆరంభించాడు థర్ద్ గ్రేడు నుంచి , లేకపోవటంతో , సెకండ్ గ్రేడు లో చూశాడు, అందులోనూ లేదు. ఫష్ట్ గ్రేడ్ లో చూశాడు. నమ్మలేక పోయాడు తన కళ్ళని తానే.కళ్ళు నులుపుకొంటూ ఒకటికి నాలుగు మార్లు పరీక్షగా చూశాడు. అది తన నంబరే.
వసుంధర నంబరు ఏ గ్రేడ్ లో లేకపోవటం ,తన నంబర్ ఫష్ట్ గ్రేడ్ లో ఉండటం ఒక ప్రక్కన బాధ , మఱో ప్రక్కన పట్టలేనిఆనందం ఒక్కసారే అతనిలో చేరాయి. వెంటనే ఇంటికి చేరుకొన్నాడు.
వసుంధరా, నా నంబర్ ఫస్ట్ గ్రేడ్ లో ఉన్నదే .
ఫస్ట్ గ్రేడా ?  కంగ్రాట్స్ అంటూ నోటిని తీపితో ముంచేసింది.
ఇదంతా నీ ప్రతిభే. నేనే నిన్ను అభినందించాలి.
లేదండీ ఇదంతా మీ క్రుషేనండి. నా ప్రతిభే అయితే , నేనూ పాస్ అయ్యేదాన్నిగా .
నిజమే నువ్వెలా పాస్ అవుతావ్ ? ఏనాడైనా శ్రధ్ధ తీసుకొని ఉంటేగా. విడిగా నువ్వెంత   శ్రధ్ధగా చదివాన్నది కాదు ప్రధానం.ఎక్స్చేంజ్ లో రెన్యువల్ , ఎక్జాంస్ లో రివిజన్ తప్పనిసరి .ఎన్నిసార్లు గుర్తు చేశానో, సినా ,నువ్వు చదివిందేం లేదుగా! రిజల్ట్సే సాక్ష్యం.
నిజమేనండి .
వసుంధర ఎం ఏ , వసంతరావు ఐ ఏ ఎస్ . మనిరువురిలో నేనే పెద్ద చదువు చదివింది. నేనే గొప్ప. ఇన్నాళ్ళు నేను ,నీకంటే  తక్కువ చదువు చదివానని, ఏవేవో వెఱ్ఱి కూతలు కూసిందీ లోకం .  ఇంతదాకా నన్ను వేలెత్తి చూపిన ఈలోకానికి సరైన సమాధానం చెప్తాను .రేపో , మాపో ఐ ఏ ఎస్ ట్రైనింగ్ కి వెళ్తాను. ఆపుడు ఈ నోళ్ళన్నీ ఎలా మూసుకుపోతాయో చూడు తనలోని ఇన్నాళ్ళ అగ్నిని వెలుపలకి వెళ్ళగక్కాడు.
మీరు పాసయినందుకు , నేను పాసయినదానికంటే పది రెట్ల ఆనందం పొందుతున్నానండి.
చాలాకాలం తర్వాత యిన్నాళ్టకి ఈ నాడు తన భర్తలోని ఆధిక్యతను చూడగలిగింది. ఇదే ఇన్నాళ్ళు తనకు కరువైంది . వాస్తవంగా ఈ ఎక్కువ, తక్కువలు  మన ( భార్యా భర్తల ) వ్యక్తిగత విషయం.నిజానికి నాకు ఏ ఉద్యోగం చేయాలని లేదు. నేను  పాసయితే , నాకూ ఎక్కడో ఓ చోట పోస్ట్ వేస్తారు. అప్పుడు నేనో చోట , మీరో చోట ఉండిపోవాల్సి వస్తుంది. నాకది ఇష్టం లేదు. నాక్కావలసింది మీరు . నేను ప్రిపేర్ కానంటే మీరెక్కడ ప్రిపేర్ కానంటారేమోనని, నేనూ ప్రిపేరవుతానన్నానంతే. రేపటి రోజున నన్ను ఫలానా కలెక్టర్ వసంతరావు గారి భార్య అంటారే గాని , ఎం ఏ  వసుంధర గారు అని  అనరు .నేను మీ భార్యగా  చలామణి అవ్వాలనుకున్నాను . ఇన్నాళ్టకి నాకెంతో ఆనందంగా ఉంది.
ఈ లోకం నాటిన విషవ్రుక్షం నాలో నానాటికీ వ్రుధ్ధి అవుతూ, నన్ను నరకయాతనకు గురి చేసింది. నేనెలా
సమాధానమివ్వాలా ఈ లోకానికి ,  అని నాలో నేను మధనపడ్తున్న సమయంలో నువ్వు నాకు మంచి సలహా
యిచ్చావు.నువ్వు ఉన్నత చదువులు చదివినందులకు , సక్రమంగా ఆలోచించి మన సంసారాన్ని బాగుచేశావు . నిజ్జంగా నీలాంటి  స్త్రీని భర్యగా పొందినందుకు  నేనెంతో గర్విస్తున్నాను.
                                     * స * మా * ప్తం *
Print Friendly

కామెంట్ ప్లీజ్


( ఈ కవిత వ్రాయటానికి   స్ఫూర్తి  "   వేడి వేడి సమోసాలు "   బ్లాగ్ ఆథర్ సాగర్ . ) 

ఓ నాడు ,
ఉట్టి పుణ్యానికే నాపై ,
నా వాళ్ళు ,
నా సహవాసులు ,
కమెంట్ల రాళ్ళు విసురుతుంటే , 
కలుక్కుమన్న నా మనసు ,
పలుమార్లు కసురుకొన్నది ,
కమెంట్లే చేయవద్దని హెచ్చరించింది .

నేడు ,
నేను రచనలు చేయటం ప్రారంభించా ,
అంతే కాదు ,
బ్లాగూ ఓపెన్ చేశా ,
అందరూ చదివేందుకు అనుమతించా ,
నా రచనలపై మీ అభిప్రాయాలను ,
వ్రాయమని ఆహ్వానించా .

ఆ నాడు , 
ఉట్టిపుణ్యానికే కమెంట్లు 
వదలిన వాళ్ళెవ్వరూ ,
ఈ నా రచనలు చదవ (లే)రు , 
కమెంట్లు వ్రాయ(లే)రు ,

మనుషులు పైన , మనసుల పైన ,
కమెంట్లు వదలటం బహు తేలిక వాళ్ళకు .

నేడు ,
నాతో ముఖాముఖీ పరిచయం లేని వారెందరో , 
నా రచనలు చదివి కమెంట్లు యిస్తుంటే ,
ఆ కమెంట్లు నే చదివిన ప్రతిసారీ ,
పలుమార్లు ఆనదం వేస్తుంటుంది .

ఒక్కోమారు ,
అనుమానం కూడా నా చెంత చేరుతుంది , 

"  ఈ కమెంట్లన్నీ నిజాలేనా ? 
లేక విమర్శిస్తే తట్టుకోలేమని ,
ఇలా పొగిడేస్తున్నారా ? "   అని  .

మరోమారు ,
నా మనసే నాకు సర్దిచెప్ప ప్రయత్నం చేస్తోందిలా , 

"   ఈ కమెంట్లలో పురోగమనం ,
ఆ కమెంట్లలో తిరోగమనం , 
ఆ కమెంట్ల కంటే ఈ కమెంట్లు నయమేగా అని  ".

ఎదుటివారికి బాధ కలిగించటం కంటే ,  
సంతృప్తి నివ్వటమే సదా శ్రేయస్కరమే కదా !

               **********

శక్తిఈ సృష్టికి మూలం క్తేనని ,
అనుభవంలో  అవగతం చేసుకొన్నాడు .

నిజానికి ఏ శక్తి , ఏనాడూ ,
ఎవరికీ కనపడదు , 
కానీ తెలియబడ్తుంది .

కనపడని శక్తికి ఆకారమెలా  యివ్వగలరు ?

ఆ విషయం తనకు తెలిసినా , 
ఆ  శక్తులకు ఎంతో ఆసక్తితో  ఆకారాల్ని యిచ్చేశాడు ,


ఈ గోడమీద ఎటువంటి ప్రకటనలు అంటించరాదు "   అన్న చందంగా ,

వాస్తవానికి యిలా అంటించటమే ఓ ప్రకటన ,
ప్రకటనగా భావిస్తే , తను తెలియచేయలేడు కదా ! 

ఆ శక్తులకు లింగభేదాలు ఈ మానవుడే తగిలించాడు ,
తన భావాలకనుగుణంగా వావి వరుసలు తగిలించాడు ,
ఆ ఆకారాలచేత కాపురాలు చేయించాడు ,
వారసులను వెలికితీసి , బారసాలలు చేశాడు ,
గుళ్ళూ , గోపురాలలో ఆ శక్తులను బంధించాడు , 
దైవాలుగా కొలువ నారంభించాడు ,
ఆ దేవుళ్ళను వేడుకొంటున్నాడు ,
తనకు అవసరమైనపుడు  తననాదుకొమ్మంటున్నాడు ,
ఆదుకొనకున్నా , ఎప్పటికైనా ఆదుకొంటాడులే  , 
మొండి ధైర్యంతో జీవితాన్ని గడుపుతుంటుంటాడు  ,
ఇంకేమీ చేయలేక ఇలా ఆశగా ఎదురు చూస్తుంటాడు .

శక్తులేవైనా శక్తివంతమైనవని గ్రహించాలి ,
ఆ శక్తులే లేకుంటే మానవులే కాదు ,
జీవకోటి అంతా అశక్తులై , నిర్జీవితులౌతారు . 

                      **********

మొబైల్

                   
నడిబజారులో అమ్మాయిలని , అబ్బాయిలని 
వాళ్ళ వాళ్ళకు తెలియకుండా ,
తన ప్రియుళ్ళతో , ప్రియురాళ్ళతో కలుపుతోంది .
సరదాల దురదలు తీర్చుకొమ్మంటుంది .


ప్రేయసిని నమ్మించి , 
ప్రియుడిచేత , 
గాలి కూడా చొరబడలేని ఆ వేళ  ,
చిత్రాతి చిత్రమైన చిత్రాలను తీయిస్తుంది ,
చిలికి చిలికి గాలి వానై ,
చిత్రంగా  చితి మిగులుస్తుంటుంది . 


భార్యలు , భర్తలు ,
ఒకళ్ళ కొకళ్ళ ,
కళ్ళు కప్పుకొంటూ ,
పరాయి వాళ్ళతో కలయికలకు , 
ప్రత్యేకంగా నిలబడ్తుంటుంది . 

నమ్మకంగా ఆటోలలో ఎక్కించుకొని,
ఆ సందేశాన్ని తమవారికి ,
ఏ సందేహం రాకుండా చేరవేసి ,
సామూహికంగా అత్యాచారాలు ,
చేయించటానికి దోహదపడ్తుంటుంది .

బాకీదారులు ఫోన్లో అడుగుతుంటే ,
తను పక్క బజారులో ఉన్నా ,
ఔట్ ఆఫ్ స్టేషనని ,
రావటానికి టైం పడ్తుందని ,
బొంకు పలికిస్తుంటుంది .


అడ్డదారిలో దోచుకొనేటందుకు ,
కిరాయి రౌడీల క్రియలకు ,
వీధి రౌడీల ప్రక్రియలకు ,
ఓ పేద్ద అడ్డాగా ఉపయోగపడ్తుంటుంది .  

అన్ని దేశాల నీలిచిత్రాలను ,
అర నిముషంలో కళ్ళముందుంచుతుంది ,  
రెప్పలు మూయకుండా అదేపనిగ ,
తదేక దృష్టితో చూడమంటుంది .  

బైటకు వెళ్ళిన మానవులకు ,
పొరపాటున ఏదైనా ప్రమాదం సంభవిస్తే ,
వెంటనే చేరవేసి తగు ట్రీట్మెంట్ యిప్పించి ,
ప్రాణాన్ని , తనవారిని రక్షిస్తోంది .

హంతకుల ఆరా తీసేందుకు ,
రక్షకభటులకు శ్రీరామరక్షగా నిలబడ్తోంది . 

ఏ వస్తువైనా ఈ ప్రపంచం పంచన ,
మంచికే సృష్టించబడ్తుంది ,

ఆ పై వంచన పంచకు చేర్చి ,
ఆ దిశగా అడుగులు వేయిస్తుంటారు  .

ఆ వస్తువుల తప్పు కాదు ,
కనుగొన్న వాళ్ళ నేరమూ కాదు ,
ఉపయోగించుకునే వారి తీరుని బట్టి ,
మంచిగా , చెడుగా దర్శనమిస్తుంటాయి .


అణుబాంబు కనుక్కొన్నది దేశ రక్షణకే కాని ,
ప్రాణ హానికి కాదన్నది మరువకూడదు సుమా !

                        ***********

ఆ నలుగురు
తర తమ భేదాలెఱుగరు , 
ఒకే కంచంలో తింటారు ,
ఒకే మంచంలో మాత్రం పడుకోరు ,
నలుగురూ నేలపైనే శయనిస్తారు ,  
ఎవరూ ఎక్కువ కారు , తక్కువ కారు ,
ఎవరిని ఎవరూ ఎంచుకోరు ,
ఎవరేం తెచ్చుకొన్నా పంచుకొంటారు ,
కాలేజీలో గైర్హాజరుకి హాజరు పలుకుతారు ,
క్లాసులకి లాస్ లేకుండా నోట్స్ కవర్ చేసుకొంటారు ,
మూవీలకి కలసే మూవ్ అవుతారు ,
పైసలెవరి వద్ద నున్నా తమవనే భావిస్తారు ,
అద్దె అందరూ కలిసే చెల్లిస్తారు ,
అనిపించినపుడు గదికి తెచ్చుకొని ,
అందాల్ని వరుసగ అందరూ అందుకొంటుంటారు ,
ఆ ఖర్చుని అందరూ షేర్ చేసుకొంటుంటారు , 
ఈ వరస నెలలో రెండు , మూడు మార్లు . 
బోన్లు వేరైనా , ఫోన్లు మాత్రం అందరివీ ,
రీఛార్జ్ ఎవరైనా చేయించవచ్చు , వాడకం అందరిది ,
అఱమఱికలసలు లేనే లేవు వారికి ,

ఓ నాడు ,
ఆ నలుగురిలో ఒకడు  ఆర్జంటుగా ఊరికి వెళ్ళాడు .

వారం  తర్వాత వచ్చాడు ,
ఆ ముగ్గురుతో కలవక ,
ముభావంగా ఉంటున్నాడు .

ఏమైందని అడిగారా ముగ్గురు ?

కొన్ని అత్యవసర పరిస్థితుల్లో ........
కొన్ని అత్యవసర పరిస్థితుల్లో ........

చెప్పరా ! అలా నముల్తావేంటిరా ? చెప్పరా ! 

దిగులుగా , పెళ్ళి చేసుకోవలసి వచ్చిందిరా ......  ,

ఆ మాట విన్న ముగ్గురు , 
గుడ్ న్యూస్ కదరా .

మిమ్మల్ని ఆహ్వానించకుండా చేసేసుకున్నారా ! సారీరా ,

ఫరవాలేదులేరా , 

అది కాదురా , సారీరా , ఐ యాం రియల్లీ సారీరా ,

డోంట్ ఫీల్ లైక్ దట్ , ఉయ్ ఆర్ ఆల్ వన్ ,

థాంక్యూ రా అర్ధం చేసుకున్నందుకు ,
ఎస్ ఉయ్ ఆర్ ఆల్ వన్ ,

హమ్మయ్య !
ఇంక నుంచి చాటుమాటుగా తెచ్చుకోవలసిన అగత్యమే లేదురా , 
హాయిగా ఎంచక్కా ,  
ఎప్పుడంటే అప్పుడు ,
ఎవరంటే వాళ్ళు ,
వరుసగా ఎంజాయ్ చేయచ్చు ,

ఒరేయ్ , అలా మాట్లాడకండిరా , అది కుదరదురా .

తను ఒప్పుకోకుంటే , నువ్వొప్పించరా ,
ఆ మాత్రం చేయలేవురా మన యిన్నాళ్ళ స్నేహం కోసం .

వెరీ వెరీ సారీరా .

అదేంటిరా , మళ్ళీ వెరీ వెరీ సారీ అంటావ్ ?

ఔనురా ,
ఇన్నాళ్ళూ మనమందరం ఎంజాయ్ చేసిన మాట వాస్తవమే ,
ఇపుడే తెలుసుకున్నాను ,
ఇన్నాళ్ళూ మనకంటూ అన్నీ కంబైండ్ గానే  ఉన్నాయిరా ,
అమ్మ ,నాన్న ,అమ్మమ్మ , బామ్మ , తాతయ్య , 
పెదనాన్న , బాబాయ్ , పెద్దమ్మ , చిన్నమ్మ , 
అన్నదమ్ములు , అక్కచెల్లెళ్ళు , బావలు , బావ మరుదులు ,
వదినెలు , మఱదళ్ళు యిలా ,
మనకున్న అన్ని సంబంధాలూ యిటువంటివేరా ,

ఈ వివాహ వ్యవస్థతో ,
ఈ సమాజంలోని స్త్రీ , పురుషులిద్దరికీ ,
తనదంటూ ఒకటి ఏర్పడ్తుంది ,
అదే నా భార్య , నా భర్త ,
' నాది ' అనేదానికి నాంది యిక్కడే , యిప్పుడే ,
నాదంటూ నిర్ధారణ అయిం తర్వాత ,
మరొకరికి ఎవరూ పంచలేరురా ,
మఱి ఎంచరాదురా ,
ఈ క్షణాన్ని జీవితంలో మఱచిపోలేనురా ,
నేను వేరే వెళ్తున్నాను , 
బై , బై , గుడ్ బై , సీ యు అల్ .

                      ******


  


ఇకనైనా
ఆటు పోట్ల పోరాటంలో అలలుద్భవిస్తాయి 
అలలు ఉరకలేస్తూ పరుగులు తీస్తాయి
అందంగా అగపడ్తూ ఆనందాలనందిస్తాయి
కడలెంత క్షోభననుభవిస్తూ అంత శోభనిస్తుందో ?

ఎంతమంది , శిశువులు , అశువులు బాశారో
ఆంగ్లేయుల అహంకార  తూటాలకు  బలయ్యారో
మఱెంతమంది అగపడకుండా అడవుల పాలయ్యారో
ఎన్నేళ్ళ అవిరళ కృషి ఫలితామో ఈ స్వాతంత్ర్యము ? 

ఆ వృక్షం అందనంత ఆకాశాన్ని తాకుతున్నట్లు
అనిపిస్తూ, అందంగా కనిపిస్తోంది 
మొలక నాటి నుంచి నేటి దశ వరకు
ఎంతమంది చిలిపి చేష్టలకు తల కాచిందో ?

ఏ దారి రహదారి కాదోయ్ ఒక్కనాటితో  .
ఓ నాడు ఆ దారి ముళ్ళ కంచె , రాళ్ళ పంచ
ఎన్ని సైక్లోన్లకు తొలుచుకుపోయిందో,
మఱెన్ని ప్రొక్లీనర్ల తాకిడికి తట్టుకొందో ?

రోమ్ మహానగరమంటారు
ఒక్క రోజులో కట్టబడ్డది కాదనీ అంటారు
అంత అందంగా తీర్చి దిద్దటానికి 
ఎంతమంది  పట్టుదలతో  పరి పరి శ్రమించారో ?

రోగమైనా ఒక్క రోజులో బయటపడదు ,
ఎన్నాళ్ళనుంచో లోనే అణగి మణగి ఉండిపోతాయి
ఇంక లోన వుండలేని క్షణాన ,వెలికి వచ్చి వెతలు కలిగిస్తాయి
ఆరోగ్యమైనా, ఓ నాటితో సమకూరదు .

పరికించగా , ఏదీ ఒక్క క్షణంలో జరగబడదని ,
ఇలా ఈ క్షణం జరగటానికి వెనుక ,
ఎనలేని ప్రిపరేషన్ ఉంటుందని ,
తెలుసుకొని మసులుకొందాం ఇకనైనా ........

                                 *******

ఇక ఇల కల

యుక్తవయసులో ,
నేను , నా స్నేహిత వర్గం ,
కళ్ళకు కనపడ్తున్న అక్రమాలను , 
అన్యాయాలను సహించలేకపోయాం ,
అక్రమాలను అఱికట్టాలనుకున్నాం ,  
అన్యాయాల్ని అణగదొక్కాలనుకున్నాం , 
ప్రతిన పూనాం మా స్నేహిత వర్గంతో ,
సమసమాజ నిర్మాణం స్థాపిస్తాం !

మా పెద్దలందరూ మమ్మల్ని , 
ఉడుకు రక్తపు ప్రతినలొద్దురా అన్నారు .

మీలా కాదు మేము ,
మావి మాటలు కాదు ,
సరాసరి చేతలే సుమా !
మా సత్తా ఏమిటో చాటుతాం !

అంతదాకా ,
మూడు పువ్వులూ ముఫ్ఫై కాయలుగా  ,
వృధ్ధి చెందిన మా స్నేహిత వర్గం  ,
చెట్టుకొకళ్ళు , పుట్టకొకళ్ళుగా ,
అయిపోయాం చెల్లాచెదురుగా  .

'నింద లేనిదే బొంద కదలదన్నట్లు '
కారణాలు కో కొల్లలు ,
ప్రతి క్రియకు కారణం ఉంటుంది ,
చదువులు , ఉద్యోగాలు , ఆరోగ్యాలు ,  
ఆర్ధిక పరిస్థితులు , పెళ్ళిళ్ళు ,
ఆ పై సంసార సారాల సంతానాలు . 

ఎన్నో చేయాలనుకున్న మేమంతా ,
ఏమీ చేయలేక , ఏటికి ఎదురీదలేక , 
విడిపోయి , మిగిలిపోయాం  ,

ఆ నాటి ఆ ఆలోచనలు , 
ఆ నాటి ఆ ప్రతినలు , 
ఉడుకు రక్తపు పోకడలుగా , 
పెళ్ళినాటి ప్రమాణాలుగా ,
నామకరణం చేయబడ్డాయి  .

మేమూ అందరిలా సగటు మానవులమే ,
సమసమాజ నిర్మాణం యిక కలే .

                  ********
  నా ( న్యూ ) నుడులు - 21                  ఆ వయసులో చావ ,
                    ఈ వయసులో యావ .

2                  నోటిమాటలతో కడుపు నిండదు ,
                    నోటు చేతలతో కడుపు పండదు .

3                  చెప్పనిది చేయటం ఘోరమైతే ,
                    చెప్పినది చేయకపోవటం నేరమే .

4                  ఆత్రతతో అవిటివాడివి కాబోకు ,
                    భద్రతతో భవిష్యత్తును బాగుగా చూసుకో .

5                  ప్రగతిన పయనించు ,
                    సుగతిన జీవించు .

6                  ఆశలతో ఆత్రపడకు ,
                    భద్రతనే మరువకు .

7                   ఎంతకొట్టినా ఏడవను కానీ ,
                     తిడితే తక్షణమే ఏడ్చేస్తా .

8                   నాడు  ముందు చూపు ,
                     నేడు మందు చూపు .

                  కార్యం అంటే కట్టుకున్న భార్యతో చేసేది ,
                     స్వకార్యం అంటే -- ---- తను చేసుకొనేది ,
                     ఘనకార్యం అంటే పరాయి పడతితో చేసేది ,
                     స్వామికార్యం అంటే సన్యా(న్నా)సులతో సంభోగమన్నమాట .

10                 మానవుని దయా దాక్షిణ్యాల మీద కొంతమంది మాత్రమే జీవనం సాగించ గలరు ,
                     భగవంతుని దయా దాక్షిణ్యాల మీద అన్ని జీవరాసులూ జీవనం సాగించ గలవు .

                  
                                                                                                                 ( మళ్ళీ కలుసుకొందాం )

           

ఆశ(యా)లు

( ఈ మినీ కవిత "ప్రగతి" వారపత్రిక లో 23-05-1980 న ప్రచురితమైనది  


ఆశలే 
మనసులో 
చేరి
ఆశయాలుగా
మారి
మనసులోని
కృషి
దీక్ష
పట్టుదలలతో
సంకలనమైన నాడు
నెరవేరతాయి.

      ***

మలుపు

( ఈ మినీ కవిత "  మలుపు  "   వారపత్రిక లో 06-06-1980 న ప్రచురితమైనది ) 

ఆశల ఆరాటంలో 
ఆశయాల పోరాటంలో
జీవికి అలుపు 
జీవితానికే ఓ మలుపు .

          ***

వ్యత్యాసం


    
                                                                  
అట,
కొండల నడుమ,
లోయలో నీరు,
ఎంత లోతులో ఉన్నా, 
మాలిన్యాన్ని ఎరుగవు, 
స్వేఛ్ఛా జీవితాన్ని సాగిస్తాయి .

ఇట,
గుండెల నడుమ,
మనలోని మనసు,
ఎంత చేరువలో ఉన్నా, 
మాలిన్యాన్ని పెంచుతుంటుంది
స్వేఛ్ఛా జీవితాన్ని సాగించలేదు .
     
            ****

రేయి - హాయి

ప్రకృతి వెలుగులు మాయం ,
కృత్రిమ కాంతులు ఖాయం ,
చందమామ ప్రతాపానికి ,
నక్షత్రాల ప్రభావాలకి ,
ఆలవాలం ఆ రేయి ,
ఆ రేయి  రాకుంటే ,
చెలి చెంతకు రాదోయి ,
చెలి చెంత లేకుంటే ,
లేనే లేదోయి హాయి . 

ఆ రేయి రాకుంటే ,  
చెలికాడు చెంత చేరడోయి ,
చెలికాడు చెంత లేకుంటే ,
లేనే లేదోయి హాయి .


       ********


నా ( న్యూ ) నుడులు -1

1                 ఆడది సృష్టికి మూలమైతే , 
                   మగవాడు ఇంటికి మూలం

2                 మగవానికి ఆఫీసులోని కాగితాలు ఎంత ముఖ్యమో
                   ఇంటిలోని జీవుల జీవితాలూ అంత ముఖ్యమే .

3                 జీవితం 
                   ఎవరి చేతుల లోనూ లేదు
                   వారి వారి చేతల లోనే ఉంటుంది . 

4                 భార్య 
                   దగ్గరుండి ఆనందపెడుతుంది
                   దూరానుండి బాధపెడుతుంది .

5                 నీతి కానిది ఆసించకు
                   నీది కానిదీ ఆసించకు
                   నీ దానిని ఆలస్యం చేయకు .  

6                 నిలకడలేని మనసు 
                   తలగడలేని  పరుపుతో సమానం .

7                 ప్రమాదాన్ని ఎదిరించు
                   ప్రమోదాన్ని ఆస్వాదించు .

8                 ఆదరణ , ఆచరణ కవలలు.
                   ఆదరణతో మనస్సును మచ్చిక చేసుకో
                   ఆచరణతో జీవితాన్ని బాగుచేసుకో .

9                 మూసిన తలుపులు 
                   తీయని తలపుల గురుతులు .

10               తెలియక చేసేది పొరపాటు
                   తెలిసి చేసేది అలవాటు .


                                                                                                      ( మళ్ళీ కలుసుకొందాం )


        
                   

గులాబీ
సుఖదుఃఖాలు తులాభారాలు ,
కలిమిలేములు కావడికుండలు ,
మంచి చెడులు మానవ మనుగడలు

అంటు వేసి , నీరు పోసి పెంచుతాం ,
పెరిగి పెద్దదై అందాలొలకబోస్తుంది ,
అందరికీ ఆనందాలను అందిస్తుంది .

ఆ ముళ్ళు చెడుకి తార్కాణాలు ,
ఆ గులాబీలు మంచికి ప్రామాణికాలు ,
ముళ్ళు గుచ్చుకోకుండా పూలు కోసుకో ,
ముళ్ళనచ్చటే వదిలేసెయ్ ,
చెడు అంటుకోకుండా మంచిని తీసుకో ,
చెడునచ్చటే వదిలేసెయ్ .

ఆ గులాబీలు పూజకుపయోగపడి ,
దైవాన్ని చేరుకొంటాయి .

ఆ గులాబీలు ఆడవారి శిఖపై చేరి , 
శిఖర దర్శనమిస్తుంటాయి .

ఫూజ వేళ , ఆడవాళ్ళ చెంత శిఖరాన్నే అలరిస్తాయి ,
మంచిని నెత్తిన పెట్టుపెట్టుకొని పూజిస్తాం .

మంచి ఎప్పుడైనా , ఎక్కడైనా ఉన్నతమే . 

                 ***********

భిన్నత్వంలో ఏకత్వం

నింగిలోని చుక్కలని ,
సంచిలోకి నింపాలని ,
వెలుగు నిచ్చే వెన్నెలని ,
నెలనాళ్ళూ చూడాలని ,
పలు ప్రయాసలు  పడ్తోంది , 
పసిడి వన్నెల పసితనపు ప్రధమాకం . 

మూన్నాళ్ళ సొగసులకు మూలమిచ్చటేనని ,
ఊహల ఊయల ఊసులిచ్చటేనని , 
మోహాల పల్లకి మొహరించేదిచ్చటేనని ,
ఆశల ఆరాటాలకి నాందిచ్చటేనని ,
శ్వాసల పోరాటానికీ పునాదిచ్చటేనని ,
మంచీ చెడుల నెంచలేని నెలవిదేనని ,
గ్రహించలేని కలల కౌమారమే ద్వితీయాంకం  .

దోరవయసు చెఱ పాలౌతుందని ,
ఆ చెఱ తొలగింపు తనదేనని ,
అందినదానితో తృప్తి చెందాలని ,
చిరంజీవులు ఈ జీవుల వారసత్వమని ,
అనుభవసారమే ఈ (సం)సార బంధమని ,
తెలుసుకోలేని తడి కల యౌవనమే తృతీయాంకం .

సుఖాల సారమే రువు బాధ్యతలని ,
సంతోషాలకు సదా దూరమౌతున్నామని ,
ఆద్యంతాలు దైవాశ్రయం కోరాలని ,
మోక్ష గవాక్షాలు  తెరిపించుకోవాలని ,
జీవన్ముక్తికి మార్గాన్వేషణ వెతకాలని ,
చాటి చెప్పే వార్ ధక్యమే ( వార్ధక్యమే ) చతుర్ధాంకం ,
అదే  జీవన చరమాంకం  .  
           
                    **********  

ఈనాడు

                             


                      నాయకులు పంచేస్తున్నారు నోట్లు
                      అనామకులు  వేస్తున్నారు ఓట్లు
                      నడుమన వినాయకులు పెట్టేస్తున్నారు తూట్లు 
                      ప్రతినాయకులూ ఖర్చు చేస్తున్నారు కోట్లు 
                      సంపాదిస్తున్నారు ఎలాగైనా సీట్లు
                      ఆ సీట్ల కొరకు పడ్తారెన్నైనా అగచాట్లు
                      కష్టమంటూనే యిష్టంగా అధిరోహిస్తున్నారు సీట్లు
                      గర్వంగా,దర్పంగా పంచుతున్నారు స్వీట్లు
                      చెప్తున్నారు ముచ్చట్లు
                      కొడుతున్నారు చప్పట్లు
                      పెంచుతున్నారు రేట్లు
                      మారుతున్నాయి ఫేట్లు
                      వేస్తున్నారు రకరకాల ఫీట్లు
                      పడ్తున్నారెన్నో పాట్లు
                      పెంచుకొంటున్నారు ప్లాట్లు
                      మారుస్తున్నారు పార్టీల ప్లేట్లు
                      ప్రజానాయకులు చేసే పొరపాట్లు
                      మెల మెల్లగ మారు అలవాట్లు
                      చూడకున్నారు ప్రజల యిక్కట్లు
                      వీడకుంటిరి వారి మొండి అలవాట్లు                      
                      ఉండిపోతారు నిమ్మకు నీరెత్తినట్లు
                      వారి బాగులు వారు చూసుకొంటున్నారు
                      పై వారికి బ్యాగులు  సమర్పించుకొంటున్నారు


                      మహాకవి శ్రీ శ్రీ గారు  ఏనాడో సెలవిచ్చారిలా

                     "   ఎవరో వస్తారని , ఏదో చేస్తారని ,
                      ఎదురుచూసి మోసపోకుమా !
                      నిజం మఱచి నిదురపోకుమా ! "

                      ఈ కలియుగానికి కళ్ళకు కనపడే సత్యం.


                      గుర్తుంచుకొని ఆచరిస్తే మన జీవన గమనం మారినట్లే. 
                                                *******వింత మగ మృగాలు


 నాడు ,
ఆడజాతి అల్పం ,
మగ మహరాజులు అధికం ,
వంటింట్లోనే ఉంచేశారు , 
వంటికే పరిమితం చేశారు ,
కళ్ళు కనపడని కబోదులుకూడా ,
కన్నెలే కావాలని తపించారు ,
కన్యాశుల్కాలు ప్రవేశపెట్టారు ,
కన్నెచెఱ చెఱపట్టారు ,  
నిండు నూరేళ్ళ ఐదవతనాన్ని,
ఐదో , పదేళ్ళకే చెల్లు చేశారు ,
కాటికే సరాసరి చేరిపోయారు 
పెనిమిటి లేని వాడి పెళ్ళాముగా,
సమాజంలో ముద్దర వేశారు ,
ఆ ఆనందాలను అందనంత దూరం చేశారు ,
పునర్వివాహ  ప్రసక్తే లేదని తేల్చేశారు ,
ఆ అబలల వైవాహిక జీవితాలు 
గెలవలేక గేలి చేశాయి ,
ఆ నాడు ఆడజాతి స్థానం అధమం .

ఈ నాడు ,
ఆడజాతి అధికం ,
మగతెగ అల్పం ,
పసివాడికీ పడుచు కావాలిట ,
దబ్బు పడేస్తే వస్తది ఆడది అంటాడు , 
వయసులో ఉన్నోడికి కావాలి ఈ ఆడది ,
తన సరదాల దురద తీర్చుకోవటానికట ,
వయసుడిగిన అయ్యకు కూడా ,
పడుచు కావాలంటాడు ,
పట్నపు పిల్లైనా సర్దుకు పోతానంటాడు ,
కట్నపు మూట పట్టుకు రావాలిట ,
సరదాలను పరదాలతో మూయమంటాడు ,
తనకు , తనవారికి చాకిరీ చేయాలంటాడు ,
లేకుంటే , 
మాంచి ఉద్యోగమైనా చేసి సంపాదించాలంటాడు ,
అభం శుభం తెలియని అబలల ,
కమ్మని జీవితాలు  కన్నీటి లోయలాయె ,
ఆడజాతి స్థానం ప్రధమమే .

అధమ స్థానమన్న భీతితో ఆనాడు ,
ప్రధమ స్థానమన్న ప్రేమతో ఈనాడు ,
తరతరాలుగ ఆడజాతి జీవితాలు ,
ఇంగితమే ఎఱుగని ,
ఈ "  వింతమగ మృగాల "  కంకితమాయె .

                   *****************

            


తారతమ్యం


            
                                                
పసివయసులో,
     
తప్పటడుగులలో ఆనందం

ముద్దు ముద్దు మాటలే ముదం
     
తెలియని మంకుతనమే ఆందం
     
తెలియక తప్పులే ఒప్పులు
     
ఇవన్నీ చిన్నతనపు రగడలు

     

పిన్నవయసులో,
     
తప్పుటడుగులలో విషాదం
     
ముది మాటలేమో విషాదం
     
తెలిసిన హుందాతనమే
     
తెలిసి ముప్పులు
     
ఇవే పెద్దతనపు పోకడలు


              *****

చాకలి తిప్పడు ( ఏకపాత్రాభినయం )


ఈ చాకలి తిప్పడు ఏకపాత్రాభినయం " మాలిక " వెబ్ మ్యాగజైన్ లో 30-12-2012 న ప్రచురించబడినది.

” చాకలి తిప్పడు ” ( ఏకపాత్రాభినయం )

రచన : శర్మ జి ఎస్
లచ్చా , లచ్చా, ఓ లచ్చా, నా అబ్బడాల సుబ్బలచ్చా , నానొచ్చా, తొరగా రాయే ……. .
ఏటే ఎంతకీ రాయేటే , ఓ ! అదా యిసయం , నానొచ్చే  ఏలకి మోటుగుంటే బాగుండదని , నీటుగ అద్దంలోనికి  సూత్తూ, సాటుగ బొట్టూ  కాటుకెట్టుకుంటున్నావంటే. మనం మనం ఒకటే గదంటే, నాకాడ నీకు సోకేటే ? అయినా , నీ సోకు నాకు తెల్వదేటే ? లచ్చ్క్హా ఓ లచ్చా , ఈ సోకుల సాకులతో ఆలస్సం సేయక తొరగా రాయే , రాయే తొరగా రాయే .
( ఎంతకీ రాకపోయేసరికి   )
ఏటే రాదేటే ? ఇంటో నేదా ? ఎటెల్లిందబ్బా ? ఎన్నిచార్లు సెప్పాలే , నా సాటున నీవెన్ని ఏసాలేసినా పర్లేదే , ఎటొస్సీ నాకు తెల్వదు
గదంటే  ఆ ఏసాలు. సీ…. సీ…. నిన్ననుకొని ఏం నాభమే . మా అప్ప , అదేనే , మీ అమ్మ  నిన్నంటగట్టి నాకీ తిప్పలు తెస్సి పెట్టినాదె. సచ్చేది సావక నా సెయ్యట్టుకొని, తన సేతిలో ఎట్టుకొని, నిన్నేలుకుంటానని పెమాణకం సేయించొకొన్నాదె . అద్గదె అక్కడ కొట్టిందె దెబ్బ. పేదోళ్ళు మాణిక్క్యలెట్టుకోకపోయినా పెమాణకాలకి కట్టుబడి ఉంటారు గదంటె. ఆ అల్సు చూసుకొనిగదంటె ,నీవాడిందే ఆట పాడిందే  పాటగా సెలామణి సెయ్యమని నా పాణాలను తోడేలులా తోడేత్తున్నావు గదంటె.ఎంతకాలమిలా ఏలతావో , ఎంతకాలమిలా ఏడిపిత్తావో నానూ సూత్తాలేయే.
సీ…. సీ…. ఇట్టాంటి పెల్లాముతో కాపురం సేసేకంటే పురం వదలి ఎల్లటమే మేలంట. ఔనౌను నాను ఊరొదలి ఎల్తే ,ఊళ్ళో ఆసాముల బట్టలుతికే మడేల్ మరొకడెవడు లేడు గంద.సరెలే అని సాకిరేవుకెల్లి బట్టలుతుక్కొద్దామా అంటె ,ఆ సాకిరేవేమో ఊరిసివర సస్సినాదే.ఆడకి ఓ పెద్దపులి ఒంటరిగా వస్సి , సంసారాన్నే ఎట్టిందంట. నానిపుడు రేవుకాడకెల్లేదెట్టాగంటా ? ఎట్టాగాంటా ? ఎట్టాగాంటా ? పోనీ ధైర్నం సేసి పోతే…… , అమ్మో ఇంకేటన్నా ఉందా నాయాల్ది , పెపంచకం మొత్తం తలకిందులయిపోదూ . అలా తలకిందులయిన పెపంచకాన్ని , మల్లా మామూలు పెపంచకం సెయ్యాలంటే , గోపంచకం సల్లితే గాని , మామూలు పెపంచకం గాదంట. అంత గోపంచకం  నానేడ పట్టుకొచ్చేది,ఇదంతా దేనికిలే. అసలు నానాడకెల్లకుంటే పోలా.
ఆ….. తట్టినాది, తట్టినాది , నా తలకు తట్టినాది.ఆ పులిని సంపి ఆనమాలు తెస్సి యిస్సినోడికి రాజుగోరు , అద్దరాజమిస్సి , తన కూతుర్నిస్సి పెల్లి సేత్తనని దండొరా కొట్టించినాడు గంద.ఇది గుత్తొస్సినాక కూడా నాను సావటమేమిటి ? ఓ ఏల నానే ఆ పులిని నానే సంపితేనో …… , నానే ఆ పులిని సంపితేనో …….అబ్బ, అబ్బ,అబ్బ , నా అదురుట్టమే అదురుట్టం గందా! నా అదురుట్టం ఎదురుగొట్టంలా ఎకాయికీ ఆకాసాన్నే అంటుకుంటుండాదె. అబ్బ, అబ్బ, అబ్బ , నా అదురుట్టమే అదురుట్టం గందా!
( ఆనందంలో తేలియాడుతుంటాడు  ,  ఆ ఆనందాన్నుండి మెల్లగా తేరుకుని )
ఓ ఏల ఆ పులి నా మీదకే తిరగబడితే….. ? ఆ….. ఏటౌతదేటి ? అదురుట్టం ఎనక్కెల్లి ముదరట్టాన్ని ముందుకు నెట్టేత్తది.
ప్చ్ అంతే గంద. అస్సలు ఈ జీవితానికి ఎపుడైనా తెగింపు కావాలంట, అపుడే ముగింపు వత్తదంట .
( ఇంతలో పులి అరుపు విన్నవాడై )
అయ్యబాబోయ్ , పులి… ,పులి…, అరుత్తుండాదె , అమ్మో ఇటే వత్తుండాదె . సచ్చానురోయ్ , సచ్చానురోయ్ ,సచ్చానురోయ్
( పరుగెత్తుతూ ,  ఎనక్కి తిరిగి చూసి ) ఆ! ఏం ధైర్నం ? ఏం ధైర్నం  ? సూడబోతే  సొరకాయంతలేడు , సొరసేపలా  పరుగులు  తీస్తుండాడు. ఏంటా పరుగు ?  ఏ కాయకీ  పులిమీదకే దూకేత్తుండాడే .
( శబ్దాలన్ని ఒక్కమారుగా నిశ్శబ్దంలో చేరిపోయేసరికి )
ఏటబ్బా ? ఇది . ఏడా సడి , సప్పుడు నేదే . పులి నేదూ , పిలగాడూ నేడే . కాసింత ముందుకు పోయి సూత్తా, కాసింతన్నా తెలియక పోతుందా ( అనుకొంటూ ముందుకు పోతాడు , అచ్చట పడుకొని ఉన్న పులిని చూసినవాడై ) అయ్యబాబోయ్  పులి…పులి…పు..లే….పు..లి ( వణుకుతున్న గొంతుతోనే అయినా ఈతని అరుపులకు  ఆ పులి లేవలేదు. బాగా గాఢనిద్రలో ఉన్నదనుకున్నవాడై ) ఇదే మాంఛి సమయంగంద, ఎనకమాలగా ఎల్లి రాల్లేత్తే పొలా ?
ఆ దెబ్బతో దాని బూజు వదులుద్ది , నాను రాజు నయే మోజు తీరుద్ది. ( మెల్లిగా చిన్న చిన్న రాళ్ళు ఏరుకొచ్చి వేస్తాడు ,అయినా   ఆ  పులి లేవలేదు . )నానేసిన రాళ్ళు తగలకూడనిచోటే తగిలినట్ట్లుండయి. దెబ్బకు సస్సూరుకున్నాది నాయాల్ది . ఇంకా ఈడెందుకు ?  రాజుగోరికాడకెల్తే పోలా !
( నిండుకొలువును అలంకరించిన రాజుగారిని చేరుకున్నవాడై )
మారాజులుంగోరికి దండాలు , మారాజులుంగోరికి దండాలు . నానే ఆ పులిని సంపినాది . కావాలంటే  సూసుకోండి. ఇదుగో పులీ ,అదుగో తోకా!( చూపిస్తుంటాడు , రాజుగారినుంచి బదులు రాకపోయేసరికి  ) ఏటీ ఇంకా ఆలొసిత్తుండారేటి ?  పులిని సంపి ఆనమాల్లు తెమ్మంటె , పులినే సంపి తెస్సినాడేమిటనా ? ఆడె ఉంది అసలు కిటుకు. ఈ సమయంలో ఆ సామెత గుత్తుసేసుకోవటం  ఎంతైనా సందర్బోచితం. సదువుకొన్నవానికంటే సాకలోడు ( మడేల్ ) మేలంటారు . ఏటికో  తెలుసా ?
ఇందుకే ఓన,మాలు ఆనమాల్లు తెలియనొణ్ణి కనుకనే , పులినే ఈడకు ఈడ్సుకొచ్చినా. సూసుకోండి బాగా,  ఏదీ రాకుమారిని పిలిపించండి, దండలు మార్సుకొని దండాలెడతాం.మిమ్మల్నే మాంగోరు, నాయాల్ది ఇటు మాట్టాడుతా వుంటే , అటెటో సూత్తారేటి ?
( రాజుగారు చూస్తున్న వైపు తన చూపు మరల్చి , కంగారుగా )
ఆడు… ఆడు… ఆడే …ఆడే… ఆ పిలగాడే , సచ్చానురోయ్ , కొంప మునిగిందిరోయ్ . ఇపుడేం సెయ్యటం ?  ఇపుడేం సెయ్యటం ? సెప్పుమా …ఆ…గుత్తొస్సింది , గుత్తొస్సింది, మా అయ్య సెప్పిండుగా , ఇబ్బందులకాలంలో ఇట్టమైనవారిని తల్సుకొని , పిల్సుకుంటే  వస్సి ఆదుకుంటార్రా అని. మరి నాకిట్టమైనది ఈ పెపంచకంలో నా లచ్చేగా! .లచ్చా ,లచ్చా,ఓ లచ్చా,నాను సచ్చా , రాయే , తొరగా రాయే. రాజుగోరు నిన్ను ముండమోయించి , రాకుమారిని ముత్తైదువని సేసేత్తుండారే  . తొరగా వస్సి రాజుగోరి కూతుర్ని ఏడుకోవే , రాయే ,తొరగా రాయే.లచ్చా  ,లచ్చా, ఓ లచ్చా, నాను సచ్చా , రాయే , తొరగా రాయే.
                                               ( తెర పడుతుంది )

మహా మనీషి

అంతరంగంలోని ఆర్తిని

అర్ధం చేసుకొని
మసులుకొనువారే
నిజమైన ఆత్మబంధువౌనురా

ఆపదలో ఉన్నవారిని

ఆదుకున్నవారు
ఏ జాతివారైన నేమి
అసలైన ఆప్తులౌనురా

అంత్యదశలో

అలమటించే ప్రాణికి
కంఠంలో నీరు పోయువారే
సిసలైన ప్రాణబంధువౌనురా

కారుచీకటిలో

గోరంతదీపాన్ని
వెలిగించిన వారే
మహా మనీషి ఔనురా

    ********

ఆకసం - మానసం

     

                                            


అంతు లేనిదా ఆకాశం
అంతు చిక్కనిదీ మానసం

అనంతమా ఆకసం
అణువంతదీ మానసం

ఆకసాన నక్షత్రాలు
మానసాన ఆలోచనలు

ఆ ఆకాశంలో ఉఱుముల , మెఱుపుల ఘర్షణ
ఈ మానసంలో తలపుల , వలపుల సంఘర్షణ

లెక్కలోని ధృవ తారలు  కొన్నే
ఆచరణకు ఆలోచనలూ కొన్నే

ఆకసాన రాజసం
మానసాన వికాసం

ఆకసానికి లేదు ఏ ఆధారం
మానసానికి లేదు ఏ ఆకారం

            *****