సవారీయా ? సవాలా ?


                                                                                                                                       రచన : శర్మ జీ ఎస్ 

నేను , నా శ్రీమతి  
ఈ మమ్మీ రైడ్ కి వెళ్ళే వాళ్ళు ఏ విధమైన బ్యాగులు క్యారీ చేయకూడదుట . కనుక మా బ్యాక్  ప్యాక్ ఆ ప్రక్కనే వున్న ఫ్రీ లాకర్లో పెట్టాము . ఆ లాకర్ కంప్యూటర్ లో మన ఫింగర్ ప్రింట్ ద్వారా లాక్ చేయబడ్తుంది . నా శ్రీమతి హ్యాండ్ బ్యాగ్ మాత్రం తన వద్దనే వుంచుకోచ్చు అన్నారు .

ఆ భారీ లైన్లలో అలా నడుచుకొంటూ వెళ్తుండగా "   రకరకాలవారు రాగిమీసాలవారు  "   అన్న చందాన అక్కడే ఆలింగనాలు , ముద్దులు , మురిపాలు చూడ తటస్థించింది . 


ఓ పడుచు కుఱ్ఱవాడు తన క్రాఫ్ ని కోడిపుంజు నెత్తిపై నున్న ఎఱ్ఱకిరీటంలా చేసుకున్నాడు . బహుశా తను పెట్ట కాదు , పుంజునని అందరకు తను చెప్పకనే తెలిసిపోవాలనుకున్నాడు కాబోలు .

అది మనకు మాత్రం ఓ వింత  కాగా , మా కెమేరాలో బందించాను . ఈ  రైడ్స్ కి నిర్ణీత సమయం వుందని ప్రకటనల పలక మీద ప్రకటిస్తుంటాడే గాని , ఒక సమయమంటూ లేదు , నిరంతరం ఒక బోటు తర్వాత మరో బోటులో ఎక్కించి పంపుతుంటారు . ఆ లైన్లన్ని నడచి మేం ఆ సాధనాన్ని  చేరేసరికి  6.20 అయింది .

ఏ రైడ్ల కైనా ఒక్కరు వెళ్తే వాళ్ళను ఎక్కడో ఒక చోట కూర్చో పెట్టి పంపుతుంటారు . అదే ఎక్కువమంది అయితే వాళ్ళను పక్కపక్కన కూర్చోపెట్టి పంపుతుంటారు .

మాయిరువురిని ఆ  సాధనంలో  ఒక చోట కూర్చోమన్నారు . రెండవ వరుసలో ఆఖరున కూర్చొన్నాం . వెంటనే లాక్ చేసేశారు . కూర్చోగానే అక్కడి స్టాఫ్ అలా వెళ్ళే వాళ్ళందరకి హ్యాపీ రైడ్ చెప్తారు . బయలుదేరింది .మలుపు తిరిగింది , అలుపూ మొదలైంది , జీవం కోల్పోయిన అస్థిపంజరాలు  కూడా జీవం వున్నవారిని భయ పెడ్తున్నాయి మన మీదకు వచ్చి . ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే మన పై నుంచి  మన మీదకు ఆ అస్థి పంజరాలు వాటి చేతులతో మనల్ని పట్టుకొన ప్రయత్నిస్తున్నట్లుగా చేతులను చాచుతూ కదుల్తుంటాయి . ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే పైన వేదికలా వున్న ఆ చోట ఒక శవాకారం మాట్లాడుతుండగా మనం పైకి చూస్తుండగా ,   సడెన్ గా మన కుడి , ఎడమల రెండు అస్థిపంజరాలు ఠక్కున కనపడి కాలి బూడిదవుతాయి .

అది దాటి ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి పైకి ఎక్కుతూ వేగం పుంజుకొంటుంది మా వాహనం . ఆ వేగంలో ఎటు పోతున్నామో , ఏం చూడబోతున్నామో తెలియని అదో రకపు అయోమయ స్థితి . ఇదో రకమైన థ్రిల్ . ఆ వేగం అంతా , యింత అని చెప్పలేని పరిస్థితి . అంధకారాన్ని మనం తరచూ చూస్తూనే వుంటాం .  గాడాంధకారం , కళ్ళు విప్పార్చినా ఏమీ కనపడని స్థితి యిది .  ఏ ఆలోచన దరిజేరనీయదు , ప్రాణాన్ని గుండెలోనే నొక్కి పట్టి ఒకరికొకరు గట్టిగ పట్టుకొని ఉన్న స్థితిలో వేగంగా అష్ట కాదు అనేక వంకరలు తిరుగుతూ , పైకి , క్రిందకు పల్టీలు కొడుతూ , మధ్య మధ్యలో మనమీదకు దూకే అస్థిపంజరాలు , ఛటుక్కున ఎదురుగా ఏదో వస్తే ( సడెన్ బ్రేక్ తో ఆగినట్లు )ఆగిపోయింది .

ఇంతదాకా హాహాకారాలతో తమ ఉనికిని తెలుపుకుంటున్న అందులోని మా సహచరులు ( పలు భాషా ప్రజలు ) ఒక్కమారుగా హమ్మయ్య బ్రతికిపోయాం రా అన్న భావాన్ని తమ నిట్టూర్పులతో వ్యక్తపరిచారు . ఇంకా గాడాంధకారం వీడిపోలేదు . ఉచ్వాస , నిశ్వాసల ద్వారా , మేము ఊపిరి తీసుకొంటున్నామని తెలుసు కొనటం జరిగింది . ఆ తర్వాత ఎలా ఉంటుందో , ఏమో అని , ఎందుకైనా మంచిది అని మరల హాయిగా , ఒక రెండు నిముషాలు ఊపిరిని ఉఛ్ఛ్వాస , నిశ్వాసలతో పీల్చుకున్నాము .

మా వాహన కదలికలు మళ్ళీ ఆరంభమయ్యాయి , మేమంతా మరల ఏం జరుగుతుందోనని సంసిధ్ధమయ్యే సమయంలో , ఎటు వెళ్తుంది  , ఈ గేట్ తీస్తాడేమో , ఇంకా ఏమి చూపిస్తాడో అనుకుంటుండగా అదే వేగంతో , వెను తిరిగింది  .

ఎందుకంటే , ఇంతవరకు తెలియకుండా జరిగిన ఈ ప్రయాణం ఆశ్చర్యాన్ని , ఆనందాన్ని అందించింది మన ప్రిపరేషన్ ఏమీ లేకుండానే . అదే వంకర టింకర ప్రయాణం మరల సాగింది . ఈ మారు భయభ్రాంతులకు గురైనాము . మళ్ళీ అదే ప్రయాణమా ? అన్న భయం  ఆవహించినా , మనం అరిచి గీ పెట్టుకున్నా , వచ్చి ఆదుకొనే నాధుడెవడూ లేడు కనుక నోరు మూసుకొని సాగిస్తున్నామనుకొంటే పొరపడినట్లే . నోరు బాగా తెరచి , బిగ్గరగా , రణగొణ ధ్వనులతో హాహాకారాలు మొదలయ్యాయి . అలా , అలా వెనక్కి తీసుకువెళ్తూ , ఎప్పుడు మలుపు తిరుగుతుందో మనకు తెలియదు , చిట్ట చివరికి ఒక్కమారు ఆ పై నుంచి క్రిందకు తోసేసింది .

గుండెలవిసిపోయాయి అని మా  పెద్దవాళ్ళు అంటుంటె విన్నాను గాని దాని భావమేమిటో తెలుసుకోలేకపోయాను . ఇప్పుడు అనుభవంలో తెలుసుకున్నాను .

అందరం  బ్రతికి బయటపడ్డాంరా బాబూ అనుకున్నంత ఆనందంతో బయటకు వచ్చాము .

నిజానికిది కూడా వాళ్ళు ప్రకటించిన నియమ నిబంధనలను చూడకుండానే ఈ రైడ్ కి మేమిరువురం వెళ్ళి వచ్చాం . బైటకు వచ్చేసరికి , 7 గంటలయింది . సూర్యుడికి కూడా ఈ అమెరికా బాగా నచ్చినట్లుంది .  5 గంటలకల్లా వస్తున్న లేత వెలుతురుతో సూర్యుడూ పరుగులు తీస్తూ పై పైకి గబగబా వచ్చి తొంగి చూస్తుంటాడు ఇక్కడి ప్రకృతిని . తన వెలుగు , జిలుగులతో ఝిగేలుమనిపిస్తుంటాడు . ప్రతాపాన్ని చూపబుధ్ధికాక , ప్రకాశాన్నే అందంగా అందజేస్తాడు . అలాగే సాయంత్రాలు కూడా .అంత పొద్దున్నే వచ్చాడు కదా అని  తొందరగా వెళ్ళిపోడు . ఆయన ఈ అమెరికాలోని అందాలను తనివితీరా చూస్తూ , ఆ మైమరపులో ఆలస్యంగా వెళ్తున్నట్లుగా మనకనిపిస్తుంది .

అలా తను పొందిన ఆనందాలని ఈ జీవకోటికి అందించాలన్న సదాలోచనతో రాత్రి 8.45 నుంచి 9 గంటలలోపు తిరిగి వెళ్ళిపోతాడు .

                                                                                       
                                                                                                           *********** 

2 comments:

  1. నాకొచ్చిన ఈ అవకాశాన్ని పదిమందికీ పంచాలన్నదే ప్రధాన ఉద్దేశ్యం .

    ReplyDelete