దేవుళ్ళ , దేవతల పుట్టు పూర్వోత్తరాలు


                                                            దేవుళ్ళ , దేవతల పుట్టు పూర్వోత్తరాలు

                                                                                                                                       రచన : శర్మ జీ ఎస్ 

సృష్టి ఆరంభం నుంచి  ఆకారుడైన మానవుడు , నిరాకారమైన శక్తిని తెలుసుకొన్నా , ఎలా గుర్తుంచుకోవాలో తెలియక ( సతమతమవుతూ ) ఆ నిరాకారమైన శక్తికి తనలాగే రూపాల్ని కల్పించి , వావి వరుసలు తగిలించి కొలువనారంభించాడు .

వాస్తవానికి ఆ శక్తి గుణకారిణి .

అలా కనపడని , అనుభూతమయ్యే ఆ శక్తి స్వరూపాలకు గుణాలు ప్రతిరూపాలు . గుణాలు రెండు రకాలు  ధర్మము , అధర్మము ని . ఇవే మానవ జీవనగమనంలో మంచి , చెడు ని / పుణ్యము , పాపము ని , సుఖము , దుఃఖము ని / సత్యము , అసత్యము ని /  న్యాయము , అన్యాయము ని / అహింస , హింస ని  చెలామణీ అవుతూ వస్తున్నాయి .


ఇందులో ధర్మం , సుఖం , సత్యం , పుణ్యము , న్యాయం , అహింస లాంటివన్నీ మంచికి మారుపేరుగా , ఆ మంచిని దైవానికి ప్రతిరూపాలుగ  భావిస్తూ వచ్చారు అనాదిగా , అదే పునాదిగా తలచి . 

ఇంక మిగిలిన ఆ అధర్మం , దుఃఖం , అసత్యం , పాపము అన్యాయం , హింస లాంటివన్ని  చెడుకి ప్రతిరూపాలుగా భావిస్తూ వచ్చారు అనాదిగా , అదే పునాదిగా తలచి  . 

అలాంటి మంచి గుణాలు కలిగిన మనుషుల్ని, జీవుల్ని దైవంగా భావించటం , అలాంటి చెడు గుణాలు కలిగిన వారిని , జీవుల్ని దెయ్యాలుగా గుర్తించటం జరిగింది . ఇదే ఈ మానవుల నైజంగా నిలిచిపోయింది . 

మంచి గుణాలు కలిగిన మనుషుల్ని, జీవుల్ని దేవతారూపాలుగా భావించారు ఆ కృత (సత్య )యుగ మానవులు . అలా ఆ గుణాలు తకూ రావాలని , తాము  అంతటి గుణ (శక్తి )వంతులు కావాలని , ఆ గుణాల వలన  తాము 
వాళ్ళు ఆనందించాలని , తమ మానవజన్మ తరించాలని భావించి ఆ గుణాలని  గుడ్డిగా కొలవలేక ,ఆ గుణాలకే
లింగ భేదాలతో  ఆకారాలనేర్పరచి , ఆ కారాలకే దేవుడు , దేవతలగ నామకరణం చేశారు .

తమకు లాగే  భవ బంధాలు తగిలించారు .
పూజలారంభిచారు ఆ నాటి మానవులు .
అలా సృష్టింబడిన దేవతలే , ఈ నాడు పూజలందుకొంటున్నారు .

విఘ్నాల (ఆటంకాల ) గుణాన్ని  విఘ్నేశ్వరుడుగా

సృష్టి గుణాన్ని బ్రహ్మగా ,

పోషణ గుణాన్ని విష్ణువుగా ,

హరించే గుణాన్ని ఈశ్వరుడుగా ,

దుష్ట సంహార  గుణాన్ని  దుర్గగా , 

లోకోధ్ధరణ గుణాన్ని   , కలహాల గుణాన్ని నారదుడుగా ,

అందాలకు ప్రతీకలుగా రంభ , ఊర్వశి , మేనకలుగా ,

ఎంతటి స్థితిలో ఉన్నా అతివల అందానికి బానిసయ్యే గుణాన్ని ఇంద్రుడుగా ,

ఉష్ణంతో కూడిన వెలుగుని సూర్యుడుగా ,

చల్లదనముతో కూడిన మసక వెల్తురుని చంద్రుడుగా , 

ఆయువుకి పట్టు అయిన ప్రాణవాయువును వాయువుగా , 

ఈ చరాచర సృష్టికి మూలాధారమైన ఉదకాన్ని గంగగా , 

ఆ గంగని ఆజమాయిషీ చేయగలిగిన శక్తిని శివుడుగా ,

గురి గల గురువుని బృహస్పతిగా ,

పంచేద్రియాలను నిర్దేశించగల గుణాన్ని గాయత్రిగా ,

సున్నితమైన గుణాన్ని , సాక్షాత్తు ఈశ్వరీదేవి గుణాలకు ప్రతీక శ్రీ లలితాపరమేశ్వరిగా  ,

ఙ్నాన , విఙ్నానాల భాండాగార నిలయాన్ని సరస్వతిగా , 

సిరి సంపదలను (అవి లేనిదే మానవ మనుగడ లేనే లేదు ) శ్రీలక్ష్మిగా ,

ఈ జగత్తు నడుపుటకై ఈ పై గుణాల  (శక్తుల ) నన్నింటినీ సృష్టించిన శక్తి స్వరూపిణిని జగన్మాతగా , పార్వతిగా ,

సత్యం , పుణ్యము  , ధర్మం , అహింస , మంచి లాంటి విశేష ( సు )గుణాలన్నింటినీ స్వర్గంగా ,

అసత్యం , పాపము , అధర్మం , హింస , చెడు లాంటి ( దు )ర్గుణాలన్నింటినీ నరకంగా ,

అటూ , ఇటు కాకుండా మధ్యలో అటొక కాలూ , ఇటొక కాలూ వేసేవాళ్ళ గుణాల్ని త్రిశంకు స్వర్గంగా , 

ఈ చర్య  కృతయుగారంభంలోనే ప్రారంభమైంది . ఆ యుగంలో ఎవరు ఏం చెప్పినా విని రించేవారు , ఆచరించే
వారు , ఎదురు చెప్పేవారు కాదు , వాదించేవారు కాదు . ఆ యుగ మానవులు ముందు యుగాలని ఊహించుకొని (ఈ నాడు ఉన్న దారుఢ్యం ముందు ముందు ఉండబోదని , కారణం ఈ మానవుల శక్తి నుంచే మరల సృష్టి జరుప
బడ్తున్నదని గ్రహించాడు ) యిలా ఆ నాడే ఫిక్స్ అయిపోయారు  .

ఆ తర్వాత యుగమైన త్రేతాయుగంలో ఆ శక్తే మానవరూపంలో అవతారమెత్తి మానవులతో సంచరిస్తూ , మగవారు ఏకపత్నీ వ్రతుడుగా ( అందినదానితో సంతృప్తి చెందాలని )శ్రీరాముడి ద్వారా ,

ఆడవారు తన బాగోగులు చూసుకొనే భర్త పంచన లేకుంటే , అపనిందలకు గురి అయి , నిరూపణ చేసుకొని తీరాల్సిం
దే నని సీత ద్వారా ,

అన్నదమ్ములు కలిసి మెలసి ఉండాలని లక్ష్మణ , భరత శతృఘ్నుల ద్వారా , 

భక్తుడు అంటే నిశ్చలమైన భక్తి గుణాలు కలిగి ఉండాలని వాయుపుత్రుడైన ( అంటే వాయువు కనపడదు , అలాగే ఆ వాయుపుత్రుడైన హనుమంతుని శక్తి కనపడదని , ఆ విషయం  మనకు తెలియచెప్పే టందు కే ' నీ శక్తి నీకు తెలియదంటూ ) హనుమంతుని ద్వారా ,

మానవుడెంతటి ( శక్తిమంతుడైనా ) వాడైనా , పర స్త్రీ లోలుడైతే నాశనమైపోతాడన్నది రావణుడి ద్వారా ,

ఆ తర్వాత యుగమైన ద్వాపరయుగంలో మఱల ఆ శక్తే మానవుల మధ్యన శ్రీకృష్ణుడిగా జన్మించి , సమాజంలో పేరుకుపోయిన దానవగుణాల్నినిర్మూలించి , నిష్కామప్రేమ ద్వారా ఆ శక్తి (గుణం )లో చేరిపోవచ్చు అని తెలియచెప్పటమైంది .

ఈ ద్వాపరయుగంలో మహాభారతం ద్వారా తెలియచేసిందేమిటంటే , పంచపాండవులు పంచేంద్రియాలకు ప్రతీకలు .
పంచేంద్రియాలు  ( వినుట , చూచుట , ఆఘ్రాణించుట , రుచి తెలుసుకొనుట , స్పర్శలు  ) .
పంచేంద్రియాలే పంచప్రాణాలు , ఆ పంచప్రాణాలు పంచపాండవులు , ఆరో ప్రాణం కర్ణుడు . 

పిల్లలు ఎంత పెద్దవారైనా తల్లిమాట జవదాటకూడదు అని కుంతి ద్వారా తెలియచేశారు . 

ఎంతటి శక్తిమంతుడైనా , స్థితిమంతుడైనా , ధైర్యవంతుడైనా , ఎన్ని మంచి గుణాలున్నా , ఒక్క దుర్గుణం (పరస్త్రీ వ్యామోహం ) వల్ల చరిత్రహీనులై పోతారని తెలియచేశారు దుర్యోధనుని ద్వారా .


ఆన్యాయం , అరాచకాల్ని సహించటానికి కొంత సమయం ఉన్నది . ఆ నిర్ణీత సమయం దాటినప్పుడు తన , పర భేదాలుండకూడదు అని అర్జునుడికి గీతోపదేశం ద్వారా అదే శ్రీకృష్ణుడు తెలియచేశాడు .

ఇలా యుగాలకొక్క రూపంలోనో , లేక అనేక రూపాల్లోనో  ఆ శక్తి సృష్టించి మానవులను సన్మార్గంలో నడిపించటానికి తన శాయశక్తులా తోడ్పడుతున్నది .

ఇక ఈ కలియుగానికి వస్తే , జనాభా అధికమై పోవటం వలన దేశాలకనుగుణంగా , ఎక్కడికక్కడ , ఎప్పటికప్పుడు మంచి గుణాలని మానవ రూపాలలో సృష్టించి , సన్మార్గంలో నడవటానికి దోహదపడ్తోంది . 

ఇలా తరచి చూస్తే ప్రతి దేవుడు / దేవత శక్తి అయిన గుణాలకు సంబంధించిన వాళ్ళే .

 అల్లా , క్రీస్తు ,శ్రీ దత్తాత్రేయ , మహావతార్ బాబాజీ , యిత్యాది మహాపురుషులందరూ ఈ శక్తి గుణాల కోవలో ని వారే . మొన్న మొన్నటీ శ్రీ షిర్డిసాయిబాబా వరకు .
 
డబ్బులు వడ్డీకి తీసుకొని స్వంత ఖర్చులకు వెచ్చించే వాళ్ళు ఎంత తీర్చినా అసలు అలాగే ఉంటుందన్న గుణాన్ని( ఎన్నటికీ  తీరని బ్యాంకు లోన్ అసలులా అని మనం తెలుసుకోవాలి ) శ్రీ వేంకటేశ్వర స్వామిగా .

మీరు ఏ పురాణం , ఏ ఇతిహాసం చూసినా ఇవే అందులో మనకు కనపడేది . అది తెలుసుకొని మసులుకొంటే అంద
మైనదీ జీవితం , లేకుంటే అందవిహీనమైనదే .

ఏ శక్తి మానవరూపం దాల్చినా , సాటి మానవుల్లాగే అంతమవాల్సిందేనని , అది తనచే శాసించబడిన ధర్మశాసన
మని తెలియచేస్తుంది  .అందుకే మానవరూపాలలతో పుట్టిన ఎంతటి శక్తిమంతులైనా , రామాయణ మహాపురు షులు , మహాభారత వీరులు , కలియుగ పుణ్య పురుషులు లాంటి అందరూ మరణించారు . ఇది మనకు తెలియ
వస్తున్న నగ్నసత్యమే .

గుణాలు ఎన్నో రకాలు . కనుక అనేక రూపాల్లో ఆవిర్భవిస్తూ మానవులను మహనీయులుగా తీర్చి దిద్ద ప్రయత్నం చేయటం జరుగుతున్నది . ( సద్గుణాలకనుగుణంగా  ) .

అవి మనలో ఉంటే మనమూ మహనీయులమే , ఆ సద్గుణాలకు వారసులమే . కనుక మన ఆలోచనా విధాల్ని మార్చుకోవాలే గాని , ఒక పక్క దేవుళ్ళకు పూజలు చేస్తూ , పురస్కారాలు జరిపిస్తూ , సాటి తోటి జీవులకు అన్యా యం చేయటంలో మీరు దుర్గుణ భూయిష్టమైన దుష్టదేవతలను ప్రోత్సహించటమే గుణాల పరంగా .

మంచి గుణాలు కలిగిన మానవుల్ని మనం దేవుని ప్రతిరూపాలుగా భావించి , మానవుడే మాధవుడు అని అన్ని
వేళలా చెప్పుకొంటుంటాము .

మీరనుకొంటున్నన్నట్లు సద్గుణాలు సత్యదేవుళ్ళు / సత్యదేవతలు . దుర్గుణాలు దుష్టదేవుళ్ళు  / దుష్టదేవతలుగా తెలుసుకోండి .

అంతే గాని దేవుడు / దేవత ఎక్కడో లేరు , ఉన్నది శక్తికి ప్రతిరూపాలైన సద్గుణాలే .

కనుక మనం ఆహ్వానించవలసినది దేవుణ్ణీ  / దేవతను కాదు , సత్ శక్తులైన సద్గుణాలని , మరువకండి , మననం చేసుకొంటుండండి . 

మనమూ మన జీవితాలని హాయిగా అనుభవించవచ్చు , మహనీయులమూ కావచ్చు . అది మన చేతులలో సారీ , మన  చేతలలోనే ఉన్నదన్నది అక్షరసత్యం , ఆచరణయోగ్యం కూడాను .

నిజానికి  కనపడేదంతా నిజం కాదు , శాశ్వతం కాదు . కనపడనిదే శాశ్వతం .  

నిజానికి నేటి పూజల కొలుపు ( వు ) భక్తా ?  భయమా ? అంటే , ఈ రెండింటిలో ఏదైనా ఒకటే ఉండాలనే వారు . కాని ఈ కలియుగంలో రెండూ కలిసిపోయాయి . భయంతో కూడిన భక్తిలా నిలిచిపోయాయి . 

దేవుళ్ళకు , దేవతలకు కొలుపులు , కొలువులు , పూజలు ఆపి , ఆ సద్గుణ శక్తుల్ని ఆవాహన ( ఆవాహన అంటే ఏదో  అనుకోకండి , మేళతాళాలు , భాజాభజంత్రీలు అవసరం లేదండి . మనఃస్ఫూర్తిగా ఆహ్వానించటమే ) అలా ఆహ్వానింపబడిన వారిని ఎంత గొప్పగా , గౌరవ్భావంతో చూస్తామో అలాగ ఆ ఆహ్వానించిన శక్తుల్ని చూసుకొంటే చాలు )  చేసుకొంటే చాలు , మనమూ అంతటి శక్తివంతులమౌతాము .  ఆ శక్తులని సద్వినియోగపరచుకోవలసిన అవసరం మన మీద ఎంతైనా వుంటుంది . 

ఇది తెల్సుకొని మసులుకొంటే , మనమే సర్వ సద్గుణశక్తికి వారసులమౌతాము ఆ శ్రీరాముడిలా , శ్రీకృష్ణుడిలా , ఏసుక్రీస్తులా , మహావతార్ బాబాజీలా , దత్తాత్రేయునిలా , ఆ  గురుపరంపర మానవ మహనీయుల్లా , షిర్డి సాయిలా .
ఇది అంత తేలికైన విషయం కానే కాదు . 

మనం  ఉన్నత పదవుల్లో వున్నవారిని ఆహ్వానించేటప్పుడు మన ఇంటిని , ఆ పరిసరాలని ఎంత అందంగ తీర్చిదిద్దుతామో ( వాళ్ళకు అనుగుణంగా ) , అలా మనమూ , మన శరీరాన్ని అలా  సన్నధ్ధం చేసి ఆ సద్గుణశక్తుల్ని ఆహ్వానించాలి . 
అంటే మనం  అరివీర భయంకరమైన అరిషట్వర్గాలని అదుపులో పెట్టుకోవాలి . ఆ పైనే ఆ సద్గుణశక్తులు మనలను మంచివారుగా , మహనీయులుగా మారుస్తూ , మన జీవితాల్ని మన ముందు తరాలవారికి మార్గదర్శకులుగా చూపిస్తాయి .  

కనుక మనం చేయాల్సిందల్లా ఒక్కటే . ఆ సద్గుణశక్తులు మనలో చేరే విధంగా సన్నాహాలు చేసి , ఆహ్వానించటమే .

తెలుసుకొన్నారుగా , ఇంక ఆ దిశగా అడుగులు వేయండి , మీకే తెలుస్తుంది మీరెంత మంచివారో .


ఇక ఆ పై ఎవరిష్టం వారిది . 

" సర్వే జనా సుఖినో భవంతు  , శుభం భూయాత్  ."   

చివరగా  చిన్న మాట ఇది నా అభిప్రాయం మాత్రమే  . 

మీ యిష్టం మీది , మీ జీవితం మీది . ఎవరి మీద ఎవరికీ అధికారం లేదు , వుండకూడదు కూడా . మమకారం మాత్రమే వుండాలి , అదీ ఎదుటివారి స్వేఛ్ఛను హరింపజేయనంతవరకు అని నమ్ముతున్నాను కనుక . మరి సెలవు .


                                                                             *********

2 comments:

 1. ఆ సద్గుణశక్తులు మనలో చేరే విధంగా సన్నాహాలు చేసి , ఆహ్వానించటమే--
  నిజమైన జ్ఞానం మీకు భోధపదినందుకు సంతోషంగా ఉన్నదీ--

  ReplyDelete
  Replies
  1. నా బ్లాగుకి స్వాగతం . మీరర్ధం చేసుకున్నందుకు కృతఙ్నతలు .
   మనం తెలుసుకొని మసులుకొంటే మహామనుధులౌతారు . దీనికి అందరూ అర్హులే .
   వయసు , లింగ భేదం లేదు .

   Delete