దింపుడు కళ్ళ ఆశ


” దింపుడు కళ్ళ ఆశ ” (హాస్య నాటిక )

రచన : శర్మ జి ఎస్

పాత్రలు – పాత్రల స్వభావాలు
యమధర్మరాజు : యమసీమ ( భూలోకవాసుల పాప , పుణ్యాలను బేరీజు వేసే ఏకైక కార్యాలయం  )కి ఏకైక అధిపతి.
చిత్రగుప్తుడు : యమసీమకి ( దివిసీమకా? యమసీమకా ? పాపపుణ్యాల కనుగుణంగా తేల్చి చెప్పగల) ఏకైక అకౌంటెంట్.
కింకరులు           :   కిం అనగానే కం అనుకుని హాజరయ్యే యమ భటులు.
నారాయణ          :   నరలోకంలో నివసించే సామాన్య నరుడు.

( తెఱ తీయగానే )
( అది యమసీమ . అచట యమధర్మరాజు ఆధీనములో , చిత్రగుప్తుని ఆధ్వర్యములో , నరలోకము నుంచి వచ్చిన శవాలకు , వారి వారి పాపపుణ్యాల కర్మలకనుగుణంగా , వారికి చేయవలసిన సకల మర్యాదలు చేయుదురు . యమధర్మరాజు కొలువు తీరి ఉన్నాడచట . చిత్రగుప్తుడు ఆతని ఏకైక ఎకౌంటెంట్ , కింకరులు అచటనే ఉంటారు )
చిత్రగుప్తుడు: ప్రభూ గత మూడు నాళ్ళుగా తమరు దివిసీమ సభకు వెళ్ళుటవలన కొన్ని కేసులు మీ పరిశీలనకై ఉండిపోయినవి . ఇపుడు పరిశీలనకు అనుమతించినచో , ఆ కేసులను ప్రవేశపెట్టెదను.
యమధర్మరాజు: ప్రవేశపెట్టుడు .
చిత్రగుప్తుడు: కింకరులారా , వరుసవారీగా ప్రవేశపెట్టుడు .
కింకరులు:  చిత్తం అమాత్యా ! ( లోపలకు శవాలను మోసుకురావటానికి వెళ్తారు )
యమధర్మరాజు: గుప్తా! ఏతెంచిన శవాలలో ఎవరి సంఖ్య అధికముగా నున్నది ?
చిత్రగుప్తుడు:  ప్రభూ!  పాపులే అధికముగా యున్నారు . పుణ్య కర్మలు చేసి ఇటకేతెంచిన వారు బహు స్వల్పం. ఎందులకో వివరించెదరా !
యమధర్మరాజు: ప్రతి యుగంలో 25 శాతం మాత్రమే వృధ్ధి చెందాలని ఆ బ్రహ్మదేవుల వారి శిలాశాసనం. ఐతే దాన్ని కూడా ఈ కలియుగ మానవులు అధిగమించాలని, సృష్టికి ప్రతిసృష్టి చేయాలని, పలు ప్రాణులతో సాగిస్తూ జీవిస్తున్నారు  పిల్లలకు జన్మనిస్తున్నారు . అది వారి ఘనతగా దండోరా వేసుకుంటున్నారు . వింత ధోరణులు , వింత పోకడలు ఈ కలియుగాన్ని కల్తీయుగంగా మార్చేశాయి. అందువలననే పాపులు అధికసంఖ్యలో తరలి వస్తున్నారిచటకు .
( ఇంతలో కింకరులు శవాలను మోసుకు వచ్చి అత ఓ మూలగా ఉంచుతారు )
చిత్రగుప్తుడు:  ప్రభూ!  ఈ నరుడు కన్నతల్లితండ్రులకు , ఒక్కగానొక్క పుత్రుడు . ఆ తల్లితండ్రులు  పుత్రుడిని అమిత గారాబంగా చూసుకున్నారు . చివరికి ఆ తల్లితండ్రులకు కూడుపెట్టక , వారి ఆస్తిని కైవశం చేసుకొని , వారినే శవాలుగా మార్చటానికి కిరాయి హంతకులతో మంతనాలు జరిపి అంతమొందించిన అధమాధముడు.
యమధర్మరాజు:  అటులనా ! కంప్యూటర్ తో కంపారిజన్ పూర్తి అయినదా ?
చిత్రగుప్తుడు: అయినది ప్రభూ . శిక్ష సెలవీయుడు . తక్షణమే అమలు జరిపించెద .
యమధర్మరాజు:  అతగాడికి స్పృహ కలిగించి కుతకుత ఉడుకుతున్న వంటనూనెలో అదేపనిగ ముంచుడు మఱల నే చెప్పువఱకు
( కింకరులు ఆ శవాన్ని తరలించారు శిక్ష అమలు జరుపు ప్రదేశానికి.  వెంటనే మఱో శవాన్ని హాజరు పరుస్తారు )
చిత్రగుప్తుడు: ప్రభూ ఈ నరుడు , కట్టుకున్న కన్నెపిల్ల కడుపున కాయ కాయించకపోగా, వ్యసనాలకు బానిసై , పరాయి పంచన ఆ ఇల్లాలికి పడకవేసి , హయిగా వ్యసనాలను అనుభవించాడు . ఆ ఆడకూతురు సుఖరోగాలతో మంచాన్నంటిపెట్టుకుని , మందిప్పించమంటే , సుఖాన్ని పొందినపుడు  రోగాన్ని కూడా అనుభవించాల్సిందే . మందు నాకు కావాలి , నీకు కాదు అన్న నికృష్ఠుడు . సెలవీయండి .
యమధర్మరాజు : అయినచో ఈ నీచుడ్ని ఉడుకునూనెలో ముంచుతూ , ఉడుకు నీళ్ళతో కడుగుడు.
(మఱలా ఆ శవాన్ని తరలించారు శిక్ష అమలుజరుపు ప్రదేశానికి . మఱో శవాన్ని ప్రవేశపెట్టితిరి )
చిత్రగుప్తుడు:  ప్రభూ ఈ పడతి తన పడుచుతనాన్ని అలుసుగ తీసుకుని , అందినవారికందఱికి అందిస్తూ ,అందినంత దోచుకొంటూ , కట్టుకున్న భర్తను మోసం చేస్తూ , పడక సుఖాన్ని అందించక, అడుగడుగునా , మీరే నా పతి , ప్రత్యక్షదైవం . నేను మీ అర్ధాంగిని . నా పడక మీ పక్కనే అన్నది తెలిసి కూడా పొందాలని ఉంటుంది , కాని పొందలేకపోతున్నా. మీరున్నపుడు , నాకు మీ పడక చేరాలనిపించదు . మీరింట్లో  లేనపుడే నాకు మీతో సుఖం పంచుకోవాలనిపిస్తుంది అంటూ తప్పించుకు తిరిగింది అతను  జీవించినంతకాలం . ఆతను పోగానే  అడ్డంకి తొలగిందని అమిత ఆనందం చెంది , అడ్డూ ఆపు లేకుండా సుఖాల్ని పొంది ,రోగాల దరిజేరి , ఇటకు చేరింది . శిక్ష సెలవీయుడు .
యమధర్మరాజు:  ఓ అటులనా ! గుప్తా , ప్రతి శవాల చిట్టా కంప్యుటర్ తో ఎంతో జాగ్రత్తగా ట్యాలీ చేసిన మీదటే ఈ కొలువుకి హాజరు పరచుచుంటివిగదా! .
చిత్రగుప్తుడు:  ఔను ప్రభూ , అటులనే చేయుచుంటిని .  సందేహమెందులకు వచ్చింది ?
యమధర్మరాజు:  నీ మీద అణుమాత్రం సందేహము లేదు ? ఆ మధ్య నరులు మన పరిపాలనా దక్షత మీద  సినిమాలు తీసి ఆనందించుచున్నారుట.  బ్రహ్మదేవులవారు నిన్న నిర్వహించిన సభలో వెల్లడించి , హెచ్చరించారు .
చిత్రగుప్తుడు: నేను ప్రత్యేక శ్రధ్ధతో పరిశీలిస్తాను ప్రభూ .
యమధర్మరాజు: ఈ చిత్రాంగిని చిత్ర,విచిత్రమైన ఆ ముళ్ళ కంచెలో ఉంచి సైక్లింగ్ చేయించండి .
( కింకరులు తక్షణమే ఆ శవాన్ని శిక్షాస్ధలానికి తరలించి, తదుపరి శవాన్ని హాజరు పరిచారు )
చిత్రగుప్తుడు:  ప్రభూ నేటికిదే అఖరు కేసు .
యమధర్మరాజు: నుడువుడు .
చిత్రగుప్తుడు: కంప్యూటర్ కంపారిజన్ లో ఆరిజనే దెబ్బతిన్నట్లున్నది .
యమధర్మరాజు : ఆశ్ఛర్యంగా ఉన్నదే , ఇపుడే సెలవిచ్చితివిగదా , ప్రత్యేక శ్రధ్ధతో పరికిస్తున్నానని . ఇంతలో ఏమైంది ?
చిత్రగుప్తుడు:  అదే నాకూ అర్ధం కావటంలేదు . ఈ కేసు పూర్వాపరాల లోనికి వెళ్ళగా, ఈతని మేని రంగు , నన్ను ఖంగు తినిపించుచున్నది .
యమధర్మరాజు        గుప్తా ! నీకేమి మతి చలించలేదుగా ! కనుల ముందు కనుపించుచున్న కాఱునలుపుని కాదనుచుంటివా ? భూలోకవాసులకువలె నీకునూ మసక రాలేదుగదా ?
చిత్రగుప్తుడు: లేదు ప్రభూ , పలుమారులు పరిశీలించితిని . ప్రయోజనం యోజనం దూరంలో కూడా కనపడటం లేదు . మన చిట్టా ప్రకారం ట్యాలీ  కాకున్నచో , శిక్షను అమలు జరుపము అన్న మన పరిపాలనా దక్షతను ఎఱింగిన మానవులు , తమ ముఖములను మార్చుచుంటిరేమో అన్న సంశయము నన్ను వెంటాడుచున్నది .
యమధర్మరాజు : అదియును మన దృష్తిలోకి తీసుకోవలసిన విషయమే . నరులు తెలివి మీరి ప్రవర్తించుచున్నారని బ్రహ్మదేవులవారు నుడివినారు .ఆ తైల భాండాగారమందున్న స్వస్వరూప తైలమును ఆతనిపై చిలకరించుము .
చిత్రగుప్తుడు: అదియును చిలకరించి చూచితిమి . ఏ మార్పును  గోచరించలేదు . నరులు ఈ తైలమునకు విరుగుడు కనుగొంటిరా అన్న అనుమానం  నాలో బలపడుచున్నది .
యమధర్మరాజు : ఈ స్థితిలో దండన గాని మన్నన  గాని చేయుటకు మన శిలాశాసనాలు అంగీకరించవు . సందేహ నివృత్తి అయిన పిమ్మటే తగిన శిక్ష వేయగలం .

సభను రేపటికి వాయిదా వేస్తున్నాము. ( అంతఃపురం లోనికి వెళ్ళిపోతాడు )

చిత్రగుప్తుడు: ( శవము వైపు తిరిగి లోలోన వేదమంత్రోఛ్ఛారణ లోలోనే చేసి ,స్పృశించి )  నారాయణా , నారాయణా , లే
నారాయణ:  ( ఆ శవము జీవము పుచ్చుకున్నదై ఒక్క ఉదుటున లేచి ) ఒరేయ్ రామిగా, ఆ పత్తిబేళ్ళను , ఆ గిడ్డంగులలో త్వరగా పేర్చరా .

( బిగ్గఱగా అరుస్తాడు )

చిత్రగుప్తుడు: నారాయణా , హడావుడి తగ్గించు. ఇది గిడ్డంగి కాదు , కనీసం నీ జన్మభూమి అద్దంకి కాదు .  నీ బుధ్ధి మాకెఱుకేలే . నీ ఆ చేష్టలు మాకు తెలియవనుకొనుచుంటివా ?
నారాయణ: నేను మితభాషిని , పరస్త్రీ ద్వేషిని .
చిత్రగుప్తుడు: మా చెవులకే పూలు పెట్టుచుంటివా ?
నారాయణ : మా ఆవిడ తలలోకే పూలు కొనుటకు వసతి లేకున్నది . ఇంక మీ చెవులకెక్కడ పూలు పెట్టెదను ?
చిత్రగుప్తుడు: మాకే వినిపించుచుంటివా ?
నారాయణ:  తెలియనివారికి వినిపించుట లోక పఱిపాటే గదా ! నాది ప్రేమ పెళ్ళి కాదు, పెద్దలు కుదిర్చినది. అందుకే పూలు కొనకున్నను మా సంసారం హాయిగా  జరిగిపోతున్నది .
చిత్రగుప్తుడు: ఎందుకు జరిగిపోదు , ఓ పక్కన చాటుమాటుగా నీవు ఆ గిడ్డంగులలోని ఆడంగులతో  సలిపిన సలపరింతలు నీ భార్యకు తెలియనివి కానీ , మాకు తెలియనివి  కావు .
నారాయణ:  రామ రామ , హరి హరీ .
చిత్రగుప్తుడు: ఇక్కడేమో ఇలా  రామ రామ ,  హరి హరీ  నా ? అక్కడేమో రామ్మా, రా…మ్మా ,హాయ్ , హాయి  అంటూ రంధిగా సాగించిన రంకులు మాకు  తెలియవనుకొని , కప్పిపుచ్చునుకొన ప్రయత్నించు చుంటివా ?
నారాయణ: పాపం శమించుగాక , ఆడవారిని చూచిన ఆమడ డూరమున నుండు నేను ఆడంగులతో , అందులో ఆ గిడ్డంగుల లోనా ? ఛీ….ఛీ… మమ్మలే ఏమార్చకు , మా పై  ఏలిక వారికీ విషయము తెలిసిన కఠోరమగు శిక్ష విధించెదరు .
యమధర్మరాజు: ( వైర్ లెస్ లో ) గుప్తా , అతగాడి కలరేమైనా ఓ కొలిక్కి వచ్చినదా ? శీఘ్రగతిన ముగించుము .
చిత్రగుప్తుడు:  చిత్తం ప్రభూ. ( నారాయణ తో ) నారాయణా నీ శరీర ఛాయ ఏమిటో తెలియపరుచుము .
నారాయణ:  నా  రంగు మీకు కనపడుటలేదా !  ఇంత వెలుతురులో కూడా . ఆశ్ఛర్యముగా నున్నదే . ఆమావాస్య రాత్రులలో నన్ను నేను పరిచయం చేసుకొనక తప్పదు . పట్టపగలు , పున్నమి రాత్రులలో కొట్టొచ్చినట్లు కనపడే కారు నలుపు రంగే నాది .
చిత్రగుప్తుడు: అసత్యములాడకుము .
నారాయణ: నిత్యము నేనీ రంగే . అసత్యములు నాకేల , ఇది ఆ భగవత్ లీల .
చిత్రగుప్తుడు : మీ మానవులు రోజు రోజుకీ కనటం , కనుగొనటంలో అత్యంత ఉత్సాహమును ప్రదర్శించుచున్నారు . నారాయణ:( కంగారుగా )అంటే మీరు మనుషులు కారా? మీరెవ్వరు ? నేనెక్కడ వున్నాను. నన్ను కిడ్నాప్ చేసితిరా ? చిత్రగుప్తుడు: గాభరా పడకు నారాయణా .
నారాయణ: ( ఆందోళనగా ) మీరు మా మానవుల లాగా అగుపించుటలేదు . మీరే గ్రహవాసులు ? నాపై మీకాగ్రహమేల ? డబ్బుల కొఱకు కిడ్నాప్ చేసితిరా ? నా వద్ద గాని , మావాళ్ళ వద్ద గాని అంత డబ్బులు లేవు . మాది మిక్కిలి పేద కుటుంబం . పిత్రార్జితాలు గాని , పై డబ్బుల సంపాదనగాని మావద్ద లేనే లేవు . రెక్కాడితే గాని  డొక్కాడని డొక్కు కుటుంబం మాది . మా తల్లితండ్రులకు నేనొక్కణ్ణే పిల్లవాడిని . మా ఆవిడకు నేనొక్కన్నే మొగుణ్ణి . నా పిల్లలిద్దరికి నేనొక్కణ్ణే తండ్రిని . ఎటుచూసినా  నేనొక్కణ్ణే మా వాళ్ళందరికి . దయచేసి నన్ను వెంటనే వదిలేయండి . వేరెవ్వరినైనా చూసుకోండి  ప్లీజ్ .
చిత్రగుప్తుడు: నారాయణా కంగారుపడకు. మేము నీవనుకుంటున్నట్లు మేము కిడ్నాపర్స్ మీ కాదు . అయినా నిన్నిచటికి తెచ్చింది మఱల అచట దించటానికీ కాదు .
నారాయణ: మొదట నన్ను ప్రత్తి కంపెనీలో దింపుడు . రేపు శనివారం . మా కూలీలకు బట్వాడా యీయనిచో ,  నన్ను రాజస్ధాన్ లోని మరాట్వాడాకు పంపెదరు .
చిత్రగుప్తుడు: నీ నాటకాలింక ఆపు .
నారాయణ:  సాంబయ్యను మందు తెమ్మని పంపా. వాడక్కడ నా కొరకు ఎదురుచూస్తుంటాడు . వెంటనే నన్ను పంపండి , లేకుంటే మందు ఇచట దొరుకుతుందా ?
చిత్రగుప్తుడు: మమ్మల్నే మందు సప్ప్లై చేయమనుచుంటివా ? మెల్లగా నీ అసలు రంగు బైటపడుచున్నది .
నారాయణ: మీరు నన్ను అపార్ధం చేసుకొంటున్నట్లున్నారు . మీరు నాకంటగడ్తున్న అలవాట్లకు అసలు బానిస  మా కంపెనీలోనే కూలీగా పనిచేసే ఆ నారాయణ అయ్యుంటాడు .  ఓ మారు పరిశీలించుకోండి .
చిత్రగుప్తుడు: ( వెంటనే  కంప్యూటర్లో పరిశీలించి ) నీవు నక్కల నారాయణవు కాదా ?
నారాయణ: కానే కాదు . నేను నడిగొప్పుల నారాయణాను. నేను నేనే , వాడు వాడే .
చిత్రగుప్తుడు:            అలాగా ! అయితే సరి .
నారాయణ: హమ్మయ్య , యిప్పటికైనా గుర్తించారు . నాకదే పదివేలు కాదు లక్షలు , కోట్లు. లేకుంటే నన్ను నమ్ముకున్న నా భార్యాబిడ్డలు ఏమైపోయేవాళ్ళో . మీ సంశయం తీరిందిగా. నన్ను త్వరగా పంపించేయండి .
చిత్రగుప్తుడు:  తొందరపడకు నారాయణా , అంత తొందర ముందర వుంటే ఎదర బతుకంతా చిందర వందర అన్నారు మీ మానవులే .
నారాయణ:  ఆ మానవులే, ఆలస్యం అమృతం విషం అని కూడా అన్నారు . అవసరాల కొద్దీ ఎన్నెన్నో అంటుంటారు. అవన్నీ వదిలేసి నన్ను వెంటనే పంపించే మార్గం చూడండి .
చిత్రగుప్తుడు: అటులనే, మా ప్రభువులతో సంప్రదించి నీ పయనమునకు తగు ఏర్పాట్లు చేసెద ( అతనిని వెంటనే శవంగా మార్చాడు )
**********
( యమధర్మరాజు అత్యవసరంగా కొలువు తీరారు )

యమధర్మరాజు: గుప్తా , ఈ అత్యవసర కొలువుకు గల కారణం ?
చిత్రగుప్తుడు:  ప్రభువులు మన్నించవలె . ఘోరతప్పిదము జరిగిపోయినది మనకింకరుల వంకర పనుల వలన . నక్కల నారాయణకు బదులుగా , నడిగొప్పుల నారాయణను కొని వచ్చితిరి .
యమధర్మరాజు: ఈ తప్పిదము ఎటుల జరిగినది ? విచారించితివా ?
చిత్రగుప్తుడు: విచారించితిని , ఆ పై యిటుల జరిగినందులకు విచారించుచుంటిని .
( వేరొక ఫ్లాపీని ఇన్సర్ట్ చేసి పరిశీలించి ) మన్నించండి ప్రభూ , ఈ నక్కల నారాయణని భూలోకమునకు పంపుట వీలుకాదు . ఈతగాడు దేహము  చాలించెనని అచ్చట అగ్గిపాల్జేసితిరి . అటులైన ఆతనిని ఏ దేహం లోనికి పంపెదరు .
ఆ  నక్కల నారాయణ దేహములోనికి పంపెదము .
యమధర్మరాజు: ఆతగాడికి స్పృహ కలిగించుము . విచారించెదము .
చిత్రగుప్తుడు: ( వేద మంత్రోఛ్ఛారణ లోలోనే గావించి ) నారాయణా లే , లే నిన్ను మీవారి వద్దకు చేర్చెదము . కానీ…..
నారాయణ: కానుల కాలం ఎపుడో పోయింది . మాది కార్ల కాలమండి .
చిత్రగుప్తుడు: నిన్ను నీ భార్యాబిడ్డలు గాని , నీ పిల్లలు గాని , నిన్నెఱిగిన వారెవ్వరూ నిన్ను గుర్తించలేరు . వేరే వాళ్ళు గుర్తు పట్టగలరు . వారిని నీవు గుర్తు  పట్టలేవు .
నారాయణ: చతుర్లాడకండి . నన్ను నా వాళ్లు , నన్నెరిగినవాళ్ళు గుర్తు పట్టనపుడు , వేరే వాళ్ళెలా గుర్తుపడతారు ? నన్ను గుర్తుపట్టినవాళ్ళని , నేను గుర్తుపట్టనా ? ఇదేదో తిరకాసుగా ఉందే .
యమధర్మరాజు:       నారాయణా నిన్ను  నీ లోకమునకు  పంపెదను . అట ఎచట వుండెదవు ?
నారాయణ: అద్దె ఇళ్ళ అగచాట్లను తట్టుకోలేక , ఈ మధ్యనే బాంకు  వాళ్ళ పుణ్యమా అని ఓ స్వంత ఇల్లు కట్టుకున్నాను . వసతులంతగా లేకపోయినా , సంసారమీదటానికి ఏ యిబ్బంది లేదు .
చిత్రగుప్తుడు: నీ భార్యా బిడ్డలు నిన్ను లోనకు రానీయరు . మా మాట నెమ్మదిగా ఆలకించు .  నీవనుకుంటున్నట్లు యిది భూలోకం కాదు .
నారాయణ: మఱే లోకం ? మీరెవ్వరు ? తెలుగు బాగానే మాట్లాడుచుంటిరిగా .
చిత్రగుప్తుడు: మేము సర్వభాషా ప్రవీణులం. ఇది యమసీమ , వారే యమధర్మరాజు ప్రభువులు . నేను చిత్రగుప్తుడను.   మీ భూలోకము మాకెపుడు సుపరిచితమే . మీ భూలోకవాసులకి మేము ఎపుడూ కొత్తే .
నారాయణ:  అంటే నేనిపుడు మరణించితినా ? అటులైన ఎటుల మీతో మాటలాడుచుంటిని ?
చిత్రగుప్తుడు: నిక్కముగా నీవు మరణించితివి . ఇపుడు నీవు దేహమున లేవు.ఇందులో యిసుమంతైనను సందేహము లేదు . కావలసిన ఒకపరి నీ అవతారమును చూసుకొనుము .

( వెంటనే తనను తాను చూసుకొని భయభ్రాంతుడై రోదిస్తుంటాడు )

చిత్రగుప్తుడు: ఏడవకు నారాయణా , ఏడవకు , నిన్ను చూస్తుంటే మాకూ జాలిగనే వున్నది . ఎన్నో యుగాలనుంచి , ఎన్నో కేసులు పరిశీలించి శిక్షనమలుజరిపిన మాకు నీ  కేసు కొంచెం యిబ్బందికరంగా ఉన్నది .
నారాయణ: (యివేవీ వినిపించుకోకుండా ఏడుస్తూ ) అయ్యయ్యో అపుడే చనిపోయానా ! పట్టుమని పదేళ్ళైనా ఆ సంసార  సుఖాన్ని అనుభవించనే లేదు .
చిత్రగుప్తుడు: ఈ తప్పిదము మా కింకరుల పొరపాటు వలన జరిగింది . అది మా తప్పుగా భావించి విచారణ చేయుచుంటిమి .
నారాయణ: ఇందువలన నా జీవితము నాకు తిరిగి వస్తుందా ? రాదు కదా !
చిత్రగుప్తుడు: ఈ తప్పును సరిదిద్దుటకు మార్గమాలోచించి యున్నాము . నీకు నూతన దేహమును మా ఏలిక ప్రసాదించదలచారు .అందులకు నీవు మాతో సహకరించవలె .
నారాయణ: కళ్ళల్లో కారం చల్లి , నా ఆకారాన్నే మార్చేసి , మమకారాన్ని మసి చెసి , యిపుడు సహకరించాలా ? దేనికొరకు ? నా భార్య నన్ను లౌ చేస్తుందా ?నా బిడ్డలు నన్ను యింట్లోకి ఎలౌ చేస్తారా ?
చిత్రగుప్తుడు: గట్టిగా చెప్పలేం . ఒట్టిగా మాత్రమే చెప్పగలం .
మఱో అమ్మాయిని ప్రేమించి పెళ్ళి చేసుకో . మఱల ఆ శోభనం నాటి సుఖాన్ని అనుభవించి ఆనందించు .
నారాయణ: వింటుంటే బలే హుషారు పుడుతోంది, గాని  నా పెళ్ళాం నాక్కావాలి . నా పెళ్ళానికి నేనే మొగుణ్ణి కావాలి . భూలోకానికెళ్ళిన తర్వాత మీమీద కన్స్యూమర్  కోర్టులో కేసు వేస్తా .
చిత్రగుప్తుడు: అలాగే వేసుకో , కానీ అక్కడకు వెళ్ళాలంటే , నీవు మాతో తప్పక సహకరించవలె .
నారాయణ: అలాగైతే సహకరిస్తా .

( మళ్ళీ నారాయణకి స్పృహ లేకుండా చేసి , కంప్యూటర్ లో మఱోమారు క్షుణ్ణంగా  పరికించిన మీదట )

చిత్రగుప్తుడు:  ప్రభూ , ఓ ఫ్లాష్ .
యమధర్మరాజు: ఏమిటి గుప్తా ?
చిత్రగుప్తుడు: ఒకటే ఒక్క మార్గమున్నది ప్రభూ .ఈతని భార్య ఇతనిని చేసుకొనకముందు , తనకు వరుసైన బావతో ప్రేమ కలాపాలు , సరస సల్లాపాలు సాగించి అతనినే పెళ్ళి చేసుకొంటానని పెద్దలకు చెప్పింది . కాని జాతకాలు సరిపోలేదని , అతనికిచ్చి చేస్తే ఆడదానికి ముఖ్యమైన ఐదవతనాన్ని నువ్వు కోల్పోతావని , కనుక చేసుకోవద్దని
ఈ నారాయణనే చేసుకోమని బలవంతం చేసి పెళ్ళి చేశారు. ఇపుడామె బావ  యిచటకు వచ్చుటకు సిధ్ధంగా ఉన్నాడు . అల్పాయుష్కుడని పేరు పడటంతో , ఆతని కింకను పెళ్ళి కాలేదు . ఈ నారాయణని ఆతని శరీరంలో  ప్రవేశపెట్టినచో ,
ఆ అమ్మాయి తల్లితండ్రులు అతనిని చూసి , చచ్చి బ్రతకటంతో ఆతని రోగాలన్నీ చచ్చిపోయాయని , అతను ఆరోగ్యంగా బ్రతికి బట్ట కడ్తున్నాడని భావించి వాళ్ళమ్మాయిని ఆతనికిచ్చి మళ్ళీ పెళ్ళి చేస్తారు .  ఈ నారాయణ తన పెళ్ళామే తనకు దక్కిందని  ఆనందం చెందుతాడు  . మన ఈ ప్రక్రియతో ,  అదే  సమయంలో ఆ అమ్మాయి బావ కూడా తను ప్రేమించినమ్మాయే తనకు పెళ్ళాం కావటంతో , తను చచ్చి బ్రతకటం తనకో గొప్ప అదృష్టమనుకొంటాడు . ఇందుకేనేమో తననింతవరకూ , ఎవరూ పెళ్ళి చేసుకోలేదనుకుంటాడు .
యమధర్మరాజు: భూలోకంలో స్మశానం ఊరి చివర ఉండటం వలన శవాన్ని అంత  దూరం మోయలేక, మధ్య మధ్యలో దించుకుంటుంటారు . అలా దించుకున్న సమయంలో , ఈ నారాయణని ఆ శవంలో ప్రవేశింపజేసిన , వారి బంధువులు అమితంగా  ఆనందపడిపోతారు .  ఇదే భూలోకవాసులకు ” దింపుడు కళ్ళ ఆశ ” గా అమలులోకి వస్తుంది.నాటినుంచి అలా మధ్య మధ్యలో దింపటం శవాన్ని మోయలేక కాదని , అలా దింపితేనైనా మఱలా బ్రతికి బట్ట కడ్తాడేమోనని కొండంత ఆశతో  ఎదురు చూస్తుంటారు . ఇంక జాగు సేయక తక్షణమే ఆ విధముగ చేయుడు .
చిత్రగుప్తుడు: ఆఙ్ఞ ప్రభూ .
( చిత్రగుప్తుడు ఆఙ్న మేరకు  కింకరులు నారాయణని , ఆ నరేష్ శవంలో ఆవహింపజేయటానికి తీసుకు వెళ్తారు . ఆ నరేష్ శవాన్ని స్మశానం మార్గమధ్యలో శవ వాహకులకు బరువుగా వుండి కిందకు దించుతారు . సరిగ్గా అదే సమయంలో ఆ కింకరులు నారాయణని ఆ నరేష్  శవంలో ఆవహింపజేస్తారు . అమాంతంగా ఆ శవంలోని నరేష్  కదిలి లేచి  కూర్చోవటంతో అక్కడ వున్న యావన్మంది భయభ్రాంతులకు గురి అయి పారిపోతుంటారు .
ఆ నరేష్ శవంలో ఉన్న నారాయణ , వాళ్ళ వెంబడి పరుగెత్తుతూ తనని చూసి భయపడవద్దని , తను చచ్చి
బ్రతికానని చెప్తాడు . మొదట కంగారుపడినా , ఆ తర్వాత అందరూ ఆనందపడ్తారు . ఇంతకీ అసలు విషయమేమిటంటే నారాయణ ఆ శవంలో ఆవహించగానే గత  స్పృహ కోల్పోతాడు . అందువలన యమధర్మరాజు మీద గాని , చిత్రగుప్తుల మీద గాని కన్స్యూమర్ కోర్టు లో కేసు వేయలేకపోతాడు తన పునర్జన్మలో. )
రవళి తన బావైన నరేష్ ని మళ్ళీ పెళ్ళిచేసుకున్న తర్వాత , పైకి బావలా కనపడ్తున్నాడే గాని , తనను , పిల్లను  చూసుకోవటంలో గాని,  ఆ సుఖం అందించటంలో గాని, ఒకటేమిటి , అతని నడవడి ముమ్మూర్తులా నారాయణనే గుర్తుకు తెస్తున్నది . ఎవరితో చెప్పుకోగలదు. మొగుడు పోయిన తనకు మొహం మొత్తకుండా మళ్ళీ మొగుణ్ణి
యిచ్చారు . ఎవరు మాత్రం ఇంతకన్నా  ఏం చేయగలరు . లేని బావ కంటే గూని బావైనా మేలేగదా అని తను ఆ కనపడ్తున్న ఆ నరేష్ బావతోనే  జీవనం సాగిస్తుంది…


                                                                      ******       తెర పడ్తుంది     ******



editor
Print Friendly

Your email address will not be published.
Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

No comments:

Post a Comment