మిష్టరీ స్పాట్ - హిష్టరీ స్పాట్






శాంతా క్రూజ్ బీచ్


ఈ రోజు శనివారం , తేది 19/05/2013 . భోజనాల తర్వాత మిష్టరీ స్పాట్ కి , ఎస్ ఎఫ్ ఓ బీచ్ కి బయలుదేరాము. మధ్యాహ్నం 12.30 కి కారులో .  బీచ్ లో పిల్లలు యిసుకతో ఆడుకొనే సామగ్రిని దారిలో షాపింగ్ చేశారు . 1.36 కి చూపించే  షో కి టికెట్లు తీసుకున్నాడు . నగరం లోంచి కొండ పైకి వెళ్ళ్తుంటే , అంతా అడవులు , ఆ అడవులల్లో , ఆ కొండలలోనే అక్కడక్కడా కొన్ని యిళ్ళు , వంకర కంకర దారులు , పక్కనే ఎత్తైన వృక్షరాజాలు , ఇంకో వైపు పాతాళాన్ని ఙ్నప్తికి తెస్తున్న లోతైన లోయలు .

ఈ మధ్యలో కామెడీగా నా చిన్న మనుమడు  చిటికెన వేలు చూపిస్తూ హడావుడి చేశాడు .దిగిన వంటనే అప్పటికే 1.40 దాటింది , అయినా రెస్ట్ రూం ఎక్కడా అని ఆ ప్రయత్నం అప్రయత్నంగా జరిగిపోయింది .
 చిటికెన వేలు కున్న స్పెషల్ గుణం , ఒకడు మొదలెడితే వరుస అందరికీ అంటుకుంటుంది అంటువ్యాధిలా . వ్యాధి అన్నానే కాని ఆ పని పూర్తి అయింతర్వాత హాయిగా  ఫీలయ్యం అందరం . అప్పుడే అనిపించింది వదిలించు
కోవటంలో ఇంత ఆనందం వుంటుందని .

మిష్టరీ స్పాట్ షోకి రెడీ అయ్యాము . ఏపుగా పెరిగిన వృక్షరాజాలు ఏటవాలుగా కనపడ్తున్నా అవి క్రింద పడవు ,
పడేటట్టుగా ఉంటాయి . ఆ తర్వాత పైకి వెళ్ళాము అనటం కన్నా , ఎక్కామంటేనే బాగుంటుంది . అక్కడ ఒక బల్ల ఒకవైపు ఎత్తు , ఇంకోవైపు పల్లం బాగా కనపడ్తుంటుంది .

దాని మీద ఎత్తైన ప్రదేశంలో ఒక బంతి పెడితే అది పల్లం వైపు జారకుండా అక్కడే ఉండిపోయింది . ఆ తర్వాత అదే బంతిని పల్లం వైపు నెట్టింది . అది అక్కడ ఉండకుండా ఎత్తుగా వున్న వైపు పరుగున వచ్చి అక్కడే నిలిచింది .
ఆ తర్వాత నా పాకెట్ లోని కలం తీసుకొని ఎత్తు వైపు ఉంచింది . అది నిశ్చలంగా అక్కడే వుండిపోయింది . మఱల పల్లం వైపు అదే కలాన్ని క్యాప్ లేకుండా పల్లం వైపు క్రింద వైపు పెట్ట్టింది .ఆ కలం పల్లం వైపు ఉండకుండా ఎత్తు వైపు వచ్చి అక్కడ నిలిచింది . చివరగా నీళ్ళు పల్లం వైపు పోస్తే అవి పల్లం వైపు పోకుండా మెఱక వైపుగా పైకి వచ్చాయి . ఇదేమి మంత్రం కాదు , తంత్రం కాదు . అదే మిష్టరీ స్పాట్ . భూమ్యాకర్షణ శక్తి ఆ పల్లం వైపు తక్కువ , మెఱక వైపు సరిగ్గా వుంది .

ఆ తర్వాత అక్కడ ఓ చక్కల గదిలోనికి అడుగుపెట్టటంలోనే యిబ్బందితో కూడిన విషయమే .ఆ గది ఏటవాలుగా ఉంటుంది . అడుగులు వేయటమే కష్టం . అక్కడ వంగినా పడిపోము . ఫొటోలు కూడా తీసుకున్నాము . నిజమే అందులో అబధ్ధమేమీ లేదు అన్న నిర్ధారణకు వచ్చాము .

ఈ మొత్తానికి 45 నిముషాల నుంచి 60 నిముషాల వరకు సమయం పడ్తుంది .

అటుపిమ్మట వెంట తీసుకొచ్చుకున్న ( మన ) పులిహోర అందరం లాగించాము . లోడింగ్ అయింతర్వాత అన్ లోడింగు సర్వ సహజమే కదా ! ఆ దిశగా అడుగులు వేశారు కొందరు . . అర్ధగంట అయింతర్వాత బయలుదేరాం ఎస్ ఎఫ్ ఓ బీచ్ కి . 20 నిముషాలలో చేరుకున్నాము . కారు పార్కింగ్ చేసి , ఎక్స్పోజ్ అయ్యే శరీరాన్ని సన్ స్క్రీన్ లోషన్ స్ప్రే పూసుకొని యిక బీచ్ ఒడ్డుకి చేరుకున్నాము .

మనమేమో మన శరీరం ఎక్కడ నల్లబడిపోతుందోనని సన్ స్క్రీన్ లోషన్ పూసుకొని బీచ్ వద్దకు వెళ్తుంటే , ఇక్కడ అమెరికన్లు ఒంటిమీద గుడ్దపీలిక లాంటివి అడ్డం పెట్టుకుని సన్ బాత్ చేస్తున్నారు బోర్లా పడుకుని . అలా అందాలారబోస్తున్నారు చాలామంది . వాళ్ళను చూసేమో సముద్రం కూడా నురగలు కక్కుతూ , ఉరుకుల పరుగులు తీస్తూ , పలకరించి పోతున్నది . ఆ దృశ్యాలను కెమేరాతో చిత్రీకరించాము .

ఎంత వైవిధ్యం ఇండియా వాళ్ళకి - అమెరికా వాళ్ళకి . ఇండియాకి , అమెరికాకి అన్ని విషయాలలో తేడానే .

7 గంటలకు రిటర్న్ బయలుదేరి , గ్రాసరీస్ తీసుకొని 8.30 కి ఇంటికి చేరుకొన్నాము .

                                                                        *********

No comments:

Post a Comment