పెళ్ళి అంతరార్ధం

                                                                                                                                     రచన : శర్మ జీ ఎస్

            
పెళ్ళి జరిగే విధానం :

స్నాతకం : స్నాతకం అంటే బ్రహ్మచర్యాన్ని వీడడం అన్నమాట .

మన ఆచారం ప్రకారం మగ పిల్లవాడు కాశీలో చదువు పూర్తయిన తరువాత బ్రహ్మచర్యం తీసుకోవాలనుకుంటే
అక్కడే వుండి పోయి , ఆ గురువర్యులకు సేవ చేస్తూ దేవుళ్ళుగా భావించే ఆ కాశీ అన్నపూర్ణ, విశ్వేశ్వరుల సన్నిధిలో ఉండేవాడు .  ఐహిక విషయాలు అనగా డబ్బు , సంపాదన ,అందం, పిల్లలు, పెళ్లి లాంటివన్నీమర్చిపోవాలి .

 అంతవరకు పెంచిన జుట్టు , గెడ్డం ఈ పెళ్ళి సంధర్బంగా అందంగా చేస్తారు. 

( ఆ నాటి కాలమాన పరిస్థితులను బట్టి ఆ చదువులు చదువుకున్నవాళ్ళు ఆచరించవలసిన విధానమే యిది . ఈ కాలానికిది సరికాదు . )

ఇది పెళ్ళికి మొదటి మెట్టు.

కాశీ యాత్ర :

పెళ్లి కూతురు తండ్రి పెళ్లి కొడుకుని తన కూతుర్ని పెళ్లి చేసుకొని గృహస్తాశ్రమాన్ని తీసుకోవలసినదిగా ఆహ్వానిస్తాడు  . పెళ్ళికూతురు అన్నయ్య(తమ్ముడు) తన చెల్లిని (అక్కను) పెళ్లి చేసుకొని మున్ముందు జీవితాన్ని ఆనందమయం చేసుకోమని కోరతారు . 

( ఆ నాటి కాలమాన పరిస్థితులను బట్టి ఆ చదువులు చదువుకున్నవాళ్ళు ఆచరించవలసిన విధానమే యిది )


సంకల్పం :
మనం దేవుని ఎదుట మనస్పూర్తిగా ప్రార్ధన చేయాలి . 

(  పంచభూతాలు ప్రకృతితో ముడిపడినవి . వీటికి  అతీతమైన శక్తి వున్నది . అందువలననే ఈ ఐదింటిని భూతాలుగా వర్ణించారు  .  ఈ పంచభుతాలను శాసించగల శక్తికి దేవుడు అని పేరు పెట్టి పూజించటం ప్రారంభించారు అనాది నుండి . నిజానికి  సంకల్పం చేయడం అంటే సదాలోచన  చేయడమే . ఆ విషయాన్ని సూటిగా చెప్పకుండా డొంక తిరుగుడుగా చెప్పడమే దేవుని ప్రార్ధించాలని చెప్పడం .

అంకురార్పణం :
పెళ్ళి కూతురు మట్టి కుండలలో కొండల నుండి తెచ్చిన మట్టితో నింపి తొమ్మిది రకాల గింజలు వేస్తారు. అది
మనిషి పుట్టుకకు అనుకరణ .

( దీని అర్ధం , నువ్వు జీవించాలంటే , నికు ధాన్యం అవసరం , కనుక నువ్వు వాటిని పెంచాలి అని అంతరార్ధం )

గౌరి పూజ:
పవిత్రతకు పెళ్లి కూతురు ప్రతీక .  పార్వతీదేవి శివుని అర్ధనారీశ్వరానికి ప్రతీక. పెళ్ళికూతురు  పెళ్లికొడుకుతో సుఖ , సంతోషాలతో ఉండాలని మనసా, వాచా , కర్మణా త్రికరణశుధ్ధిగా కలిసిపోవాలని పెళ్ళి కూతురితో ఈ పూజ చేయిస్తారు .

( ఆ పరమేశ్వరుడు పార్వతీదేవిని ఎలాగైతే తన అర్ధభాగమిచ్చి అనుక్షణం చూసుకొంటున్నాడో , అలాగ నువ్వూ నన్ను చూసుకోవాలన్న అభ్యర్ధనే ఈ గౌరీ పూజకు మూలకారణం )

వర పూజ :


వరుడి చేత చేయించబడేది .ఇది కూడా అలాంటిదే ,

కన్యాదానం : 
పెళ్లి కూతురు తండ్రి పెళ్లి కొడుకుని విష్ణువుతో పోల్చి తన కుమార్తెను ఇచ్చి అతని ముందు ఏడు తరాలుకు బ్రహ్మ
లోకం ప్రాప్తించాలని పూజిస్తారు . ఆమెతో సఖ్యంగా వుంటూ , తరువాత తరం పిల్లలు మంచిగా పుట్టాలని  , మీరిరువురూ సుఖంగా ఉండాలని కోరుకుంటారు.

(ఇక్కడ విష్ణువు అంటే పోషణకారి అని మనం గ్రహించాలి . అంటే అనాదినుండి ఆడవాళ్ళను పోషించాల్సింది మగవాళ్ళేనని శాసించారన్నమాట . వాస్తవానికి ఆడవాళ్ళకున్న నేర్పు, ఓర్పు మగవాళ్ళకు వుండనే వుండదు . ఆ విషయాన్ని బైటాకు చెప్పకుండా యిలాంటి దురాచారా( దురాలోచన , దూరాలోచన )లతో ఇంట్లోనే బందించేశారు ఆ నాటి వారు . అందుకు ఆడ , మగ తలలూపారు . నిజాన్ని కప్పిపుచ్చే ప్రయత్నంలో ఏర్పడిన ఆచారమే యిది )

ఇప్పుడు పెళ్ళికొడుకుకి , పెళ్లి కూతురుకి  మధ్య పరదాగా ఓ తెల్లటి వస్త్రాన్ని ఉంచుతారు. అతనికి తన కుమార్తెను మంచి అణకువ, స్వచ్చమైన,ఆరోగ్యమైన అమ్మాయిని భార్యగా ఇస్తున్నట్టు ఒట్టు వేసి చెప్తారు .

( ఆ నాటి ఆచారం ప్రకారం ఆ యిరువురూ ఒకరినొకరు చూసుకోకపోవటం వలన ఆ పరదా కార్యక్రమం వాళ్ళలో ఒకరినొకరు చూసుకోవాలన్న ఆత్రుతను పెంచటానికి దోహదకారి అవుతుంది . ఈ రోజుల్లో యిలాంటి కార్యక్రమాలు చేయటం ఒకరకంగా మనల్ని మనం మోసం చేసుకోవటం , అందర్నీ మోసం చేయటం , ఇలాంటివాటిని ఆచరించమని చెప్పకనే చర్యల ద్వారా చెప్తూ ప్రోత్సహిస్తున్నట్లు అవుతుంది కదూ )

సుముహర్తం (జీలకర్ర బెల్లం ధారణ):

పరదా తొలగించకుండా , పెళ్లి కొడుకు , పెళ్లి కూతురు ఇద్దరు ఒకరి తల మీద ఒకరు జీలకర్ర బెల్లం  (అంటే కుండలిని శక్తి ప్రదర్శనమయ్యే చోట) పెట్టిస్తారు . 

( అంటే జీలకఱ్ఱ , బెల్లం లా మీరిరువురూ మీ ముందు జీవితంలో కలసిపోవాలన్న సద్భావన దీనికి ప్రధాన కారణం  )
ఆ పిమ్మట ఆ మధ్యలోని పరదా తొలగిస్తారు. అప్పుడే పెళ్ళికొడుకు , పెళ్ళికూతురు ఒకరినొకరు చూసుకొనటం జరుగుతుంది .

( అంటే పెద్దలు చూసినవాళ్ళతోనే అటు ఆడపిల్లలకు గాని , మగపిల్లలకు గాని వివాహాలు జరిగేవని చెప్తున్నారు . వినటానికే వింతగ బహు కొత్తగా వుంది కదూ ) 

జీలకర్ర ఎందుకు ?

జీలకర్ర బెల్లం కలిపి చేసిన ముద్దలో ఒక రకమైన పాజిటివ్ విద్యుత్ తరంగాలు ఉంటాయి. మన తలమీద ఒకానొక
స్థలం మీద ఆ ముద్ద పెడితే నిద్రాణావస్థలో ఉన్న ఆ కేంద్రం విచ్చుకొని సహస్రార చక్ర గుండా అగ్న చక్రగుండా (ఈ
స్థలంలో మన ఆధ్యాత్మికత మేల్కొపే స్థలం) భృకుటి( రెండు కళ్ల మధ్య ఉన్న స్థలం) ద్వారా ఉత్తేజితం అవుతుంది .
ఆ సమయంలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఒకరినొకరు చూసుకున్నప్పుడు ఒకే రకమైన ఆలోచనలు కలిగి సంసార జీవితం మీద మంచి అభిప్రాయంతో ఒకే బాటలో నడుస్తారని .

( భావన మంచిదే , ఆచరణ యోగ్యం కాదు , ఎందుకంటే ఆ యిరువురికి అన్నీ అంతక్రితమే అయిపోతున్న ఈ రోజుల్లో ఈ అవకాశం ఎక్కడుంటుంది ? మరలా మనం మనలని మోసం చేసుకుంటూ , అందరినీ కూడా మోసంచేస్తున్నాము )

యోక్త్రధారణ (ఒక రకమైన గడ్డితో తాడు కట్టడం)

పెళ్లి కొడుకు పెళ్లి కూతురి నడుం చుట్టూ ధర్బ ( ఎండిన గరిక ) తో అగ్ని దేవుణ్ణి స్మరిస్తూ ఒక తాడులా కడతాడు.

దీని అర్ధం : మనం ఒక కష్టమైన పని మొదలుపెట్టినప్పుడు నడుం చుట్టూ గుడ్డ చుట్టుకుంటాం . దాని వల్ల వెన్నుపూసకి అదనపు బలం ఇస్తాం. అదే విధంగా పెళ్లి అయిన తరువాత అదనపు బాధ్యతలు వస్తాయి కనుక పెళ్లి కొడుకు పెళ్లికూతురుకి తోడునీడగా ఉంటానని చెప్పడం .

( ఈ కార్యక్రమాలు చేయటంలో హడావుడి , ఆర్భాటం ముందరకు వస్తున్నాయి . ఆ మంత్రాల అర్ధాలు / భావనలు ఎంతమందికి తెలుసు ? ఆత్మవంచనే మళ్ళీ )

హిందూ వివాహంలో ఇది ప్రధానమైన ఘట్టం . 

మాంగల్యధారణం : (మూడు ముళ్లు వేయడం)

( ఇక్కడ ఓ సందేహం కలగవచ్చు , ఆడవాళ్ళ మెడ వంచి ఆ మాంగల్యధారణ ఎందుకు చేస్తాడు అని ? ఆడవాళ్ళు మగవాళ్ళ మీద ఆధారపడి వుండాలన్నదే ప్రధానమైన వుద్దేశం )

మాంగల్యం అంటే మంచిది అని, ధారణ అనగా ధరించడం అని .

పెళ్లి కూతురి మెడలో రెండు పుస్తెలు పెళ్లి కొడుకు కడతాడు . అందులో ఒకటి పెళ్లి కూతురు తరఫునుండి , మరొకటి పెళ్లికొడుకు తరఫు నుండి. ఈ మాంగల్యం నమ్మకానికి , మనస్సాక్షికి ప్రతిరూపంగా, జీవితాంతం తోడునీడగా ఉంటానని పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి అందరి ముందు ప్రమాణం చేస్తున్నాడనటానికి ప్రతీక . మూడు ముళ్లు వేస్తాడు . అవి స్థూల శరీరానికి ( భౌతిక శరీరం ), సూక్ష్మ శరీరానికి ( పరబ్రహ్మ) , కారణ శరీరానికి ( ఆత్మ) కి ప్రతిరూపాలు . మనసా, వాచా , కర్మణా (నమ్మడం ,చెప్పడం ,చేయడం ) లకు కూడా ప్రత్రిరూపాలుగా మాంగల్యధారణ జరిగేటప్పుడు పంతులుగారు ఈ క్రింది మంత్రాలు చెబుతారు .

"  మాంగల్యం తంతునానేన మమజీవన హేతునా ,
  కంఠే బద్నామి శుభగే త్వం శరదశ్శతం "   

( ఇక్కడ ఒక పుస్తె పెళ్ళి కూతురి తరఫు నుండి , ఇంకొక పుస్తె పెళ్ళి కొడుకు తరఫు నుండి తేవటంలో మున్ముందు జీవితంలో కష్ట , సుఖాలకు , ఎదురయ్యే సమస్యలకు ఆ యిరువురి పెద్దలు బాధ్యులుగా వుంటారని , వుండాలని . )

తలంబ్రాలు :

ఇది సరదా కార్యక్రమం . పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఒకరిపై ఒకరు తలంబ్రాలు (అక్షింతలు - సాఫ్రాన్ - పసుపు - బియ్యంలో కలుపుతారు) వేసుకుంటారు .

( సహజంగా ఎదుటివారి మీద అక్షతలు చల్లటం , హుషారుగానే సాగిపోతుంటుది . అందుకే అతి సరదాగా జరుగుతుంటుంది . ఈ  రూపేణా వాళ్లలో వున్న బెరుకుతనం పోయి , కొంచెం చేరువ అవటానికి కూడా దోహదకారి అవుతుంది . ఆ పై మున్ముందు జీవితంలో ఒకరిపై , ఒకరు అక్షతలు చల్లుకోవటం జరుగుతుంది . దానికి పునాదే యిది అని చెప్పకనే చెప్పే కార్యక్రమం యిది )  

హోమం :

అనగా పవిత్రమైన అగ్ని. హోమం (అగ్ని) మనిషికి దేవునికి వారధిగా ఉంటుంది . హోమం చుట్టూ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మనస్సాక్షిగా ఒకరిని ఒకరు అంగీకరిస్తున్నట్టు అందరి ముందు ఒకరి చేయి ఒకరు పట్టుకొని ఏడు సార్లు తిరుగుతారు . ఈ ఏడు అడుగులు పెళ్లి ప్రమాణాలకి సూచికలు .

౧. ఇద్దరు కలిసి సంసార బాధ్యతలు తీసుకుంటాం
౨. ఇద్దరం ధైర్యంతో , శక్తితో గుండె నింపుకొని అన్ని అవసరాలని తీర్చుకుంటాం
౩. ఇద్దరం కలిసి కుటుంబ సుఖం కోసం , సంఘం వర్ధిల్లడం కోసం పాటుపడతాం
౪. కష్టసుఖాలలో కలిసి ఉంటాం
౫. కలిసి మంచి బుద్ధులు వచ్చేటట్టు పిల్లల్ని పెంచుతాం
౬. ఇద్దరం కలిసి సుఖ,శాంతి కోసం పాటుపడతాం. ఆధ్యాత్మికంగా పురోగతి చెందుతాం.
౭. జీవితాంతం ఆలు మగల పెళ్లి బంధంతో ఉంటాం.

( ఇది ఆ యిరువురి చేత ప్రతిన చేయించటం , వీటికి కట్టుబడి వుంటాం అని . అగ్ని దహిస్తుంది కనుక , మనిషి అగ్నికే భయపడ్తాడు . వేటిల్లో నుంచి అయినా తప్పించుకోగలడు కాని , అగ్ని నుంచి తప్పించుకోలేడని పూర్వీకులు ఈ పధ్ధతిని ఆచరణీయం చేశారు . ఈ అంతర్విషయాలు ఎంతమందికి తెలుసు ? 

నాగవల్లి :

ఒక సిల్క్ ఉయ్యాల తయారు చేసి దానిలో చందనం కర్ర ముక్క, పండిన అరటి పండు(లేక మామిడి పండు) మరియు పసుపు ఒక పళ్లెంలో ఉంచుతారు. పండిన పండు ఆరోగ్యవంతమైన , పసుపు పవిత్రమైనదిగా , చందనం స్వయం సుగంధమైనదిగా , అందరికి భావిస్తారు . మంచిని పంచే మంచి పిల్లలు కలగాలని ఈ కార్యక్రమం చేస్తారు .

( ఈ కార్యక్రమం ద్వారా మీ యిరువురి దాంపత్య జీవితంలో పిల్లలు పుడతారు . ఆ పిల్లల్ని మీ యిరువురూ , ఈ ఉయ్యాలనెలాగైతే ఊపుతున్నారో , అలాగ పంచుకోవాలి వాళ్ళ పెంపకంలో అని అర్ధం .
ఆ తర్వాత వీరిరువురూ చేరువయ్యేటందులకు ఇది కూడా ఓ మార్గమే .

దీని తరువాత ఒక సన్నని (ద్వారం ) బిందెలో ఉంగరం వేసి పెళ్లి కొడుకు , పెళ్లి కూతురుని ఒకే సారి చేయి పెట్టి ఎవరు ఉంగరం ముందు తీస్తారో చిన్న సరదా పోటి కార్యక్రమం పెడతారు .

వీరిరువురూ చేరువయ్యేటందులకు ఇది కూడా ఓ మార్గమే .

సన్నికల్లు:

పెళ్లి కొడుకు పెళ్లి కూతురి ఎడమ బొటను వేలుని పట్టుకొని సన్నికల్లు మీద పెట్టిస్తాడు. పక్కనే అగ్ని జ్వలిస్తూంటుంది . ఆ సమయంలోని మంత్రాలర్ధం "ఈ రాయిని ఎక్కు. మన మెదడుని రాయిలా జీవితంలో వచ్చే కష్ట సుఖాలకి చలించక స్థిరంగా ఉంచుకొందాం" అని ప్రమాణం చేస్తారు . తరువాత పెళ్లి కొడుకు పెళ్లి కూతురుకి మెట్టెలు (సిల్వర్ రింగులు) కాళ్ల వేళ్లకి పెడతాడు.

తరువాత పంతులుగారు అరుంధతి (మహర్షి వశిష్టుని భార్య) నక్షత్రాన్ని చూపిస్తూ అరుంధతి పవిత్రత గురించి చెప్పి అలా ఆదర్శగృహిణిలా ఉండమని అరుంధతి దీవెనలు వధూవరులు తీసుకోమంటారు .

(దీనివెనుక ఒక ప్రధాన కారణమున్నది. వశిష్ట , అరుంధతీ ద్వయం ఆదర్శ దంపతులకు ఒక ప్రతీక . కొత్తగా పెళ్ళైన దంపతులు సైతం వారివలెనే ఉండాలనే ఉద్దేశ్యంతో మనవారు ఆ దంపతులిద్దర్ని తారారూపంలో వీక్షింపచేస్తూ రావడం ఒక సాంప్రదాయమైంది . ఆ నాటి కాలంలో మునులైనా సంసారం లోని సారాన్ని అందుకుంటూ , సత్ప్రవర్తనలో నడవగలిగారని తెలియబడ్తుంది . కనుక మీరూ అలాగ నడుచుకోవలసినది అని తెలియచేయటానికే ఈ అరుంధతీ నక్షత్రాన్ని చూపించటం జరుగుంది . కాని ఏ పంతులుగారు వశిష్టుని చూడమని ఎపుడూ , ఎక్కడా చెప్పిన దాఖలాలు తెలియరాలేదు . అయితే ఈ మానవులకు ఏదైనా ఆశ చూపనిదే ఏదీ చేయరన్న దృఢనమ్మకంతో యిలా వీరిద్దర్ని సందర్శించడం వలన దంపతులకు ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యము, సౌభాగ్యములు కలుగుతాయి అని ఎఱ వేయటంతో అదో ఆచారంగా , సంప్రదాయంగా మారిందే కాని , ఆ అరుంధతిని ఆకాశంలో చూసిన వారెవ్వరూ ఉండి ఉండరు . ఎందుకంటే ప్రక్కన వున్న మంచివాళ్ళనే చూడలేకపోతున్నారు . మనకు తల్లితండ్రుల ద్వారా సంక్రమించిన రెండు కళ్ళు కొంత మేర మాత్రమే స్పష్టంగా చూడగలవు అని మనం ఎన్నటికీ మరచిపోకూడదు . ఆ ఆకాశంలో వున్న వాటిని చూడాలంటే , అందుకు ఆ కనపడని జ్ఞాన నేత్రం ( భృకుటి వద్ద వుంటుందని ) ద్వారా మాత్రమే చూడగలమని , అందుకే లింగ భేదం లేకుండా అందరూ బొట్టు పెట్టుకొనమని చెప్తూ , దాన్ని ఓ ఆచారంగా అలవాటు లోకి తెచ్చారు . ఈ విషయాన్ని కూడా అంతర్భావంగానే వుంచారు . అందరకు తెలిసేలా బయటకు వెల్లడి చేయలేదు . ఇలా చాలా సద్విషయాలను కట్టడి చేయటం జరిగింది . తెలియకుండా అగ్నిని పట్టుకుంటే కాలుతుందన్నది సత్యమే . కాని ఎంతమంది అలా తెలియకుండా పట్టుకొంటారు అని మాత్రం ఆలోచించలేకపోయారు ఆ నాటి మహానుభావులు . ప్రతి ముఖ్య విషయాన్ని వాళ్ళ ( మంత్రాల ) గుప్పెటలో పెట్టుకుని సమాజం మీదకు వదిలారు . అన్నీ అగ్ని లాగే తమ స్వభావాన్ని తెలుపలేవు అన్నది ఒక్కమారు ఆలోచిస్తే మంచిది . ( పంతులుగారు అరుంధతి నక్షత్రాన్ని చూపించాలని ప్రయత్నించినా ( ఆ పంతులుగారికే కనపడదు లెండి ) , చూసినవారెవ్వరు ? చూడలేదంటే మనల్ని అవమానిస్తారని భావించి చూశామని చెప్పేవాళ్ళే అందరూ . 

పాణి గ్రహణం :

దీని అర్థం ఒకరి చేయిని ఒకరు పట్టుకోవడం. ఇది చాలా ముఖ్యమైనది. పురోహితులు ఈ కార్యక్రమాన్ని పుణ్యకాలంలో చేయిస్తారు.
పెళ్లి కూతురు కుడి చేయి వేళ్లని శంఖం ఆకారంలో ముడిచి పెళ్లి కొడుకు అదే విధంగా పెట్టి పెళ్ళి కూతురు వేళ్లని పట్టుకుంటాడు . పెళ్లి కూతురు చేయి పైకి పెళ్లి కొడుకు చేయి కిందకి ఉండేటట్టుగా పట్టుకుంటారు.

పెళ్లి కొడుకు కింది విధంగా ప్రార్ధన చేయాలి:

అర్ధాంగి! ఈ రోజు నీ చేయిని అందరి ముందు పట్టుకున్నాను . నీతో జీవితాంతం సుఖ సంతోషాలతో ఉండాలని మంచి పిల్లలను కని పెంచాలని తోడు నీడగా ఉంటానని వాగ్దానం చేస్తున్నాను. లక్ష్మీ దేవి కటాక్షంతో నిన్ను,మన పిల్లల్ని గుడ్డ,బట్ట,తిండి,చదువు ,ఐశ్వర్యం, సంతోషంతో ఉంచాలని ఆ తల్లిని ప్రార్ధిస్తున్నా. నేను అందరి ముందు నిన్ను నా భార్యగా స్వీకరిస్తున్నా. వాయు దేవుడు అన్ని దిక్కులు వెళ్లి అందరికి బంగారం పంచాలని, అగ్ని దేవుడు అందరికి ఆహారం సమకూర్చాలని , నీవు , నేను సర్వదా సుఖంతో ఉండాలని కోరుకుంటున్నాను.

( నీతులెవరు చెప్పినా చాలా చాలా బాగుంటాయి కదా ! అలాగే ఈ భావనలెపుడూ మంచివే , ఆచరణలే అసాధ్యమైనవి . ఇంత క్రితం చెప్పించినా మరల చెప్పించటంలో మరచిపోరాదు అన్నదే ఇచ్చట అర్ధం )

లజ హోమం :

పురోహితుడు నూతన దంపతులతో హోమం లో ఉబ్బిన బియ్యం వేయిస్తారు . ఇలా చేయడం ద్వారా వధువు వరుడు ఎక్కువ కాలం జీవించాలని , పిల్లపాపలతో సుఖంగా ఉండాలని పుట్టింటి వారు , మెట్టింటి వారు కలిసి ఉండాలని  కోరుకొనటం . ఇలా హొమం చుట్టూ మూడు సార్లు వధూవరులు ఉబ్బిన బియ్యం వేస్తూ ప్రార్ధిస్తారు .

( ఆ యిరువురి ఆలోచనలు ఒకే రకంగా వుండాలన్న భావనే )

పెళ్లి కూతురుకి నడుం చుట్టు కట్టిన దర్భని తొలగించడం :

పెళ్లి కూతురు క్రింది విధంగా ప్రార్ధనలు చేస్తూ  ఆ దర్బని తొలగిస్తుంది.

పరమేశ్వరుడు ఇచ్చిన ఈ వరుడు కట్టిన దర్బని తొలగిస్తూ  , నీవు , నేను  సుఖసంతోషాలను పంచుకుంటూ బ్రహ్మ లోకం చేరుదాం .

( అంటే ప్రతి సృష్టికి కారకులవదామని , ఆనందాలని పంచుకుంటూ )

నేను అనుమతి ఇస్తున్న నీకు ఆ దర్బ లేకుండ నాతో సుఖంగా ఉండవచ్చు అని.

( ఆ వరుడు నేను నీ నడుమును చుట్టేస్తాను . ఇంక ఆ దర్భతో పనిలేదు , ఆ దర్భను తీసివేయి అందుకు నేను అంగీకరిస్తున్నాను , ఈ క్షణం నుంచి నువ్వు నా శ్రీమతివి అంటాడు .) 

                                                                                              ******

( సృష్టి ప్రారంభంలో జనాభా అల్పం . అందువలన ఆనాటి చదువులు అలా సాగాయి . అన్ని భాషలకు మూలం సంస్కృతం కావటం వలన , అన్నింటిని సంస్కృతంలోనే సిధ్ధం చేశారు . అందుకే ఆచారాలు  , మంత్రాలు , సంస్కృత మంత్రాలలోనే యిమిడి వున్నాయి . క్రమేపి జనాభా అధికమైనట్లే , భాషలు అధికమైనాయి . అయినా మూల మంత్రాల్ని సంస్కృతంలోనే వుంచి జీవనం కొనసాగిస్తూ వచ్చారు . వేదాలు , పురాణేతిహాసాలు , రామాయణ మహా భారతాల లాంటి వాటిని మాత్రం వారి వారి ప్రాంతీయ భాషలలోకి మార్చుకున్నారు . అలా మార్చినందువలన అందులోని అంతర్భావమేమీ దెబ్బతినదు కదా ! అవే మంత్రాలైతే అంతర్భావం బయట పడితే సమస్యలు తలెత్తుతాయి . కనుక ఆ సంస్కృత భాషని నేర్చుకున్న వారు మహా పండితులుగా చెలామణీ అయి కాలక్రమంలో  . వారే బ్రాహ్మణులని నిర్ధారణ చేసుకున్నారు . ప్రపంచంలో వారే పూజార్హులు , పురోహితులు . 
పురోహితులు అంటే , పురమునకు హితము చేకూర్చేవాళ్ళు అని అర్ధం కదా ! ఏంతవరకు హితము చేకూర్చారన్నది ఆలోచిస్తే అందరికీ అర్ధమవుతుంది .
మంత్రాలు అంటే మంచి భావనలకు మూలమైనవని అంతరార్ధం . కాని అవి స్వార్ధంతో కూడుకోవటం వలన సంస్కృతం లోనే వుండిపోయాయి ఈ నాటివరకు .

నిత్యం ఎన్నో పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి . ఎంతో మంది దంపతులవుతున్నారు . ఇంతకు ముందు అయ్యారు , ఇప్పుడూ అవుతున్నారు . పెళ్ళి చేయించే పంతులుగార్లకి కూడా ఈ అర్ధాలు బహుశా వాళ్ళకెంతమందికి తెలుసో ఒకమారు ఆలోచించండి . ఎంతమందికి ఈ వేద మంత్రాల భావన తెలుసు ? ఎంతమంది అర్ధం చేసుకొని జీవనం సాగిస్తున్నారు ? అర్ధం తెలియనిదేదైనా వ్యర్ధమేనన్నది అక్షర సత్యమే కదా ! కొంచెం ఆలోచించండి . ఈ పెళ్ళి తతంగం సరదాల దురద తీర్చుకోవటానికి తప్ప చక్కటి జీవనం సాగించటానికి దోహద పడటం లేదని , దోహద పడాలని ఆశిస్తూ ఈ వ్యాసం వ్రాయటం జరిగింది . 

ఏ ఒక్కరినీ దూషించాలని గాని , వేలెత్తి చూపాలని గాని నా ఉద్దేశం కాదని తెలియచేస్తున్నాను .


శ్రధ్ధగా ఆలోచించి ఆచరణయోగ్యం చేయటానికి మీ వంతు మీరు ప్రవర్తిద్దురూ .  

గమనిక : ప్రవరాఖ్యుడు పెళ్ళి గురించి వ్రాసినదానినాధారంగా ఇలా  మరింత విపులంగా విశ్లేషణ చేయటం జరిగింది . 

మరలా మరో మారు కలుసుకుందాం / మరింత తెలుసుకుందాం .



                                                                                            *** ముగిసింది ***

8 comments:

  1. అంతా బాగా చెప్పారు, కానీ అరుంధతి నక్షత్రం గురించే చెప్పలేకపోయారు. మిగతా solar systems లాగా కాకుండా (planets revolve around star) అది dual star system. అంటే రెండు నక్షత్రాలు ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతూ ఉంటాయి. సంసారంలో ఆలుమగలు ఒకరికి ఒకరు కలిసి ఉండాలని తెలియచెప్పడానికే అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు. ఎటువంటి సాంకేతిక పరికరాలు లేకుండానే నక్షత్రాలని గమనించి dual star system ని కనిపెట్టి దాన్ని జీవితానికి అన్వయించిన మన పూర్వీకులు ఎంత గొప్పవారో కదా!!!!

    ReplyDelete
    Replies
    1. పూర్వీకులు గొప్పవారే , కానీ వాళ్ళు కనుక్కున్నవాటిలో సమాజానికి అవసరమైనవీ గుప్తంగా వుంచటం వల్లనే దుష్ప్రభావాలకు స్థానం ఏర్పడింది .

      Delete
  2. //( పంతులుగారు అరుంధతి నక్షత్రాన్ని చూపించాలని ప్రయత్నించినా ( ఆ పంతులుగారికే కనపడదు లెండి ) , చూసినవారెవ్వరు ? చూడలేదంటే మనల్ని అవమానిస్తారని భావించి చూశామని చెప్పేవాళ్ళే అందరూ .
    పైగా అరుంధతీ నక్షత్రాన్ని చూడమనటంలో అంతరార్ధం మగవారి స్వార్ధ పరత్వమే . ఎందుకంటే ఆమె భర్త కుష్టు రోగంతో బాధపడ్తూ ( ఆ సరికే ఆయన పేద్ద విటుడు , పరస్త్రీలోలుడు లెండి . తద్వారా ఆయనకు సంక్రమించిన ఆస్తి ఈ కుష్టు రోగం )మరలా పరస్త్రీని కోరితే ఆమె అందుకు సహకరించి , ప్రోత్సహిస్తుంది , అలా మీరూ మీ మొగుళ్ళను ప్రోత్సహించమని ఆ అరుంధతిని ఆదర్శంగా తీసుకోమంటారు , ఇది ఘోర తప్పిదం కదా ! ఇటువంటి దురాచారాలను క్రమ బధ్ధీకరణ చేసిన మన పూర్వీకుల మానసిక స్థితి ఎటువంటిదో కొంచెం ఆలోచించండి )//

    అయ్యా... మీరు అరుంధతికి సుమతి కథను కలిపినట్టున్నారు. కాస్త గమనించండి. తదనుగుణంగా కంటెంట్ (విషయం)లో మార్పు చేయండి.

    పూర్ణప్రజ్ఞాభారతి

    ReplyDelete
    Replies
    1. నా బ్లాగుకి మీకు స్వాగతం , సుస్వాగతం . మీ సలహాను స్వీకరించి కరెక్ట్ చేయటం జరిగింది . కృతజ్ఞతలు .

      Delete
  3. చాల బాగా వివరించారు. తెలియని విషయాలు చాలా తెలిసాయండి.

    ReplyDelete
    Replies
    1. ఇలా చాలా విషయాలు అటడుగున పడి వుండటమే మన సమాజం దుష్ప్రబావాలకు ఆలవాలమై తిష్ట వేసుకు కూర్చున్నాయి .

      Delete
  4. సమాజంలో ప్రధానమైన విషయాన్ని చాలా విపులంగా తెలియజేసారు,.ప్రతీ తంతు ప్రతేకంగా ఎందుకు చేస్తారో సవివరంగా చెప్పి తెలియని వారు తెలుసుకునేట్టు మంచి పోస్టు వ్రాసారు...

    ReplyDelete