రచన : శర్మ జీ ఎస్
ఇంతటి అంతరార్ధంతో కూడుకున్న ఈ పెళ్ళి , ఆ తర్వాత ఆ భర్త కాలం చేస్తే , ఆ అమ్మాయి మెడలో తాళి , నుదుట కుంకుమ , కాళ్ళకు పసుపు , కళ్ళకు కాటుక , జడలో పూలు , పాదాల వేళ్ళకున్న మెట్టెలు , చేతులకున్న గాజులు తొలగిస్తారు . ఇక ముందు జీవితంలో నీకా అర్హత లేదని . ఆ సుఖాలకు నువ్వు అర్హురాలివి కాదు అని .
ఆ స్త్రీని ఎవరు చూసినా మోజుపడకుండా వుండేలా , అందవికారంగా ( జుట్టు కూడాతీయించేవారు ) తయారు చేసేవారు . ఈ చర్యలకు వయసు తారతమ్యం లేదు ( భార్య అయిన అర్హత మాత్రం చాలు ) .
ఇది ఎంతవరకు సమంజసం ?
ఆ చేతులకు గాజులు ఆడపిల్లగా పుట్టినప్పటినుంచీ పెడ్తూ వున్నవే కదా !
ఆ కళ్ళకు కాటుక ఆడపిల్లగా పుట్టినప్పటినుంచీ పెడ్తూ వున్నవే కదా !
ఆ నుదుట కుంకుమ / తిలకం ఆడపిల్లగా పుట్టినప్పటినుంచీ పెడ్తూ వున్నవే కదా !
ఆ కాళ్ళకు పసుపు ఆడపిల్లగా పుట్టినప్పటినుంచీ పెడ్తూవున్నవే కదా !
ఆ జడలో పూలు ఆడపిల్లగా పుట్టినప్పటినుంచీ పెడ్తూ వున్నవే కదా !
పుట్టినప్పటి నుంచి వున్న వీటిని కూడా భర్త పోగానే తీసేయటం , మగ మహారాజుల కర్కశపు కార్యక్రమాన్ని ఆ నాటి ఆడవాళ్ళు వాళ్ళ స్వార్ధపరత్వంతో సహకరించిన దుశ్చర్యగా భావించి తీరవలసిందే .
ఇవన్నీ కూడా ఆడవాళ్ళు , మగవాళ్ళు కలసి వారికనుకూలంగా తయారుచేసినవనే నా భావన .
ఇక్కడ రెండు రకాల ఆడ (ఛాందసవాదులు)వాళ్ళు , మగ (ఛాందసవాదులు)వాళ్ళున్నారు .
1 . వాళ్ళ పిల్లకు భవిష్యత్తులో మరే మగ పశువుకి బలి కాకుండా చేసినవారు .
2 . తమ అబ్బాయి పోయినప్పుడు , తను మళ్ళీ పెళ్ళి చేసుకుంటే ( పిల్లలని కని వుంటే ) వాళ్ళనెవరు పెంచుతారు ,
ఓ వేళ తను పెళ్ళి చేసుకోకపోయినా , తనకి ఆ కోర్కెలు కలగకుండా వుండాలన్న సదుద్దేశంతో / దురుద్దేశంతో కొంతమంది ఆడ , మగ ఛాందసవాదులు చేసిన స్వార్ధపూరిత చర్యగా భావించి తీరవలసిందే .
ఇలాంటి విధానాలను తమ ఆచారంగా , సంప్రదాయంగా సమాజంలో చెలామణీ చేశారు . దీని వలన చాలామంది మనసులు , అహ మనసులే కాదు ,జీవితాలు కూడా నిస్సత్తువగా మారి , వాళ్ళను నిర్జీవులుగా మిగిల్చేశాయి / మిగిల్చేస్తున్నాయి / మింగేస్తున్నాయి అన్నదానిలో యిసుమంత సందేహపడవలసిన పని లేదు .
ఆ భర్త పోయిన ఆడవాళ్ళను చూడగానే గుర్తొచ్చేలా తెలియాలనే ఇలాంటి చెత్త చేష్టలను ఆచారంగా , దుష్ప్రచారం చేశారు . చూసేవాళ్ళ కొరకు భర్త పోయిన ఆడవాళ్ళను అలా , అందవికారంగా తయారు చెయ్యాలా ? అంటే దీని వెనుక ఓ వింత అంతరార్ధం కాదు అంతా స్వార్ధమే దాగి వుంది . ఏ మగవాళ్ళకు ఆ స్త్రీని చూడగానే ( ఆనాటి ఆడవాళ్ళు గృహనిర్బంధం లోనే వుండేవారు కదా ! పొరపాటున ఆ ఇంటికి వచ్చిన ఏ మగవాళ్ళు చూడటం జరిగితే ) అటువంటి దుర్భావన కలగకుండా వుండాలని యిటువంటి దురాచారాలను ప్రోత్సహించారు .
వాళ్ళూ మనలాంటి మానవ జీవులే . వారికీ కోరికలుంటాయి . సారీ వారికి కాదు వారి వయసుకీ , మనసుకీ కోరికలుంటాయి . అవి సక్రమంగా తీర్చుకొనే అవకాశం మన సమాజం వాళ్ళకు అందించాలి . అలా అందించిన నాడు చాలా వరకు అక్రమ సంబంధాలకు స్వస్తి పలికిన వాళ్ళమౌతాము . అలాంటి ఆడవాళ్ళను క్రమబధ్ధీకరణ చేయ ప్రయత్నిస్తే అక్రమ మార్గంలో తీర్చుకోవాలనే ఆకాంక్షే వాళ్ళ మనసుల దరిదాపునకు కూడా రాదు / రాలేదు .
పబ్లిక్ గా దొరకే వస్తువుని మన యింటిలో నిల్వ చేయం అన్నది సర్వులకూ విదితమే కదా! ఏ వస్తువుకైతే కంట్రోల్ విధిస్తారో , ఆ వస్తువు మీద మనకు మక్కువ పెరిగి , ఎపుడెపుడు అక్కున ఠక్కున చేర్చుకొందామన్న తపన అధికమౌతుంటుంది . ఆ పై వాళ్ళను వక్ర మార్గంలోకి తీసుకు వెళ్తుంది , దాన్ని ఎలాగైనా దక్కించుకోవాలనో / పొందాలనో .
ప్రాయంలో , నడివయసులో భర్తను పోగొట్టుకున్న ఆడవాళ్ళు , మరలా పెళ్ళి చేసుకోకుండా యింత అందవికారంగా వుండాలా ?
అదే భార్య పోయిన భర్త ( తన మొదటి భార్యకు పుట్టిన పిల్లలున్నా ) సంవత్సరం కూడా తిరగకుండానే పెళ్ళి చేసుకోవచ్చా ? ఇదెక్కడి న్యాయం ? ఇదేనా న్యాయం ? ఇదే నా న్యాయం అంటూ ఆ నాటి వింత పశువులు / ఛాందసవాదులు చేసిన గొప్ప దురాచారం / దుస్సంప్రదాయం .
ఏ వయసులో మగవాళ్ళకే కోరికలుంటాయా ? అవి వాళ్ళ స్వంతమ ? ఆడవాళ్ళకి అలా వుండవా ? వుండకూడదా ?
ఏ వయసు మగవాడికైనా కోరిక ఉంటే తీర్చుకోవలసినది మరి ఈ ఆడవాళ్ళే కదా ! అంటే వీళ్ళు అక్రమ పధ్ధతిలో ఈ వింత పశువుల / ఛాందసవాదుల కోరికో లేక కొంచెం దురదో తీరుస్తూ సమాజంలో పతిత అని ముద్ర వేయించుకోవాలా ?
ఆచారాలకి అర్ధముండాలే గాని , స్వార్ధపరుల చేతిలో సంప్రదాయంగా మారకూడదు .
మీరూ ఆలోచించండి కొంచెం విశాలహృదయంతో . మీకూ యిది తప్పనిపిస్తే ప్రోత్సహించకండి . ఒప్పనిపిస్తే , మళ్ళీ మళ్ళీ ఆలోచించండి తప్పేనని అనిపించేటంతవరకు .
ఈ దురాచారాన్ని సత్వరమే రూపు మాపేటందుకు ఎవరికి వారు సంసిధ్ధులు కండి .
ఈ విషయంలో కొంతమేరకు విజయపధంలో నడిపించిన శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారిని మనం స్ఫూర్తిగా తీసుకొనవలసిందే . ఆయనకు మన నమోవాకములు సమర్పించవలసిందే .
******
No comments:
Post a Comment