ఉప వాసము


                                                                                                                                    సేకరణ : శర్మ జి ఎస్

ప్రతిరోజు రాత్రి శివుని పదకొండు సార్లు తలచుకొని నిద్రపోపాలని , అలా శివుని తలస్తూ రాత్రులు నిద్రపోవడం వలన ప్రతి రాత్రి శివరాత్రి అని అంటారు. త్రయోదశి తిథి శివునికి సంబంధించిన తిథి అని అందువలన పరమ శివుని తిథి అని అంటారు. నెలకు రెండు సార్లు త్రయోదశి తిథి వస్తుంది. శుక్ల పక్షంలో ఒక త్రయోదశి, కృష్ణ పక్షంలో ఒక త్రయోదశి వస్తుంది. శుక్ల పక్షంలో వచ్చే త్రయోదశి తిథితో కూడిన చతుర్దశీ తిథిని శుక్ల పక్ష శివరాత్రి అంటారు. శుక్ల పక్ష శివరాత్రి నెలకు ఒకసారి మాత్రమే వస్తుంది .

శివరాత్రులు సంవత్సరానికొకసారో నెలకొకసారో కాక ప్రతి రాత్రి శివరాత్రిగానే భావించే సాంప్రదాయముంది. ఉదయాన్నే లేచి (శ్రీ హరి అని మూడుసార్లు తలచి లేవాలి ఎందుకంటే నిద్రలేచినది మొదలు నిద్ర కుపక్రమించేవరకు(జాగ్రదావస్థకు) ఉన్న కాలమునకు విష్ణువే అధిపతి . ఆయన అనుగ్రహముతో ఆ రోజు కార్యములన్నీ శుభప్రదంగా జరగడాని కొరకు, మీరు చేసే మొదటి సంకల్పమే బ్రహ్మతత్వమైన సృష్టికి గుర్తు). నిత్య కర్మానుష్టానములు చేసుకొని శివలింగము నారాధించి, తను చేసే ప్రతి పనిలో , ప్రతి ఒక్కరిలో శివుని చూస్తూ సాత్వికాహార బద్ధుడై తిరిగి సాయంత్రం శివారాధన చేసి నివేదన చేయబడిన పదార్థములను ప్రసాద బుద్ధితో తీసుకొని రాత్రి నిద్రకు ఉపక్రమించడం. ఈ నిద్రనే శివుని స్వల్పకాలిక లయం అంటారు. ఈ నిద్రను పొందుటను గమనిస్తూ శివుని పదకొండు సార్లు తలచుకొని నిద్రపోవాలని శాస్త్ర వచనం / పెద్దల వచనం . ఇలా రోజూ త్రిమూర్తులను తన అవస్థలలో గుర్తిస్తూ సాధన ద్వారా జ్ఞానం వైపుకి అడుగులేయడమే ప్రతి రోజు శివరాత్రిగా పేరు గాంచి ప్రసిధ్ధి పొందింది .

ఇక త్రయోదశి తిథి పరమ శివుని తిథిగా శాస్త్రాలు పెద్దలు గుర్తించారు. శుక్ల పక్షంలో వచ్చే త్రయోదశి తిథితో కూడుకుని ఉన్న చతుర్థశిని శుక్లపక్ష శివరాత్రి అని పిలుస్తూ ఉంటారు ఇది సంపూర్ణ జ్ఙానం వైపు వెళ్ళేసాధకునికి గుర్తు (చాలా వరకు శుక్ల పక్ష శివరాత్రిని ఉపాసన చేయడమన్నది ఈమధ్య కాలంలో కనబడడంలేదు, దీనికి తగిన ఆఖ్యానాలు కూడా ప్రచారంలో వున్నట్లు  లేవు , ఉన్నవేమో తెలియరాలేదు .)
ఇక కృష్ణ పక్షంలో త్రయోదశి తిథిని కూడిన చతుర్దశీ తిథిని మాస శివరాత్రి అని పిలుస్తారు ఒక రోజులో అసుర సంధ్య వేళ కేవలం శివ పూజకు ఎంత విశిష్టమో అలా ఒక నెలలో మాస శివరాత్రి అటువంటిది. ఈరోజు కూడా మహాశివరాత్రి లాగానే శివారాధనలూ, శివాభిషేకాలు, బిల్వ పత్రి పూజలూ, శివాలయ సందర్శనలూ, భజనలూ, ఉపవాసాలు, జాగరణలూ చేయడం పరిపాటి. ఆరాధనలో ఎటువంటి తేడాలేదు. ఐతే రోజూ చేసే ఉపాసనకన్నా ఈ రోజు చేసే ఉపాసన కొంత అధికం.

అలాగే మాఘమాసంలో వచ్చే కృష్ణ పక్ష చతుర్దశిని మహా శివరాత్రి అని నిర్ధారించారు. ఆరోజే రాత్రే శివలింగము ఆవిర్భవించిందని శాస్త్ర వాక్కు. ఆనాడు పగలంతా శివ పూజలతో, శివ కథా కాలక్షేపములతో సాత్విక ఆహారము లేదా ఉపవాసము ( ఉపవాసమంటే లంఖణం కాదు ఉప= దగ్గర, వాసము= ఉండుట, భగవంతునికి దగ్గరగా ఉండుట. వీలైనంత తక్కువైన ఆహారము సాత్వికమైనది తీసుకొని భగవంతుని గుణములను కొలుస్తూ, స్తోత్ర పాఠాలను చేస్తూ, ఆ లీలా మూర్తి అనుగ్రహాలను మననం చేసుకొంటూ  భగవత్కార్యక్రమాలలో పాల్గొనుట ).

శివలింగం అర్థ రాత్రి ఆవిర్భవించడం అంటే ఏదో ఒక రాయిలానో శిల గానో ఆవిర్భవించటం అని కాదు. మాఘ మాసం వచ్చేసరికి, (ఆషాడ మాసంనుంచి వర్షాలవల్ల లోకంలో సృష్టి ప్రతి సృష్టి జరిగుతుంది. భౌతికంగా అన్ని జీవాలు అంధకారంలోఉంటాయి, సరిగ్గా కనపడదు అందునా మాఘ మాసం చతుర్దశి అర్థ రాత్రి అమావాస్య ఘడియలలో లేదా అమావాస్య వస్తుందనగా ఉన్న చీకట్లను తొలగించడానికి జ్యోతి రూపంలో శివుడు ఆవిర్భవించాడు అదే అజ్ఙానరూపంలో ఉన్న చీకట్లను తొలగించడానికి జ్యోతి రూపంలో ఆవిర్భవించాడు. అవ్యక్తమైన పరమాత్మ వ్యక్తమైనాడు. ఆరోజు రాత్రి జాగరణ చేసి లింగావిర్భావ సమయమున ఒక జ్యోతి ( దీపమును లేదా కర్పూర దీపమునుగాని ) గాని ఈ క్రింది శ్లోకము చదువుతూ చూడవలెను అప్పుడు శివరాత్రి వ్రత పూర్ణ ఫలము.

కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః , జలేస్థలే యే నివసంతి జీవాః |
దృష్ట్వా ప్రదీపం నీచజన్మభాగినః , భవన్తి త్వం శ్వపచా హి విప్రాః ||

మన సనాతన ధర్మ గొప్పదనమెంతో చూడండి. ఈ శ్లోకం చదివి, ఆ దీపాన్ని వెలిగించిన యజమానే కాక, దానిని చూస్తున్న వారందరే కాక, కీటకములు, పక్షులు, దోమలు, చెట్లు, జల నివాసములు, ఏ ఏ జీవములు ఆ దీపమును చూచుచున్నవో లేదా ఏ ఏ జీవములపై ఆ దీపపు కాంతి పడుతున్నదో అవన్నీ ఉద్ధరణ పొందవలెను అని ఆ యజమాని భావన చేయాలి. దీనితోనే ఆ శివరాత్రి వ్రతం సంపూర్ణం. (ఇదే శ్లోకం కార్తీక పౌర్ణమి దీపాన్ని చూస్తూ కూడా చెప్పవలెను)

ఈ విషయాన్ని మీకు తెలిసినవారందరకీ తెల్పండి. [పూర్తిగా శివరాత్రి, కార్తీక పౌర్ణమి వ్రతాలు చేయకపోయినా (ఏ అస్వస్తత వల్లనో) అ నాటి రాత్రి జ్యోతి స్వరూపుడైన శివుని దీపము లో చూస్తూ ఈ శ్లోకం చెప్పినా చాలు అని పెద్దలెవరో చెప్పగా విన్నట్లు గుర్తు .

చివరగా ఓ చిన్న మనవి .

ఏ పూజలూ చేయటానికి వసతి చిక్కలేదే , ఉపవాసాలు వుండే వీలు లేకపోయిందే , నాకెవ్వరూ సహకరించరే అనుకొంటూ ఎందరినో బాధపెట్టి వుండటం కంటే , అసలు ఎవ్వరికీ బాధ కలిగించకుండా ఆ అతీత శక్తి అయిన ఆ భగవంతుని సాన్నిధ్యంలో గడపటమే అసలైన ఉప వాసము అని గ్రహించి ఆచరించటం ఎంతైనా మంచిది .

ఎవ్వరినీ బాధపెట్టకుండా ఉపవాసం వుండే అవకాశం వున్నవాళ్ళు తప్పకుండా ఉపవాసం వుండండి , సదా ఆ అతీత శక్తిని స్మరించి తరించండి .


                                                                                 *                         *                    *
  

No comments:

Post a Comment